Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత రాజ్యాంగంలోని 45వ ఆర్టికల్ ''6 నుంచి 14 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన బాలలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించాల''ని చెబుతున్నది. 'విద్యా హక్కు చట్టం' 2009 సంవత్సరంలో ఆమోదం పొంది చట్టమైన అనంతరం ఈ ఆర్టికల్‌కి పరిపుష్టి చేకూరి, దేశంలోని బాలలందరికీ విద్య అనేది హక్కుగా పరిణమించింది. అయితే చట్టం వచ్చి పుష్కరకాలం గతించినప్పటికీ బాలలకు సరైన విద్య అందడంలేదన్నది కాదనలేని వాస్తవం. పాలకుల సంకుచిత విధానాల వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల అందరికీ విద్య అనేది అందని ద్రాక్షలాగే మిగిలిపోతున్నది. ప్రపంచీకరణ ప్రబలంగా విస్తరించిన 21వ శతాబ్దంలో కార్పొరేట్ శక్తులు విజృంభించి విద్యారంగాన్ని తమ గుప్పెట్లోకి తీసుకున్నాయి. విద్యారంగంలో ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయాలను సైతం ప్రభావితం చేసే స్థాయికి ఇవి ఎగబాకాయి. గతంలో అనగా 1975 సంవత్సరం వరకు విద్యా విధానాల తయారీ, వాటి అమలు రాష్ట్రాల పరిధిలోనే ఉండేది. అయితే 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 సంవత్సరంలో విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్చిస్తూ, నిర్ణయాలు చేస్తూ విద్యారంగ అభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతోనే ఈ మార్పు చేశారు. కానీ.. తదనంతర కాలంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వీలులేకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రాల హక్కులు హరించబడుతున్నాయి.
''ఏ దేశాన్ని అయినా నాశనం చేయాలంటే ఆ దేశంపై అణుబాంబులు లేదా క్షిపణులు ప్రయోగిం చాల్సిన అవసరం లేదు. ఆదేశ విద్యారంగాన్ని నాశనం చేస్తే సరిపోతుంది. అప్పుడు ఆ దేశం దానంతట అదే నాశనం అవుతుంది''. అని దక్షిణాఫ్రికాలోని ఓ విశ్వవిద్యాలయం ప్రవేశద్వారం వద్ద రాయబడి ఉంటుంది. ఇది విద్య యొక్క ఔన్నత్యాన్ని, ప్రాశస్త్యాన్ని వివరించడానికి, అవిద్య వలన కలిగే నష్టాలను అవగాహన చేసుకోవడానికి ఉద్దేశించినది. అయితే ఈ మాట నేడు భారత దేశంలోని వర్తమాన పరిస్థితులకు అద్దం పడుతున్నట్లుగా అని పిస్తున్నది. ప్రస్తుతం దేశంలో బడుగు, బలహీన వర్గాలను విద్యకు దూరం చేస్తూ, విజ్ఞానపు దీపాలను ఆర్పేసి, అజ్ఞానపు చీకట్లను పాదుకొల్పే కుతంత్రాలు ముమ్మరంగా విస్తరిస్తున్నవి. ప్రజలను చైతన్య స్రవంతిలో చేరనీయకుండా భావోద్వేగాల చట్రంలో బందీలను చేస్తూ, భావితరాల పాలిట మరణ శాసనాలు లిఖిస్తున్నారు. మానవాభివృద్ధి సూచీలో మున్ముందుకు వెళ్లాల్సిన దేశం క్రమంగా వెనుకబడుతోంటే ప్రపంచ దేశాలే విస్తుపోతున్న విషయాన్ని మరిచిపోలేము. అయినప్పటికీ బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు తగ్గిస్తూ, విద్య తమకు అప్రాధాన్యమైన రంగం అన్నట్టుగా కేంద్రం ఆంతర్యాన్ని తేటతెల్లం చేస్తున్నది.
ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ విద్యారంగ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే విద్యార్థులకు అందాల్సిన పాఠ్యపుస్తకాలు. రెండు నెలలు కావస్తున్నా ఇంకా 50శాతానికి అటు ఇటుగా మాత్రమే సరఫరా చేయడం ప్రణాళిక లేని తనంగా భావించవచ్చు. ఏకరూప దుస్తులు సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నది. మధ్యాహ్న భోజనానికి అతి దారుణంగా నిధులు కేటాయిస్తూ అనివార్యంగా నాణ్యత కొరవడేందుకు ఆస్కారం ఇస్తున్నది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న పరిస్థితుల్లో కూడా అర్థపుష్కర కాలం నాటి పాత రేట్లనే కొనసాగించడం హేయమైన చర్యగా భావించవచ్చు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించిన గౌరవ వేతనం పెంపు హామీ అమలుకు నోచుకోకపోవడం బాధాకరం. పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించడానికి వెనుకాడుతున్న ప్రభుత్వం పేద పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నది. ఇక ఉపాధ్యాయుల కొరత పాఠశాలల్లో తీవ్రంగా వేధిస్తున్న సమస్య. ఖాళీల భర్తీకి చొరవ చూపకుండా ప్రస్తుతం పనిచేస్తున్నవారిలో అదనపు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ సమాజంలో నగుబాటుకు అవకాశం ఇస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినందున, రాష్ట్రవ్యాప్తంగా సర్దుబాటు చేద్దామనుకున్న ఉపాధ్యాయుల సంఖ్య 5 వేలకు మించకపోవడం ఈ ప్రక్రియ అసంబద్ధతను వ్యక్తీకరిస్తున్నది. సర్దుబాటు పేరుతో ప్రభుత్వం కావాలనే కాలయాపన చేయడం, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకపోవడం, అప్పటివరకు తాత్కాలిక ఉపాధ్యాయులను లేదా విద్యా వాలంటీర్లను నియమించకపోవడం ఈ ప్రభుత్వానికి విద్యా రంగం పట్ల ఉన్న నిర్లక్ష్యపు వైఖరిని బహిర్గతపరుస్తున్నది. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన 'ఆంగ్ల మాధ్యమం' అమలులో కూడా ఇదే నిర్లక్ష్యం కొనసాగుతున్నది. ఉపాధ్యాయుల కొరత, పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం, ఆంగ్ల మాధ్యమ శిక్షణ సరైన రీతిలో సాగకపోవడం వంటి లోపాల వల్ల లక్ష్యం చతికిలపడింది. పాఠశాలలకు ఘనమైన వైభవం తీసుకొచ్చే పథకంగా పేర్కొనబడిన 'మన ఊరు - మనబడి' కార్యక్రమం నిధుల జాప్యంతో వెనుకపట్టు పట్టింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై వెలువడుతున్న ఊహాగానాల నేపథ్యంలో నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టాల్సిన కాంట్రాక్టర్లు పునరాలోచనలో పడ్డారు, వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగవలసిన విద్యాశాఖలో నిర్లిప్తత, నిరాసక్తత నెలకొని ఉన్నది.ఈ నిర్లిప్తత, నిరాసక్తతలను ప్రభుత్వం బద్దలు కొట్టాలి. పాఠశాలలకు అవసరమైన అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో ''విద్యా మిషన్'' ను ప్రకటించి అమలు చేయాలి. అభివృద్ధి అనే శరీరానికి గుండెకాయ వంటి విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం ద్వారా ''విజ్ఞాన తెలంగాణ'' ఆవిర్భావానికి బీజం వేయాలి.
ఒక దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలంటే అత్యంత ప్రాధాన్యతనివ్వాల్సిన రంగం విద్యా రంగం. అలాంటి విద్యారంగం పట్ల మన పాలకుల నిర్లక్ష్యపు ధోరణి, ఇంకా చెప్పాలంటే వివక్షాపూరితమైన వైఖరి మారాలి. కుటిల రాజకీయ లక్ష్యాలతో కూడిన వైఖరిని విడనాడితేనే మన దేశం పురోగమిస్తుందన్న వాస్తవాన్ని అంగీకరించాలి.
- వరగంటి అశోక్
9493001171