Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిష్యుడు: ఒకప్పుడు నాదేశం ''ఒప్పుల కుప్ప ఒయ్యారి భామ.'' ఇప్పుడు నాదేశం ''అప్పుల కుప్ప అయ్యో రామా..!'' ఎంత గొప్పగా ఉంది గురువుగారూ!
గురువు: కవిత్వమెందుకు? సూటిగా విషయంలోకి రా శిష్యా!
శిష్యుడు: అప్పులతో అథోగతి అని కేంద్రం రాష్ట్రాలను తూలనాడుతుంటే మరి మీ సంగతేంటి? అని కేంద్రాన్ని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి.
గురువు: శుంఠ - త్వంశుంఠ అని వాదులాడు కుంటున్నాయన్న మాట.
శిష్యుడు: అవుననవును... మన తెలంగాణాకు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పుంటే, కేంద్రానికి కోటీ 57లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నదట. 2013-14 సంవత్సరం వరకు కేంద్రం అప్పులు 57లక్షల కోట్ల రూపాయిలు ఉంటే, ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక అదనంగా మరో వందలక్షల కోట్ల రూపాయలు (కోటి కోట్లు) ఎందుకు అప్పుచేసినట్టు? అని నిలదీస్తున్నారు. అసలు ఈ అప్పు ఫిలాసఫీ ఎంటో కొంత వివరించండి గురువర్యా!
గురువు: శ్రమతోనే సంపద పుడుతుందని కారల్‌మార్క్స్ చెప్పాడు. నిజం కూడా. కానీ డబ్బే డబ్బు పుట్టిస్తుందనేది పెట్టుబడిదారీ సిద్ధాంతం. ఇది శుద్ద అబద్దం అయినా ప్రస్తుతం అదే రాజ్యమేలుతుంది.
ఆలు బిడ్డలను అమ్మైనా, చివరకు తన్ను తాను అమ్ముకునైనా అప్పు తీర్చాల్సిందేనన్న విషయాన్ని 'సత్య హరిశ్చంద్ర' నాటకంలో మనం చూస్తాం. పైకి పేరులో 'సత్యం' కనిపించినప్పటికీ నాటకాసాంతం... ఏ రూపేణా అప్పు తీసుకున్నా, ఆ రుణం తీర్చకపోతే 'ఆ పాపానికి' నిష్కృతి లేదు అనే అంశాన్ని అది బోధిస్తుంది.
శిష్యుడు: అవునండి గురువుగారూ ''రుణవిముక్తే జీవనధర్మం'' అని ఆ నాటకం చాటి చెపుతుంది.
గురువు: అంతేనా...? రుణం తీసుకున్నవారి బతుకులు 'బానిస బతుకులు' అని చాటిచెప్పదా..?
శిష్యుడు: అదీ నిజమేనండోరు. అంటే ఇప్పుడు మనవన్ని బానిస బతుకులేనా..?
గురువు: కాక మరేమిటి? దాదాపు 140కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో పుట్టే ప్రతి శిశువుపై కూడా లక్షకు పైగా అప్పు ఉంటున్నది.
శిష్యుడు: మరి అప్పులతోనే అభివృద్ధి అంటున్నారు.
గురువు: ఎవరు అనేది? పెట్టుబడిదారీ సిద్ధాంత కర్తలు. 1990 నుండి నూతన ఆర్థిక విధానాలు శీఘ్రగతిన అమలు కావడంతో ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి సంస్థలు బడుగుదేశాలకు షరతులతో అప్పులిస్తూ, వడ్డీలకు వడ్డీలు గుంజుతూ ఆదేశాలను పూర్తిగా దివాళా తీయిస్తున్నాయి. కరిమింగిన వెలగపండులా ఆయాదేశాల పరిస్థితి తయారైంది. సహజవనరులను, దశాబ్దాలుగా ప్రజలు కష్టపడి నిర్మించుకున్న ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా బహుళజాతి సంస్థలకు కట్టబెట్టేందుకు అవి ద్వారాలు తెరుస్తున్నాయి. పాలకులు ఇందుకు డూడూ బసవన్నల మాదిరి తలలు ఊపుతున్నారు. అందరూ కలసి ప్రజల్ని నట్టేట ముంచు తున్నారు.
మనదేశ పరిస్థితే చూడు. మన రూపాయి పతనం మున్నెన్నడూ లేనివిధంగా డాలర్‌కు రూ.80లకు చేరింది. మున్ముందు దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా ఘోరంగా దిగజారడానికి ఇదో సంకేతం.
శిష్యుడు: గురువుగారికి ఆగ్రహం వచ్చినట్టున్నది?
గురువు: ఆగ్రహం కాదు శిష్యా! భయం. అప్పులు తీర్చలేని స్థితికి భారత్ చేరుకుంటున్నదనే భయం. రాబోయే తొమ్మిది నెలల్లో 621 బిలియన్ డాలర్ల అప్పులు తీర్చాలి భారత్. ఇప్పటివరకు ఇది మన జాతీయాదాయంలో నలభైశాతం. అయినా 267 బిలియన్ డాలర్ల అప్పు ఇంకా మిగిలే ఉంటుంది. ఇవి రిజర్వ్‌బ్యాంకు లెక్కలే సుమా!
శిష్యుడు: ఈ డాలర్ - రూపాయి గొడవ ఏమిటి? కాస్త వివరించండి.
గురువు: మన రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో రిజర్వుబ్యాంక్, మార్కెట్లో మన వద్ద నిల్వ ఉన్న డాలర్లను అమ్మకానికి పెట్టి చలామణి చేస్తుంది. ఆ విధంగా 633 బిలియన్ డాలర్లు ఉన్న నిల్వలు ఈ ఆర్నెల్లలో 593 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అందుకే మన రూపాయి మారకం విలువ డాలర్‌తో రూ.80. దగ్గరన్నా ఆగుద్దా లేదానన్న భయం.
శిష్యుడు: రూపాయి విలువ పడిపోతే ఇబ్బందేమిటి?
గురువు: అసలు సమస్య ఇక్కడే ఉంది శిష్యా. బడా బడా వ్యాపారులకంటే సాధారణ ప్రజానీకానికే ఆ బాధ ఎక్కువ. మనం ఇతర దేశాల నుండి కొన్న వస్తువులకు వాళ్ళు డాలర్లలో బిల్లులు ఇస్తారు. అప్పుడు మనం మనవద్ద నున్న రూపాయిలను డాలర్లుగా మార్చి చెల్లించాలి. గతంలో 10డాలర్లకు సుమారు రూ.600 చెల్లిస్తే, ఇప్పుడు రూ.800 చెల్లించాలి. రూపాయి విలువ తగ్గేకొద్దే దిగుమతుల బిల్లులు పెద్ద మొత్తంలో చెల్లించాలి. అలాగే తీసుకున్న అప్పులకు కూడా అధికంగా వడ్డీలు చెల్లించాలి.
శిష్యుడు: అంటే రుణభారం పెరగడంతో పాటు, దిగుమతయ్యే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి కదా!
గురువు: అంతేగా... అంతేగా...
శిష్యుడు: హమ్మా.... గ్యాస్, పెట్రోల్ ధరలు అమాంతంగా ఎందుకు పెరుగు తున్నా యో ఇప్పుడు తెలుస్తున్నది గురువుగారు.
గురువు: ఆ ప్రభావంతో అన్ని వస్తువుల ధరలూ ఆగకుండా అలా పెరుగుతూనే ఉంటాయి శిష్యా.
శిష్యుడు: ఒకవైపు అప్పులు పెరిగి ఆదాయాలు రాక, మరోవైపు ధరలు పెరిగి ప్రజలు బతకలేక అల్లాడిపోరూ....
గురువు: అందుకే శ్రీలంక ఆర్థిక సంక్షోభం ఎక్కడో ఒక రాష్ట్రంలో కాదు దేశమంతటా తాండవిస్తున్నది.
శిష్యుడు: అవునండి గురువుగారు... అప్పుల సునామీ నుండి తేరుకోకపోతే భవిష్యత్ అంతా అల్లకల్లోలమే.
- శైలి, సెల్:9959745723