Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొన్నటి దాకా జాతీయ ప్రత్యామ్నాయ నేతగా ప్రచారం చేసుకున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒక్కసారిగా ఉనికిని కాపాడుకోవడానికి ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. నిరాడంబర మూర్తిగా, ''నీతి నిజాయితీల నిప్పుకణిక''గా ఆమెను చిత్రించిన బడామీడియా ఇప్పుడు కథ మార్చేస్తున్నది. ప్రపంచంలోనే అరుదైన కమ్యూనిస్టు విజయగాధగా చరిత్రకెక్కిన వామపక్ష సంఘటన మూడున్నర దశాబ్దాల పాలన సహించలేని శక్తుల అండతో ''ఆశాదీపం''గా చూపించబడిన అక్క(దీదీ) ఇప్పుడు చిక్కుల్లో పడిపోయారు. రోతపుట్టించే స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సి) కుంభకోణంలో పుట్టలు పుట్టలుగా కోట్లు బయిటపడ్డాక, తృణమూల్ సర్కార్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. భవిష్యత్ పరిణామాలు తెలుసుగనకే మమత రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలోనే రాజకీయ పిల్లిమొగ్గలు వేశారు. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా నిలిచిన మాజీ మంత్రి పార్థాచటర్టీ అరెస్టు, యాభై కోట్ల పట్టివేత తర్వాత మరింత దిగిపోయి మోడీతో తక్షణ సమావేశానికి తొందరపడుతున్నారు.
ఎస్ఎస్సీలో జరిగిందేమిటి?
ఎస్ఎస్సీ పాఠశాల టీచర్ల నియామకం కోసం పరీక్షలు నిర్వహిస్తుంది. వామపక్ష ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధతో గొప్ప ప్రగతి సాధించింది. ప్రయివేటు కార్పొరేట్ విద్యాసంస్థలు అక్కడ విస్తరించలేదంటే కారణం ప్రభుత్వ విద్యారంగం సమర్థంగా నడవడమే. ఆ కాలంలో టీచర్ల నియామకం ఎలాంటి జోక్యాలు లేకుండా నిబంధనల ప్రకారం నడిచింది. మమతాబెనర్జీ అధికారంలోకి వచ్చాక కొద్ది కాలంలోనే ఇదంతా గోల్‌మాల్‌గా మారింది. నియామకం కోసం పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకున్నవారికి ఉద్యోగాలు హుళక్కి కాగా, అంతుతెలియని రాశిలో వెనకనున్న వారు అవలీలగా పోస్టులు సంపాదించారు. 2013లో టెట్ ఫలితాలలో కేవలం 1.07శాతం అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించినట్టు ప్రకటించారు. 55లక్షల మంది అభ్యర్థులు రాసినట్టు మొదట వివరాలు రాగా తర్వాత హఠాత్తుగా 45లక్షల మంది మాత్రమే రాసినట్టు ప్రకటించారు. తర్వాత 17లక్షల 72వేలకు కుదించారు. 18,792మంది అర్హత సాధించారని వెల్లడించారు. ఇదంతా పెద్ద బూటకమని, పరీక్షా పత్రాలను తృణమూల్ కార్యాలయంలోనే దిద్దారని కూడా బహిర్గతమైంది. తద్వారా తమ బంధుమిత్రులను, కార్యకర్తలను మాత్రమే ఎంపిక చేశారు. కల్నా నియోజక వర్గ ఎంఎల్ఎ కుటుంబంలో ఎనిమిది మందికి పోస్టింగులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. ముకుల్ రారు, పార్థాచటర్జీ, మదన్మైత్రాల కమిటీ ఈ నియామకాలు ఖరారు చేసింది. 2014లోనే బయిటకొచ్చిన ఈ కుంభకోణంపై నిరసన కొనసాగుతున్నా ప్రభుత్వం సరిదిద్దుకోకపోగా సమర్థనలతో సరిపెట్టింది. 2018 నాటికి ఇది తీవ్ర రూపం తీసుకుంది. సీపీఐ(ఎం) ఎంపీ వికాస్ రంజన్ భట్టాచార్య హైకోర్టులో కేసు వేశారు. మరోవంక నష్టపోయినవారి నిరసన దీక్షలు కొనసాగాయి. రాష్ట్రం మూలమూలలా ఈ స్కాంకు వ్యతిరేకంగా పోస్టర్లు నినాదాలు వెలిశాయి. అప్పటి నుంచి అటు ప్రత్యక్ష పోరాటం, ఇటు న్యాయపోరాటం కూడా ఉధృతమవుతూ వచ్చాయి. మమత మూడోసారి గెలిచాక కోర్టులో విచారించే న్యాయమూర్తులు కూడా బెదిరింపులు ఎదుర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు మమత చెబుతున్నా, రాజకీయ బేరసారాలు సాగుతూనే వచ్చాయి. శారదాస్కాం, నారదా స్కాం ఇంకా వివిధ సంస్థల్లో అక్రమాలకు పాల్పడిన ముఖ్యనేతలు నెమ్మదిగా బీజేపీలో చేరి దర్యాప్తును తాత్కాలికంగా తప్పించుకున్నారు. ముకుల్‌రారు, అభిషేక్ బెనర్జీ, సువేంద్రు అధికారి ఇలా మమత బృందంలో కీలక నేతలు చాలామంది బీజేపీలో చేరారు. వారంతా బీజేపీ శిబిరంలో చేరి రక్షణ పొందడమే గాక తమ లోగుట్టు వెల్లడించారని పరిశీలకుల అభిప్రాయం. బెంగాల్లో వామపక్షాలు, మీడియా కూడా అనేక అవినీతి వ్యవహారాలు బయిటపెడుతున్నా కేంద్రం సకాలంలో చర్యలు తీసుకోలేదు. శారదాస్కాంలో చిట్‌ఫండ్ వ్యాపారం, ఆ సొమ్మును మీడియాలోకి మళ్లించడం, మమత అనుకూల ప్రచారంతో ఓటర్లను మభ్యపెట్టడం వీరివ్యూహంగా నడిచింది. వాస్తవానికి సింగూరు నందిగ్రామ్లపై దుష్ప్రచారం వెనక కూడా ఇదే ఉంది. సీపీఐ(ఎం)ను దెబ్బతీసేందుకు ఆరోజున మావోయిస్టులు, ముస్లింలీగ్, బీజేపీ, కాంగ్రెస్ కూడా చేతులు కలిపినచరిత్ర ఇప్పుడు గుర్తుకు వస్తున్నది. ఆరాచకం మూర్తీభవించిన మమతను వీరనారిగా, పేదలమనిషిగా వీరంతా ప్రచారం మోగించారు. వామపక్ష పాలనలో తప్పులు కొన్ని దొర్లి ఉండవచ్చు గాని ఇసుమంతైనా అవినీతి మచ్చ అసలు చూపించలేక అసత్య ప్రచారాలు చేపట్టారు. కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులంతా కలసి మమతను గెలిపించారు. సాదాచీర, సామాన్యమైన ఇల్లు అంటూ ఆమె నిరాడంబరతను వేనోళ్ల కీర్తిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారు. (మమత పేదల కాలనీలో ఉన్నట్టు చెప్పుకున్నా ఆ ఇంటి మర్మతులకు జనావాసంలో ఆమె రక్షణకు మామూలుకంటే ఎక్కువ ఖర్చవుతుంది. నిజానికి జ్యోతిబాసు, బుద్ధదేవ్ భట్టాచార్యతో సహా ఎవరూ ముఖ్యమంత్రి నివాసంగా భవనం తీసుకోలేదు. జ్యోతిబాసు సొంతింట్లోనే ఉండేవారు. బుద్ధదేవ్ ప్రభుత్వ గృహ సముదాయంలో ఉన్నారు. అసలు బెంగాల్‌కు ముఖ్యమంత్రి నివాసం అంటూలేదు) ఏమైనా వ్యక్తిగత నిరాడంబరత మాటున నీతినిబంధనలు ఎలా పాతరేశారో ఇప్పుడు ఖచ్చితమైన ఆధారాలతో దొరికిపోయింది. కేంద్రం తమ ప్రత్యర్థులపైన కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎన్ఐఎ వంటివాటిని దుర్వినియోగపరుస్తున్న మాట నిజమే. పార్లమెంటు సమావేశాల సమయంలో తృణమూల్‌తో సహా వివిధ ప్రతిపక్షాలు దీనిపై ఒక ప్రకటన చేశాయి కూడా. అయితే అవినీతి ఆరోపణలకు ఖచ్చితమైన ఆధారాలున్నప్పుడు దర్యాప్తు వద్దని దాని ఉద్దేశం కాదు. ఈ దర్యాప్తులలో ద్వంద్వనీతి అన్నది సమస్య. ఇప్పుడు ఎస్ఎస్సీ వ్యవహారంలో కూడా దర్యాప్తు హైకోర్టు ఆదేశాలతో జరుగుతున్నది.
నోట్ల కట్టలు గుట్టలు గుట్టలు
పార్థాచటర్జీ సన్నిహితురాలైన మాజీనటి అర్పితా ముఖర్జీ ఇంటిపై దాడి చేసినప్పుడు గదినిండా దాచివున్న 21 కోట్ల నగదు పట్టుబడింది. అక్కడ దొరికిన వివరాలతో మరోదాడి చేస్తే ఇంకో 29 కోట్లకు పైగా దొరికింది. ఖరీదైన బంగారు కానుకలు, విలువైన పెయింటుంగులకు లెక్కేలేదు. ఇంత ప్రత్యక్షంగా నోట్ల కట్టలతో దొరికిపోయిన సందర్బాలు అరుదు. పార్థాచటర్జీ అరెస్టు వెనువెంటనే మమతాబృందం ఆరోపణలు రుజువైతే చర్య తీసుకుంటామని గంభీరోక్తులు పలికింది. ఇంతలోనే ఆయనను తొలగించాలని అంతర్గతంగా వత్తిడి పెరగడంతో పార్టీ పదవుల నుంచి, మంత్రి పదవి నుంచి కూడా తొలగించి చేతులు దులుపుకున్నారు. పార్థాచటర్జీ ముఖ్య నాయకుల ఫిరాయింపుల తర్వాత కొన్నేళ్లుగా మమతకు కుడిభుజంగా చక్రం తిప్పుతున్నవాడే గానీ ఆషామాషీ మనిషికాదు. ఆమెకు తెలియకుండానూ ఆమె పాత్ర లేకుండానూ ఇంత పెద్ద కుంభకోణం ఇంత కాలం సాగడం అసంభవం. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం తదితరులు ఈ సర్కారు అవినీతి పుట్ట అని ఈ తీగతో పాటు మొత్తం దొంక కదిలించాల్సిందేనని కోరారు. ముఖ్యమంత్రి కూడా వైదొలగాలని కోరుతూ వామపక్షాలు పెద్ద ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి.
రాజకీయ భవితవ్యం?
ఈ పరిణామాల తర్వాత మమతా బెనర్జీ మోడీతో సయోధ్యకు ప్రయత్నించవచ్చనేది ఒక అంచనా కాగా, ఆమె సమావేశం కోసం ప్రయత్నించడం అదే సంకేేతమిస్తున్నది. 2021 ఎన్నికలకు ముందు వరసకట్టి బీజేపీలోకి ఫిరాయించిన ముఖ్యులు అనేకమంది ఆమె విజయం తర్వాత తిరిగివచ్చారు. వారిలో చాలామందిపై కేసులున్నాయి. ఇప్పుడు బీజేపీ నాయకుడుగా ఉన్న సువేందు అధికారి కూడా అలావెళ్లిన వారే. 2021లో గెలుపు తర్వాత తిరిగి వచ్చిన అభిషేక్ బెనర్జీ, ముకుల్‌రారు వంటివారు తృణమూల్‌లో మళ్లీ కీలక స్థానాలు పొందారు. మొత్తంపైన రెండు పార్టీల్లో అదే నాయకులు ముఖ్యపాత్రధారులుగా ఉన్నారనేది వాస్తవం. దాగుడు మూతల వ్యవహారంగా ఉన్న ఈ రెండు పార్టీల అవకాశవాద సంబంధాల గురించి స్పష్టంగా చెప్పడం కష్టం. వామపక్షాలు అదృశ్యమైపోయాయని చెల్లుచీటి రాసినవారు కూడా ఇప్పుడు వాటి భవిష్యత్ పాత్ర గురించి మాట్లాడుతున్నారు. ఈ మధ్య స్థానిక ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు రావడం ఇందుకు మరో కారణం.
అవినీతి సొమ్ము అపారంగా కలిగివున్న మమతను కాపాడేందుకు ఇప్పుడు అనేక విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు రాజ్‌దీప్ సర్దేశాయి జరిపిన ఒక చర్చలో ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ జయంత ఘోషాల్ మమతకు ఈ అవినీతి గురించి తెలియదని చెప్పారు. ఆ పార్టీ ఎంపీ స్వాగత్రారు కూడా పార్థాచటర్జీ తమకందరికీ అప్రతిష్ట తెచ్చారని ఆక్రోశిస్తున్నారు. ముఖ్యమంత్రికి ఇవేవీ తెలియదని సమర్థించడానికి సన్నిహిత నేతలు తంటాలు పడుతున్నారు. నిజానికి అనేక రకాలైన మాఫియాముఠాలతో తృణమూల్‌కు గట్టిబంధమే ఉంది. ఈ కేసులోనే ఎనిమిది బినామీ ఖాతాలు స్తంభింపచేశారు. మూడు ఉత్తుత్తి కంపెనీలు దొరికాయి. మరింత లోతుగా ఖచ్చితంగా దర్యాప్తు సాగితే ఇంకాచాలా బయిటకొస్తాయి. ఇన్నేళ్లు ఆందోళన చేస్తున్నవారిని పట్టించుకోని పాలక పార్టీ కార్యదర్శి అభిషేక్ ముఖర్జీ వారికి ఉద్యోగాలు ఇస్తామని చర్చలకు వెళ్లడం నష్టనివారణ వ్యూహమే. బీజేపీ ఇప్పుడు చాలామాట్లాడుతున్నా ఇన్నాళ్లు ఎందుకు దాటేశారనేది చెప్పాల్సివుంటుంది. ఈ కుంభకోణంపై తొలినుంచీ వివిధ రూపాలలో పోరాడుతున్న సీపీఐ(ఎం) వామపక్షాలు మాత్రం దోషులందరని బోనెక్కించేదాకా వదలిపెట్టడం జరగదు. మమతా బెనర్జీ రాజీనామా చేసి మరెవరినైనా ముఖ్యమంత్రిగా చేయాలనే పోరాటం కొనసాగించనున్నాయి.
- తెలకపల్లి రవి