Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వేచ్ఛాకలలు ఉరితాళ్లను ముద్దిడిన జ్ఞాపకం
జైళ్ల ముళ్లవనాన విచ్చుకున్న త్యాగాల
పరిమళ జ్ఞాపకం
త్రివర్ణ శోభిత ముప్పాతికల స్వాతంత్య్ర సంబరాన
వెలుగురేఖలకై వెతుకులాటల పథగమనం
అయినా, ఇదిగో! నా గుండెల నిండా
మోగుతున్నది వందేమాతరం!
ఊరికే ఎవడిచ్చాడు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు
ఉరికొయ్యకు ఊగిన మీదటే దక్కినవీ ఫలితాలు
శాంతి సత్యాగ్రహాలెన్ని వెల్లువెత్తినా...
బుల్లెట్లు రక్తాన్ని కళ్లచూశాయి
నిర్భంధగాడాంధకారం నిండా ముంచెత్తినా
వీరుల వెలుగు రెక్కలు విప్పుకున్నాయి-
ఇది యోధులు విడిచిన ప్రాణ చలువ
ఉద్యమం ఫలించిన విలువ!
ఎవరు దీనికి వారసులు?
ఏవీ నాటి కలలు ఆశలు!
ఎవరు దిగమింగారు ఫలాలు?
ఆకలి చూరుపట్టుకుని వేళాడుతూనేవుంది
దారిద్య్ర సహచరత్వం కొనసాగుతోంది
అసమానత ఆదానీ లాభంలా పెరిగిపోయింది
వివక్షతా వెతల అగ్నిగుండం మండుతూనేవుంది
అయినా, నా గుండెల నిండా వందేమాతరం!
ప్రశ్నలు సంధించిన కలాల తలలపై
బుల్డోజర్లు జవాబుల విధ్వంస సవారీ నడుస్తోంది
మనందరి అన్నం ముద్దకోసం
తన్నుతాను చెమట ముద్దగా చేసుకొన్న
రైతన్నపైకి రైఫిల్లు ఎక్కుపెట్టటం
నిరసన హక్కును రక్తంలో తొక్కి చంపటం
నన్ను నిరంతరం దహిస్తున్న జ్ఞాపకం
అయినా, నా గుండెలో మ్రోగుతూనేవుంది వందేమాతరం!
ఇన్నేళ్లకాలాన కన్నీళ్లు తుడవనేలేదు సరే!
కొన్ని తాగేనీళ్ల కోసం కదలిన పసిగొంతును
కులకత్తులు క్రూరంగా వెంటాడాయి
ఇప్పుడు నా తల నేలకు వంగి అవమానపడుతోంది!
దేశమంటే మనుషులని మహాత్ములెంత గొంతెత్తితేయేం?
మతం చిచ్చును రగిలించే నినాదమే
అధికారమై మంటలు రేపుతున్నది
కలిసి నడిచిన కదనగీతం నాటిది
కలల్ని కూల్చేస్తున్న ద్వేషరాగం నేటిది
ఎన్ని కుట్రలు రచించినా
ఎంత విషం ప్రవహించినా
నిలువరించే తెగువనాది
త్రివర్ణ జెండా బలమునాది
వజ్రసంకల్పం నాది
అందుకే...
నా గుండెలో మోగుతూనేవుంది వందేమాతరం!
- కె ఆనందాచారి