Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైళ్ళు, సర్కారు దవాఖానాలు (ప్రభుత్వ ధర్మాసుపత్రులు) భూలోక నరకాలని ప్రతీతి. జీవితంలో ఒకసారైనా వాటి జోలికి పోకుండా మానవ జన్మగడిచిపోతే చాలు. ఎంతో కొంత స్వర్గ సుఖాలు పొందినట్లేననేది ఆ భావన కావచ్చు. అయితే నూటికి ఎనభైమంది నేరం చేసినా / చేయకపోయినా జైలు జీవితం గడుపుతున్న విచారణ ఖైదీలు (అండర్ ట్రయిల్స్ వారు) అని ఇటీవల సుప్రీంకోర్టు తెలిపింది.
ఆ విషయం అలా ఉంచితే ఖైదు జీవితంతో సమాంతరంగానో లేదా ఇంకా దిగజారిన నరక కూపంగానో మురికివాడల జీవితాలు ఉంటాయనడం అతిశయోక్తి కాదు. సలాంబాంబే, స్లమ్ డాగ్ మిలీయనీర్, చక్ర (ది వూండ్స్ ఆఫ్ సొసైటీ) వంటి సినిమాలు ఆ దుర్భర జీవితాలను కొద్దిగా అద్దం పట్టాయి. సాహిత్యంలోనూ ప్రతిబింబించింది అతిస్వల్పం మాత్రమే.
నగర పారిశ్రామిక నాగరిక క్రీనీడన అట్టడుగు మురికివాడల పొరల్లో అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే కడ తేర్చుకునే అభాగ్యులెందరో. ఆ కటిక జీవిత చేదు వాస్తవాలను చూడటానికే కాదు అసలు ఊహించుకోవడానికే చాలా మందికి ధైర్యం చాలదు. కానీ, ఆ మురికిని శ్వాసించి, ఆ అమాయక రోగగ్రస్త జీవశ్ఛవ బతుకులను ప్రేమించి, అంతే నిజాయితీగా బయట ప్రపంచానికి అందించే రచయితలు చాలా చాలా అరుదుగా ఉంటారు. అందులో అగ్రగణ్యుడిగా నిలిచిన రావిశాస్త్రి తెలుగువాడు కావడం మన తెలుగువారందరికీ గర్వకారణం. నిర్మలమైన ఆ దుర్భల జీవితాలను తెలుగు వారికే కాదు, యావత్ ప్రపంచానికంతటికీ చూపిన మన కాలపు మహా రచయిత రావిశాస్త్రి శతజయంతి ఈ నెల 30న జరుగుతున్నది.
'సమాజాన్ని వేయి కళ్ళతో రావిశాస్త్రి పరికిస్తాడు, కనిపెడతాడు' అని మహాకవి శ్రీశ్రీ అనడంలోనే ఆయన నిశిత పరిశీలనా చూపు, చొచ్చుకుపోయే లోతైన సూక్ష్మ దృష్టి అసామాన్యమైనదని అర్థమవుతుంది. ''కళలు - సాహిత్యం ప్రజలవి. ప్రజల నుండి ప్రజలకు'' అన్న లెనిన్ మహాశయుని మాటల పరమార్దానికి రావిశాస్త్రి రచనలు నిలువెత్తు సంతకం. ప్రతి రచయితా తీగపై నడిచే సర్కస్ కళాకారునిలా నిరంతరం అప్రమత్తంగా మెలగాలి. ఎందుకంటే రచయితైన ప్రతివ్యక్తీ తాను రాస్తున్నది ఏ మంచికి హాని చేస్తుందో, ఏ చెడుకు మేలు చేస్తుందో గమనించుకోవాలి అంటారాయన. తెల్లకాగితంపై పుటం పెట్టిన ప్రతి అక్షరానికి రచయిత ఆ విధంగా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేస్తాడు.
పతితులు, భ్రష్టులు, బాధాసర్పద్రష్టులు, అసహాయకులు, అమాయకులు, అభాగ్యులు, అల్పజీవులు, నేరస్థులు, న్యాయవాదులు, అధి కారులు, పోలీసులు... ఒకరేంటి ఇలా సకల సామాజిక, పీడిత పాత్రలు ఆయన రచనల్లో కోకొల్లలుగా కన్పిస్తాయి. చదివే పాఠకుల్ని పక్కన చేరి పలకరించిపోతాయి. వినే మనస్సులను అవి అలా వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకలా...? అంటే సమాధానం త్వరగా దొరకదు. ఆయన రచనల్లో ఎక్కువగా లుంపెన్ (అరాచక) పాత్రలుంటాయనే విమర్శ లేకపోలేదు. అయితే వారెలా పుట్టుకొస్తారు? ఈ వ్యవసే ్థవారినలా పుట్టిస్తుందనే ఎరుక మహ బాగా ఉన్న రచయిత రావిశాస్త్రి. తాను ఎందుకోసం రాస్తున్నాడో... ఎవరి కోసం రాస్తున్నాడో... తెలిసినప్పటికీ ఔచిత్యానికి భంగంకాని రీతిలో ఆ శైలీ నిర్మాణం జరిగిపోతుంది. అందుకే పాత్రలను తాను సృష్టించినప్పటికీ, ఒక్కోసారి ఆ పాత్రల వెంటనే తాను పరుగు తీయాల్సి వచ్చిందని చాలా తేలికగా చెప్తాడు.
ఓ పిరికి నవ్వు, అచేతనం, సర్దుబాటు, ప్రశ్న ప్రతిఘటన తెలియని బేలతనం, బయటకు పెకిలిరాలేని ఊహాస్వప్నాలు, అన్నింటినీ అణచుకునే అసహనం, లోలోన కుమిలిపోవడం, కలగలపి ఓ సాహితీ దర్పణంగా మలచి, ఇక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ తొలినాళ్ళల్లో సృష్టించిన 'అల్పజీవి'ల చేతిలో పెడతాడు. ఈ బీద మధ్య తరగతి దర్పణ గదుల్లో ఎటు చూసినా అందరూ సుబ్బయ్యలే. 'చైతన్య స్రవంతి' అంతరంగాల్లో విహరించడం ఆహ్లాదమే కాదు భూతద్ద భయాలూ గోచరిస్తాయి. అసలు తన్ను తాను తెలుసుకోవడమే తత్వజ్ఞానం అంటారు పెద్దలు. 'పిపీలకం' అనే చిన్న చీమ తను ఏంటో.. తను ఎందుకు పుట్టిందో, ఎందుకు బతుకుతుందో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో బయలుదేరి జ్ఞానులనుకుంటున్నవారి (స్వాముల) బండారాన్ని, పరిమితులను బట్టబయలు చేస్తుంది. ఆచరణ ద్వారానే జ్ఞానం... అదీ ఒక్కోసారి శత్రువు నుంచి కూడా లభిస్తుందనే సత్యాన్ని వ్యక్తం చేస్తుంది. కడుపు నిండిన వారి(కి) ప్రవచనాల భ్రమలను బద్దలుకొడుతుంది.
రష్యన్ రచయిత అలగ్జాండర్ కూప్రిన్ నవల యమకూపం (అనువాదం - రెంటాల గోపాలకృష్ణ) తెలుగు పాఠకుల్ని ఓ ఊపు ఊపింది. పురుషాధిక్య ప్రపంచం సృష్టించిన వేశ్యాలంపటత్వానికి అద్దం పడుతుంది. అంతే రీతిలో రావిశాస్త్రి రచన రత్తాలు - రాంబాబు (అసంపూర్ణం)ను చాలా మంది తులనాత్మక అధ్యయనం గావించారు. శీలం అనేది స్త్రీలకు మాత్రమే సంబంధించిన విషయం కాదని, ఆహార, నిద్రలతో సమానంగా మైధునం ప్రతి ప్రాణి భౌతిక అవసరంగా తేటతెల్లం చేస్తుంది. ఇలా ప్రఖ్యాత ప్రపంచ రచయితల సరసన రావిశాస్త్రిని చేర్చడం తెలుగు వారికి ఎంతో సంతోషకరం.
శాస్త్రిగారి రచనల్లో ఎలాంటి ముసుగులు ఉండవు. ముసుగులను ఛేదించడమే ఆయన పని. ఒక పక్క న్యాయవాద వృత్తిలో ఉంటూనే కోర్టులను అబద్దాల పుట్టలని వర్ణించగలడు. రావిశాస్త్రి కథలు కవితామచయం అని చెప్పినవాడు త్రిపురనేని శ్రీనివాస్. పదహారేళ్ళ నిరుపేద పడుచుపిల్ల 'జరీ అంచు తెల్ల చీర'కోసం గుండె కొట్టుకునే ఆవేదన. వరద వరదగా వచ్చే ఏడుపు. ఇది మెరపు లేని మబ్బు తెరపిలేని ముసురు... ఎంతకీ తగ్గని ఎండ... తెల్లవారని చీకటి రాత్రి... అంటూ పోతూవుంటే చిన్న చిన్న కలల సాకారానికి కూడా అంతమెక్కడీ అనే ప్రశ్న మెలిపెడుతుంది. అందుకే రావిశాస్త్రిది కవితాత్మక వచనశైలి అని, అది అనుపమాన ఉపమానాలతో, కళింగాంద్ర మాండలిక శైలితో శోభిల్లిందని విమర్శకుల అభిప్రాయం. ఛెకోవో కథల్లో మాదిరి ఒక వాక్యం తీయడం గాని, చేర్చడం గాని కుదరదు అని అంటారు. ఎవరి గురించి రాసినా, దేన్ని గురించి రాసినా ఆయన శ్రామిక వర్గ పక్షపాతి అని అందరికీ తెలిసిందే.
తాను బతికి ఉన్నకాలంలోనే స్టార్ స్టేటస్ పొందిన రచయిత రావిశాస్త్రి. కాళీపట్నం, కె.వై.ఎన్. పతంజలి, బినాదేవి వంటి వారెందరో ప్రభావితులయ్యారు. ఎంతటి సీరియస్ విషయాన్నైనా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో సరళంగా, ఆకర్షణీయంగా, వారి హృదయ భాషల్లో రాయొచ్చని నిరూపించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖలో చదువుకున్న ఎందరో సోషియాలజీ, సోషల్ వర్క్, లా విద్యార్థులకు ఆయనో సజీవ పాఠం కూడా.
1922 జూలై 30న రాచకొండ విశ్వనాథ శాస్త్రి శ్రీకాకుళంలో జన్మించారు. విశాఖ ఎ.వి.ఎన్.కాలేజీలో డిగ్రీ, మద్రాసులో లా చదివారు. ఆకళ్ళ కృష్ణమూర్తి వాసిరెడ్డి వెంకట్రావు వంటి వారి సాంగత్యంలో మార్క్సిస్టు సిద్ధాంతాన్ని తెలుసుకున్నారు. దాస్త్రో మెవ్స్కీ, చెకోవ్, లారెన్స్, వుడ్హౌస్లు అభిమాన రచయితలు. తనపై చార్లెస్ డికెన్స్ ప్రభావం ఉన్నట్టు చెప్పుకున్నారు.
1930 నుంచి రచనలు చేస్తున్నప్పటికీ 1952 'అల్పజీవి' నవలతో తారాస్థాయికి ఎదిగారు. అప్పటి నుంచి నాలుగు దశాబ్దాల పాటు ఆయన కలం తెలుగు సాహితీ నేలపై స్వైరవిహారం చేసింది. మూడు కథల బంగారం, ఋక్కులు, ఆరు చిత్రాలు, ఆరు సారా కథలు, సారో కథలు, కలకంఠి - కథా సంపుటాలు. అల్ప జీవి, రాజు - మహిషి, రత్తాలు - రాంబాబు, గోవులొస్తున్నాయి జాగ్రత్త, సొమ్ములు పోనాయండి, ఇల్లు - నవలలు. నిజం, విషాదం, తిరస్కృతి - నాటకాలు మొదలైనవి ఆయన రచనలు.
1970లో విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడినపుడు ఆయన వ్యవస్థాపక ఉపాధ్యక్షులు. 1975 అత్యవసర చీకటి పరిస్థితు ల్లో కొన్ని నెలలు కారాగార జీవితం గడిపారు. సాహిత్య సేవను గుర్తించి ఎ.పి. సాహిత్య అకాడ మీతో సహా వచ్చిన అనేక అవార్డులను ఆయన తిరస్కరించారు. 1993లో అస్తమించారు.
- కె శాంతారావు
సెల్: 9959745723