Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిరణ్యాక్షుడు భూగోళాన్ని చాపచుట్టిన పురాణంలాగా అన్ని రాష్ట్రాలనూ తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలనుకుంటున్న బీజేపీ పేరాశలకు బీహార్ పెద్దదెబ్బ కొట్టింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీతో విడగొట్టుకుని ఆర్జేడి, కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ద్వయానికి వారి తరహాలోనే గుణపాఠం నేర్పారు. ఏకపక్ష కేంద్రీకృత నిరంకుశత్వంగా పరిణమిస్తున్న మోడీ మతతత్వ విధానాల నుంచి ఒక పెద్దరాష్ట్రం దూరమైంది. అందులోనూ ఉత్తరాదిన యూపీ తర్వాత కీలకమైన క్షేత్రం బీహార్. గతంలో జేపీ ఉద్యమానికి తర్వాత కాలంలో వెనకబడిన సామాజిక శక్తుల సమీకరణానికి పేరొందింది. అలాంటి చోట వచ్చిన ఈ పరిణామం ప్రభావాన్ని తక్కువ చేసేందుకు, బీహార్‌కే పరిమితం చేసేందుకు మీడియాలో కథనాలు పరంపరగా వస్తున్నాయి. గత ఎన్నికలలో నితిశ్ పార్టీ జేడీయూకు తక్కువ స్థానాలే వచ్చినా తాము ముఖ్యమంత్రిని చేశమనీ, కానీ నితీష్ వెన్నుపోటు పొడిచాడని బీజేపీనేతలు తిట్టిపోస్తున్నారు. నితీష్ గత పదేండ్లలో ఆరుసార్లు అటూఇటూ మారిన మాట నిజమే గానీ బీజేపీ అంతకన్నా నాలుగాకులు ఎక్కువే చదివింది. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి మహారాష్ట్ర పరిణామాలు తక్షణ కారణమైతే బీజేపీ తనను నానా పాట్లకు గురిచేయడం మరింత ముఖ్యమైన కారణం. మిశ్రమ కూటములంటూనే తమను బీజేపీ మింగేస్తున్నతీరును మిత్రపార్టీలన్నీ గ్రహించి జాగ్రత్త పడుతున్నాయి. మహారాష్ట్రలో శివసేన, పంజాబ్‌లో అకాలీదళ్, ఇప్పుడు జేడీయూ దూరం కావడంతో బీజేపీకి ఇక ఉత్తరభారతంలో మిత్రులంటూ లేకుండా పోయారు. దక్షిణాదిన తమిళనాడులో అన్నాడిఎంకె ఉన్నా అక్కడ దాని ప్రయోజనం నామమార్థం. తమాషా ఏమంటే ఇలాటి సమయంలో ఏపీలో పాలక వైసీపీ పరోక్షంగా బీజేపీ కనుసన్నల్లో మెలగడం, టీడీపీ మరోసారి మోడీని ప్రసన్నం చేసు కోవాలని తహతహలాడటం ఒక వైపరీత్యం. జనసేన, బీజేపీతో జట్టుకట్టే ఉంది.
ఎన్నో మార్పులు... మలుపులు
బీజేపీ ఇంతవరకూ స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిన ఏకైక హిందీ రాష్ట్రమది. నితిష్‌కుమార్ చెలిమి తోనూ చలువతోనూ మాత్రమే అక్కడ ఆ పార్టీ అధికారంలో భాగస్వామి కాగలిగింది. మొదట సోషలిస్టులుగా తర్వాత జనతా జనతాదళ్ నేతలుగా ఎదిగిన లాలూప్రసాద ్యాదవ్ (కుటుంబం), నితీష్కుమార్లే ముప్పైఏండ్లకు పైగా బీహార్‌ను పాలిస్తున్నారు. లాలూతో పోటీ తట్టుకోలేకే నితీష్ సమతాపార్టీ ఏర్పాటుచేసి బీజేపీతో కలిశారు. 2005నాటికి అనేక మల్లగుల్లాల తర్వాత నితీష్‌కుమార్ గెలిచి ముఖ్యమంత్రి కాగలిగారు. అప్పటి నుంచి వరుసగా కొనసాగుతున్నారు. సమతా పార్టీ జేడీయూగా మారింది. లాలూయాదవ్ కేసుల్లో శిక్షపడి జైలుకు వెళ్లడంతో ఆయన చిన్న కొడుకు తేజస్వి యాదవ్ ఆర్జేడీ పార్టీ సారథ్యం చేపట్టారు. 2013లో బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని నిర్ణయించడం నితీష్‌కు ఎంతమాత్రం మింగుడు పడలేదు. పైగా బీహార్ ప్రత్యేకత నేపథ్యంలో బీజేపీ తరహా మతరాజకీయాలు చెల్లుబాటుకావని ఆయనకు బాగా తెలుసు. కాస్త ముందునుంచే బీజేపీతో విడగొట్టు కోవడం మొదలుపెట్టారు. మోడీ ప్రచారానికి రానక్కర లేదని షరతుపెట్టారు. చివరకు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లి దెబ్బతిన్నారు, మోడీ గాలిలో అక్కడ బీజేపీకి 22 స్థానాలు రాగా జేడీయూకు కేవలం రెండు, ఆర్జేడీకి నాలుగు వచ్చాయి. రామ్‌విలాస్ పాశ్వాన్ ఆరు స్థానాలు తెచ్చుకొని కేంద్రంలో మంత్రిగా చేరారు. ఈ ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ నితీష్ రాజీనామా చేసి రామ్మంజీని ముఖ్యమంత్రిని చేశారు. అయితే అంతా ఆయనపెత్తనమే. కొద్ది కాలంలోనే మాంజీని తప్పించి మళ్లీ పదవి చేపట్టారు.
బీజేపీ పంజరంలో నితీష్
2015లో మహాఘట్ బంధన్ ఏర్పాటు చేసి ఆర్జేడీతో కలసి ఘన విజయం సాధించారు. మోడీ విజయోత్సాహానికి ఏడాదిలోనే అది తొలి విఘాతం. అయితే ఇరుపార్టీల విభేóేదాలతో ఆ ప్రయోగమూ అర్థాంతరంగా ముగిసింది. ఉపముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్, లాలూకుటుంబం జోక్యం పెరిగిపోయిందని నితీష్ ప్రచారం ప్రారంభించారు. కేంద్రం లాలూపై దాడి పెంచడంతో ఆ కేసులు సాకుగా చూపి మళ్లీ వారితో తెంచుకున్నారు. ఆఘమేఘాలమీద బీజేపీతో జతకట్టి కొత్తసర్కారు ఏర్పాటుచేశారు. ఇప్పట్లా తాను రాజీనామా చేయకుండానే ఆర్జేడి మంత్రులను తప్పించి బీజేపీవారిని చేర్చుకున్నారు. కేంద్రం ఆశీస్సులతో మూడేండ్లు పాలన పూర్తిచేశారు. 2019లో ఇరు పార్టీలకు ఇంచుమించు సమానంగా 17, 16 లోక్‌సభ సీట్టు వచ్చాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ షా ద్వయం నితీష్‌ను తగ్గించి బీహార్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని పథకాలు వేశారు. కేంద్ర మంత్రివర్గంలో జేడీయూ కోటా బాగా తగ్గించేశారు. రాష్ట్రం నుంచి ఇరుపార్టీల ఎంపిల సంఖ్య ఒకటే అయినా బీజేపీనుంచి ముగ్గురు మంత్రులను తీసుకుని జేడీయూకు ఒకటే కేటాయించడంతో కేంద్రంలో చేరరాదని నితిష్ నిర్ణయం తీసుకున్నారు. అయినా నితిష్ వ్యతిరేకిగావున్న ఆర్సిసింగ్ను తీసుకున్నారు. 2020ఎన్నికలలో తేజస్వి నాయకత్వంలోని ఆర్జేడీ 75 స్థానాలతో పెద్దపార్టీగా వచ్చింది. అనేక పేచీలు పెట్టిన కాంగ్రెస్ యాభైమూడు స్థానాలు తీసుకుని కేవలం 27 చోట్లనే గెలిచి తీవ్రంగా నష్టపర్చింది. వామపక్షాలు చాలాకాలం తర్వాత మళ్లీ బలం గణనీయంగా పెంచుకున్నాయి. వాటికి కేటాయించిన 29 స్థానాల్లోనూ ఎంఎల్ 12, సీపీఐ(ఎం), సీపీఐ చెరో రెండు తెచ్చుకున్నాయి. ఇతర పార్టీలకూ కొన్ని స్థానాలొచ్చాయి. రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడైన చిరాగ్ పాశ్వాన్ రాష్ట్రంలో బీజేపీ పథకంలో పావుగా మారారు. కేవలం జేడీయూ పోటీచేసిన చోట్లనే పాశ్వాన్ బీజేపీ రెబల్స్‌ను తన పార్టీ అయిన లోక్‌జనశక్తి(ఎల్జెఎస్) తరపున నిలబెట్టి ఓట్ల చీలికతో ఓడిపోయేలా చేశారు. ఫలితంగా బీజేపీకి 74 స్థానాలు వస్తే జేడీయూ సీట్లు 43కు పడిపోయాయి. ఇతర చిన్నపార్టీలను కలుపుకొని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే నితీష్ పూర్తిగా బీజేపీపై ఆధారప డాల్సిన స్థితి. నామకార్థంగా నితీష్‌ను ముఖ్యమంత్రిని చేసినా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, స్పీకర్‌తో సహా కీలక శాఖలన్నీ బీజేపీవారే తీసుకున్నారు. మరో వంక ఆరెస్సెస్ అనుబంధం విభాగాలు మతసామరస్యానికి హాని కలిగించే చర్యలు ప్రచారాలు పెంచాయి. శుక్రవారంనాడు ముస్లింలకు ఆప్షనల్ సెలవు ఇవ్వడాన్ని ఖండించారు. కులగణన చేయడానికి వ్యతిరేకత తెలిపారు. ఆఖరుకు శాసనసభలో నితీష్ నియోజక వర్గంలో పరిస్థితి బాగాలేదనే చర్చను స్పీకర్ అనుమతించడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. సభ తన చేతిలో లేకుండా ఏ ముఖ్యమంత్రి పాలన సాగించ గలుగుతారు? తన పట్టు బాగా ఉన్నప్పుడు బీజేపీ ఆరెస్సెస్ తరహా మతతత్వ పోకడలకు కొంతవరకు నిలవరించగలిగిన నితీష్ ఇప్పుడు ఇబ్బందిలో పడ ిపోయారు. కీలుబొమ్మ ముఖ్యమంత్రిగా ఉంటే తన పునాదినే దెబ్బతీస్తుందని కూడా గుర్తించగలిగారు. అందుకే ఆర్సిసింగ్ రాజ్యసభ పదవీ కాలంముగిసినా మళ్లీ నామినేట్ చేయకుండా తొలి నిరసన తెలిపారు. ఆయనపై ఆరోపణల దర్యాప్తు మొదలుపెట్టారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిర్వహించిన అయిదు కార్య క్రమాలకు దూరంగా వుండిపోయారు. ఏమైనా ఎన్డీఏ లో లేని జగన్, నవీన్ పట్నాయక్ వంటివారు నిరంతరం బల పరుస్తుంటే ఆ కూటమిలో ఉండి నితీష్ దూరం పాటించడం దేశ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.
వచ్చే ఎన్నికలపై ప్రభావం
నితీష్ ప్రధాని పదవికి తనను అభ్యర్థిగా భావిస్తున్నారనే గత కథనాలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఆశించారని ఇటీవలి కథనం ఉన్నా ఆయన దాన్ని ఖండిస్తున్నారు. ఉపరాష్ట్రపతి పదవి వద్దని కూడా చెప్పానంటున్నారు. ఇదే సమయంలో బీజేపీయేతర పార్టీల సమావేశాలు, కేసీఆర్ మమతాబెనర్జీ కేజ్రీవాల్ వంటివారు జాతీయ ప్రత్యామ్నాయాలుగా చర్చజరగడం వాటిలో తేజస్వియాదవ్ భాగస్వామి కావడం నితిష్‌ను అభద్రతకు గురి చేసింది. దాంతో మళ్లీ తేజస్వితో పొత్తు చర్చలు జరిపి బీజేపీతో తెంచేసుకున్నారు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ద్వారా శివసేనను చీల్చినట్టే బీహార్‌లో తన పార్టీకి కూడా ఎసరు పెట్టి తనను నెట్టేస్తారని స్పష్టం కావడంతో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రధానకారణం బీజేపీ అమిత్ర చర్యలు, విశ్వాసఘాతుకత్వం మొదటిదైతే, ప్రత్యామ్నాయంలో తనూ భాగంగా ఉండాలనే ఆకాంక్ష రెండవది. ఈ ప్రభావం బీహార్‌కే పరిమితమవుతుందనడం అర్థరహితం. సీనియర్ నాయకుడుగా ఇరవయ్యేండ్ల ముఖ్యమంత్రిగా నితిష్‌కు హిందీ రాష్ట్రాలలో బలమైన ప్రభావమే ఉంటుంది. ఆయన సామాజిక వర్గమైన కుర్మీలు అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉండటం ఇందుకో కారణమంటారు. ఇప్పటికే యూపీ నుంచి ఎస్పి నేత అఖిలేష్‌యాదవ్ ఈ మార్పును స్వాగతించారు. అనేక హిందీ రాష్ట్రాలలో కాంగ్రెస్ కూటములు లేదా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నాయి. బెంగాల్ ఒరిస్సా కూడా బీజేపీ చేతిలో లేవు. దక్షిణాదిలో కర్నాటక మాత్రమే ఉండగా మరెక్కడా వారు అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించదు. నితిష్ వైఖరిలో అవకాశవాదాన్నే చెబుతూ రాజకీయి పూర్వాపరాలను విస్మరించడం విజ్ఞత అనిపించుకోదు. వాస్తవికంగానూ ఉండదు. ఏమైనా ఈ ప్రభావం త్వరలో జరిగే గుజరాత్, హిమచల్ ఎన్నికలపై పడొచ్చు.. ఉత్తరోత్తరా 2024 ఎన్నికల పోరాటం కూడా తీవ్రమైన పోటీకి దారితీస్తుంది. అనంతరం ఏమి జరుగుతుందనేది ఫలితాలపైన ఆధారపడి ఉంటుంది గానీ ముందస్తు జోస్యాలను ఊహలను బట్టి కాదు. నితిష్ మాత్రం 2024ఎన్నికల్లో మోడీ గడ్డుపరిస్థితిలో పడిపోతారనే గట్టిగా చెబుతున్నారు. బీజేపీ నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా లౌకిక శక్తుల సమీకరణ కోరేవారు ఈ పరిణామాన్ని స్వాగతిస్తారు.
- తెలకపల్లి రవి