Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అమృతమంటే అదేదో కాదు అది విషమే, విషమంటే మరేమిటో కాదు అదో రకం అమృతం'' అంటూ స్వామివారి వాక్కులు సాగిపోవచ్చు. లేదా ఇంకెవరన్నా అలాంటి అవతారమెత్తి ఓ ఆధ్యాత్మిక ఉపన్యాసం ప్రారంభించే ముందు వెలుగు చీకటి, అదృష్టము దురదృష్టము, సంతోషం దుఃఖం, పగలు రాత్రి, ఐశ్వర్యం బీదరికం ఇలా వీటిని వేరు వేరుగా చూడొద్దు, ఈ రెండు పదాలూ ఒక్కటే ఒకరికి అమృతమైనది ఒకరికి విషం, డబ్బుల్లేనివాడికి శాంతమూ ఓ ఐశ్వర్యమే, ఆరోగ్యమే పరమ సౌభాగ్యం అంటూ చెప్పుకుంటూ పోవచ్చు. ఈ మధ్యే అధికారం పోయి రోడ్డుమీద పడ్డ నాయకుడికి ఈ మాటలు బహు బాగా కనిపించవచ్చు. ''నిజమే నేడున్నది రేపు ఉండదు, నేడు లేనిది రేపు కనిపించ వచ్చు... నా సీటూ అంతే... ఇప్పుడు కాకపోతే మరోసారి వచ్చి తీరుతుంది'' అనుకుంటూ ఆజాదీ మహౌత్సవం చేసుకోవడానికి ఇంటికి పోవచ్చు.
అమృతమూ విషమూ వేరు కాదు, ఆహా నిజంగా ఎంత తాత్వికత. షుగర్ ఉన్నవాడికి తీపి ఓ విషం, అదే కాకరకాయ రసం ఓ అమృతం అని ఇంకో బుధ్ధి జీవి చెప్పొచ్చు. చెప్పిన తరువాత అబ్బో నాకూ ఏ జిడ్డు కృష్ణమూర్తో, ఓషోల లాగా మెదడు ఓ దీపమై వెలుగుతోందే, నా తల వెనుక గుండ్రంగా ఏదైనా వెలుగు కనిపిస్తోందా అని పక్కన మిత్రుడిని అడగవచ్చు. ఏదీ లేదులేరా ఊరకే విసిగించకు అనొచ్చు ఆ మిత్రుడు. రే చూడరా ఆ వెలుగు చక్రం, బాగా చూడు, అసలు ఆ వెలుగు రేఖలని చూసి నీవు తట్టుకోగలవా అని గడ్డిపోచకన్నా హీనంగా తనను చూచే మిత్రుడిపై మాటల బాణం వదలొచ్చు. సిగరెట్ చివరి దమ్ము లాగి, ఆ పీకని కిందేసి, చెప్పుతో దాన్ని నిర్దాక్షిణ్యంగా అదిమేసి, వస్తాన్రా అంటూ ఆ మిత్ర శ్రేష్టుడు వెళ్ళిపోవచ్చు. అన్నింటినీ తాత్వికంగా చూద్దామని ట్రై చేసే మన తాత్విక మహరాజు నేను ఆ పడేసిన సిగరెట్ పీకతో సమానమా, హతవిధీ ఏమిటి నాకీ పరీక్ష అని అనుకోవచ్చు. నేను ఫెయిల్ అయ్యానా, లేక పాస్ అయ్యానా. అయినా ఫెయిలు పాసూ రెండూ ఒక్కటే అనుకుంటూ అక్కడినుండి లేచి పోవచ్చు.
ఇలా పాజిటివ్ నెగేటివ్ వేరు కాదు, రెండూ కలిస్తేనే బల్బు వెలుగుతుంది కదా అనీ చెప్పొచ్చు. ఆ రెండూ ఉంటే సరిపోదు, బల్బు వెలగాలంటే మొదట శక్తి ఉండాలి, అది కరెంటు కావచ్చు, లేదా బ్యాటరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అదున్నప్పుడే పై రెండూ పనిచేసి బల్బు మనకు వెలుగునిచ్చేది. అందుకే బీ పాజిటివ్ బ్రో అని మాత్రమే చెబితే సరిపోదు, బీ పాజిటివ్ అండ్ నెగేటివ్ బ్రో అని చెప్పాలి. బానిసత్వం, స్వాతంత్య్రం వేరు వేరు కాదు రెండూ ఒక్కటే... బ్రిటిషోడు, మన పాలకుడు వేరు కాదు ఇద్దరూ ఒక్కటే అని చెప్పొచ్చు. లేదా మహాత్ముడు చెప్పినట్టు రాజు దేవుడిలాంటి వాడు, ప్రజలు భక్తులలాంటివాళ్ళనో, పాలకులు తలితండ్రుల లాంటి వాళ్ళు ప్రజలు పిల్లలలాంటివాళ్ళు అనుకోవచ్చు కొందరు. అయితే ఆ దేవుడిలాంటి, తల్లిదండ్రులలాంటి పాలకులు అందరినీ ఒకేలా చూస్తారా అన్నదే ప్రశ్న. అందుకే మన స్వాతంత్య్రం ఓ మేడిపండు మన దారిద్య్రం ఓ రాచపుండు అని చెప్పిన కవిని ఎప్పుడూ తలచుకోవాలి. మేడి పండే ఎందుకు చెప్పాడు అని అనుమానమొస్తుందేమోనని వేమన ఓ నాలగు వందల సంవత్సరాలకు ముందే మేడి పండు చూడ మేలిమై ఉండు అన్నాడు. దాని పొట్ట విప్పి చూడమన్నాడు. వేమన ఓ సామాజిక వైద్యుడు కాబట్టే మేడిపండులాంటి ఎన్నింటి విషయాల పొట్టలు విప్పి వాటిలో ఎటువంటి పురుగులు, చీడ పురుగులు, వైరసులు, బ్యాక్టీరియాలు ఉన్నాయో మనకు చూపాడు, ఇంకా మనల్నీ చూడమన్నాడు. కానీ మనం చూస్తున్నామా? మనముందే పొట్టలు పైకి పెరిగి పెరిగి ప్రపంచ పొట్టల పోటీకి పోతున్న ఒకరిద్దరి పొట్టలు ఎలా పెరిగాయి, ఎంత పెరిగాయి, ఇంకా ఎంతలా పెరగబోతున్నాయి, వాటిని విప్పి చూస్తే అందులో మన నాయకుల బొమ్మలు ఎన్ని కనిపిస్తాయి అన్న విషయాలు ఈ అమృతోత్సవ సమయాన కాస్త సమయం తీసుకొని చూడాలి మనం.
రాక్షసులు, దేవతలు పాల సముద్రాన్ని చిలికారట. అలా చిలుకుతూ పోతే విషం పుట్టిందట మొదట, తరువాత అమృతం పుట్టిందట. ఆ విషాన్ని శివుడు తన గొంతులోనే పెట్టుకొని గరళ కంఠుడైనాడు. ఇప్పుడు లేటెస్టుగా గరళ కంఠుల నిర్వచనమే మారిపోయింది అది వేరే సంగతి. ఆ వచ్చిన అమృతాన్ని దేవతలు మాత్రమే తాగారట. మరి రాక్షసులేం పాపం చేశారు. ఇప్పుడు ఈ ఆజాదీ శుభవేళ, ఈ డెభ్భై ఐదు సంవత్సరాలు గడిచాక, అంతో కొంతో అమృతం వచ్చే ఉంటుంది కదా మరి దాన్ని ఎవరు తాగారు, ఎవరికి తాపుతున్నారు మొదలైన ప్రశ్నలు మనం వేసుకోవద్దా? లేదా ఎవరో స్వామి చెప్పినట్టు విషమూ, అమృతమూ ఒకటే అని విషమే తాగుతూ ఉందామా? అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా అంటూ అన్నమే తినేవాళ్ళు మనకు సున్నం ఎందుకు వడ్డిస్తున్నారు? ఈ భరతమాతకు బిడ్డలందరూ సమానం కాదా? తన ముద్దు బిడ్డడు అంబేడ్కర్ చెప్పింది ఏమి చేస్తున్నారు? ఆయన ఎవరెవరికి ఏమిచేయాలో అని చెబితే వీళ్ళేమి చేస్తున్నారు? ఆయనతో పాటు ఇంకెందరో మంచివారు ఎన్నెన్నో చెప్పారు. అవన్నీ తెలుసుకొని ఆహా ఆ రాజ్యం వచ్చేస్తుంది ఓపిక పట్టాలి అనుకుంటే సరిపోదు. స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి అని మహాకవి చెప్పిన ప్రకారం మనం ఇంకా చాలా చాలా చేయాలి. చేసేవాళ్ళను బలపరచాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆ మహాకవే చెప్పినట్టు ఇక ఎదురు చూసి ఎదురు చూసి మోసపోవద్దు మనం.
చంద్రహాసుడు, విషయ, దుష్టబుద్ధి కథలో చంద్రహాసుడి చేతిలోని ఉత్తరంలో ఇతడికి విషమునిమ్ము అని ఉంటే అతని అందానికి ముగ్ధురాలైపోయిన విషయ ఆ విషము అన్న పదాన్ని తన కాటుకతో విషయ అని చేసి విషయనిమ్ము అని మార్చినట్టు మనకు విషాన్ని కాకుండా అమతాన్ని పంచమని మన రాతలు మార్చే వారెవరూ లేరని మనం తెలుసుకోవాలి. ఆ మార్చాల్సింది, మార్చుకోవాల్సింది మనమే అనీ తెలుసుకోవాలి. మనకు దుష్టబుద్ధులు మస్తు సంఖ్యలో ఉన్నారు కాని విషయలు లేరన్న విషయం మరువరాదు. పైన చెప్పుకున్న మహాకవి మాటల్ని నిత్యం మననం చేసుకోవాలి, చేసుకుంటూ ఉండాలి.
ఆలశ్యం చేస్తే అమృతం కూడా విషమైపోతుందట. అలా మన మనసులు అమృతం లాగా ఎన్నో సంవత్సరాలు బాగా ఉన్నాయి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆ మహాకవే చెప్పినట్టు ఇక ఎదురు చూసి ఎదురు చూసి మోసపోవద్దు మనం. ఆలశ్యం చేస్తే అమృతం కూడా విషమైపోతుందట. అలా మన మనసులు అమృతం లాగా ఎన్నో సంవత్సరాలు ఊరకే ఉన్నందున వాటిని విషతుల్యం చేస్తున్న మహరాజులు నేడున్నారని గమనించాలి. ఇప్పటికే ఆ మహారాజులు అమృతాన్ని విషం చేసే పనిలో యమా స్పీడుగా ఉన్నారు. మేలుకుందాం, ఈ అజాదీ మహౌత్సవ్ సందర్భంగా అమృతం అందరికీ అందేలా చేసుకుందాం. అమృతం, విషం రెండూ వేరువేరని తెలుసుకుందాం. గరళ కంఠుడి సంగతేమో కాని విషపు మాటలు అమృతం లాంటి మన మెదళ్ళను విషంలా మార్చకముందే మేలుకుందాం. జై హింద్...
- జంధ్యాల రఘుబాబు
సెల్: 9849753298