Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంక్షేమం, అభివృద్ధి ఒకదానికొకటి పోటీ కాదు. అవి పరస్పరాధారితాలు. సంపూరకాలు. సంక్షేమం అభివద్ధికి దారితీస్తుంది. సంక్షేమం సుస్థిరమై అభివృద్ధి పరిపూర్ణమైతే, సంక్షేమ పథకాల అవసరముండదు. అప్పటివరకూ సంక్షేమ పథకాలు సామాన్యుల ప్రయోజనాలకు ఉపయోగపడాలి. సంపన్నుల, కార్పొరేట్ల అభివృద్ధికి అనువర్తించేటట్లు వాటిని రూపొందించటం రాజ్యాంగ విరుద్ధం. ప్రజాద్రోహం.
ప్రజలకు కూడు, గూడు, గుడ్డ వంటి ప్రాథమిక అవసరాలు తీర్చడం, విద్యవైద్య సౌకర్యాలు అందించడం, పౌరుల ఆర్థిక, సామాజిక స్థితి క్షీణించకుండా కాపాడటమే గాక మెరుగుపరచటం, ఉన్నతీకరించటం ప్రజా సంక్షేమం. పెట్టుబడిదారుల లాభాలు, సౌకర్యాలు, సంపన్నుల సుఖసంతోషాలు, విలాసాలు, వారి భవంతులు, క్రీడలు, భోజన మధురాస క్రీడల ప్రాంగణాలు అభివృద్ధి కాదు. పేదల ఆకలి, వస్త్రవసతి అవసరాలు తీర్చి, ఉపాధి కల్పించి, కనీస విరామ వినోదాలను అందించే సమ్మిళిత సమగ్ర ప్రగతియే అభివృద్ధి. ఇందులో ధనికవర్గ ఆధిపత్యం, పేదల దోపిడీ ఉండవు. శ్రామికులు, దళితులు, స్త్రీలు మానవులుగా చూడబడతారు. సంక్షేమం రెండు పాలనా పద్ధతుల్లో అమలవుతుంది. 1. సంక్షేమ పెట్టుబడిదారీ విధానం: ఇది వాణిజ్యవేత్తల అనుకూల విధానాలు పాటిస్తుంది. ప్రభుత్వ రంగం కంటే ప్రయివేటు రంగం అతి ప్రభావవంతంగా సాంఘిక సంక్షేమం అందిస్తుందని నమ్ముతుంది. 2. సంక్షేమ రాజ్యం: ఇందులో పౌరుల ఆర్థిక, సామాజిక సంక్షేమం ప్రభుత్వ బాధ్యత. సంక్షేమం ప్రభుత్వ అధీనంలో ఉంటుంది.
భారత్లో రాజ్యాంగ పీఠిక, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు సంక్షేమ రాజ్య హామీనిచ్చాయి. రాజ్యాంగ అధికరణ 38 సమాన అవకాశాలను, అధికరణ 14 సమాన పనికి సమాన వేతనంతో సహా అనేక సమానత్వ సూత్రాలను అందించాయి. ఆదేశిక సూత్రాలు రాజకీయ ప్రజాస్వామ్యాన్నే గాక సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని, పోలీసు రాజ్యం బదులుగా సంక్షేమ రాజ్యాన్ని ఆదేశించాయి. కానీ, ముందు ప్రభుత్వాలు కొంత, నేటి సర్కారు పూర్తిగా ఈ అవగాహనలను తారుమారుచేశాయి. పాలక పక్షాలు ఎన్నికల ప్రణాళికల్లో, ప్రచారాల్లో అర్థంలేని, ఆచరణ సాధ్యం కాని అశాస్త్రీయ, అప్రజాస్వామిక, రాజ్యాంగవిరుద్ధ వాగ్దానాలు చేస్తున్నాయి. సంక్షేమం పేరుతో అపాయకర జనసమీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. గద్దెనెక్కి ఎక్కువ ప్రమాణాలను విస్మరిస్తున్నాయి.
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు లబ్ధిపొందాలి. వాటి పాదార్థిక, సామాజిక ప్రయోజనం సామాన్య ప్రజలకు అందాలి. అభివృద్ధికి దారితీయాలి. ప్రైవేట్లకు, కార్పొరేట్లకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు, లాభాలు అందరాదు. సంక్షేమ పునాదులైన విద్య, వైద్యం తప్పనిసరిగా ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి. కానీ, ప్రపంచీకరణను ఆమోదించి ఈ రంగాలను ప్రయివేట్లకు అప్పజెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులే ప్రత్యక్షంగా, పరోక్షంగా విద్యవైద్యసేవారంగాల్లో ప్రవేశించారు. కార్పొరేట్ల కొమ్ముకాస్తున్నారు. దోపిడీ సాగుతోంది. ప్రభుత్వ సంక్షేమ ఫలాలన్నీ వీళ్ళే పొందుతారు. పేదల సంక్షేమం మరుగునపడింది. కార్పొరేట్లు అభివృద్ధి చెందుతున్నారు. ఈ ప్రక్రియ ఇప్పుడు అన్ని రంగాలకు విస్తరించింది. ప్రధాని బీమా పథకాలు ప్రయివేటు సంస్థలను బతికించేవే. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ల ఆస్పత్రులు, ఫీజు రియంబర్స్మెంట్తో కార్పొరేట్ల కళాశాలలే లాభపడ్డాయి, పడుతున్నాయి. ఈ ఖర్చుతో ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపర్చవచ్చు. ప్రభుత్వ కళాశాలలు స్థాపించవచ్చు. అందరికీ ఉచిత విద్య వైద్యం అందించవచ్చు. దీర్ఘకాల నష్టాలు గమనించక, తాత్కాలిక భృతులతో తృప్తిపడుతూ అమాయక ప్రజలు పాలకవర్గ ఓటుబ్యాంకుగా మారారు. పాలకులకు ఈ పథకాలతో అపరిమిత ప్రయోజనాలున్నాయి. అధికారులు, దలారీలు లాభపడతారు. ప్రయివేట్లు, కార్పొరేట్లతో శాశ్వత బంధం ఏర్పడుతుంది. ''క్విడ్ ప్రో కో (నీకిది-నాకది)'' విధానంతో జీవితమంతా పరస్పర లబ్ధి పొందుతూ ఉంటారు. సంక్షేమం పేరుతో పన్ను చెల్లింపుదారుల సొమ్ము కార్పొరేట్ల వశమవుతోంది. ఆ ఆర్థికబలంతో వాళ్ళు మరిన్ని సంస్థలు స్థాపిస్తారు. సమాజ వినాశకులను తయారుచేస్తారు. దేశ విచ్ఛిన్నతకు దారితీస్తారు. సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రజలకు అవగాహనలేని తనాన్ని ఆసరాగా చేసుకుని, దోపిడీ వర్గాల ప్రాయోజిత ప్రణాళికలను పాలకులు పేదల సంక్షేమ పథకాలుగా వర్ణిస్తారు. ఈ మోసపూరిత ప్రచారాలను ప్రజలు నమ్ముతారు. అరకొర సౌకర్యాలతో తృప్తిపడతారు. ఈ మోసాలను వివరించేవారు తమ సౌకర్యాలకు అడ్డుపడుతున్నారని భావిస్తారు.
సంపూర్ణ అభివృద్ధి సాధించే వరకు సంక్షేమం కొనసాగవలసిందే. నేడు పాలక పార్టీలు, వాటి మిత్ర పక్షాలు గాక ప్రతిపక్షాలు కూడా సౌజన్య పక్షపాతం (ఔనంటే ఔననే ఎదరుచెప్పలేని తత్వం)తో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కార్పొరేట్లకు ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. స్వలాభం చూసు కుంటున్నాయి. ప్రజా సంక్షేమానికి తూట్లుపొడిచి అభివృద్ధి నిరోధకాలుగా మారుతున్నాయి. ప్రగతిశీల పౌర సంఘాలు, ప్రత్యామ్నాయ పక్షాల ప్రజాసంఘాలు సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. దీర్ఘకాల ప్రయోజన దృష్టితో చైతన్యపర్చాలి.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్: 9490204545