Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూన్ 8 నుండి 16 వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికీ అనేక చోట్ల కురుస్తూనే ఉన్నాయి. అనేకులు నిరాశ్రయు లయ్యారు. అనేక జిల్లాల్లో ఇండ్లు మునిగి నివాసాలు కొట్టుక పోయిన బాధితులు, పంట నష్టపోయిన రైతులు, ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలు, ఇలా నష్టపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబాలకు కుటుంబాలే సాయం కోసం ఎదరు చూస్తున్నాయి. వారికి ఏ మాత్రం సాయం అందకపోగా అందుతుందనే భరోసా కూడా లభించటం లేదు. ఒకవైపు బాధితులందరూ సాయం కోసం ఎదురు చూస్తుండగా, మరోవైపు పొలిటికల్ వార్ కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఓటు-సీటు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శలు-ప్రతి విమర్శలే తప్ప బాధితులకు సాయమందించే ప్రయత్నమే లేదు.
భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర నష్టం జరిగింది. ప్రధానంగా పెద్దపల్లి, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం... ఇలా అనేక ప్రాంతాల్లో అపార పంట నష్టం జరిగినట్లు అంచనా. వేసిన వరి నాట్లు కొట్టుకుపోగా, పత్తి మునిగి మురిగి పోయింది. మొక్కజొన్న, ఇతర ఆరుతడి పంటలు ఆదిలోనే అక్కరకు రాకుండా పోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 మంది మృతి చెందగా, 934 గ్రామాల్లో 12వేలకు పైగా ఇండ్లు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో 600ఇండ్లు కూలిపోయినట్లు, సుమారు 1500 పశువులు మృతి చెందినట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. 61వేల మంది నిరాశ్రయులు ప్రభుత్వ షెల్టర్లు తీసుకున్నప్పటికీ, ఇందులో ఎవరికీ ప్రభుత్వాల ద్వారా సహకారాలు అందలేదనే ఆరోపణలున్నాయి. జూన్ 17న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్... బాధితులకు పలు హామీలిచ్చారు. శాశ్వత ప్రాతిపదికన రెండు వేల ఇండ్లు కట్టిస్తామని భద్రాచలంలో బాధితులకు భరోసా ఇచ్చారు. ఏటూరు నాగారం ప్రాంతాల్లోనూ ఏరియల్ సర్వే చేసి పలు హామీలిచ్చి పది రోజులు గడిచినప్పటికీ, కనీసం తాత్కాలిక సాయం కూడా అందలేదు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం కూడా పర్యటించి పరిశీలించింది. నిజామాబాద్, జయశంకర్- భూపాల్పల్లి, ములుగు జిల్లాల్లో 21, 22 తేదీల్లో పర్యటించి, ఆయా జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించి నష్టాన్ని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం తక్షణ సాయం కింద రూ. వెయ్యి కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ అటు కేంద్రం నుండి గానీ, ఇటు రాష్ట్రం నుండి గానీ వరద బాధితులకు ఇప్పటి వరకు అందిందేమీ లేదు. ఇకపై అందుంతున్న భరోసా అంతకంటే లేదు. రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలున్నారు. ఇందులో కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. అయినప్పటికీ తెలంగాణకు ఎలాంటి వరద సాయం ప్రకటించక పోవడం దురదృష్ట కరం. టీఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు సైతం ఇప్పటి వరకూ పార్లమెంటులో వరద సాయంపై ప్రస్తావించిన దాఖలాలు లేవు.
భారీ వర్షాలు అనేక జిల్లాలను అతలాకుతలం చేసిన సందర్భంలో, లక్షలాది మంది సాయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో... ప్రభుత్వాల నుండి ఎలాంటి సాయం అందక పోగా, ప్రజా ప్రతినిధుల నుండి కూడా స్పందన లేకుండా పోయింది. పైగా టాపిక్ డైవర్షన్ కొనసాగుతోంది. వచ్చే సాధారణ ఎన్నికలపై, మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా, సస్పెన్షన్పై ఆయా పార్టీలు చర్చకు తెరలేపడం వల్ల వరద బాధితుల సమస్య పక్కదారి పట్టింది. ప్రజాస్వామ్యంలో పేదలు, బాధితులకు బాసటగా ఉండాల్సిన పార్లమెంటు, అసెంబ్లీ వేదికలు నిస్పారంగా మారి, ప్రజాస్వామ్య విలువలకు, ప్రజల పట్ల బాధ్యతకు తిలోదకాలిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
- చిలగాని జనార్థన్
సెల్:8121938106