Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన రాష్ట్రాభివృద్ధి గురించి ఇటీవలి కాలంలో పెద్ద చర్చ జరుగుతున్నది. రాష్ట్ర ప్రజల సగటు ఆదాయం సంవత్సరానికి రూ.2.79 లక్షలపైగా ఉందని, ఇది దేశ ప్రజల సగటు ఆదాయం కన్నా ఎక్కువ అని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అందరి ఆదాయాలు కలిపి చూసినప్పుడు ఈ లెక్క వాస్తవం కావచ్చు. కోటీశ్వరుడి ఆదాయం, అతని ఇంట్లో పని చేసే పని మనిషి ఆదాయం లేదా కంపెనీ యజమాని, కార్మికుడి ఆదాయం కలిపి సగటు చేస్తే ఇలాగే కనపడుతుంది. ఇది ప్రజలను భ్రమలకు గురి చేయడమే. దిగజారుతున్న కార్మికుల జీతభత్యాలు, జీవన పరిస్థితులు, ప్రభుత్వ విధానాలను మరుగుపర్చడానికి పాలకులు ఈ లెక్కలు వల్లె వేస్తుంటారు. మరి వాస్తవాలు ఏమిటి?
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఎనిమిదేండ్ల కాలంలో కార్మికుల నిజవేతనాలు పెరిగాయా, తరిగాయా అంటే నిస్సందేహంగా తరిగాయని చెప్పవచ్చు. కార్మికులు కొనుగోలు చేసే నిత్యావసరాల సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. 2014 తరువాత రెండింతలయ్యాయి. బియ్యం కిలో రూ.37, గోధుమలు రూ.34, పప్పులు రూ.75 నుండి 105, చక్కెర రూ.45, పాలు లీటర్ రూ. రూ.52, నూనెలు రూ.186, టీపొడి 282, ఆలు రూ.28 కన్నా తక్కువ లభించడం లేదు. పెట్రోల్ ధర లీటర్‌కి రూ.109, డీజిల్ 98, ఎల్పిజి గ్యాస్ రూ.1100లు అయింది. ఇటీవల అర్బన్ ప్రాంతాలలో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగాయి. చిన్న చిన్న ఇరుకు గదులు కూడా రూ.5వేలకు తక్కువ లేవు. రవాణా చార్జీలూ, విద్యుత్ చార్జీలూ పెరిగాయి. పెరుగుతున్న ధరలతో పాటు ఇతర ఖర్చులు కూడా ఈ కాలంలో భారీగా పెరిగాయి. ఫలితంగా కార్మికులు అప్పులపాలు కావడమో, అర్థాకలితో జీవించడమో జరుగుతున్నది. పిల్లల చదువుల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. వైద్య ఖర్చులు ఆదాయంలో 50శాతంగా ఉంటున్నాయి. ప్రపంచీకరణ వల్ల వచ్చిన అనేక మార్పులతో పండగలు, సంప్రదాయాలు, పెళిళ్ళలో ఆడంబరాలు కూడా భారీగా పెరిగాయి. డిజిటలైజేషన్ వల్ల కూడా ఖర్చు పెరిగింది. ముఖ్యంగా సెల్‌పోన్ రీచార్జ్, డేటా ఖర్చులు, ఇంట్లో నలుగురు ఉంటే 4 ఫోన్లు అవి కూడా స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగింది. ల్యాప్‌టాప్‌లు ఉంటే వాటి ఖర్చు అదనం. పిల్లలకు ఆన్లైన్ పాఠాలు వల్ల అదనపు భారం. ఈ రకంగా కార్మికుల జీవన ఖర్చులు విపరీతంగా పెరిగాయి. మరి ఆదాయం పెరిగిందా; కేసీఆర్ లెక్క ప్రకారం సగటున రూ.2.79లక్షల ఆదాయం వస్తే ఇబ్బంది లేదు. కానీ వాస్తవం మరోలా ఉంది.
రాష్ట్రంలోని పరిశ్రమల్లో నూటికి 90శాతం మంది కాంట్రాక్టు లేబర్, వీరిలో 60శాతం అంతర్ రాష్ట్ర వలస కార్మికులు ఉన్నారు. 2012 నాటి జీఓ 11 ప్రకారం వారికి కనీస బేసిక్ రూ.5579లు డీఏతో కలిపితే. 2022 ఏప్రిల్ తరువాత రూ.10,688లు మాత్రమే. అది కూడా 12 గంటలు పని చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో సవరించిన కనీస వేతనాలే తప్ప, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక రంగంలో కూడా వేతనాలు పెరచలేదు. ఈ వేతనాలు చెల్లించేది కూడా ప్రయివేటు యజమానులు. ప్రభుత్వంపై పైసా భారం పడదు. కానీ, ప్రభుత్వం యజమానుల ఒత్తిడికి లొంగి పెంచకుండా ఉంది. కంపెనీ అధిపతులే ప్రజా ప్రతినిధుల అవతారమెత్తి ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యాక కార్మికుల వేతనాలు పెంచేదెవరు? అనేది ప్రశ్న.
మన రాష్ట్రంలో కనీసంగా ఉన్న బేసిక్ (మూలవేతనం) ఒకసారి చూద్దాం. ఉదా: డిస్టిల్లరీ, బెవరేజస్‌లో రూ.3896, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు రూ.3445, గార్మెంట్స్ రూ.3995, ఆటోమొబైల్ రూ.3809, సాఫ్ట్ డ్రింక్స్, మినరల్ వాటర్స్ కంపెనీల్లో రూ.2504, స్టీల్ మిల్లులు రూ.3207, షాప్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ రూ.3370, హాస్పిటల్స్ రూ.6207, పవర్‌లూం 2645, బీడీ రంగం రోజుకు రూ.149, సెక్యూరిటీ సర్వీసెస్‌కు రూ.4000, ప్రయివేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ రూ.3370, నిర్మాణ రంగం వారికి రూ.3370 ఉంది. వీటికి కరువు భత్యం కలిపినా నేటికి అత్యధిక రంగాలలో కనీస వేతనాలు నెలకు రూ.10వేలు, రోజుకు రూ.350 కన్నా మించని దుస్థితి ఉంది. అనేక కంపెనీలలో మహిళలకు రోజుకు రూ.250 మాత్రమే ఇస్తున్నారు. సమానపనికి సమాన వేతనం, లింగ వివక్ష పాటించకుండా ఇవ్వాలనే చట్టాలను పట్టించుకోవడం లేదు. కనీస వేతనాల చట్టం 1948 ప్రకారం, 15 ఐఎల్‌సి తీర్మానం మరియు సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసం రూ.26,000లు ఉండాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర కనీస వేతన సలహా మండలి కనీసం బేసిక్ రూ.18,000లు ఉండాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. కానీ ఏడేండ్లు గడిచినా ముఖ్యమంత్రి అంగీకరించలేదు.
రాష్ట్రంలో కార్మికుల వేతనాల దోపిడీతో పాటు వర్కింగ్ కండీషన్స్ కూడా దారుణంగా ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న పారిశ్రామిక ప్రాంతాలలో సుమారు 5లక్షల మందికిపైగా ఉత్పత్తి రంగంలో పనిచేసే కార్మికులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం టిఎస్ఐఐడిసి ద్వారా టీపాస్ పేరిట పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇస్తూ సెజ్‌లను, భారి పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నది. ఇందులో పనిచేసే కార్మికుల స్థితిగతులను మాత్రం పట్టించుకోవడం లేదు. వర్కర్ అనే చట్టబద్ధమైన నిర్వచనానికి, పనికి తిలోదకాలు ఇస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన అప్రెంటీస్ యాక్టులో సవరణల వల్ల 30శాతం మందిని స్టైఫండ్ ఇచ్చి పర్మినెంట్ వర్కర్ మాదిరి యంత్రాలపై పని చేయిస్తున్నారు. వీరికి కనీస వేతనం, పీఎఫ్., ఇ.ఎస్.ఐ, బోనస్ ఇతర సౌకర్యాలు ఏమీ లేకుండా యాజమాన్యాలు వీరి శ్రమను దోచుకుంటున్నాయి. ట్రైనీలు, లాంగ్‌టర్మ్, షార్ట్‌టర్మ్, ఎక్స్క్యూటీవ్లు రకరకాల పేర్లతో వెట్టిచాకిరీ పెరిగింది. లేబర్ కోడ్‌లలోని ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్‌ను అమలు చేస్తున్నారు. కార్మికుడికి జీవిత భద్రత, ఉద్యోగ భద్రత లేదు. రిటైర్మెంట్ వయస్సు వరకు ఎక్కడ పని చేస్తాడో తెలియని స్థితి. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికుల పరిస్థితి మరీ దయనీయం. కంపెనీల ఆవరణల్లో పందుల దొడ్ల మాదిరి నివాసాలు. చట్టబద్ధ సౌకర్యాలు ఉండవు. ప్రమాదాలు జరిగినా, గాయపడినా, చనిపోయినా దిక్కులేని స్థితి. అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టం 1979 ప్రకారం వీరికి చట్టబద్ధ హక్కులు ఉన్నా వాటన్నింటిని తుంగలో తొక్కుతున్నారు. కార్మికశాఖ అధికారులు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు కంపెనీల వైపు కన్నెత్తి చూడడానికి లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఉత్సాహంతో 2021లో జీఓ.118 ద్వారా 600 రకాల సమస్యలకు యజమానులు సెల్ఫ్ సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుందట. అంటే యజమాని నా కంపెనీల్లో అన్ని చట్టాలు అమలు చేస్తున్నానని రాసిస్తే దాన్ని ప్రభుత్వ అధికారులు ఆమోదించాలి. అంతే తప్ప తనిఖీలు చేయరాదు. కార్మికశాఖ కోరలు పీకి యజమానులకు పెద్దెపీట వేశారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనే కనీస వేతనాలు ఎక్కువగా ఉన్నాయని యాజమాన్య సంఘాలు వాదిస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం బలపరుస్తున్నది. కార్మికుల వేతనాలు పెంచితే కంపెనీలు రాష్ట్రానికి రావని వాదన చేస్తున్నాయి. ఇది నిజమా? ఒకసారి ఇతర రాష్ట్రాల వేతనాలు పరిశీలిద్దాం. రిజర్వు బ్యాంక్ రిపోర్టు ప్రకారం దేశంలోనే కేరళలో అత్యధిక వేతనాలున్నాయి. వామపక్ష ప్రభుత్వం రూ.16,022కు తగ్గకుండా కనీస వేతనం నిర్ణయించింది. కర్నాటకలో 2016 జీఓ ప్రకారం ఆటోమొబైల్ రంగం బేసిక్ రూ.10,010 ఉంది. తమిళనాడులో రూ.10,094 ఉంది. తెలంగాణాలో రూ.3809 ఉంది. ఢిల్లీ ఆప్ ప్రభుత్వం కూడా రూ.16,506కు తగ్గకుండా పెంచింది. దక్షిణాది రాష్ట్రాలలో అతితక్కువ వేతనాలు మన తెలంగాణలోనేనని గమనించాలి.
రాష్ట్ర ప్రభుత్వం బహుషా ఈ విషయంలో బీజేపీ మోడీ సర్కార్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నది కాబోలు... దేశానికే మోడల్‌గా చెప్పిన గుజరాత్లో కార్మికుల స్థితి దారుణం. 12గంటలు పని, పీఎఫ్., ఇఎస్ఐ లేదు, ఉద్యోగ భద్రత లేదు, సెలవులు ఉండవు. వెట్టిచాకిరీ చేయవల్సిన పరిస్థితి. ఆ రాష్ట్రంలో ఆజాదికా అమృతోత్సవ్ పేరిట కార్మికుల కరువు భత్యం రూ.2.50పైసలు పెంచారు! యూపీ బీజేపీ ప్రభుత్వంలో కూడా వేతనం మొత్తం కలిపినా రూ.9000లు మించదు. వీటన్నింటిని తలదన్నేలా నరేంద్రమోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా యాజమానులందరికి మేలు చేయడం కోసం మినిమం ఫ్లోర్లెవల్ వేజ్ రోజుకు రూ.176గా, నెలకు రూ.4576గా నిర్ణయించింది. దీన్ని చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలోనే ఎక్కువ అని వాదన చేస్తున్నారేమో. ఇటువంటి దారుణమైన వేతనాల వల్లనే పరిశ్రమ అధిపతుల లాభాలు గత ఎనిమిదేండ్లలో విపరీతంగా పెరిగాయి. ప్రపంచంలోనే అదాని, అంబానీలు టాప్ 10 పొజిషన్లో ఉన్నారు, జనం దరిద్రంలో ఉన్నారు.
ఈ విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా కోట్లాది కార్మికవర్గం పెద్దఎత్తున పోరాటం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 2014 నుండి కనీస వేతనాలు సవరించాలని ఉద్యమిస్తున్నది. కార్మికగర్జన పేరిట 400కి.మీ. పాదయాత్ర, కార్మికశాఖ ఆఫీసుల ముట్టడి చేశారు. అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా విజ్ఞప్తి చేశాయి. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. అందుకే సిఐటియు ఆధ్వర్యంలో ఆగష్టు 3న కార్మికవర్గం మహాధర్నాకు పూనుకున్నది. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం 73 రంగాలలో కనీస వేతనాలు సవరించాలి. కనీస వేతనం రూ.26,000లు నిర్ణయం చేయాలి. గత సంవత్సరం జూన్‌లో 5 రంగాలకు ఇచ్చిన ఫైనల్ నోటిఫికేషన్లకు గెజిట్ ఇవ్వాలి. ప్రయివేటు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్కు, హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. బీడీ కార్మికుల జీఓపై అభియన్స్ ఎత్తివేసి కొత్త జీఓ ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికుల బోర్డులో అందరిని నమోదు చేయాలి. సెస్ నిధుల దుర్వినియోగం అరికట్టాలి. వారికి అసెంబ్లీలో చెప్పినట్లు లక్ష బైక్‌లు ఇవ్వాలి. కార్మికుల కడుపు కొట్టి కార్పొరేట్ యజమానుల కడుపులు నింపే చర్యలు ఆపాలని కార్మికులు కోరుకుంటున్నది. కార్మికులందరి సగటు ఆదాయం పరిగితేనే రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుందని గమనించాలి.
- భూపాల్
సెల్:9490098034