Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''గద్దొచ్చె కోడిపిల్ల కియ్యాం కియ్యాం...'' అన్న చందంగా ఉంది బీజేపీ రాష్ట్ర నేతల తీరు. ఇగో చూడు... అగో చూడు... ఆయనొస్తున్నడు... ఈయనొస్తున్నడు అంటూ తమకు నచ్చిన నేతలపై మాటల వల విసురుతున్నరు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడంలో సిద్ధహస్తులైన ఆ పార్టీ నేతలు మీడియాలోనూ తెగ ప్రచారం చేయించుకుంటున్నారు. ప్చ్! ఏం ప్రయోజనం. ఎవరూ రాకపాయే. ఇదేందని మీడియోళ్లు ప్రశ్నిస్తే 'ముహుర్తాలు' బాగోలేవంటూ దాటేస్తున్నరు. ఇగ గిట్టయితే ఇజ్జత్పోతుందుకుని విననోళ్లపై ఈడీ, సీబీఐ అస్త్రశస్త్రాలను ప్రయోగించబోతున్నట్టు జోరుగ ప్రచారమైతున్నది. గీకథ గిట్టుండంగ 'ఆలూలేదూ చూలూలేదు కొడుకు పేరు సోమలింగం' అన్నట్టు... పట్టుమని నాలుగైదు సీట్లయినా గెలవలేదుగానీ, సీఎం పీఠం మాదేమాదే అంటూ కుర్చాట ఆడుకుంటున్నరు. ఈటల పరపతితో గెలిచిన హుజురాబాద్ నియోజక వర్గాన్ని చూపెట్టి రాష్ట్రంలో తమ బలం పెరిగిందని తెగ మురిసిపోతున్నరు. గిదే ఊపులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉసిగొల్పు తున్నరు. గాయనేమో రోజుకోమాట మాట్లాడుతూ గందరగోళం చేయబట్టే. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ మండల నాయకు లను పిలుపిచ్చుకుని ''నా వెంట రండి... నేను చూసుకుంట'' అంటే ''పోపోవయ్య మేం రాం..నీకు రాంరాం... రాజీనామా చేస్తే అస్సలు గెలువవు'' అంటూ మొహంమీదనే చెబుతున్నరంట. దీంతో ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. 'తామేసిన గాలానికి రాజగోపాల్‌రెడ్డి చిక్కిండు' అని బీజేపీ నేతలు సంబురపడుతుంటే.. ''బుల్బుల్ పిట్ట వలలో పడ్డదిరబై.. రాజీనామా చేసేరు బిడ్డా... మేం ఆ స్థానాన్ని కైవసం చేసుకుంటాం'' అంటూ టీఆర్ఎస్ నేతలు తెగ సంబరపడుతున్నారు.
- అచ్చిన ప్రశాంత్