Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూన్ 26, 2022న జీ-7 సమావేశాల సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ''భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది'' అని ప్రకటించినప్పటికీ, పౌర సమాజంపై ప్రభుత్వం చేస్తున్న దాడులు పతాక స్థాయికి చేరాయి. నవంబర్ 2021లో ఇండియన్ పోలీస్ అకాడమీలో జరిగిన 73వ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నాటి నుండే భారత ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు(నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) పౌరసమాజాన్ని నాయకు లను చాలా ఘోరంగానే అనుమాని స్తున్నాయనే విషయం స్పష్టమైంది. జాతీయ భద్రతా సలహాదారు, ప్రధాన మంత్రికి ప్రధాన సహాయకుడైన అజిత్ దోవల్, పౌరసమాజమే ప్రమాదకరమైన శక్తిగా నిలుస్తుందని నూతన పోలీసు అధికారులకు హెచ్చరిక చేశాడు.
ఆధిపత్య రాజకీయ వ్యవస్థలో మైనారిటీల హక్కులను కాపాడడంలో జరిగే వైఫల్యం తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. మన పొరుగునున్న పాకిస్థాన్ ఆధిపత్యం విభజనకు దారి తీసిందన్న విషయం మనకు తెలిసినప్పటికీ, భారత ప్రభుత్వం అదే మార్గాన్ని అనుసరిస్తున్నది. ప్రభుత్వం అన్ని మత విశ్వాసాలను ఆచరిస్తున్న ప్రజలకు సమాన హక్కులు, అన్ని మైనారిటీ మతాలకు చెందిన వారికి సంరక్షణ కల్పించాలని రాజ్యాంగం, చట్టం కోరుతున్నాయి. భారతదేశం ఆలోచన ప్రకారం పౌరులంతా ''ఈ దేశం మాది'' అని భావించేలా భారతరాజ్యాన్ని ఏకీకృతం చేయడానికి అవసరమైనవిగా ఈ హక్కులను పరిగణించారు. పౌర సామాజిక సంస్థలు రాజ్యాంగ రూపకల్పనలో సహకరించినప్పటికీ, ఆ విలువలను కాపాడడానికి వాటిని నిస్సందేహంగా క్రమబద్ధం చేయాల్సిన అవసరం ఉంది.
గుజరాత్ రాష్ట్రంలో జరిగిన మానవ సంహారం విషయంలో సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందని ఆరోపిస్తూ ప్రముఖ ప్రజా ప్రయోజనాల న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను జూన్ 25, 2022న అరెస్ట్ చేశారు. 2002లో గుజరాత్లో జరిగిన మానవ సంహారంలో చనిపోయిన వారి సంఖ్యను నమోదు చేయడంలో ఆ ప్రభుత్వం విఫలం చెందడం ఒక్కటే కాదు, ఆ కేసును సుప్రీంకోర్టు దాకా తీసుకొని వెళ్ళిన న్యాయవాది, నిబంధనలు పాటించలేదని ఆరోపణతో ఇరువురు సీనియర్ రిటైర్డ్ అధికారులు జైలులో ఉన్నారు. జూన్ 24, 2022న సుప్రీంకోర్టు తన అనుకూల తీర్పును వెలువరించిన తరువాత ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, ముస్లింల ఊచకోతకు సంబంధించిన కట్టుకథలు అల్లేందుకు, హత్యకు గురైన కాంగ్రెస్ ఎంపీ ఈహ్షాన్ జాఫ్రీ భార్యతో ఈ ముగ్గురు వ్యక్తులు కుమ్ముక్కు అయ్యారనీ, ఈ కట్టుకథలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అనేకమంది ప్రతిష్టకు భంగం కలిగించాయనీ, తమ అనుకూల న్యూస్ ఏజెన్సీ 'ఏఎన్ఐ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హౌంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించాడు.
ఇలా పౌర సమాజాన్ని ఇతర అనేక విషయాల్లో కూడా లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం (ఎఫ్సీఆర్ఏ), మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)తో పాటు 'ఉపా' చట్టాన్ని ఉపయోగించడం ద్వారా ప్రభుత్వం, పౌర సమాజాన్ని బెదిరించి, భయపెట్టి ఆధిపత్య హిందూ జాతీయవాద మార్గంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది.
ఎఫ్సీఆర్ఏను ఒకసారి పరిశీలిస్తే, అభివృద్ధి పనుల కోసం విదేశీ నిధులు ఉపయోగించుకోవడానికి భారతీయ ప్రభుత్వేతర సంస్థలకు ఎఫ్సీఆర్ఏ అనుమతి అవసరం. 2010లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం చేపట్టిన ఎఫ్సీఆర్ఏ సవరణ ప్రకారం ప్రభుత్వేతర సంస్థల నిర్వహణకు సంబంధించిన అన్ని అధికారాలను ప్రభుత్వానికి ఇచ్చింది. ఇప్పుడు ఆ ప్రభుత్వేతర సంస్థలు ప్రతీ ఐదు సంవత్సరాలకొకసారి వాటి లైసెన్స్‌లను పునరుద్ధరించు కోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ 2010 చట్టాన్ని ఉపయోగించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గతంలో ఏనాడూ లేనంత ఎక్కువ సంఖ్యలో లైసెన్స్‌లను రద్దు చేసింది.
2011, మే 2022 మధ్య కాలంలో 20,679 పౌర సామాజిక సంస్థలు తమ రిజిస్ట్రేషన్లను కోల్పోతే, కాంగ్రెస్‌పార్టీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వ పాలన(2011-2014)లో 3,987 సంస్థల లైసెన్స్‌లు రద్దైతే, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ పాలన (2015-2022)లో 16,692 ఎన్జీవోలు రద్దయ్యాయి. బీజేపీ పాలనలో రద్దైన ఎఫ్సీఆర్ఏ లైసెన్స్‌ల సంఖ్య చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. 2015-2022 మధ్య కాలంలో లైసెన్స్‌లు కోల్పోయిన 16,692 ఎన్జీవోలలో, 2020 లో చట్టానికి సవరణ చేసిన కాలానికి ముందు అంటే 2015-2019 మధ్య కాలంలో 16,679 ఎన్జీవోలకు హక్కును నిరాకరించారు. 2020లో ఒక్క లైసెన్స్ కూడా వెనక్కు తీసుకోలేదు.
ఎఫ్సీఆర్ఏ 2020 సవరణ
2020లో ఎఫ్సీఆర్ఏకు చేసిన సవరణ ప్రభుత్వేతర సంస్థలకు పెద్ద దెబ్బ. కోవిడ్ మహమ్మారి ఉధృతంగా వ్యాప్తి జరుగుతున్న సమయంలో పౌర సమాజం అవిశ్రాంతంగా సహాయక చర్యలు చేపట్టే సందర్భంలో ఈ సవరణ జరిగింది. ఈ సవరణలను హడావుడిగా పార్లమెంటులో ఏ చర్చ లేకుండానే ఆమోదించారు. 2020 సవరణ తరువాత, ఎన్జీవోలు కార్యనిర్వహక ఖర్చుల నిమిత్తం చాలా తక్కువగా ఖర్చు చేయాల్సి వచ్చింది. చివరకు, అన్ని ఎన్జీవోలు తమ విదేశీ ఖాతాల లావాదేవీలను న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి ద్వారా నిర్వహించవలసిన అవసరం ఏర్పడింది. దీని వలన ప్రభుత్వానికి, విదేశీ నిధులను పొందే సంస్థలను మరింత దగ్గరగా పరిశీలించే అవకాశం ఏర్పడుతుంది. ఒక రిట్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఏప్రిల్ 8, 2022 నాడు వెలువరించిన తన అభిప్రాయం 2020న చేసిన ప్రభుత్వ సవరణను సమర్థించింది.
ఆఖరికి మన దేశం నుండి వస్తున్న నిధులతో పని చేస్తున్న భారతదేశ ఎన్జీవోలను కూడా వదిలిపెట్టలేదు. అంతేకాక పన్నులు లేకుండా ఇచ్చే విరాళాలను ప్రతీ ఐదు సంవత్సరాలకొకసారి సమీక్షిస్తామని తన 2020 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించింది. ఇదే సమయంలో మానవ హక్కులకు సంబంధించి, దేశీయ సంస్థలు అందించే నిధులను బాగా తగ్గించాల్సి వచ్చింది. అదే విధంగా ప్రభుత్వ నిధులను కూడా భారీగానే నిలిపి వేశారు.
పేదల కోసం, మైనారిటీ హక్కుల కోసం పని చేస్తున్న ప్రముఖులను 2020 సవరణ తరువాత కాలంలో శిక్షించారు. ఆక్స్‌ఫామ్ లైసెన్స్‌ను, 2010 ఎఫ్సీఆర్ఏ సవరణ కింద అనుమతి ఉన్నప్పటికీ పునరుద్ధరించలేదు. ఆక్స్‌ఫామ్ సంస్థ, వలస కార్మికుల వెతల గురించి, కరోనా వ్యాప్తి సమయంలో పేద ప్రజల దయనీయమైన స్థితిని గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని పోయింది. ఈ నివేదికలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఈ సంస్థ కార్మికుల హక్కులను కాపాడే ప్రయత్నం చేస్తుంది.
మైనారిటీల హక్కుల కోసం పనిచేస్తున్న ఎన్జీవోలకు కూడా కష్టకాలం వచ్చింది. ఉదాహరణకు, 'ద కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్స్'కు కొంత కాలం పాటు ఎఫ్సీఆర్ఏ ఆమోదాన్ని నిలిపి వేశారు, తర్వాత దాని లైసెన్స్‌ను కూడా రద్దు చేశారు. ఐఎన్ఎస్ఏఎఫ్, పీపుల్స్ వాచ్ లాంటి మానవహక్కుల సంబంధిత సంస్థలకు కూడా ఎఫ్సీఆర్ఏ అనుమతులను నిరాకరించారు.
ఆఖరికి, మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టాన్ని పౌర సమాజ నాయకులకు, రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ప్రయోగించే సాధనంగా మార్చారు. ఇది జైలుశిక్షను విధించే చట్టం. ఈ మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద సోదాలు నిర్వహించి పౌరులను అరెస్ట్ చేయగలిగే విస్తృతమైన అధికారాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు ఉన్నాయి. మైనారిటీల హక్కుల కోసం నిరంతరం పని చేస్తున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్ లాంటి ఎన్జీవోల పైన కూడా ఉపయోగించారు. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులైన రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ఢిల్లీ ఆరోగ్యశాఖా మంత్రి సత్యేంద్ర జైన్లకు వ్యతిరేకంగా కూడా ఈ ఏజెన్సీని ఉపయోగిస్తున్నారు. భారతదేశ ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి భారతీయ సమాజపు బహుళత్వాన్ని అదుపుచేసేందుకు ఎఫ్సీఆర్ఏ, పీఎంఎల్ఏలను బలమైన ఆయుధాలుగా ఉపయోగి స్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజాస్వామిక రాజకీయాలే సామాజిక విలువలను రక్షించాలి. రాజకీయ ప్రత్యర్థి ఎప్పుడు లేస్తాడు? అసలు లేస్తాడా? అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
- రాహుల్ ముఖర్జీ
(''ద హిందూ'' సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్,
సెల్: 9848412451