Authorization
Mon Jan 19, 2015 06:51 pm
75 సంవత్సరాల స్వాతంత్రం తరువాత మన దేశంలోని ఇతర ఏ రంగం కన్నా వ్యవసాయ రంగం ఎక్కువ సంక్షోభంలో ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం ఈ పాతికేండ్లలో (1995 - 2020) రైతులు, వ్యవసాయ కూలీలు నాలుగు లక్షల మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో గత ఎనిమిదేండ్లలో మోడీ పాలనలోనే ఒక లక్షమంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇక 2001 - 2011 మధ్య 90 లక్షల మంది సాగుదారులు తగ్గిపోగా, మూడు కోట్ల మంది వ్యవసాయ కార్మికులు పెరిగారు. దళితులు, ముస్లింలలో భూమిలేని కుటుంబాల సంఖ్య 60శాతం. ఆదివాసీలు సాధారణంగా భూమి కలిగినవారై ఉంటారు. కానీ గత 30ఏండ్లలో భూములు గుంజుకోవడం వల్ల భూమిలేని ఆదివాసీల సంఖ్య పది శాతం పెరిగింది. ఎన్‌ఎఫ్‌హెచ్ ఎస్ వివరాల ప్రకారం దేశంలోని భూమిలో 20శాతం భూమి 75ఎకరాల పైబడి ఉన్న కుటుంబాల చేతిలోనే ఉంది.
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం లెక్కల ప్రకారం చట్టంలో పేర్కొన్న దానికి విరుద్ధంగా 100రోజుల బదులు వ్యవసాయ కార్మికులకు 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో 49 రోజులే పని దొరికింది. జూన్ 2022లో గ్రామీణ ఉపాధి 80 లక్షల మందికి పోయిందని సీఎంఐఈ లెక్క తేల్చింది. మొత్తం గ్రామీణ నిరుద్యోగం రేటు ఎనిమిది శాతం పెరగటం ఆందోళనకరం. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వివరాల ప్రకారం 2018-19లో 21-59 ఏండ్ల వయసు వారిలో 10శాతం గ్రామీణ పురుషులు, 72 శాతం గ్రామీణ మహిళలు ఏ ఉపాధి లేకుండా ఉన్నారు. ఇది కోవిడ్ ముందు స్థితి, ఆ తర్వాత పరిస్థితి ఇంకా దిగజారింది. ఆకలి వల్ల, పోషకాహార లేమి వల్ల లక్షల్లో చనిపోతున్న గిరిజన బిడ్డల సంగతి వర్ణనాతీతం. 2021లో ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం 116 దేశాల్లోనూ 101వ స్థానానికి చేరింది. భారతదేశ వ్యవసాయ సంక్షోభానికి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే.
స్వాతంత్య్రానంతరం వరుస కాంగ్రెస్ ప్రభుత్వాలు అవలంభించిన వ్యవసాయ విధాన లక్ష్యం, అర్ధ ఫ్యూడల్ భూస్వాములను పెట్టుబడి దారి భూస్వాములుగా మార్చి ధనిక రైతాంగాన్ని సష్టించడం. ఇది రైతాంగంలో వర్గ విభజనను తీవ్రం చేసింది. 1950లో బీసీ మహౌల్న బీస్ అంచనా ప్రకారం దేశంలో పునః పంపిణీకి 6కోట్ల 30 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉండాలి. కానీ, దీనిలో ఒక్క గుంట భూమి కూడా పేద రైతులకు పంచింది లేదు. దేశంలోని భూకేంద్రికరణలో ఏ మార్పు లేక పోగా ఇటీవల కాలంలో మరింత పెరిగింది.
మొదటి దశలో వ్యవసాయ విస్తరణకు, విద్యుత్‌కు, శాస్త్ర సాంకేతిక రంగాలకు, ధాన్యం నిలువ చేసుకునేందుకు ప్రభుత్వం పెట్టుబడులు ఇతోధికంగా ఉండేవి. కనీస మద్దతు ధర ద్వారా ఉత్పత్తిదారులకు ప్రభుత్వం సహకరించేది. కొన్ని పంటలను సేకరించడం ద్వారా కూడా ఈ సహకారం ఉండేది. ప్రజా పంపిణీ వ్యవస్థకు కూడా ప్రభుత్వ సబ్సిడీలు ఉండేవి. బ్యాంకుల జాతీయకరణ తర్వాత రైతాంగానికి విస్తారంగా పరపతి సౌకర్యం కల్పించబడింది. దేశీయ మార్కెట్ రక్షణకై వ్యవసాయ పనిముట్ల దిగుమతిపై అనేక ఆంక్షలు పెట్టబడ్డాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అధిక పెట్టుబడి వల్ల మంచి దిగుబడి నిచ్చే వంగడాలు సష్టించబడ్డాయి. ఇదంతా హరిత విప్లవానికి దారితీసింది. ఉత్పత్తి, ఉత్పాదకత మెరుగై ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమద్ధి సాధించింది. అయితే ఇది రెండు రకాల అసమానతలకు దారితీసింది. మొదటిది ప్రాంతాల మధ్య, రెండోది రైతాంగంలో అసమానత. అయినప్పటికీ 1990 వరకు వ్యవసాయ రంగంలో కొంత పురోభివృద్ధి సాధ్యమైంది.
1991లో కాంగ్రెస్ ప్రారంభించిన నయా ఉదారవాద విధానాలు 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఉధతంగా కొనసాగుతున్నాయి. సామ్రాజ్యవాద వత్తిడితో ఆ విధానాలు అభివద్ధి నిరోధకంగా మారాయి. ఈ దశలో ఆర్థిక లావాదేవీల నిర్వహణలో రాజ్యం తన పాత్ర ఉపసంహరించుకుంది. పూర్తిస్తాయిలో పెట్టుబడిదార్ల వత్తిడికి తలోగ్గింది. 1995లో హిస్సార్‌లో జరిగిన ఏఐకేఎస్ జాతీయ మహాసభ ఈ విధానాలను విశ్లేషించి క్రింది హెచ్చరికలు చేసింది కేంద్ర ప్రభుత్వం అనుసరించే ఈ విధానాలు రైతాంగంపై తీవ్ర దుష్పభావాన్ని చూపిస్తాయి. ఇవి పేద, మధ్యతరగతి రైతాంగాన్ని మరింత నిరుపేదలుగా మారుస్తాయి. పట్టణ, గ్రామీణ నిరుద్యోగం ఎన్నడూ చూడానంతగా పెరిగిపోతుంది. ఇతర ఎన్నో రైతు సంఘాలు ఈ వ్యవసాయ విధానాలను పొగడ్తలతో ముంచెత్తుంతుండగా ఏఐకేఎస్ నయా ఉదారవాద విధానాలను విశ్లేషించగలగడం ప్రత్యేకత. ఎఐకెయస్ హిస్సార్ మహాసభ హెచ్చరికలు 30ఏండ్ల తర్వాత ఏ విధంగా నిజమైనాయో ఇప్పుడు చూస్తున్నాం.
నయా ఉదారవిధానాలతో
వ్యవసాయరంగంలో విధ్వంసకర పరిణామాలు
భూ సంస్కరణలను తిరగదోడటం, భూ పరిమితి చట్టాలను నీరు గార్చటంతో పెద్ద పెద్ద భూఖండాలను భారతదేశపు బడా వ్యాపారావేత్తలకు, విదేశీ బహుళ జాతి కంపెనీలకు అమ్మటానికి లేక లీజుకివ్వటానికి అవకాశమేర్పడింది. దున్నేవాడికే భూమి అనే నినాదం స్థానంలో కార్పొరేట్లకే భూమి అనే నినాదం వచ్చింది. విత్తనాలు, ఎరువులు, నీటి పారుదల సౌకర్యాలు, విద్యుత్తు, ఇంకా ఇతర వ్యవసాయిక అవసరాల మీద ప్రభుత్వ సబ్సిడీలకు కోత పెట్టటంతో వ్యవసాయ సాధనాల మీద ఖర్చు విపరీతంగా పెరిగింది. ఆ ఫలితంగా ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగాయి. వ్యవసాయ దిగుమతుల పరిమితి మీదవున్న ఆంక్షలు తొలగించటం, దిగుమతులపై పన్నులు తగ్గించటంతో సబ్సిడీ కలిగిన విదేశీ వ్యవసాయ సరుకులు వరదలాగా దేశంలోకి వచ్చిపడ్డాయి. దానితో దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కుప్పకూలాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏఎస్) వల్ల కలిగిన దుష్ప్రభావాలు సైతం ఇటువంటివే. వ్యవసాయం, ఇరిగేషన్, విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, ఇంకా ఇతర మౌలిక సదుపాయాలమీద ప్రభుత్వం పెట్టే పెట్టుబడులలో భారీగా కోత పెట్టారు. ఆయువుపట్టు లాంటి విద్యుత్తు, నీటి పారుదల సౌకర్యాల ప్రయివేటీకరణతో ఈ రెండింటికి పెట్టాల్సిన ఖర్చు బాగా పెరిగింది. అంతేగాక, నీటి మీద గుత్తధిపత్యాలు ఏర్పడ్డాయి సంస్థాగత రుణాలలో అతి పెద్దభాగం కార్పొరేట్లకు మళ్ళించే విధాన నిర్ణయం మూలంగా రైతులకు, వ్యవసాయ కార్మికులకు అందుబాటులో ఉన్న రుణాలలో భారీ కోత పడ్డది. దానితో రైతాంగం అధిక వడ్డీలు వసూలు చేసే ప్రయివేట్ వడ్డీ వ్యాపారులమీద ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. ఆహార సబ్సిడీలలో విపరీతంగా కోత విధించి, గతంలో ఉన్న సార్వత్రిక ప్రజా పంపిణీకి బదులు లక్షిత ప్రజా పంపిణీ విధానాన్ని ప్రారంభించటంతో పేద ప్రజల ఆహార భద్రత ప్రమాదంలో పడ్డది. కనీస మద్దతు ధర యంత్రాంగంలో, పంటల సేకరణ వ్యవస్థలలో దేశీయ మార్కెట్టులో జోక్యం చేసుకునే చర్యలనుండి ప్రభుత్వం తప్పుకున్నది. ఎగుమతి ఆధారిత వ్యవసాయం వైపునకు, ఆహారపంటల స్థానంలో వాణిజ్య పంటలు వైపుకు సాగును మళ్ళించటానికి ఒక విధానపరమైన ఒత్తిడి జరుగుతున్నది. సాగు నిర్వహణలో యాంత్రీకరణ పెరుగుతున్నది. దీనితో వ్యవసాయ కార్మికుల ఉపాధి, నిజ వేతనాలు తగ్గుముఖం పట్టాయి.
అసలు నేరం బీజేపీ-ఆర్ఎస్ఎస్ల మోడీ పాలనది
సామ్రాజ్యవాద దేశాల ఆదేశాలకు లోబడి వ్యవసాయ, పారిశ్రామిక, ఇతర అన్ని రంగాలలో నయా ఉదారవాద విధానాలను తీవ్రంగా అమలు చేస్తున్న నేటి బీజేపీ-ఆర్ఎస్ఎస్ పాలకులే అసలు నేరస్థులు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలూ సహజంగానే ఆ మార్గాన్నే నడుస్తున్నాయి.
2020లో హానికరమైన మూడు వ్యవసాయ చట్టాలు వచ్చాయి. వాటికీ వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటం జరిగింది. 2015 శాంత కుమార్ కమిటీ నాటినుంచి నయా ఉదారవాద పాలసీల అమలు దిశగా మోడీ ప్రభుత్వం విధానాలను నిర్ణయిస్తూ ఉన్నది. క్రమంగా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పద్ధతిని, ప్రభుత్వ ప్రోక్యూర్మెంట్ పద్ధతిని, అలాగే మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను నాశనం చేయటం వ్యవసాయ చట్టాల ఉద్దేశ్యమని స్పష్టమైంది.
చివరికి, ఈ మార్గం అష్టకష్టాలలోవున్న రైతుల భూమిని కూడా ఆక్రమించాలని చూస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఇటువంటి ప్రయత్నాన్ని మోడీ ప్రభుత్వం చేసింది. భూసేకరణ సవరణ ఆర్డినెన్స్, 2015 తేవటం ద్వారా ఈ ప్రయత్నం జరిగింది. కానీ దీనిని క్షేత్ర స్థాయిలో పోరాటాల ద్వారా, రాజ్యసభలో పోరాటం చేయటం ద్వారా ఓడించటం జరిగింది. అయితే, అనేక బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఇవే సవరణలను తమ రాష్ట్ర అసెంబ్లీల ద్వారా బలవంతంగా రుద్దాయి.
బీజేపీ ప్రభుత్వం దేశీయ, విదేశీయ కార్పొరేట్ వర్గాలకు సూపర్ లాభాలు కట్టబెట్టటానికి, వాటి సంపదను పెంచటానికి వీలుగా యావత్తు వ్యవసాయ రంగాన్ని వాటికి హస్తగతం చేయాలని చూస్తున్నది. వ్యవసాయ చట్టాలు చేసిన పక్షం రోజుల లోపే, కార్మికవర్గం దశాబ్దాల తరబడి తీవ్రంగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను పార్లమెంటులో రద్దు చేసింది. వాటి స్థానంలో కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను ప్రవేశపెట్టింది. వ్యవసాయ కార్మికుల జీవనరేఖ అయిన ఉపాధి హామీ పధకం నిధుల కొరతతో కూనారిల్లుతున్నది. తమ శ్రమతో దేశ సంపదను ఉత్పత్తి చేసే పునాది వర్గాలైన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులపై దుర్మార్గమైన దాడి జరుగుతున్నది. కార్పొరేట్ మతతత్వం అంటే అసలుసిసలైన అర్థం ఇదే. దీనిపై శక్తివంతమైన కార్మిక-కర్షక ఐక్యతను సాధించి తుదికంటా పోరాడాలి.
స్వాతంత్య్ర పోరాటం రోజుల నాటినుంచి, భూస్వామ్య, కార్పొరేట్, సామ్రాజ్యవాద లాబీలకు నమ్మిన బంటుగా ఊడిగం చేస్తున్న బీజేపీ -ఆర్ఎస్ఎస్ల పాలన యొక్క ప్రజావ్యతిరేక విధానాలను, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) నాయకత్వంలోని రైతాంగ పోరాటం గట్టి చావుదెబ్బ తీసింది. ప్రజాస్వామ్యం కోసం, లౌకికతత్వం కోసం అందరిని కలుపుకుని రైతులు చేసిన పోరాటం శక్తివంతమైన దెబ్బ కొట్టింది. లక్షలాది మంది రైతులు చేసిన దేశభక్తియుత పోరాటం కేవలం రైతాంగం కోసమే కాదు, ప్రజలకోసం, మొత్తం దేశ రక్షణ కోసం చేసిన పోరాటం. ఈ రైతుల పోరాటం విజయంద్వారా లభించిన స్ఫూర్తిదాయకమైన ఉత్సాహంతో ముందుకు సాగాలి. కానీ, ఆ విజయం కోసం హానికరమైన, విషం చిమ్మే మతతత్వం, కులతత్వం, నిరంకుశత్వంపై రాజకీయంగా, సైద్ధాంతికంగా పోరాడటం తప్ప మరో మార్గాంతరం లేదు.
- అశోక్‌ధావలే