Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల యూనిసెఫ్ హైదరాబాద్‌లో ఒక మీటింగ్ నిర్వహించింది. ''ఆరోగ్యం పోషకాహారం తల్లిపాలు'' అంశాల మీద ఈ సమావేశం జరిగింది. పుట్టిన బిడ్డకు వెంటనే పాలివ్వలేకపోవడం మీద వక్తలు, వైద్యులు చాలా ఆసక్తికరంగా మాట్లాడారు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి వెనువెంటనే తన స్తన్యాన్ని బిడ్డ నోటికి అందించలేకపోవడం వెనకున్న అనేక అంశాలను తెలిపారు. పుట్టిన గంటలో బిడ్డకు పోషకాలు పుష్కలంగా ఉండే తల్లిపాలు అందకపోతే ఎదురయ్యే తీవ్ర ఆరోగ్య అనర్ధాల గురించి చాలా వేదన వెలిబుచ్చారు. ఇలా అందక పోవడానికి మొట్టమొదటి కారణంగా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన సిజేరియన్ ఆపరేషన్లు కారణమని, అవసరమున్నా, లేకపోయినా డాక్టర్లు చేస్తున్న సిజేరియన్ ఆపరేషన్ల వల్ల పుట్టిన వెంటనే బిడ్డ తల్లికి దూరమవడం, తల్లీ బిడ్డల మధ్య శారీరక సామీప్యత లేకపోవడం ముఖ్య కారణంగా వక్తలు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురయ్యాము. తల్లిపాలు అందకపోవడం ద్వారా ఆ బిడ్డలు భవిష్యత్తులో ఎదుర్కోబోయే విపత్కర పరిస్థితులకు, ఆరోగ్య వైపరీత్యాలకు డాక్టర్లే కారణమవ్వడం చాలా చింతించాల్సిన విషయంగా అనిపించింది.
'వైద్యో నారాయణో' అంటూ వైద్యుణ్ణి ''దేవుడి''గా కొలిచే చోట డబ్బు కోసం సిజేరియన్లు చేయడం చాలా అన్యాయం. ఆడపిండాల హత్యల వెనుక కూడా వీళ్ళే ఉన్నారనేది కాదనలేని సత్యం. గర్భస్త శిశువుకు ఏదైనా శారీరక వైకల్యం ఉందేమో, గుండె, కిడ్నీ తదితర శరీర భాగాలు సవ్యంగా పని చేస్తున్నాయో లేదో పరీక్షించడానికి చేసే అల్ట్రాసౌండ్ స్కానింగ్‌ను దుర్వినియోగం చేసేవారెందరో. అందరినీ ఒకే గాటను కట్టలేం. రోగాలతో కునారిల్లే వాళ్ళకు ప్రాణం పోసేది వైద్యులే. ఎంతో ఉన్నతమైన వైద్య వృత్తికి కళంకం తెచ్చి, డబ్బు కోసం సిజేరియన్లు, హిస్టరెక్టమీలు, గర్భస్థ ఆడపిండాల హత్యలు చేసే వర్గం కూడా ఈ వృత్తిలో ఉండటమే అత్యంత విషాదం. సిజేరియన్ ఆపరేషన్ల వల్ల పోషకాలు మిళితమైన తల్లిపాలను కోల్పోతున్న వందలాది, వేలాది బిడ్డలకు భవిష్యత్తులో ఎదురవ్వబోయే ఆరోగ్య ఉపద్రవాలను వేదికమీద డాక్టర్లు వివరిస్తుంటే వెన్నులో వణుకు పుట్టింది. ''స్కిన్ టు స్కిన్'' తల్లి వెచ్చని స్పర్శను కోల్పోయిన బిడ్డల్లో ఏర్పడే శారీరక, మానసిక అవలక్షణాలను వివరిస్తుంటే డాక్టర్లు ఎందుకింత అమానుషంగా ఉన్నారు అనిపించింది. బిడ్డ పుట్టిన క్షణమే అందాల్సిన పాలు అందకపోతే బిడ్డలు శారీరకంగా అనేక రుగ్మతలకు గురవుతారని, తల్లి శరీర స్పర్శకు దూరమైతే బిడ్డకు అనేక మానసిక సమస్యలు కలుగుతాయని చెబుతున్నప్పుడు, తల్లిపాలను కోల్పోయే బిడ్డల్లో ఏర్పడే శారీరక వైకల్యాలను వేదిక మీద వివరిస్తున్నప్పుడు పక్కనే ఉన్న మిత్రురాలు ''అమ్మూ! నీకు గుండెలో అందుకే అంత కన్నం ఏర్పడిందేమో! నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మమ్మ చనిపోయారని, అమ్మ నిన్ను మీ పెద్దక్క దగ్గర వదిలేసి వెళ్ళిపోయారని, నువ్వు ఒక్కర్తివి చాపమీద పడుకుని ఉండేదానివని చాలాసార్లు చెప్పావు. అమ్మ వెచ్చని స్పర్శగానీ, పాలు గానీ దొరకక పోవడం వల్లనే నీ గుండెకి కన్నం పడిందేమో'' అంది. నిజమేనేమో! ఏమో!! మా అమ్మకి నన్ను వదిలి వెళ్ళడం అనివార్యం. కానీ అనవసరపు సిజేరియన్లు చేసి తల్లీ, బిడ్డల్ని వేరు చేయడం క్షమించరాని నేరం కదా!
ఈ సిజేరియన్ల దందా మొదలవ్వక ముందు ప్రతి గ్రామంలో దాయీలుండే వారు. చాలా అనుభవం కలిగిన ఈ దాయీలు గ్రామంలో గర్భిణీ స్త్రీల మంచిచెడ్డలను చూసేవారు. పురుడు పోసేవారు. బొడ్డు పేగు కత్తిరించిన వెంటనే బిడ్డను తల్లి ఒడిలో ఉంచి పాలిచ్చేలా ప్రోత్సహించేవారు. బాలింత అనారోగ్యంతో ఉంటే తప్ప పుట్టిన బిడ్డను తల్లినుంచి వేరు చేసేవారు కాదు. బిడ్డ తల్లి నుంచి పుష్కలంగా పాలు తాగుతుండేది. తల్లి పాలలో ఉండే పోషకాలన్నీ బిడ్డకు అందేవి. బిడ్డ రోగనిరోధక శక్తి అపారంగా పెరిగేది. తల్లి వెచ్చని పొత్తిళ్ళలో ఉండగలిగే బిడ్డ శారీరక, మానసిక వైకల్యాలకు గురయ్యే పరిస్థితి తక్కువగా ఉండేది.
అలాంటిది వైద్యం ఇంత అభివృద్ధి చెందిన ఈ ఆధునిక కాలంలో ఎలావుండాలి? పరిశుభ్రమైన శాస్త్రీయమన వాతావరణంలో ప్రసవాలు సురక్షితంగా జరగాలనీ, ప్రసవ సమయంలో తల్లుల మరణాలు జరగకూడదని, పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉన్నత ఆశయంతోనే ''ఆసుపత్రుల్లోనే పురుళ్ళు'' పథకం మొదలైనా ఈ సిజేరియన్ల రాకెట్ బిడ్డల పాలిట శాపంగా పరిణమించింది. ఈ విషయం గణాంకాలతో సహా యూనిసెఫ్ సమావేశంలో డాక్టర్లు వివరించినప్పుడు చాలా దుఃఖం కలిగింది.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కనుమరుగు చేసిన మిడ్వైఫ్ పద్ధతి (దాయీ వ్యవస్థ)ని పునరుద్ధరించి కొంతమంది దాయీలను నియమించి వారికి శాస్త్రీయంగా శిక్షణనిచ్చి ప్రసూతి ఆస్పత్రుల్లో నియమించడం చాలా అవసరం. తెలంగాణ ప్రభుత్వం ముందే మేలుకొని దాయీల వ్యవస్థని పునరుద్ధరించడం మనస్ఫూర్తిగా ఆహ్వానించాల్సిన విషయం. మిగిలిన రాష్ట్రాలలో కూడా ఈ పథకం మొదలవ్వాలని ఆశిద్దాం. వారు గర్భిణీలతో చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయిస్తూ ప్రసవాలు సహజంగా జరిగేలా, ప్రసవమైన వెంటనే బిడ్డను తల్లి పొత్తిళ్ళలో ఉంచి పాలిచ్చేలా ప్రోత్సహించడం గురించిన దృశ్యాలను చూసినపుడు చాలా ఆనందమనిపించింది. మరింత ఎక్కువ సంఖ్యలో దాయిలను నియమించి, శిక్షణ నిచ్చి అన్ని ప్రసూతి ఆసుపత్రుల్లోను నియమించినపుడు మాత్రమే ప్రస్తుతం జరుగుతున్న పోరపాట్లను సరిదిద్దుకోగలుగుతాం. తల్లి పొత్తిళ్ళల్లో బిడ్డలు భద్రంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు. ఆరోగ్య తెలంగాణ అప్పుడు ఆవిష్కృతమవుతుంది.
- కొండవీటి సత్యవతి