Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఉన్నవాడికి తింటే అరగదు లేని వాడికి తిండే దొరకదు'' అని సినారె ఏనాడో రాశారు రింజిం రింజిం హైదరబాద్ రిక్షా వాలా జిందాబాద్ అన్న పాటలో. హెచ్చు తగ్గులు తొలిగే రోజు ఎప్పుడొస్తుందో ఏమో అని ఆ పాటలో పాడే బాలు గొంతు ఎంత ఆర్ద్రంగా ఉంటుందో వింటే కాని అనుభవించలేము. అది 1971లో వచ్చిన సినిమా. అంటే యాభై ఏళ్ళు దాటిపోయింది. కాని పరిస్థితి మారిందా అంటే తప్పకుండా మారింది, కాకపోతే ఇంకా దీనంగా తయారయ్యింది అని చెప్పొచ్చు. హెచ్చు తగ్గులు తొలగడం కాదు పెరగడం మనం చూస్తున్నాము. ఉన్నవాడి తిండి రకరకాలుగా మారింది, లేనివారిదీ మారింది కాని, అదే తిండి రోడ్లపై ఆకుల్లో తినే వాళ్ళు మాత్రం మారలేదు, ఇంకా అలాగే ఉన్నారు.
దేశంలోని చిన్న పిల్లల్లో పోషకాహార లోపం రోజురోజుకూ పెరిగిపోతోందని గణాంకాల వల్ల బయటపడింది. దానివల్ల వారి పెరుగుదలలో లోపాలు తలెత్తాయనీ ఆ నివేదికలు చెబుతున్నాయి. వాటిని ఏ ప్రతిపక్షాలో విడుదల చేస్తే అది వేరే సంగతి, కాని ప్రభుత్వ లెక్కలే ఆ విషయం చెబుతున్నాయి. మహిళల్లో కూడ పోషకాహార సమస్య తీవ్రంగా ఉందనీ బయటపడింది. నేటి బాలలే రేపటి పౌరులని, ఎక్కడ మహిళ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారని ఉపన్యాసాలు దంచే నాటి, నేటి పరిస్థితుల్లో ఇంత పెద్ద విషయం పాలకులెవ్వరూ పట్టించుకోక పోవడం బాధ కలిగిస్తుంది. బడా బాబుల బొజ్జలు ఎంతగా పెరిగాయి, ఎన్ని ఇంచులు ముందుకు చొచ్చుకొని వచ్చాయి అని కొలవడంలో తలమునకలైన ప్రభుత్వాలు కిందికి చూపు సారించడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధ్యమేనా అన్న అనుమానం వస్తుంది. ఈ పార్లమెంటరీ తరహా వ్యవస్థలో కొన్ని సాధ్యం కావని, మనుషులే పూనుకొని, ప్రశ్నించి సాధించుకోవాలని డా.అంబేద్కర్ మహాశయుడు ఎప్పుడో చెప్పాడు. ఆయన రాజ్యాంగం ద్వారా ఏమి కోరుకున్నాడు అన్న విషయం మన పాలకులు ఏనాడో మరచిపోయినారు.
ప్రపంచంలో మన మాటే నడుస్తోందని, అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కాని, ఇటు శ్రీలంక సంక్షోభాన్ని కాని ఆపే సత్తా మన నాయకుడికే ఉందని అబ్బో జనాలు రాస్తూనే ఉంటారు. తీరా చూస్తే ఈ పోషకాహార లోపం ప్రపంచంలో మన దేశంలోనే ఎక్కువగా ఉందని ఆ నివేదికలే చెబుతున్నాయి. ఇక నిజంగా ప్రపంచంలో మన పరిస్థితి ఏమిటి? మన స్థానం ఏమిటి? అని ఇంకెన్నో వివరాలు దొరుకుతాయి. అవి చూసి తరించాలి మనమంతా. ప్రజలు ఆకలితో మాడిపోతున్నా, నాయకుల కీర్తి ప్రతిష్టలు చూసి పొంగిపోయి మన పొట్టలు ఉబ్బిపోతే అప్పుడు పోషకాహార లోపం లేనట్టు లెక్క!!
బాలల్లో, స్త్రీలలో రక్త హీనత మరో సమస్య. అందుకు పోషకాహారం తీసుకొండని ప్రకటనలు. నిజంగా ప్రజల మీద అంత ప్రేమ ఉంటే తినే పదార్థాల మీద కూడా జి.ఎస్.టి ఎందుకేశారు అధ్యక్షా అని మనం ప్రశ్నించాలి. మన బదులు మనమెన్నుకున్న నాయకులు, కొద్దిమందైనా, చట్ట సభల్లో ప్రశ్నిస్తారని మనమనుకుంటే వారి నోటికి కనిపించని తాళాలు వేస్తున్నారు. ఆకలి, రక్త హీనత, పోషకాహారం, విఫలం ఇలా కొన్ని పదాలు అక్కడ మాటలాడరాదని హుకుం జారీ చేసినా చేస్తారు. దేశమంతా తాము పాకే క్రమంలో రక్త తర్పణలు జరుగుతునే ఉన్నాయి. ఆ రక్త దాహం తీరడానికి ప్రజల మధ్య చిచ్చు పెట్టడం సాధారణం. అందుకే వారికి రక్తహీనత ఉండదనుకుంటా. తాము చేసే ఎటువంటి పనులకూ జి.ఎస్.టి ఉందదు మరి.
పోషణ తక్కువై ఒకవైపు దేశం నీరసించి పోతుంటే, నాయకుల దూషణలు ఎక్కువై ఇంకోపక్క ప్రజాస్వామ్యం, విలువలు క్షీణిస్తున్నాయి. బయట తమ జనాలు మాటలు ఎన్నైనా, ఏవైనా మాట్లాడొచ్చు. కాని అదే ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పార్లమెంటులో ఫలానా పదాల ప్రయోగం అస్సలు జరగకూడదు అని ఒక జాబితా ఇచ్చారు అమాత్యుల వారు. తాము రోరు విప్పినప్పుడు మాత్రం బాగా చప్పట్లు కొట్టించుకునే నాయకులు ఇతరుల నోళ్ళకు తాళాలు వేస్తున్నారు. ఇప్పటికే అన్నింటిపైనా నిషేదాలు విధిస్తూ, భావ స్వేచ్ఛను ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా అణచి వేస్తూ ఇప్పుడు ఆహారం పై కూడా పన్ను వేసి ఏమని అడగడానికి లేకుండా చేయడం అసలు సిసలు ప్రజాస్వామ్యమని మనం తెలుసుకోవాలి. కొద్ది కొద్దిగా సంపాదించేవారి, కొద్దిగా ఉన్నవారి జేబుల్లో ఏమీ లేకుండా చేయడానికి ప్రతిదాని మీదా పన్నులు వేసి చిల్లులు పెడుతున్నారు. పి.ఎఫ్ లలో పెట్టుకునేవారిని, ఎవరి పెన్షన్ వారే కట్టుకునే వారినీ వదిలి పెట్టక వాటినీ కాజేసి, సదరు మొత్తాలను షేర్లలో పెట్టాము, వాటి విలువ తగ్గింది అందుకే మీ ఖాతాల్లో జమలు తగ్గిపోయాయి అని చేప్పే వాళ్ళు వాటికి ట్రస్టీలుగా అంటే కాపాడేవారిగా ఉన్నారు. అలాగే ప్రజల్ని, వారికి పౌష్టికాహారాన్ని అందించేవారు, అంటే ప్రజల్ని కాపాడే వారు కూడా ఇంకా బాగా పని చేసి ప్రపంచ కుబేరుల్లో మన వాళ్ళ సంఖ్యను పెంచుతూ, వారి ర్యాంకును పెంచుతూ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు ఎటూ పైకి రారు కాబట్టి వారిని ఇంకా కిందికి నొక్కేయడమే సరైన మార్గమని అనుకున్నారో, లేక పైనుండి బరువు పడితే ఇలా కిందికి పోతున్నారు అంటారో తెలియదు కాని మొత్తం పైన ప్రపంచ దేశాల్లో మనం అన్ని విధాలుగా దిగజారుతున్నామని సూచీలు చెబుతున్నాయి.
మనుషుల పెరుగుదలలో వ్యత్యాసాలు ఉంటాయి కాని తాము అధికారం వెలగబెడుతున్న రాష్ట్రాల్లో అవి ఇంకా తీవ్రంగా ఉన్నాయన్నది అమాత్యులు గమనించవలసిన అంశం. శారీరకంగా, ఆర్ధికంగా కూడా మీ పాలనలో ఉండే తారతమ్యాలు మొదట చూసుకొండి అంతే కాని త్వరలో ఫలానా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తాము, తస్మాస్ జాగ్రత్త అని సభలు జరిపి పోవడం గోబెల్స్ లాంటి వాళ్ళ పాఠాలు తలకెక్కించుకున్న మాటలుగా తోస్తున్నాయి. మనుషుల విగ్రహాలు ఎత్తుగా, బరువుగా ఉంటే చాలదు, రేపటి తరం మనుషులుగా ఎదిగే చిన్నారుల బరువు మీదా దృష్టి పెట్టడం బాధ్యతగా భావించాలి. లేదంటే ఆ పౌష్టికాహారాన్నీ స్వాహా చేస్తున్నట్టే లెక్క.
- జె. రఘుబాబు
సెల్:9849753298