Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అత్త మీద కోపం దుత్త మీద చూపుతున్నారు...' అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో యమ పాపులర్. సహజంగా మన ఇండ్లల్లో భార్య మీద భర్తకో, భర్త మీద భార్యకో కోపం వస్తే జీవిత భాగస్వామిని ఏమీ అనలేక పిల్లల మీద ప్రతాపాన్ని చూపిస్తుండటాన్ని గమనిస్తుంటాం. ఇది మానవ జీవితంలో సహజంగా జరిగే భావోద్వేగ పూరిత ప్రక్రియంటూ మానసిక నిపుణులు చెబుతుంటారు. ఈ మధ్య ప్రకృతి కూడా తరచూ విపరీతమైన ఉద్వేగానికి గురవుతూ ఉన్నట్టుంది. అందుకే వేళాపాళా, అడ్డూ అదుపూ లేకుండా వరుణ దేవుడు ఒకటే కుండపోతగా కురుస్తున్నాడు. ఆ సారు ప్రతాపానికి భాగ్యనగరంలో కాలనీలకు కాలనీలు వారానికోసారి మునకేస్తున్నాయి. ఇటీవల ఓ సీనియర్్ నాయకుడి ఇష్టాగోష్టికి వెళ్లినప్పుడు పాత్రికేయుల మధ్య ఇదే అంశం ప్రస్తావనకొచ్చింది. 'మన ఇండ్లలో మొగుడి మీద పెళ్లాం కేకలేసినప్పుడో.. లేక పెళ్లాం మీద మొగుడు సీరియస్ అయినప్పుడో ఆ గంభీర వాతావరణాన్ని సర్ది పుచ్చటానికి భర్త... హడావుడిగా చొక్కా తగిలించుకుని అప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాడు. ఓ గంటా రెండు గంటలు ఎక్కడెక్కడో తిరిగి... తన కోపం తగ్గాక ఇంటికి చేరుతాడు. అలాగే ఈ వాన దేవుడి ఇంట్లో కూడా ఈ మధ్య బాగా గొడవ జరుగుతున్నట్టుంది. దీంతో ఇంట్లో ఉండలేక అదే పనిగా గంటకోసారి, పూటకోసారి బయటకొచ్చి కుంభవృష్టిగా కురుస్తూ మన ప్రాణాలు తీస్తున్నాడు...' అంటూ ఓ సీనియర్ జర్నలిస్టు చలోక్తులు విసిరాడు. అక్కడి చిట్ చాట్ అయిన తర్వాత అందరూ తమ బండ్లు తీస్తుండగా... మళ్లీ ఒకేసారి భారీ వర్షం స్టార్టయింది. ఆ వెంటనే ఓ జూని యర్ విలేకరి... 'పెద్దన్న చెప్పినట్టు మళ్లీ ఆ వానయ్య ఇంట్లో గొడవ జరిగినట్టుంది. వచ్చేస్తున్నాడు.. మన పని పట్టేస్తాడు... పదండ్రా బాబోరు...' అంటూ దగ్గరున్న బిల్డింగులోకి దూరిపోయాడు...
-బి.వి.యన్.పద్మరాజు