Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రఖ్యాత చైనా యాత్రికుడు హ్యూయన్త్యాంగ్ తన 'భారత దేశ యాత్ర'లో శబరిమలలో బౌద్ధాలయం ఉందని రాశాడు. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త టి.ఎ.గోపీనాథరావు (1872- 1919) 1908వ సంవత్సరంలో ట్రావెన్కోర్ పురావస్తు శాఖలో పనిచేశారు. భారత పురావస్తుశాఖ అధికారిక ప్రచురణ 'ఇపిగ్రాఫికా ఇండికా' అయ్యప్ప దేవళం బౌద్ధక్షేత్రమని ప్రకటించింది. అంతేగాక, పి.సి. అలెగ్జాండర్ రాసిన 'బుద్ధిజం ఇన్ కేరళ'లో అయ్యప్ప ఆలయం - బౌద్ధాలయమనే వివరణ ఉంది. డాక్టర్ జమునా దాస్ ఒక జనరల్ సర్జన్. కానీ, ఆయన తన అభిరుచి కొద్దీ పరిశోధన సాగించి, 'తిరుపతి బాలాజీ దేవాలయం - ఒకప్పటి బౌద్ధక్షేత్రం' అనే పుస్తకం రాశాడు. అది ఇంగ్లీషులో ఉంది. నెట్లో దొరుకుతుంది.
అసలు తిరుపతి అనే పేరు ఎలా స్థిరపడిందో తెలుసుకుంటే, చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. థేరోపతి నుండి తేరోపతి, తేరోపతి నుండి తిరపతి వచ్చింది. థేరోపతి అంటే థేరోవాదం. అశోక చక్రవర్తి కాలంలో హీనయాన బౌద్ధాన్ని 'థేరోవాదం' అని పిలిచేవారు. థేరోవాదం-అంటే నిజమైన వాదం అని అర్థం! బౌద్ధం స్వీకరించినవారు తమ పేరు చివర బోధి అని చేర్చుకుంటారు. వీరు గృహస్థులుగా ఉండొచ్చు. బౌద్ధసన్యాసులు అయితే 'భంతే' అని అంటారు. ఇది పాళీ భాషా పదం. థేరోవాదాన్ని విశ్వసిస్తూ ప్రచారం చేస్తూ, ఒక దశాబ్ద కాలం తమ ఉపసంపదలో (బౌద్ధస్వీకరణలో) గడిపిన వారు 'థోరే'గా పిలవబడతారు. ఇంకా ఎక్కువ కాలం గడిపిన పెద్దవారైతే 'మహాథేరో'గా పిలవబడతారు. ఈ పదాలు (గుర్తింపులు) ఇప్పటికీ బౌద్ధులలో వాడుకలో ఉన్నాయి. ఈ వివరాలన్నీ ఎందుకంటే బౌద్ధుల 'థేరోపతి' అనే పదం కాలక్రమంలో తిరుపతి ఎలా అయ్యిందో గ్రహించడానికి!
ఆచార్య నాగార్జునుడి పేరుతో ఇప్పటి నాగార్జున సాగర్ పేరు ఎలా స్థిరపడిందో - ఇప్పటి తిరుపతిలో ఒకప్పుడు ఉన్న బౌద్ధభిక్షువు 'థేరోపతి' పేరుతో ఆ స్థలానికి తిరుపతి అనే పేరు స్థిరపడింది. ఆ కాలంలో ఆయన చాలా ప్రసిద్ధుడు. ఆసియా దేశాల నుండి ఎంతో మంది బౌద్ధభిక్షువులు ఆయన కాలంలో తిరుపతికి క్రమం తప్పక వస్తుండేవారు. అది అప్పుడు ఒక ప్రసిద్ధ బౌద్ధక్షేత్రం గనకనే వస్తుండేవారు! తర్వాత కాలంలో పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఆది శంకరుడి కాలంలో ఆయన ప్రోద్బలంతో బౌద్ధాలయం ఈశ్వరాలయంగా మార్చబడింది. అది అలా కొంత కాలం కొనసాగిన తర్వాత, రామానుజుడు రంగం మీద కొచ్చాడు. ఆయన చొరవతో ఆయన అనుచరులు ఈశ్వరాలయాన్ని విష్ణుమూర్తి ఆలయంగా మార్చారు. జనం దాన్ని వెనకటి - ఈశ్వరుడిగా పిలుచుకున్నారు. అలా అలా అది వెనకటి ఈశ్వరుడు - వెంకటేశ్వరుడిగా అయ్యింది. అందుకే చూడండి వేంకటేశ్వరుడనే పదం మనకు ఏ హిందూ పురాణాల్లోనూ, వేదాల్లోనూ కనిపించదు. ఒక వందేండ్ల క్రితం కూడా ఆ స్థలానికి ఇప్పుడు ఉన్న ప్రశస్థిలేదు.
ఈ విషయం మీద పుస్తకాలు ఉన్నాయి. ఇంటర్నెట్లో సమాచార ముంది. యూట్యూబ్లో వీడియోలున్నాయి. అభిరుచి ఉన్నవారు వెతుక్కోవచ్చు. హిందువులు గుండు చేయించుకున్నప్పుడు వెనక చిన్న పిలక ఉంచుకుంటారు. అది వారి సంప్రదాయం. కానీ, తిరుపతిలో దేవుడికి తలనీలాలు సమర్పించినప్పుడు మాత్రం పిలక ఉండదు. అది బౌద్ధుల సంప్రదాయం. అంటే ఇప్పటికీ అక్కడ బౌద్ధ సంప్రదాయపు ఆనవాళ్ళు ఇంకా ఉన్నట్టే కదా? తిరుపతిలో బాలా అనే ఒక జైన సన్యాసిని ఉండేదనీ, ఆమె బాలాశ్రీగా ప్రసిద్దురాలనీ - అదేపేరు ఇప్పుడు బాలాజీగా మారిందని కొందరు పరిశోధకులు చెప్పారు. ఇప్పటికీ ఉత్తర భారతీయులంతా వెంకటేశ్వరుణ్ణి బాలాజీ - అని వ్యవహరించడం మనం చూస్తున్నాం. ఏమైనా తిరుపతి దేవాలయం వైష్ణవాలయంగా నిర్మాణం కాలేదు. ఒక బౌద్ధ క్షేత్రమే తొలుత ఈశ్వరాలయంగా మారి, ఆ తర్వాత విష్ణు ఆలయంగా, అంటే వెంకటేశ్వరుని గుడిగా మార్పులు చెందుతూ వచ్చింది.
అయ్యప్ప దేవాలయానిదీ అదే కథ! ఒక బౌద్ధాలయాన్ని స్వాధీనపర్చుకోవడంలో శైవులకూ వైష్ణవులకూ హౌరాహౌరిగా పోట్లాట జరిగింది. విషయం కోర్టుకు కూడా ఎక్కింది. తర్వాత, ఆవేశాలు చల్లబడి వారిలో వారికి సఖ్యత కుదిరి - అయ్యకు - అప్పకూ అంటే ఇద్దరు తండ్రులకు పుట్టినవాడని కథలు అల్లుకుని, దాన్ని అయ్యప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుకున్నారు. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి; బుద్ధుని త్రిశరనాల నుండి 'శరణం' పదం తీసుకుని... అయ్యప్ప శరణం - అని పాడుకుంటున్నారు. పురాతన హైందవ సాహిత్యంలో ఎక్కడా అయ్యప్ప పేరూ, ఊరూ లేకపోవడం గమనించాల్సిన విషయం. సస్తా - అనేది బుద్ధుని పర్యాయ పదమని అమరకోశం చెపుతూ ఉంది (సస్తా దేవో మనుష్యాణామ్). ఆ సస్తా పదాన్ని అయ్యప్పకు తగిలించి వాడుకుంటున్నారు. అయ్యప్ప దేవాలయంలో జరిగే చకియార, కుట్టు వంటి సంప్రదాయ ఆరాధనలు బౌద్ధం నుండి తీసుకున్నవే. సాధారణ శకానికి పూర్వం మూడవ శతాబ్దంలో అంటే అశోక చక్రవర్తి కాలంలో బౌద్ధం కేరళలో బాగా వ్యాపించిందనీ, కరుమతి, మావెలిక్కర, భరానిక్కవు, పలిక్కవ్, కరునాగప్పలి, ఇడపల్లి, ధర్మ పట్టబ్నమ్, మటాయి పలిక్కుని - వంటి ప్రాంతాల్లో బౌద్ధం ఉచ్ఛస్థితిలో ఉండేదనడానికి ఆధారాలున్నాయి. అలాగే త్రిచూర్ వడక్కనాధన్ ఆలయం, కొండు గల్లూర్ కురుంగ భగవతి ఆలయం, శబరిమలై అయ్యప్ప ఆలయం మొదలైనవన్నీ బౌద్ధాలయాలని కె.ఆర్.వైద్యనాథ్ వెల్లడించారు. ఇకపోతే మకరజ్యోతి మహాత్మ్యం కూడా ఏమీ లేదని, అది మనుషులు చేస్తున్న గిమ్మిక్కే అని తేలిపోయింది. ఆ విషయం అయ్యప్ప దేవస్థానం బోర్డు వారే కోర్టులో ఒప్పుకున్నారు. పోలీసులు, ఫారెస్టు అధికారులు కలిసి ప్రతియేటా మకరజ్యోతి ప్రదర్శనను రక్తికట్టిస్తున్నారు. అంటే అధికారికంగానే జనాన్ని మోసం చేస్తున్నారు. అందులో దైవమహిమ ఏదీ లేదన్నది రుజువైంది. అసలు దైవమే లేనప్పుడు ఇక మహిమ ఏముంటుంది?
శివుడు తపస్సు చేస్తున్నట్టు ఉన్న విగ్రహమైనా, విష్ణువు పవళించి ఉన్న విగ్రహమైనా, వేంకటేశ్వరుడు నిలబడి ఉన్న విగ్రహమైనా - అన్నీ మార్పులు చేసుకున్న బుద్ధ విగ్రహాలేనన్నది రుజువైన సత్యం! పూర్తిగా ఆభరణాలతో, పెద్ద నామాలతో కప్పేసిన వేంకటేశ్వరుణ్ణి ఎందుకు నిదానంగా చూడనివ్వరూ? మెడపట్టి ఎందుకు తోస్తుంటారూ? - అంటే బుద్ధుడి విగ్రహం మార్చుకున్న విషయం సామాన్య ప్రజలు ఎక్కడ గుర్తు పడతారోనని, వెనక అతికించిన రెండు ఎక్స్ట్రా చేతుల భండారం ఎక్కడ బయటపడుతుందోనని భయమూ, కంగారూ అయివుంటుంది! నమ్మకం చెడిపోతే ఆదాయం పోతుంది. ఆదాయం పోతే వ్యాపారాలు కుప్పగూలుతాయి కదా? శబరిమల అయ్యప్ప, తిరుపతి వేంకటేశ్వరుడి దేవాలయాలు మాత్రమే కాక, శ్రీశైలం, మధుర మీనాక్షి, పూరీ జగన్నాధ్, సోమ్నాధ్, బద్రినాధ్ పండరీపూర్ విఠోబా వంటి దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలన్నీ ఒకప్పటి బౌద్ధక్షేత్రాలేనని చెప్పడానికి ఏమాత్రం సందేహించనక్కరలేదు. ఎప్పుడో కలియుగంలో రాబోయే కల్కి అవతారం గురించి తమ పవిత్ర గ్రంథాల్లో రాసుకున్నప్పుడు, కలియుగ దైవంగా చెప్పుకునే వేంకటేశ్వరుడి గురించి ఆ గ్రంథాల్లో ఎందుకు లేదూ? అలాగే అయ్య-అప్ప గురించి కూడా పురాణ రచయితలు రాయడం ఎందుకు మరిచారు? ఆ పురాణాలన్నీ రాయబడ్డాక - ఇలాంటి కొత్త దేవుళ్ళకు రూపకల్పన జరిగిందని తెలుస్తూనే ఉంది!
ఇక్కడ ఆది శంకరాచార్య గురించి కూడా నాలుగు మాటలు చెప్పుకోవాలి. శంకరాచార్య గురువు గోవింద భగవత్పాద. అతను అప్పటి సమాజాన్ని మోసం చేయడానికి బౌద్ధ భిక్కుగా వ్యవహరించేవాడు. లోపల మత వ్యాప్తి కోసం తపించేవాడు. అలాంటి వాడి దగ్గర శిష్యరికం చేసిన ఆదిశంకరుడు కన్యాకుమారి నుండి కాశ్మీరుదాకా ప్రయాణిస్తూ, బౌద్ధాన్ని నాశనం చేయడానికి తన శక్తియుక్తులన్నింటినీ వినియోగించాడు. ఆ కాలంలో చిన్న చిన్న రాజ్యాలుండేవి. ఆ రాజ్యాల రాజుల్ని ప్రభావితం చేసి, బౌద్ధారామాల్ని కూల్చడం, విగ్రహాలు మార్చడం జీవిత ధ్యేయంగా ఆదిశంకరుడు పనిచేశాడు. తన వితండ వాదనలతో సున్నిత మనస్కులైన బౌద్ధభిక్షువుల్ని అవమానపరిచేవాడు. న్యూనతా భావంతో వారు ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేవాడు. అందుకే శంకరాచార్యను హిందూ తీవ్రవాది - అని కొందరు ముద్రవేశారు. అయితే ఇలాంటి విషయాల్ని వైదిక ధర్మప్రభోదకులు దాచిపెట్టి, అబద్దపు అంధ విశ్వాసాల్ని ప్రచారం చేశారు. దేవుడెక్కడీ పునర్జన్మకు రుజువేది అని అడిగే ధైర్యం ఆనాటి సామాన్య ప్రజలకు ఉండేది కాదు. ఇప్పటికీ చాలా మందికి లేదు. మనువాదుల కుట్రలకు బలై 'ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నామన్నట్టు... ఉంటున్నారు. విద్యాధికులు, ప్రజా ఉద్యమాలతో ఒకప్పుడు మమేకమైన వారు కూడా మనువాదుల వలలో చిక్కి, వారు ప్రచారం చేసిన దేవీ దేవతలకు భజనలు చేస్తూ తిరుగుతున్నారు. అమాయకుల్ని, విద్యా విహీనుల్ని చైతన్యపరిచే కార్యక్రమాలు చేయకుండా తామే మూఢత్వంలో మునిగి మురిగిపోతున్నారు. సామాన్య జనం ఇలాంటివారితో జాగ్రత్తగా ఉండాలి!
సాధారణ శకానికి చాలా పూర్వం ఎక్కడా ఏ అభివృద్ధి లేని దశలో, ఎటునుండి ఏ సమాచారం అందుకునే వీలులేని రోజుల్లో గౌతముడు అడవిలో గడుపుతూ, ప్రకృతిని పరిశీలిస్తూ అంతర్ముఖుడై, అవిశ్రాంతంగా మేధోమథనం చేసి, చెప్పిన విషయాలు ఈ 21వ శతాబ్దానికి కూడా పనికివచ్చే విధంగా ఉన్నాయి. శతాబ్దాలు గడిచిపోయినా, బుద్ధుడు చెప్పిన జీవన విలువలు మారలేదు. ఈ మధ్య కాలంలో ఎంతో మంది ఖగోళ, జీవ, రసాయనిక, మానసిక శాస్త్రవేత్తలు ఎన్నెన్నో అంశాల మీద పరిశోధనలు చేస్తూ వచ్చారు. ఎన్నో కొత్త విషయాలు చెపుతూ వచ్చారు. అయినా అవన్నీ బుద్ధుడు చెప్పిన అంశాలకు కొనసాగింపులే అని అనిపిస్తాయి. చిక్కి శల్యమై దాదాపు మరణానికి చేరువైన దశలో - 'తపస్సు వల్ల ఏమీ ఒరగదని' తెలుసుకున్నాడు. మనిషి చేసే తప్పిదాలే అతని కష్టాలకు కారణమనీ, ఆ కష్టాలు తొలగాలంటే స్వార్థం, దొంగతనం, మద్యపానం, వ్యభిచారం, అబద్దాలాడటం వంటి వాటికి దూరంగా ఉండాలనీ ''పంచశీల''ను రూపొందించాడు! ఎన్నో విషయాల గూర్చి ఎంతో విపులంగా చెప్పిన బుద్ధుడు మరో విషయం కూడా చెప్పాడు. అది ఆయన అవగాహనా స్థాయిని, విశాల దృక్పథాన్నీ తెలియజేస్తుంది... ''తన చేతికి వచ్చింది బంగారమా కాదా తేల్చుకోవడానికి కంసాలి దాన్ని కాల్చి, విరిచి, రుద్ది పరీక్షించే విధంగా, నా వాక్యాలను ఓ భిక్షువులారా! నా మీద గౌరవంతో కాకుండా మీ అనుభవం అనే కొలిమిలో పెట్టి, పరీక్ష చేసి - నిలబడితేనే తీసుకోండి! లేదంటే పక్కకు తోసెయ్యండి!!'' అనే ఆ మాటల్లో ఎదుటివాణ్ణి నిలబెడదామన్న నిజాయితీ ఉంది.
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.