Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలు, వ్యవసాయ కార్మికులను ఆదుకునేందుకు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ నిర్లక్ష్యం నిరుపేదల పాలిట పెను శాపంగా మారింది. ప్రజలకు కావలసిన నిత్యవసర వస్తువులను అందించాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ కాస్తా నేడు కేవలం రేషన్ బియ్యం పంపిణీ పథకంగా తయారైంది. ఉమ్మడి రాష్ట్రంలో అమ్మ హస్తం పథకం ద్వారా తొమ్మిది రకాల సరుకులను పొందిన నిరుపేదలు, ప్రత్యేక రాష్ట్రంలో వాటికి దూరమవుతున్నారు. రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, చక్కెర, కిరోసిన్, పామాయిల్, గోధుమలు, చింతపండు, పప్పు, కారం, ఉప్పు, పసుపు వంటి నిత్యవసర సరుకులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించేవారు. కానీ నేడు ఆ నిత్యవసర సరుకుల పంపిణీకి మంగళం పాడారు. ప్రతి వ్యక్తికి అదనంగా బియ్యం ఇస్తున్నప్పటికీ మిగతా ఎనిమిది రకాల సరుకులు నిలిపివేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థ నీరుగారిపోతోంది. ప్రస్తుతం సివిల్ సప్లైశాఖ నుండి లబ్ధిదారులకు బియ్యం మాత్రమే అందిస్తున్నారు. అంత్యోదయ కార్డు దారులకు కొద్దిరోజుల పాటు చెక్కర పంపిణీ చేశారు. ప్రస్తుతం అది కూడా ఇవ్వడం లేదు. ఐదేండ్లుగా పామాయిల్ సరఫరా లేక పెరిగిన ధరలతో పేదలు, వ్యవసాయ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. బియ్యం మాత్రమే ఇస్తే వచ్చే కమిషన్ ఏమాత్రం సరిపోదని మరోపక్క రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. మండుతున్న నిత్యవసర సరుకుల ధరలతో బతుకు బండి కదలక లబోదిబోమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రజలు ఆదాయ మార్గాలు కోల్పోతుంటే ప్రభుత్వాలు మాత్రం ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నాయి. బహిరంగ మార్కెట్లో సరుకులు కొనుగోలు చేయాలంటే జనం బెంబేలెత్తుతున్నారు. అర్థాకలితో అలమటిస్తున్నారు.
దేశానికే ఆదర్శంగా కేరళ ప్రజాపంపిణీ విధానం
కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజా పంపిణీ విధానం దేశానికే ఆదర్శంగా ఉంది. ఆ రాష్ట్ర ప్రజల స్థితి గతుల ఆధారంగా ప్రజా పంపిణీ వ్యవస్థను నాలుగు భాగాలుగా విభజించి ప్రజలకు నిత్యావసర వస్తువులను అందిస్తూ వామపక్ష ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతున్నది. పేదవాడి కడుపు నింపేందుకు 14 రకాల నిత్యావసర వస్తువులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందజేయడం పేదల పట్ల వామపక్ష ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. రేషన్ డీలర్లకు ప్రతి సంవత్సరం కమీషన్ పెంచుతూ వారి సమస్యలను కూడా చిత్తశుద్ధితో పరిష్కరిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తే పేదలకు పెరిగిన ధరల నుండి ఉపశమనం కలుగుతుంది. ఆ దిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం.
- మట్టి పెల్లి సైదులు
8106778287