Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాతంత్య్ర వార్షికోత్సవాల ప్రాముఖ్యతను స్మరించుకునే సందర్భంలో, స్వతంత్ర భారతదేశం సాధించిన వ్యవస్థల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒకటిగా మనం చెప్పుకోవొచ్చు. అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థపైన సంకుచిత పునాదితో, వర్గ నిర్బంధాలు ఉన్నప్పటికీ, ఆరు దశాబ్దాలకు పైగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తన క్రీయాశీలతను నిలబెట్టడం అనేది కీర్తించదగిన విషయం. ప్రజలు, ప్రజా పోరాటాలు, ప్రజాస్వామిక ఉద్యమాల కారణంగానే ప్రజాస్వామ్యం కొనసాగే అవకాశాలు ఏర్పడ్డాయి. అయితే 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో కూడా ప్రజాస్వామ్యానికి ఉన్న అవకాశాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగం మనకందించిన బలమైన ప్రజాస్వామిక పునాదులు తీవ్ర ప్రమాదంలో పడిపోయాయి. కార్యనిర్వాహక వర్గం, శాసనసభ మరియు న్యాయ వ్యవస్థల మధ్య నిరోధ-సమతుల్యత (చెక్స్ అండ్ బ్యాలెన్సెస్)లను నిర్వహించే ప్రజాస్వామిక నిబంధనలు, ప్రభుత్వ వ్యవస్థలపై నిరంకుశత్వం పూర్తి స్థాయిలో దాడి చేయడాన్ని నేడు మనం చూస్తున్నాం.
పూర్తిస్థాయి నిరంకుశత్వం
2019 మేలో సంపూర్ణమైన ఆధిక్యతతో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏకపార్టీ నియంతృత్వాన్ని స్థాపించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దానికి ప్రతిపక్షం పైన పూర్తిగా దాడి చేయాల్సిన అవసరం ఉంటుంది. తదనుగుణంగానే పార్లమెంట్లో ప్రతిపక్షం పోషించే పాత్రను అడ్డుకుంటున్నారు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలను ఎంఎల్ఏలను కొనుగోలు చేయడం, కేంద్ర ఏజెన్సీ సంస్థలను ప్రయోగించడం ద్వారా అస్థిరపరుస్తున్నారు. ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా దాడులు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్, సీబీఐ, ఆదాయ పన్నుల శాఖలను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారు.
తగ్గిన పార్లమెంట్ విలువ, దిగజారుతున్న పార్లమెంటరీ సాంప్రదాయాలు ముఖ్యంగా మోడీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత మరింత ప్రమాదకరంగా తయారయ్యాయి. 2021లో పార్లమెంట్ 50రోజుల కన్నా తక్కువ సార్లే సమావేశమైంది. చట్టాలపైన చర్చలు లేకపోవడంతో పాటు లెజిస్లేటివ్ బిల్లులను తనిఖీ చేయడమనేది లేదు. యూపీఏ ప్రభుత్వం హయాంలో లోక్‌సభ 60 నుంచి 70 శాతం వరకు బిల్లులను స్టాండింగ్ కమిటీకి నివేదిస్తే, మోడీ మొదటి ప్రభుత్వ హయాంలో అవి 22శాతానికి, ప్రస్తుతం 13శాతానికి పడిపొయ్యాయి. శాసనాల ప్రక్రియ జరిగే సమయంలో సమస్యలను లేవనెత్తుతూ, ఓటింగ్‌కు ఒత్తిడి చేసే ప్రతిపక్షం హక్కుల నిరాకరణతో ఇది మరింత పెరిగింది. ఎగువసభలో ఓటింగ్, తనిఖీ నిబంధనల నుండి తప్పించేందుకు అనేక బిల్లులను ద్రవ్య బిల్లులని ప్రకటించడంతో రాజ్యసభ గౌరవం మరింతగా దిగజారింది. ఈ నిరంకుశ ధోరణి, మన రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కుల అణచివేతకు దారి తీసింది.
భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను నేరంగా భావించడం, పౌర హక్కుల అణచివేత అనేవి నిరంకుశ పాలన ప్రత్యేక లక్షణాలుగా మారాయి. 'ఉపా', దేశద్రోహ చట్టం లాంటి అనాగరిక చట్టాలను ప్రయోగించడం ద్వారా ఈ నిరంకుశ పాలన గతంలో ఏనాడూ లేనంత ఉచ్ఛ స్థితికి చేరుకుంది. 2014-2020, ఏడు సంవత్సరాల మధ్య కాలంలో 'ఉపా' చట్టం కింద 690 కేసులు నమోదయ్యాయి. ఈ చట్ట నిబంధనల ప్రకారం 10,552 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో రాజకీయ కార్యకర్తలు, పౌర హక్కుల న్యాయవాదులు, జర్నలిస్టులు, రచయితలు ఉన్నారు. భీమాకోరేగావ్ కేసులో 'ఉపా' చట్టం కింద మూడు సంవత్సరాలుగా 16మంది ప్రముఖ మేధావులు జైలు నిర్బంధంలో ఉండటమే దీనికి ఉదాహరణ.
నిరంకుశ పాలన ప్రత్యేక లక్షణం ఏమంటే, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పని చేయడం ఆపి, కార్యనిర్వహక శాఖను మితిమీరి అదుపుచేస్తే, సుప్రీంకోర్టు ఒక కార్యనిర్వహక కోర్టు వలె ప్రవర్తించడం మొదలు పెట్టింది. జాకియా జాఫ్రీ విన్నపం పైన, ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్‌కు ఉండే అధికారాలు, దాని అధికార పరిధి పైన ఇటీవల కాలంలో ఇచ్చిన తీర్పులు, కార్యనిర్వహక శాఖ దాడుల నుండి పౌర జీవితాలను, వారి స్వేచ్ఛను కాపాడడంలో దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం ఏ విధంగా విఫలం చెందు తుందో తెలియజేస్తాయి.
మనం ఒక్కసారి 75 సంవత్సరాల కాలాన్ని వెనక్కి తిరిగి చూస్తే, 1975లో ఇందిరాగాంధీ దేశంలో ఆంతరంగిక అత్యవసర పరిస్థితిని విధించడం ద్వారా ప్రజాస్వామ్యం పై చాలా పెద్ద దాడి చేసింది. ఈ నిరంకుశ పాలనలో ప్రతిపక్ష నాయకులను జైళ్ళలో నిర్బంధించి, పౌరహక్కు లను కాలరాసి, పత్రికా స్వేచ్ఛను హరించింది. కానీ ఈ పరిస్థితి కేవలం 20నెలల కాలం మాత్రమే కొనసాగింది. ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి చాలా తీవ్రమైనది. ఈ దాడి, ప్రజాస్వామ్యం లేకుండా చేసి లౌకికవాదం, ఫెడరలిజంలను బలహీనపరచడం ద్వారా మన భారత రిపబ్లిక్ స్వభావాన్నే మార్చాలనుకుంటున్నది. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్న మార్పు కాదు, లేదా ఇదేదో ఒక వ్యక్తికి సంబంధించిన నిరంకుశ ధోరణులు కాదు. ఈ నిరంకుశత్వానికి కారణభూతమైన ఈ శక్తుల కలయిక సంఘటనలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
రాజకీయ ప్రజాస్వామ్యంపై అంబేద్కర్
మన రాజ్యాంగాన్ని ఆమోదించే సందర్భంలో సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాదని డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ ఆనాడే హెచ్చరించాడు. ''భారత దేశంలోని ప్రజాస్వామ్యం కేవలం మన నేల పైన ఉన్న ఒక ముసుగు మాత్రమే, వాస్తవానికి అది అప్రజాస్వామికమైనదని'' కూడా అంబేద్కర్ హెచ్చరించాడు. దశాబ్దాలకు పైగా ''ఎన్నికల ప్రజాస్వామ్యం'' వర్థిల్లగా, ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యం కోసం జరిగే కృషి విఫలమవుతోంది. పాలక వర్గాలు అనుసరిస్తున్న పెట్టుబడిదారీ తరహా అభివృద్ధి విధానాలు వర్గ, ప్రాంతీయ అసమానతలను మరింత తీవ్రతరం చేశాయి. మూడు దశాబ్దాల క్రితం ప్రవేశించిన నయా ఉదారవాద విధానాల ఫలితంగా ఆర్థిక అసమానతల వేగం పెరగగా, మితిమీరిన స్థాయిలో సంపదను చేతిలో ఉంచుకున్న ధనిక వర్గాల ప్రభుత్వం సంఘటితం అవుతున్నది.
సామాజికంగా చూస్తే భూస్వామ్య విధానం, పెట్టుబడిదారీ అనుకూల సంబంధాలతో రాజీపడిన బూర్జువా వర్గం, కుల అణచివేత, అన్యాయమైన సామాజిక క్రమాన్ని అంతం చేయడానికి కేవలం లాంఛనప్రాయమైన ప్రయత్నాలను మాత్రమే చేశాయి. అందుకే, అంబేద్కర్ ముందు చూపుతో పరిశీలించినట్టు, రాజకీయ ప్రజాస్వామ్యానికి, సామాజిక, ఆర్థిక అసమానతల పెరుగుదల మధ్య వైరుధ్యం ముందుకు వస్తున్నది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యొక్క ఈ విశ్లేషణ, భారతదేశంలోని మార్క్సిస్టులకు చాలా దగ్గరగా ఎలా పోలి ఉందో గమనించాల్సిన అంశం. సామాజిక, వ్యవసాయిక సంబంధాల ప్రజాస్వామిక మార్పును సంపూర్ణంగా చేపట్టడంలో జరిగిన వైఫల్యం, ఆధునిక-ప్రజాస్వామిక సమాజ అభివృద్ధికి ప్రతిబంధకం అవుతుందని సీపీఐ(ఎం) మొదటినుంచీ అభిప్రాయపడు తున్నది. నయాఉదారవాద ఆరంభం, హిందూత్వ ఆధిపత్య మతోన్మాద పెరుగుదల సామాజిక, ఆర్థిక న్యాయానికి మృత్యు గంటలను మ్రోగిస్తున్నాయి, ఫలితంగా ప్రజాస్వామ్యం అదుపుచేయబడి, నిరంకుశత్వానికి మార్గం సుగమం అవుతున్నది.
ప్రజాస్వామ్యాన్ని అదుపు చేస్తున్న నయా ఉదారవాదం
మార్కెట్‌ను ప్రజలు, వారి హక్కుల పైన ఉంచడం ద్వారా నయా ఉదారవాదం ప్రజాస్వామ్యాన్ని పరిమితం చేస్తున్నది. బడా పెట్టుబడి రాజకీయ వ్యవస్థను ముట్టడించింది. అన్ని బూర్జువా రాజకీయ పార్టీలు డబ్బు అధికారానికి సేవకులుగా మారాయి. ఇది పార్లమెంటరీ వ్యవస్థను హరించి వేస్తున్నది.
భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) కార్యక్రమం ఏమి చెబుతుందో మనం దృష్టిలో ఉంచుకోవాలి: ''పార్లమెంటరీ వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదం కష్టజీవుల నుండి, వారి ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీల నుండి ఎదురవ్వదు. ఆ ప్రమాదం దోపిడీ వర్గాల నుండి వస్తుంది. వారి సంకుచిత ప్రయోజనాల కోసం పార్లమెంటరీ వ్యవస్థను ఒక సాధనంగా ఉపయోగించుకొని, వారే దానిని బలహీన పరుస్తారు.''
హిందూత్వ శక్తుల పెరుగుదల, 2014లో మెజారిటీ స్థానాలతో అధికారం చేపట్టిన బీజేపీ భారతదేశ రాజకీయాలలో ఓ గుణాత్మక మార్పును తీసుకొస్తున్నది. రాజ్యాధికారాన్ని, ఆరెస్సెస్ ఫాసిస్ట్ సిద్ధాంతంతో ప్రోత్సహించబడుతున్న ఒక రాజకీయ పార్టీ అదుపు చేస్తున్నది. మైనారిటీలకు సమాన హౌదా, హక్కులను నిరాకరిస్తూ, వారిని పౌరులుగా కూడా గుర్తించని, ప్రజాస్వామ్యానికి ప్రతికూలమైన హిందూత్వ నిరంకుశ పాలనను స్థాపించాలని వారు కోరుకుంటున్నారు.
ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ యంత్రాంగం వేధింపులు, హింసతో వారిని అదుపు చేసే హిందూత్వ రక్షక దళాల చర్యలను, ప్రభుత్వ చట్టాలను రెండింటినీ మన చూస్తున్నాం. వాస్తవానికి ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్నాటక లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనా రిటీలు రెండవ తరగతి పౌరుల స్థితికి నెట్టబడుతున్నారు.
హిందూత్వ - కార్పొరేట్ మైత్రి
హిందూత్వ శక్తులు, కార్పొరేట్ శక్తులు రూపొందించిన మైత్రి నిరంకుశత్వ వేటను రగిలిస్తున్నది. నయాఉదారవాద విధానాలను, హిందూత్వ విలువలను సమాజంపై రుద్దాలంటే నిరంకుశత్వాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. నాలుగు లేబర్ కోడ్లను ఆమోదించడం ద్వారా కార్మిక వర్గం యొక్క హక్కులను కాలరాసారు.
రాజ్యాంగ పరిధిలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలను తిరిగి నిర్మించడానికి ఇప్పుడు మనం పూనుకోవాల్సిన అవసరం ఉంది. నిరంకుశ పోకడలు కేవలం రాజకీయ రంగంలో మాత్రమే కాక సామాజిక, సాంస్కృతిక రంగాలలో కూడా ఉపయోగిస్తున్నారు. గోవధ, గొడ్డుమాంసం వినియోగం, ప్రజలను అదుపు చేసే చర్యలు (మోరల్ పోలీసింగ్), కళాకారులను, సాంస్కృతిక కార్యక్రమాలను హిందూ వ్యతిరేకమైనవిగా ఆక్షేపించడం, హిందూత్వ విలువలకు మాత్రమే పరిమితమై ఉండాలని విద్యా సంస్థలను అదుపు చేయడం లాంటి చర్యలన్నీ నిరంకుశ రాజ్యం లక్షణాలే.
ప్రజాస్వామ్యం కోసం పోరాటం
కాబట్టి, భారతదేశంలో ప్రజాస్వామ్యం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కీలకమైన దశలో ఉంది. హిందూత్వ నిరంకుశ పాలన ఉనికిలో ఉందనడానికి రుజువుగా ఉన్న మోడీ ప్రభుత్వం, ప్రజాస్వామ్యానికి, ప్రజల ప్రజాతంత్ర హక్కులకు ప్రమాదకరంగా ఉంది. రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక హక్కుల రక్షణకై పోరాటం సాగించాల్సి ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యం కోసం చేసే పోరాటం హిందూత్వ, నయా ఉదారవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి జోడించాల్సి ఉంటుంది.
కార్మికుల కోసం చేసే ప్రజాస్వామ్య పోరాటం చాలా ముఖ్యమైనది. దాని ప్రాముఖ్యతను గురించి రోజా లక్జెంబర్గ్ ఇలా వివరించారు... ''ఒకవేళ ప్రజాస్వామ్యం బూర్జువాలకు పాక్షికంగా అనవసరం, పాక్షికంగా ఇబ్బందికరమైతే అది కార్మిక వర్గానికి అవసరమైనది. ముందుగా బూర్జువా సమాజ మార్పులో కార్మిక వర్గానికి సహాయకంగా ఉపయోగపడే స్వయం పాలన, ఎన్నికల హక్కులు లాంటి రాజకీయ రూపాలను సృష్టించడానికి ప్రజాస్వామ్యం అవసరం. కానీ ప్రజాస్వామ్యం కోసం జరిగే పోరాటంలో కార్మిక వర్గ ప్రయోజనాలు, చారిత్రక పనులకు సంబంధించిన విషయాల్లో కార్మిక వర్గం చైతన్యవంతమవుతారు.''
నయా ఉదారవాద పాలనకు, హిందూత్వ మతోన్మాదానికి వ్యతిరేక శక్తిగా నికరంగా ఉన్న వామపక్షాలు, నిరంకుశ ప్రమాదానికి వ్యతిరేకంగా విశాల ప్రజాస్వామిక శక్తుల సమీకరణలో చాలా కీలకమైన పాత్రను పోషించాల్సి ఉంటుంది.
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451.
- ప్రకాష్ కరత్