Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగువేల లోపు జనాభా కలిగిన ఒక చిన్న ఊరి పేరు దుమాల. రెండు మహల్ల (బంగ్లాలు)తో దానికి దుమాల (దోమహల్) అని పేరు వచ్చిందంటారు. ఇప్పుడా పేరుతో గాదు గాని, 21మంది రక్త తర్పణలతో అమరుల స్మృతి వనంగా పేరుగాంచినందుకే దీనికా ప్రాధాన్యత ఉంది. సరిగ్గా నేటికి 50సంవత్సరాల క్రితం శ్రీ వేంకటేశ్వర యువజన సంఘం స్థాపించి, దుమాలలో నూతన చైతన్యానికి అంకురార్పణ చేసిన ఇప్ప నారాయణరెడ్డి, ఆయన మిత్రబృందం రైతు-కూలీ సంఘం నిర్మాణం ద్వారా విప్లవోద్యమానికి కూడా నాంది పలికారు. గత ఏడాది (జూలై 29, 2021) అనారోగ్యంతో మరణించిన ఇప్ప నారాయణరెడ్డి (76 సంవత్సరాలు) ప్రథమ వర్థంతి సందర్భంగా దుమాల పోరాటాలను, దాని త్యాగాలను, అది సాధించిన విజయాలను ఒకసారి నెమరేసుకుందాం.
1978 అక్టోబర్ 20న భూస్వామ్య వ్యతిరేక విప్లవ పోరాటాలుగా ప్రసిద్ధిగాంచిన సిరిసిల్ల-జగిత్యాల తాలూకాలను చెన్నారెడ్డి ప్రభుత్వం కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించడంతో దేశ విదేశాల్లోనూ ఈ రెండు తాలూకాలు విప్లవోద్యమానికి చిరునామాగా మారాయి. మధ్యయుగాల నాటి భూస్వామ్య దోపిడీని, దానిపై ప్రజల పోరాటాన్ని అర్థం చేసుకోవడానికి దుమాల గ్రామం అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. అందుకే ఈ ప్రాంతం సామాజిక పరిశోధనాంశంగా అనేకమందిని ఆకర్షించింది.
పంచాయతీ వ్యవస్థ అమల్లోకి వచ్చే ముందు, వచ్చిన తర్వాత కూడా దుమాలలో దొర, మాలి పటేల్, పోలీస్ పటేల్, పట్వారి అని దుష్టచతుష్టయ విధానాలకు లక్ష్మయ్య దొర దొరగా, కిష్టయ్య దొర మాలిపటేల్గా, నాంపల్లి దొర పోలీస్‌పటేల్‌గా, నారాయణపంతులు పట్వారిగా అంతా దాదాపు 300 ఎకరాల భూములకు యజమానులుగా ఉండేవారు. వీరి భూముల్లోనే ముందు నాగళ్ళు కదలాలి. జీతాలు నెలకు వడ్లు 10కుంచాలు, మక్కలు 8కుంచాలు, జొన్నలైతే 7కుంచాలిచ్చే వస్తు రూపంలో (సఱఅస టశీతీఎ) కూలీ ఉండేది. ఇక వెట్టిచాకిరి, వెట్టిగొర్లు, వెట్టికళ్ళు, మేకపుల్లరి, కుల పీడన, ఫారెస్ట్ అధికారుల వేధింపులు సర్వసాధారణంగా ఉండేవి. అన్నింటిపై ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ గాని, అభిప్రాయం చెప్పే హక్కు గాని లేనటువంటి ఫ్యూడల్ నియంతృత్వ ధోరణి, అణిచివేత రాజ్యమేలేవి. అందుకే ప్రజలు దోపిడీ పీడనలను వ్యతిరేకించి స్వేచ్ఛ కోసం పోరాడారు. ఇవన్నీ రాజ్యాంగం ప్రకారం దక్కాల్సిన హక్కులు కాబట్టే ఎల్లెడలా వీటికి ప్రజాస్వామికవాదుల మద్దతు లభించింది.
కానీ కల్లోలిత ప్రాంతాల ద్వారా ప్రజలకు దక్కాల్సిన హక్కులన్నీ కల్లోలిత ప్రాంతాల చట్టం (1948 సఱర్బతీbవస aతీవaర aష్) సస్పెండ్ చేసింది. ఇక్కడ నేరుగా రాజ్యమే భూస్వాముల పాత్ర వహించింది. అదనంగా పోలీస్ క్యాంపులు, కేసులు అరెస్టులతో జైల్లు నిండిపోయాయి. ఒక విద్యార్థి కార్యకర్తగా 1978లో జగిత్యాల డీఎస్పీ దగ్గర విద్యార్థి మహాసభలకు అనుమతి కోరడానికి పోతే నన్ను అక్కడే అరెస్టు చేసి ముషీరాబాద్ జైలుకు తరలించారు. 1972లో నిమ్మపల్లి స్వతంత్ర సమరయోధుల భూమిని భూస్వామి ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకించినందుకే ప్రజలపై కుట్ర కేసు పెట్టారు. నక్సలైటు ఉద్యమం ఎటు పోయి ఎటు వస్తుందోనని స్థానిక బంజారా యువకులకు వందలాది పోలీసు ఉద్యోగాలు ఇచ్చారు. ఒక ఆర్థిక-సామాజిక అంశాన్ని పాలకులు పరిష్కరించకపోగా, ఆ సామాజిక ఆర్థిక దోపిడీ చట్రాన్ని రక్షించడానికే రాజకీయ అధికారం ఉందని రాజ్యం దాని వర్గ స్వభావంతో ముందుకు వచ్చింది. అందుకే భూస్వామ్య వ్యతిరేక పోరాటం రాజ్యానికి- ప్రజలకు మధ్య పోరాటంగా పరిణమించింది.
ఆ విధంగా రాజ్యం నుండి ఆత్మరక్షణ కోసం ప్రజా కార్యకర్తలు తమ సర్వస్వాన్ని వదులుకొని ఊరు దాటాల్సి వచ్చింది. ఆ కోణం నుండే నిర్బంధానికి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డ సుద్దాల లింగయ్యతో దుమాల త్యాగాల చరిత్ర మొదలైంది. ఫిబ్రవరి 23, 1989లో బెజ్జంకి దగ్గర దుమాల నేతలు కానవరపు చంద్రయ్య, ఏ ముత్తన్నల బూటకపు ఎన్‌కౌంటర్‌తో హింసకాండ రూపమే మారిపోయింది. 2001 వరకు 22 సంవత్సరాలు నిరాఘాటంగా సాగిన ఈ హత్యాకాండలో కదిరె ఎల్లం (22), పండాల రాజం, షేరు రవి, భీమన్న, ఏ బత్తిని రాజం, బత్తిని లక్ష్మి, బైరి శ్రీనివాస్, నిమ్మల ఎల్లం, ఉల్లి ఎల్లం, కొలకాని శంకర్, బంగారు కటాక్ష, రామిండ్ల శ్రీనివాస్, జూలపల్లి దేవరాజు, సోమారపు ఎల్లం, బూటకపు ఎన్కౌంటర్లలో కాల్చి చంపబడ్డారు. సోమారపు రమేష్ అక్టోబర్ 16, 1992 బద్దనపల్లి ఎన్కౌంటర్ రోజున మిస్సింగ్ అయిపోయినాడు. సోమవారపు ఎల్లం జైల్లో అనారోగ్యంతో మరణించాడు. తాటిపల్లి లింగం ప్రమాదవశాత్తు ఆవునూరులో మరణించాడు. ఇందులో న్యాలకంటి రాజం ఒక్కడే పీపుల్స్‌వార్ చేతుల్లో హత్యగావించబడ్డాడు. ఇక పోరాటంలో అరెస్టులు, కేసులు చిత్రహింసలపాలై అనారోగ్యంతో వృద్ధాప్యంతో చనిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఏదో ఒక రూపంలో దాడికి, హింసకు గురికాని ఇల్లు లేదంటే ఆశ్చర్యం లేదు. బాధిత మనిషి లేరంటే అతిశయోక్తి కాదు.
వీటినన్నిటినీ తట్టుకుని దూమాల ఉద్యమం ముందుకు సాగింది. ఊరికి గొప్ప అభివృద్ధిని సాధించింది. అన్నింటికీ మించి ఉత్పత్తి శక్తులకు దొరికిన స్వేచ్ఛ ప్రజల జీవితాల్లో కొత్త మార్పుకు నాంది పలికింది. మనువాద సాంప్రదాయాలను, అనుత్పాదక వ్యయాలను, సామాజిక అసమానతలను సైతం మార్చడానికి దుమాల చేసిన సాంస్కృతిక పోరాటం నేడు కొనసాగించవలసిన అవసరం ఉంది. ''ఉన్నతమైన త్యాగాలు మహౌన్నత సమాజానికి పునాదులు వేస్తా యన్న'' విశ్వాసంతో ముందుకు సాగుదాం. ఈ క్రమంలో చితికిపోయిన అమరుల కుటుంబాలకు చేయూతనిద్దాం. గ్రామ గ్రామానికి గ్రంథా లయం ద్వారా అభ్యుదయ, శాస్త్రీయ భావాలకు పెద్ద పీట వేద్దాం.
(దుమాలలో జూలై 29, 2002న
కా|| ఇప్ప నారాయణరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా)
- అమర్