Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లమలలో మళ్ళీ యురేనియం అలజడి మొదలైంది. తెలంగాణ భూమికి వాలుజడ లాంటి నల్లమల అభయారణ్యం ప్రకృతి రమణీయతకు, అపురూపమైన జంతుజాలానికి నెలవు. అంతేకాదు, చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ప్రాచీన గిరిజన తెగలెన్నింటికో విస్తారమైన ఈ కొండకోనలే ఆవాస ప్రాంతాలు. ఇపుడు వాటి భవిత మళ్ళీ ప్రశ్నార్ధకమవుతున్నది. అమ్రాబాద్ టైగర్రిజర్వ్లో యురేనియం నిక్షేపాల అన్వేషణకై కేంద్ర అణుశక్తి సంస్థకు కేంద్ర అటవీ సలహామండలి సూత్రప్రాయంగా అనుమతి ఇవ్వడమంటే... అది కేవలం చరిత్రను చెరిపేయడమే కాదు, అక్కడి జీవ వైవిధ్యాన్నీ, గిరిజన తెగల జీవితాలనూ కాలరాయడమే. ప్రముఖ శైవక్షేత్రాలకు నెలవుగానే గాక, దేశంలోనే రెండో అతి పెద్ద పులుల అభయారణ్యంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రాంతం ఈ అమ్రాబాద్ టైగర్‌రిజర్వ్ ఫారెస్టు. ఈ అభయారణ్యంలో 20వేల టన్నుల నాణ్యమైన యురేనియం ఉన్నట్లు ప్రాథమిక అంచనా. ఈ యురేనియం తవ్వకాలు మొదలైతే ప్రభావం ఈ నల్లమలతో పాటు, చుట్టూ 83కి.మీ పరిధిలోని గ్రామాలపై కూడా ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతు న్నారు. నల్లమల గుండా ప్రవహించే కృష్ణానది, దానిపై నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, చెంతనే ఉన్న డిండీ ప్రాజెక్ట్‌ల నీటిపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే పెల్లుబుకిన నిరసనలతో వెనక్కి తగ్గినట్టే తగ్గిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా తిరిగి అనుమతుల ప్రహసనం మొదలు పెట్టడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అణుశక్తి విభాగం ప్రతిపాదనలో లోపాలున్నట్లు చెబుతూనే, దేశ ప్రయోజనాల దృష్ట్యా సూత్రప్రాయ అనుమతి ఇస్తున్నామని చెప్పడం గమనార్హం. సంబంధిత పత్రాలు, ఆధారాలను పరిశీలించాకే తుది అనుమతి ఉందని స్పష్టం చేసినప్పటికీ ఇది కేవలం సాంకేతిక లాంఛనమేనని నిపుణులు అంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో 1.99 లక్షల హెక్టార్లలో నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో 2008నుంచి అణుశక్తి సంస్థ ఖనిజాన్వేషణ మొదలుపెట్టగా, అది 2014వరకు కొనసాగింది. ఆ అడవుల్లో రూ.లక్షల కోట్ల విలువైన యురేనియం నిక్షేపాల నిల్వలు ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. దాంతో అమ్రాబాద్-ఉడిమిల్ల, నారాయణపూర్ ప్రాంతాల్లో డ్రిల్లింగ్ అనుమతుల కోసం అణుశక్తి విభాగం ప్రతిపాదన పంపింది. నాగార్జునసాగర్ ప్రాంతంలోని నిడ్గుల్ రక్షిత అటవీ ప్రాంతంలో 7 చదరపు కిలోమీటర్ల పరిధిలోని రెండు బ్లాకుల్లోనూ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని 76 చదరపు కిలోమీటర్ల పరిధిలోని రెండు బ్లాకుల్లోనూ గుట్టుచప్పుడు కాకుండా యురేనియం నిక్షేపాలపై రహస్య సర్వేలు జరిగాయి. సుమారు నాలుగు వేలకుపైగా బోర్లు వేసారు. ఇది గమనించిన పర్యావరణ శాస్త్రవేత్తలు, ఆదివాసీ ప్రజా సంఘాల నిరసనలకు భయపడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల కాలం కూడా కావడంతో వెనక్కి తగ్గాయి. తిరిగి ఇప్పుడు ధ్వంస రచనకు సిద్ధమవుతున్నాయి..! ఈ యురేనియం తవ్వకాలు మొదలైతే అటవీ ప్రాంతమేగాక పరిసరాల్లోని ఊళ్లకు ఊళ్లే వట్టి మట్టి దిబ్బలుగా మారిపోతాయి. నల్లమలలో ఉన్న ప్రకృతి వైవిధ్యం అపారమైనది. అనేక వృక్షజాతులిక్కడ ఉన్నాయి. ఇక జంతు జాతుల విషయానికొస్తే పెద్ద పులులకు ఇది ప్రధాన ఆవాసం. చిరుతలు, ఎలుగులు, వైల్డ్ క్యాట్స్, అడవి కుక్కలు, అడవి పందులు,, కృష్ణ జింకలు, మచ్చల దుప్పిలు, తోడేళ్లు, ప్యాంగోలీన్లు, కొండచిలువలు, నాగు పాములు, అనేక ఉభయచరాలతో కూడిన జీవ వైవిధ్యానికి నెలవిది. అనాదిగా జీవిస్తున్న అనేక గిరిజన తెగల ప్రజలకూ ఇది ఆవాసం. నల్లమల నిండా అరుదైన చెంచు జాతి ప్రజలున్నారు. వారిని ఆనుకుని కొన్ని వందల గిరిజన లంబాడీ తండాలలో లక్షల జనాభా నివసిస్తున్నారు.
నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపడితే ఆదిమజాతి ప్రజలూ, అపారమైన వృక్ష, జంతు సంపదకు తోడు, దేశంలోనే ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాల ఉనికికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది. శ్రీశైల ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం, మద్దిమడుగు ఆంజనేయ స్వామి దేవాలయం, గోరాపురం భ్రమరాంబ మల్లికార్జున దేవాల యం, లొద్ది మల్లయ్య, సలేశ్వర క్షేత్రాలు కూడా యురేనియం తవ్వకాలకు అనుమతించిన ప్రదేశాల్లోనే ఉండటం గమనార్హం. యురే నియం నిక్షేపాల అన్వేషణను తెలంగాణ అటవీశాఖ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రక్షిత అటవీ ప్రాంతాల్లో వందల ఫీట్ల లోతు డ్రిల్లింగ్ చేయడం వల్ల జనావాసాలతో పాటు, అపారమైన అటవీ సంపద నాశనమయ్యే ప్రమాదముందని పేర్కొంటోంది. ఈ మేరకు 2016లో కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. కానీ, అణుశక్తి నుంచి ఇంధన స్వయంసమృద్ధి సాధించా లన్నది కేంద్రం లక్ష్యం. ప్రస్తుతం దేశంలో అణుశక్తి కర్మాగారాల స్థాపిత సామర్థ్యం 6780 మెగావాట్లు మాత్రమే! 2030 నాటికి దీన్ని 40వేల మెగావాట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కాని ఎంత మూల్యా నికి అన్నది ఇక్కడ ప్రశ్న. అయినా యురేనియం ద్వారా వచ్చే విద్యుత్, అణు రియాక్టర్ల వల్ల ఆయా దేశాలు ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన అను భావాలెన్నో చూస్తున్నాం. ఈ ప్రపంచ అనుభవాలన్నీ ప్రత్యామ్నాయంగా గాలి, సౌర విద్యుత్ దిశగా ప్రయాణించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్న విషయాన్నీ గమనిస్తున్నాం. కానీ ఇది మన ప్రభుత్వాలెందుకు ఆలోచించడం లేదు? ఇన్ని జీవితాల్ని ఫణంగా పెట్టి ఏ ప్రయోజనాల కోసమీ విధ్వంసం?
- జటావత్ హనుము
851983 6308