Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత దేశం రైతు ఉద్యమాలకు ప్రపంచంలోనే ముందు భాగాన నిలిచింది. ప్రపంచంలో ఎక్కడలేనన్ని ఉద్యమాలు సాగించి దేశంలో రైతులు తమ సమస్యలను పరిష్కరించు కుంటున్నారు. 1757లో ఆంగ్లేయులు భారత దేశానికి వచ్చిన తరువాత వారు చేపట్టిన భూసంస్కరణల వల్ల ఉద్యమాలు ప్రారంభమైనాయి. రైతువారీ, జమీందారీ, మహాల్వారి, ముఠాదారీ పద్ధతులను ఏర్పాటుచేసి శిస్తును నగదు రూపంలోకి మార్చి పంటలు పండినా, పండకున్నా బలవంతంగా శిస్తు వసూలు చేయడం మొదలు పెట్టారు.
మొదటిదశ పోరాటాలు
పర్మినెంట్ సెటిల్మెంట్ రద్దు చేయాలని, భూ సంస్కరణలను తొలగించాలని, ఆంగ్లేయ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటాలు ప్రారంభమైనాయి. శిస్తులు చెల్లించలేక భూములు కోల్పోయిన రైతులు హిందూ, ముస్లింలు ('సన్యాసులు-ఫకిర్లు') 1768 నుండి 1800 సంవత్సరం వరకు ఆంగ్లేయులతో పోరాటం చేశారు. బెంగాల్ ప్రావిన్స్‌లో 150మంది సన్యాసులను కాల్చివేశారు. ఆ విధంగా 50సంవత్సరాల పోరాటాన్ని అణిచివేశారు. ఈ పోరాటంతో ప్రారంభమైన రైతు ఉద్యమాలు కొనసాగుతూ వచ్చాయి. ఉద్యమాలను అణచడానికి 'డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం 1915న' తెచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో రైతులపై పన్నులు విపరీతంగా వేశారు. ఈ పన్నులకు వ్యతిరేకంగా బీహార్‌లో 1929లో కిసాన్ సభ స్వామి సహజానంద సరస్వతి అధ్యక్షతన ఏర్పడింది. రైతులపై దోపిడీ రద్దు, జమీందారీ, జాగీర్దారీ విధానం రద్దు, భూమిపై రైతులకు శాశ్విత హక్కులు, శిస్తు తగ్గింపు, రుణాల రద్దు, సాగునీటి సౌకర్యం కల్పించాలని బెంగాల్, బీహార్, ఒరిస్సాలో పెద్ద పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాలను దెబ్బకొట్టడానికి ఆంగ్లేయులు దేశాన్ని 11 ఫ్రావిన్స్లుగా విడగొట్టారు. ఆ తరువాత ఇక్కడి నుండి పత్తిని ఇంగ్లాండ్‌లోని లాంగ్షేర్ మిల్లులకు ఎగుమతి చేసి అక్కడి నుండి తయారైన బట్టలను ఇక్కడికి దిగుమతి చేసేవారు. ఆ బట్టలకు నీలిరంగు వేయడానికి ఇక్కడి భూములలో నీలిపంట పండించాలని ఒత్తిడి తెచ్చారు. ఆ విధంగా నీలి రైతుల పోరాటం సాగింది. ఆ తరువాత కేరళలో మోప్లాల తిరుగుబాటు మలబార్ ప్రాంతంలో 1835 నుండి 1921 మధ్య సాగాయి. గుజరాత్లో కేడా రైతుల ఉద్యమం శిస్తును తగ్గించాలని 1918లో సాగింది. 1948-58లో సంతాలుల తిరుగుబాటు సాగింది. ఆంగ్లేయుల పాలన పోవాలన్న, స్వదేశి పాలన తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఈ పోరాటాలు సాగాయి. బీహార్‌లో చంపారాన్ పోరాటం, నైజాంలో కొమరంభీం పోరాటం (ఆసిఫాబాద్‌లో) జరిగింది. చోట నాగఫూర్లో 1809లో బిర్సాముండా పాదర్ నాయకత్వాన పోరాటం జరిగింది. వెంకటగిరి జమీందారు 1937, సూర్మలోయ పోరాటం సాగాయి. ఈ అన్ని పోరాటాలకు తలమానికంగా జమీందార్లకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో పోరాటాలు సాగాయి. ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకిస్తూ అల్లూరి సీతారామారాజు 1921 పోరాటం సాగింది. 1936లో కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి రైతు రక్షణ యాత్ర 1512 మైల్లు సాగించి మద్రాసుకు చేరుకున్నారు. మునగాల, మందసా, చల్లపెల్లి భూముల పోరాటాలు ప్రఖ్యాతి గాంచి విజయాలు సాధించాయి. ఈ పోరాటాలన్నీ ఆంగ్లేయులను భారత దేశం నుండి తరిమి వేయడం లక్ష్యంగా సాగాయి.
అఖిల భారత కిసాన్ సభ 1936 ఏప్రిల్ 11న లక్నోలో ఏర్పాటు చేశారు. ఈ సభ రెండు లక్ష్యాలను పెట్టుకుంది. 1. ఆంగ్లేయుల పరిపాలనను రద్దుచేసి దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించడం, 2. భూస్వామ్య విధానాన్ని రద్దు చేయడం (1947లో మొదటి కోర్కె నేరవేరినా భూస్వామ్య విధానం రద్దు కోసం ఇంకా పోరాటాలు సాగుతూనే ఉన్నాయి). అంతకు ముందు బీహార్‌లో కిసాన్ సభకు అధ్యక్షుడిగా ఉన్న స్వామి సహజానంద సరస్వతిని అఖిల భారత మహాసభకు అధ్యక్షునిగానూ, ఎన్జి రంగాను కార్యదర్శిగాను నియమించారు. దేశం స్వాతంత్య్రం పొందడానికి ఏఐకెఎస్ నాయకత్వాన భూ పోరాటాలు సాగాయి. ఈ పోరాటాలన్ని సాయుధంగానే జరిగాయి. ఏఐకెఎస్ 1945లో గోదావరి ఫరూలేఖర్ నాయకత్వాన మహారాష్ట్రలో వర్లీ ప్రాంత గిరిజనుల సాయుధ తిరుగబాటు జరిగింది. 1945-46 మధ్య బెంగాల్లో తేబాగ పోరాటం, త్రిపురలో గణ విముక్తి రైతుల పోరాటం, కేరళలో పున్నప్రవయలార్ పోరాటాలు సాయుధంగా జరిగాయి. వీటన్నింటికి అగ్రగామిగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 సెప్టెంబర్ 11 నుండి 1951 అక్టోబర్ 21 వరకు సాగింది. 10 లక్షల ఎకరాల భూమిని 3000 గ్రామాలలో గ్రామ రాజ్యాలను సాధించింది. ఈ పోరాటాలు ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డాయి. ఈ పోరాటాల ఫలితంగానే ఆంగ్లేయులు తప్పనిసరై భారత దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం ఇచ్చారు. ఈ తిరుబాట్లు దేశవ్యాప్తంగా విస్తరిస్తే తమ ఆస్తులకు ప్రమాదం వాటిల్లుతుందని ఆంగ్లేయులతోపాటు దేశ స్థానిక, బూర్జువా వర్గాలు ఆందోళన చెందాయి. స్వాతంత్య్రం రావడంతో ఎస్టేట్లను రద్దుపరిచి, రాజ్యాంగాన్ని రూపొందించి తమ జమీందారీలను పరోక్షంగా కాపాడుకున్నారు. తిరిగి స్వాతంత్య్ర అనంతరం భూముల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు సాగాయి.
రెండవ దశ పోరాటాలు
1757 నుండి 1947 వరకు 190 సంవత్సరాలు రైతులు, వ్యవసాయ కార్మికులు ఇతర రంగాల ప్రజలు ఆంగ్లేయ ప్రభుత్వాన్ని దేశం నుండి వెళ్ళగొట్టడానికి అనేక పోరాటాలు సాగించారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆహింసా విధానం ఉన్నప్పటికీ రైతాంగ పోరాటాలన్నీ సాయుధంగానే సాగాయి. ఈ సాయుధ పోరాటాల విస్తృతిని గమనించి ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్ళిపోయారు. స్వదేశీ బూర్జువా వర్గం అధికారానికి వచ్చి ఆంగ్లేయుల విధానాలనే కొనసాగించడంతో తిరిగి 2వ దశ పోరాటాలు కొనసాగాయి.
1947 నుండి 1991 వరకు రెండో విడత పోరాటాలు విజృంభించాయి. 1967లో కాంగ్రెస్ 8 రాష్ట్రాలలో ఒడిపోయింది. ఫలితంగా 1968లోనూ, 1971లోనూ, దేశవ్యాప్తంగా భూ సంస్కరణల కార్యక్రమం చేపట్టారు. కానీ ఈ భూ సంస్కరణలను కూడా పార్సుగా చేసి పరోక్షంగా లక్షల ఎకరాల భూములను భూస్వామలు దక్కించుకున్నారు. మొత్తంగా 73.36 లక్షల ఎకరాలు మిగులు ప్రకటించి, 64.96 లక్షల ఎకరాలు సేకరించి, అందులో 54.02 లక్షల ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారు. భూస్వాములు మిగులు భూములను బినామి పేర్లతో దక్కించుకున్నారు. ఈ విధంగా లక్షల ఎకరాల భూములను పరోక్షంగా దక్కించుకున్న భూస్వాములకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా స్వాతంత్య్రనంతరం పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి. నేటికీ సాగుతున్నాయి. వీటితోపాటు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలనీ, ప్రకీతి వైపరీత్యాలకు పరిహారం ఇవ్వాలనీ, మార్కెట్లో న్యాయమైన ధర కాలనీ పెద్ద ఎత్తున పోరాటాలు సాగాయి. చివరికి ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెంచినప్పుడు రూపాయికి కిలో బియ్యం ప్రజలకు అందించిన ఘనత కూడా పోరాటాలదే. దీనికి కామ్రేడ్ సుందరయ్య నాయకత్వం వహించాడు.
1959లో బాక్రానంగల్ నీటిని ఇచ్చినందుకు పంజాబ్‌లో బెటర్మెంట్లేవి విధింపునకు వ్యతిరేకంగా 11000మందితో ముఖ్యమంత్రి ప్రతాఫ్సింగ్ కైరాన్ వద్ద ఆందోళన చేశారు. దేశంలో ఇరిగేషన్ వనరుల కల్పనకు పెద్దఎత్తున పోరాటాలు సాగాయి. వాటి ఫలితంగానే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి కె.యల్. రావు ఇరిగేషన్‌శాఖ మంత్రిగా ప్రధాని జవహర్లాల్ నెహ్రూచే శంఖుస్థాపన చేయించారు. 1991 వరకు హరిత విప్లవం సాగి దేశం ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధం అయ్యింది. ఆహార ధాన్యాల ఎగుమతులు కూడా ప్రారంభించాం. ఈ ఎగుమతులను భరించలేని ధనిక దేశాలు భారత దేశ ఉత్పత్తిని తగ్గించడం కొరకు రాజకీయ ఒత్తిడి తెచ్చారు.
మూడవ దశ పోరాటాలు
దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత 1991 వరకు వ్యవసాయరంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలకు హరిత విప్లవం కొనసాగింది. ఫలితాలు వచ్చాయి. కానీ, ఆ ఫలితాలను వమ్ము చేయడానికి ప్రపంచ బ్యాంకు నేతృత్వంలో ధనిక దేశాలు గాట్ ఒప్పందాన్ని ముందుకు తెచ్చాయి. 1994 డిసెంబర్ నాటికి ఒప్పందంపై భారత దేశం సంతకాలు చేయాలని షరతు విధించారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంవత్సరం పాటు ఆందోళనలు సాగాయి. అయినా పాలకులు గాట్ ఒప్పందంపై సంతకాలు చేశారు. 1994లో గాట్ ఒప్పందంపై సంతకాలు చేయించుకొని దాన్ని ''ప్రపంచ వాణిజ్య సంస్థగా'' (డబ్ల్యూటీఓ) మార్చారు. ఆ సంస్థ దేశ వ్యవసాయరంగంపై పట్టుసాధించి మన ఉత్పత్తిని, ఉత్పాదకతను నేటికి దెబ్బతీస్తున్నది. గాట్‌కు వ్యతిరేకంగా, డబ్ల్యూటిఓకు వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి.
నాల్గవ దశ పోరాటాలు
2014 తరువాత మోడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పోరాటాల స్వరూపం మారిపోయింది. అధికారానికి వస్తూనే 2013 భూ సేకరణ చట్టానికి సవరణలు తెచ్చి రాజ్యసభలో ఓటమి పాలైంది. అయినప్పటికీ రాష్ట్రాలకు హక్కులు కల్పించి భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచింది. కనీస మద్దతు ధరలపై ఆశాస్త్రీయంగా నిర్ణయిస్తూ కనీస పెట్టుబడిరాని పరిస్థితి తెచ్చిపెట్టారు. ఆ ధరలు కూడ మార్కెట్లలో అమలు కాలేదు. తర తరాలుగా సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి. కర్నాటకలో 20లక్షల మంది సాగు చేస్తున్న 40లక్షల ఎకరాల పట్టాలు ఇవ్వాలని తుంకూరు జిల్లాలో సుదీర్ఘ పోరాటం సాగింది. 2018 మార్చి 6న మహారాష్ట్రలో 50 వేల మంది రైతులు నాసిక్ నుండి ఊరేగింపుగా బయలుదేరి 12వ తేదీకి బాంబే చేరుకున్నారు. విద్యార్థుల పరీక్షలకు ఆటంకం లేకుండా ఉండాలని అదనంగా చివరి రోజు 17 కిలో మీటర్లు నడిచి ముంబాయికి చేరుకోవడం జరిగింది. వారి పరిస్థితిని గమనించిన ముంబాయి ప్రజలు ఆహారం, బట్టలు, చెప్పులు, మందులు, తాగునీరు సరఫరా చేసి ఆదుకున్నారు. ఈ పాదయాత్ర అంతర్జాతీయంగా గుర్తింపు పొందడంతో తప్పనిసరై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దిగివచ్చి రైతు నాయకులతో రాతపూర్వక ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీనిలో అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు అశోక్ ధావలేతోపాటు కిషన్ గుజ్జార్, అజ్జిత్ నావలే పాల్గొన్నారు. 2016 నవంబర్‌లో 4 జాతాలు 1. తమిళనాడు విరుద్‌నగర్ (విజ్ఞూ కృష్ణన్, సారంపల్లి మల్లారెడ్డి), 2. జమ్ము కాశ్మీర్ (అమ్రారాం), 3. కోల్కత్తా (హన్నన్‌మొల్ల), 4. కన్యాకుమారి (పినరయి విజయన్, కేరళ సిఎం), ప్రారంభమై నవంబర్ 24న ఢిల్లీకి చేరుకోగా రాంలీల మైదానానికి 2 లక్షల మందితో ర్యాలీ జరిగింది.
చారిత్రక రైతాంగ పోరాటం
2020 జూన్ 6న కేంద్ర ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాల ఆర్డినెన్స్‌లు తెచ్చి ఆ తరువాత పార్లమెంట్లో ప్రవేశపెట్టి సెప్టెంబర్ 28న రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందింది. ఈ మూడు చట్టాలకు వ్యతిరేకంగా 26 నవంబర్ 2020 నుండి 11 మాసాలు పెద్ద ఎత్తున పోరాటాలు సాగాయి. ఈ పోరాటంలో 730 మంది రైతులు చనిపోయారు. 15మంది మేధావులు, లాయర్లు కూడా అశువులుబాసారు. ఆస్ట్రేలియా, స్విట్జర్ల్యాండ్, ఇంగ్లాండ్, అమెరికా దేశాల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. లఖ్కింపూర్కేరీలో కేంద్రమంత్రి ఆశీష్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిట్టల్ ప్రదర్శకులపైకి వాహనం తోలి విలేకరితో సహా నలుగురి మరణానికి, 15మంది గాయాలకు కారణమైనాడు. అయినా వెరవని ఈ పోరాట తీరుకు ప్రపంచం జేజేలు పలికింది. చివరికి చట్టాలు తేవడానికి ప్రోత్సాహించిన డబ్ల్యూటీఓ, జి7 దేశాలే చట్టాలను ఉపసంహరించుకోవాలని, లేనిచో భారత దేశంలో పోరాటం విప్లవం రూపం సంతరించుకుంటుందని ప్రధాని మోడీని హెచ్చరించి విరమింపజేశాయి. చివరికి ప్రధాని 29.11.2021న చట్టాలు ఉపసంహరించు కోవడంతో ఈ పోరాటం ముగిసింది. 11 మాసాలు జరిగిన ఈ పోరాటం ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన పోరాటంగా చరిత్రకు ఎక్కింది. ఆ విధంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతుల సమస్యలు మరింత ప్రమాదకరమైన స్థితికి నెట్టబడడంతో అన్ని రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా నిరంతర ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి.
ఆంగ్లేయుల రాకతో ప్రారంభమైన ఉద్యమాలు నేటి మోడీ పాలనతో మరింత ఉధృతం అయ్యాయి. రైతులను భూముల నుండి వెళ్ళగొట్టి కార్పొరేట్లపరం చేయాలన్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాలు సాగుతున్నాయి.
- సారంపల్లి మల్లారెడ్డి
సెల్: 9490098666