Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాతంత్య్రానంతరం భారతదేశం ముందు రెండు కర్తవ్యాలు - ఒకటి, విదేశీ పెట్టుబడి ఆధిపత్యం నుండి బయటపడి సాపేక్షంగా సామ్రాజ్యవాదంపై ఆధారపడని అభివృద్ధి పథంలో నడవడం. రెండు, భూస్వామ్య వ్యవస్థపై దాడి ఎక్కుపెట్టడం ద్వారా గ్రామీణ జనాభాను భూస్వాముల కబంధహస్తాల నుండి విముక్తి చేసి అంతరంగిక మార్కెట్‌ను అభివృద్ధి చేయడం. ఆ విధంగా వ్యవసాయ ఉత్పత్తులు పెంచి దేశీయ మార్కెట్‌కు పునాదులు వేయడం. ఈ రెండు లక్ష్యాలు అంతఃసంబంధం కలవి. భూస్వామ్య విధానాన్ని దెబ్బతీసి పెద్ద ఎత్తున వ్యవసాయాభివృద్ధి చేపట్టకపోతే ద్రవ్యోల్బణం, విదేశీ వాణిజ్యలోటు నియంత్రించబడవు. సామాజిక వైరుధ్యాలు ఉత్పన్నమయ్యేవి.
అయితే భూస్వామ్య విధానంపై దాడి అనేక పరిమితు లతో కూడి ఉంది. ఇది సాగుచేయని భూస్వాములను వదిలించుకుని, మిగిలిన భూస్వాములను వారు ఖుద్కాస్త్గా (సొంతంగా సాగుకు) ఉంచుకున్న భూములను పయోగించు కుని వ్యవసాయ పెట్టుబడిదార్లుగా మారేలా చూసింది. భూస్వాముల నుండి తీసుకున్న కొద్దోగొప్పో భూమిపై కౌలుదార్లలోని పైపొర వరకు భూయజ మాన్య హక్కులు కల్పించింది. భూ కేంద్రీ కరణ తగ్గలేదు. పై 15శాతంగా ఉన్న భూయజమానులు మారలేదు. కాని ఆపై 15శాతం పొందికలో మార్పులు జరిగాయి. అదే సమయంలో నీటిపారుదల సౌకర్యాల కల్పన, సాగుబడిలో అభివృద్ధికర పద్ధతుల అమలు, వ్యవసాయ భూముల కార్య కలా పాలు - వీటన్నిటిలో ప్రభుత్వ పెట్టుబడి పెరిగింది. అన్నివిధాలా దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవటం, ప్రత్యేకించి వ్యవసాయ సరుకుల వ్యాపారాన్ని నియంత్రించడం, అగ్రి బిజినెస్ కంపెనీలను (భారతీయ కంపెనీలతో సహా) ఎవర్నీ రైతాంగంతో సంబంధాలు లేకుండా చేయడం, విదేశీ పెట్టుబడులు దేశంలోకి ప్రవహించకుండా కొన్ని కీలకమైన రంగాలను, ఆర్థిక సంస్థలను జాతీయం చేయటం (తదుపరి కాలంలో గణనీయమైన సంఖ్యలో బ్యాంకుల జాతీయీకరణ జరిగినప్పటికీ) సామ్రాజ్యవాద పెట్టుబడి ఆధిపత్యాన్ని నిలువరించే ప్రధాన సాధనంగా ప్రభుత్వరంగాన్ని నిలపడం వంటివి విదేశీ పెట్టుబడి ఆధిపత్యాన్ని నిలువరించాయి. స్వయం ప్రతిపత్తి గల పెట్టుబడిదారీ విధాన నిర్మాణం యొక్క అనివార్యతను ఈ పరిస్థితి సృష్టించింది. పెట్టుబడులను, పెట్టుబడి విదేశీ మారకద్రవ్యాన్ని, లైసెన్సింగ్ విధానాన్ని, విదేశీపెట్టుబడులతో మిలాఖత్ ఒప్పందాలను నియంత్రణలో ఉంచడానికి ఈ విధానం తోడ్పడింది.
రాజ్యం ద్వారా నియంత్రించబడే ఈ విధానం (డిరిజిస్టే) వలస కాలంనాటి పరిస్థితికి భిన్నమైనది. మొత్తం జీడీపీగాని, వ్యవసాయరంగ అభివృద్ధిగాని త్వరితంగా పెరిగాయి. ఆహార ధాన్యాల తలసరి లభ్యత 20వ శతాబ్ద ప్రారంభంలో సంవత్సరానికి 200 కేజీలుంటే 1946-47నాటికి మరీ ఘోరంగా 136.8కిలోలకు పడిపోయింది. ఈ తిరోగమనాన్ని 1980 చివరి నాటికి ఏడాదికి తలసరి లభ్యత మళ్లీ 180 కేజీలుగా మార్చగలిగింది.
వలస కాలంతో పోలిస్తే ఈ వేగం ఎక్కువే అయినా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయింది. 1973-74లో ఆహారధాన్యాల తలసరి లభ్యత పెరిగినా పోషకాహార నిబంధనతో ముడిపడ్డ పేదరికం తగ్గినా 56శాతం గ్రామీణ జనాభా రోజుకు 2200 కేలరీలు, పట్టణ జనాభా రోజుకు 2100 కేలరీల శక్తినిచ్చే ఆహారం పొందలేకపోయారు. అలానే, 2శాతం సావత్సరిక ఉపాధి పెరుగుదల దాదాపు జనాభా పెరుగుదలతో సరిసమానంగా ఉండింది. కానీ యువత నిరుద్యోగానికి దారితీసింది. వారిని వ్యవస్థ నుండి దూరం చేసింది. స్వతంత్ర పెట్టుబడిదారీ విధానాన్ని బల పరిచిన బడా బూర్జువావర్గం నాటి పెరుగుదల రేటు వల్ల తెగబలిసినా, ఆ పెరుగుదల తన ఆశలకు అనుగుణంగా లేదని భావించింది. కనీసం ఆ పెరుగుదల రేటు కూడా ద్రవ్య సంక్షోభం వల్ల ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయింది రాజ్యం.
రాజ్యం నియంత్రణ విధానం నుండి నయా ఉదారవాద విధానాల్లోకి ఆర్థిక వ్యవస్థను మరల్చింది బడా బూర్జువా వర్గమే. 70వ దశకంలో ఆయిల్ ధరల దెబ్బకి అంతర్జాతీయంగా విస్తరించి, ఆధిపత్యస్థానంలోకి చేరిన ఫైనాన్స్ పెట్టుబడితో జతకట్టటం వల్ల తనకు చాలా అవకాశాలొస్తాయని బడా బూర్జువా వర్గం భావించింది. మధ్య తరగతి దీన్ని బలపరిచింది. విదేశాల నుండి ఔట్సోర్సింగ్ వల్ల తనకు ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని ఇది భావించింది. రాజ్య నియంత్రణ విధానం ఉండాలని పోరాడాల్సిన కార్మిక వర్గం, తన ఆశలకు ద్రోహం జరిగినందువల్ల పోరుకు సిద్ధపడలేదు. 1985లో ప్రారంభించి, మరీ ముఖ్యంగా 1991 నుండి మన దేశం నయా ఉదారవాద విధానాలను అవలంబిం చింది. ఇతర దేశాల నుండి సరుకులు, సేవలు దేశంలోకి రావడం మొదలైంది. దాంతో లైసెన్స్ వ్యవస్థ అంతమై పోయింది.
ఇది కేవలం ఆర్థిక పాలనా వ్యవస్థలో వచ్చిన మార్పుకాదు. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై మరోమారు విదేశీపెట్టుబడి తన ఆధిపత్యాన్ని నొక్కి వక్కాణించడం. అయితే సందర్భం వేరు. ఇక్కడ గుత్తపెట్టుబడిదార్లు విదేశీ పెట్టుబడిలో కలిసిపోతున్నారు. దీనికి ఉన్నత మధ్యతరగతి తందాన అంటోంది. సామ్రాజ్యవాదానికి, భారత సమాజానికి మధ్యనున్న వైరుధ్యం వివిధ వర్గాల ప్రజల్ని బ్రిటిష్‌కు వ్యతిరేకంగా కదిలించింది ఆనాడు. స్వాతంత్య్రానంతరం రాజ్య నియంత్రణలో ఆర్థిక వ్యవస్థ నడపడం ఒక వ్యూహంగా ఉండగా, నేటి ఆర్థిక వ్యవస్థ కొనసాగింపు దేశాన్ని విభజిస్తున్నది. సామ్రాజ్యవాదానికి జాతిమొత్తానికి మధ్య నుండాల్సిన విభజనరేఖ స్థానభ్రంశం నొందింది. ఒకపక్క అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి, దాంతో లంకెవేసుకున్న దేశీయ గుత్త పెట్టుబడిదార్లు ఉండగా, మరోపక్క మిగిలిన కష్టజీవులంతా ఉన్నారు.
దీని తక్షణ పరిణామం రాజ్యంపై ఉంది. వర్గాలకతీతంగా 'పైన'నిలబడి ఉండాల్సిన రాజ్యం, సంపూర్ణంగా గుత్తపెట్టుబడికోసం, భూస్వాముల ప్రయోజనాల కోసం, అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి ప్రయోజనాల కోసం మాత్రమే నిలిచివుంది. దీని బహిరంగరూపమే సామాన్య చిన్న ఉత్పత్తిదారులకు, రైతులకు మద్దతు ఉపసంహరణ, వ్యవసాయరంగంలోకి అగ్రి బిజినెస్ కంపెనీలు చొరబడటాన్ని అనుమతించడం. వాణిజ్య పంటలకు మద్దతు ఉపసంహరణ, (ఆహారధాన్యా లకు మద్దతు ఉపసంహరిస్తే ఏడాదికిపైగా రైతాంగం పోరాడి ఓడించింది) రుణాల మంజూరులో ఉన్న సబ్సిడీల ఉపసంహరణ వంటివి రైతాంగం చేస్తున్న వ్యవసాయాన్ని నష్టదాయకంగా చేస్తున్నాయి. రైతాంగ ఆత్మహత్యలకు, లేని ఉద్యోగాల కోసం పట్టణాలకు వలసలు పోవడానికి ఈ విధానం దారితీస్తోంది. ఇది రిజర్వు సైన్యాన్ని పెంచుతోంది.
కొద్ది మాటల్లో చెప్పాలంటే బూటకపు వాగ్దానాలతో నయా ఉదారవాదం నిండివుంటోంది. ఈ కాలంలో జీడీపీ పెరిగినా గతంలో ఏడాదికి ఒక శాతంగా ఉన్న ఉపాధి పెరుగుదల రేటు సగానికి పడిపోయింది. ఉత్పాదకత గతంలో కంటే పెరిగినా కార్మికుల సంఖ్య తగ్గింది. ఈ శ్రామికుల ఉత్పాదకత దేశీయ పెట్టుబడిదారులు, ఎగుమతిదారులు అన్నిరకాల రక్షణలూ ఉపసంహరించిన తర్వాత విదేశీ కంపెనీల ముందు ఎక్స్పోజ్ కావడం వల్లనే సాధ్యమవుతోంది. నిరుద్యోగుల రిజర్వు సైన్యం పెరుగుదల సాపేక్షంగా అంకెల్లో కనపడకపోవచ్చు. ఉన్న ఉద్యోగాల సంఖ్యను ఎక్కువ మందికి (తక్కువ వేతనంతో) పంచటం వలన, ఇటువంటి ఉపాధి పెరుగుదల వేతనాలను దిగువ స్థాయిలో ఉంచుతుంది. ఇది సంఘటిత కార్మికులలో కూడా సమిష్టి బేరసారాల శక్తిని తగ్గిస్తుంది.
నయాఉదార విధానాలననుసరించే పాలనలో రైతులను, చిన్నపాటి ఉత్పత్తిదారులను పీల్చి పిప్పిచేయటం ద్వారా, అలాగే సంఘటిత కార్మికుల సమిష్టి శక్తిని తగ్గించటం ద్వారా, శ్రామిక ప్రజల తలసరి సగటు వాస్తవిక ఆదాయం పడిపోతున్నది. జీడీపీ పెరుగుదల ఎంత ఉన్నా పేదరికపు నిష్పత్తి పెరుగుదలలో ఇది బయటపడుతుంది. 1980 చివరిదాకా తలసరి ఆహారధాన్యాల వినిమయంలో ఉన్న పెరుగుదల, ఆ తరువాత ఎదుగుబొదుగు లేక స్తంభించింది. నేషనల్ శాంపిల్ సర్వే అధ్యయనం ప్రకారం, 1993-94లో రోజుకి 2200 కెలరీలకంటే తక్కువ శక్తి గల ఆహారాన్ని పొందుతున్న గ్రామీణ ప్రజలు 58శాతం ఉంటే, 2011-12 నాటికి అది 68శాతానికి పెరిగింది. ఆ తరువాత చేసిన నేషనల్ శాంపిల్ సర్వే కూడా ఇటువంటి నిరాశజనక ఫలితాలనే తేల్చింది. అయితే 2017-18 శాంపిల్ సర్వే అధ్యయన ఫలితాలను మోడీ ప్రభుత్వం తొక్కిపెట్టింది. పాత పద్ధతిలో నేషనల్ శాంపిల్ సర్వేను చేయకూడదని కూడా నిర్ణయించింది. ఇక దేశంలోని పట్టణప్రాంత ప్రజలకు తలసరి రోజుకి అవసరమయ్యే 2100 కేలరీల కంటే తక్కువ ఆహారాన్ని పొందుతున్న వారు 1993-94, 2011-12 మధ్య 57శాతం నుంచి 65 శాతానికి పెరిగింది.
''ట్రికిల్ డౌన్'' (పైన జరిగే అభివృద్ది బొట్టుబొట్టుగా క్రింది జనాలకు చేరుతుందనే) సిద్ధాంతం బూటకపు సిద్ధాంత మని చూపుతూ, నయా ఉదార వాదం ముమ్మరంగా ఉన్న రోజులలో కూడా శ్రామిక ప్రజల కడగండ్లు పెరిగినాయి. నయా ఉదారవాదం తీవ్రమైన సంక్షోభంలోకి అడుగుపెట్టింది. బయటపడే మార్గంలేదు. నయా ఉదారవాదం క్రింద గతంలో ఒక ధోరణిని చూశాం. శ్రమ ఉత్పాదకత పెరిగినప్పటికీ శ్రామిక ప్రజల తలసరి సగటు నిజ ఆదాయం క్షీణించింది. దీనితో ఉత్పత్తిలో మిగు లు భాగం వాటా పెరుగుతుంది. ఇది ప్రపంచ వ్యాపి తంగా ఉన్న విపరీత లక్షణం. నయా ఉదార విధానాల కాలంలో భారతదేశంలో గాని, ఇంకెక్కడైనాగానీ ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరగటానికి వెనకవున్న కారణం ఇదే.
అయితే, డబ్బు మిగులుదారుల (దోపిడీ దారుల) చేతిలో ఉన్నప్పుడు అవే డబ్బులు శ్రామికప్రజల చేతిలో ఉన్నప్పడు వినిమయంలోకి రావటం తగ్గుతుంది. ఆదాయాల మార్పులో జరిగిన ఈ ధోరణి మితిమీరిన ఉత్పత్తి జరగటానికి దారితీస్తుంది. ఈ ధోరణిని అమెరికా గృహ రుణ సంక్షోభం బద్దలైన తరువాత అదుపులో పెట్టారు. ఇళ్ళు నిర్మించు కోవటానికి బ్యాంకులు విపరీతంగా అప్పులు ఇవ్వటం ద్వారా, కృత్రిమంగా డిమాండ్ పెంచి, ఆస్థులు కలిగినవారిని నకిలీ కోటీశ్వరులుగా ఈ గృహ రుణ సంక్షోభం మార్చింది. ఆనాటి నుంచి ప్రపంచ ఆర్థికవ్యవస్థ స్తబ్దత స్థితిలోకి చేరింది. భారతదేశ ఆర్థికవ్యవస్థకూ ఇది అంటుకుంది. దేశాన్ని మరింత నిరుద్యోగం వైపునకు నెట్టింది. బాధలను తీవ్రం చేసింది. మోడీ తలపెట్టిన నోట్లరద్దు, జీఎస్టీ అమలుతో (జీఎస్టీ అమలుకు కావాల్సిన పనులు కాంగ్రెస్ పాలనలోనే మొదలయ్యాయి) పరిస్థితులు మరింత దారుణంగా పరిణమించినాయి.
ఈ సంక్షోభాన్ని నయా ఉదార విధానాల పరిధిలో అధికమించలేం. అందుకు ఒకే ఒక మార్గం ఉంది - ప్రభుత్వ వ్యయాన్ని ఎక్కువ చేయటం. ఈ విధంగా ప్రభుత్వం అధిక వ్యయం చేయటానికి ద్రవ్యలోటు ద్వారానైనా, లేక అధిక సంపాదనాపరులైన ధనవంతులమీద పన్నులు వేసైనా చేయాలి. అలాగాక, ఇప్పటికే తమ సంపాదనంతా ఖర్చుపెడుతున్న శ్రామిక జనుల మీదపన్నులు వేస్తే, ఒక దాని మీద ఖర్చు పెట్టటం బదులు మరో దాని మీద ఖర్చు పెడతారు. అందుమూలంగా నికరంగా పెరిగే డిమాండ్ ఏమీ ఉండదు. అయితే, ద్రవ్యలోటును పెంచటానికిగాని, ధనికులపై అధిక పన్నులు వేయటానికి గాని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అంగీకరించదు. నయా ఉదార విధానంలో ఇటువంటి చర్యలు చేపటితే, తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. చాలా తేలికగా ద్రవ్య పెట్టుబడి మూకుమ్మడిగా దేశాన్ని వదిలిపెట్టి పోతుంది.
మరోవైపు, నయా ఉదార విధానం తనదైన పద్ధతిలో, పెట్టుబడిదారులు తమ పెట్టుబడిని పెంచుతారనే ఆశతో పన్ను రాయితీలు కల్పించటంద్వారా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తుంది. నిజానికి ఈ చిట్కా సంక్షోభాన్ని ఇంకా దారుణంగా పెంచుతుంది. పెట్టు బడిదారులు ఒక్క పైసా కూడా పెట్టుబడిగా మార్చకుండా ఈ రాయితీల సొమ్మునంతా తమ జేబుల్లో వేసుకుంటారు. పెట్టుబడిదారులకు అందివ్వటానికిగాను ప్రభుత్వాలు వేరేచోట ఖర్చును తగ్గిస్తారు. దీనితో డిమాండ్ ఇంకా కుదించుకుపోతుంది.
కరోనా మహమ్మరికి ఈ సంక్షోభంతో సంబంధంలేదు. (కొద్దికాలం క్రితం కరోనా జోడైనప్పటికీ) కరోనాకి ముందునుంచే ఈ సంక్షోభం ఉద్భవించింది. దీనినుంచి బయటపడటానికి నయా ఉదారవాదం మేలైన మార్గాన్ని ఎంచుకోవాలి. అయితే, ఖచ్చితమైన మార్గం దొరకనందు వల్ల, సంక్షోభంలో ఉన్న నయా ఉదారవాదం, హిందూ మతోన్మాదంతో జతకట్టి, తద్వారా వ్యవహారశైలిని మార్చింది. ఈ కార్పొరేట్-హిందుత్వ కూటమి లక్ష్యం ఏమిటంటే, ప్రజల భౌతిక జీవన సమస్యల నుండి దృష్టిని దూరంగా మల్లించటం. దీనికోసం తగిన రక్షణలేని మైనార్టీ సమూ హాలు గతంలోను, ప్రస్తుతమూ ''అకృత్యాలు'' చేశారని ఆరోపించడం జరుగుతున్నది. ఒక పక్కన సంక్షోభం ఉన్నప్పటికీ అంతర్జాతీయ పెట్టుబడి, స్వదేశీ బడా వ్యాపార వేత్తలు ఇప్పటికే ఉన్న సంపదకు మరింత సంపదను జోడించ కోగలిగారు. ఆస్తులను స్వాధీనం చేసుకోవటం ద్వారా, గనుల నుంచి ముడిసరుకు వెలికితీత హక్కులు పొందటం ద్వారా, ప్రభుత్వ, చిన్నపాటి ఉత్పత్తి రంగాలలో పెట్టుబడి అవకాశాలద్వారా తమ సంపదను పెంచుకుంటున్నారు.
బడా వ్యాపార సంస్థలు హిందుత్వ పార్టీ అధికారంలోకి రావటానికి ఆర్థికంగా సహాయ పడ్డాయి. తన నియంత్రణలో ఉన్న మీడియా ద్వారా మద్దతు అందించాయి. వీటికి ప్రతిఫలంగా ప్రాధమిక పెట్టుబడి సంచయం ద్వారా సంపదను పెంచుకున్నది. ఈ ప్రక్రియకు ఎటువంటి వ్యతిరేకతనైనా మొండి నిరంకుశ పద్ధతుల్లోనో, ప్రజల ఐక్యత మధ్య చిచ్చుపెట్టటం ద్వారానో, వ్యతిరేకులపై గూండా ముఠాలను ప్రయోగించటంతోనో అడ్డుకుంటున్నారు.
నయా ఉదారవాదం ఉచ్ఛస్థాయిలో ఉన్న రోజులలో కూడా ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయి లోనే ఉన్నాయి. ఇది రాజ్య నిర్వహణలోని ప్రజాస్వామ్య సారాన్ని రద్దు చేసింది. రాజ్య సార్వభౌమికతను నాశనం చేసింది. దుర్భర దారిద్య్రాన్ని పెంచుతున్నది. వీటికి అదనంగా ఆర్థిక స్తబ్దతలో, భారీ నిరుద్యోగ స్థితిలో చిక్కుకుపోయి, బయటపడే మార్గం లేకుండా పోయింది. దిక్కుతోచని స్థితిలో, ఇది దేశం మీద నయా ఫాసిస్ట్ పాలనను రుద్దుతున్నది. ఈ పాలనను కేవలం ప్రజాస్వామిక శక్తులు ఏకమవటంతో తొలగించలేవు. ఇలా ఏకమవటం అవసరమే గానీ, పెద్దమోతాదులో ఉన్న నయా ఫాసిజాన్ని ఓడించటానికి, దానికి కారణ భూతమైన తీవ్ర సంక్షోభాన్ని సృష్టించిన నయా ఉదారవాదాన్ని ఓడించటం అవసరం. ఇది కష్టతరమైన కర్తవ్యం. శ్రామిక ప్రజలను విస్తృతంగా సమీకరించటం ద్వారానే సాధ్యమవుతుంది.
- ప్రభాత్‌పట్నాయక్