Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వందల సంవత్సరాల బానిస సంకెల్లనుండి విడిపడి 75సంవత్సరాల కిందట స్వాతంత్య్ర పతాకను ఎగరేసిన మన పూర్వీకుల ఘనతను స్మరించుకోవడం నేడు మనందరి కర్తవ్యం. మూడురంగుల జండా మన అస్తిత్వానికి ప్రతీక. ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్ అంటే ప్రస్తుత ఏలికలవలె కేవలం మూడురంగుల జండాను ఎగురేయడం, సంబరాలు చేసుకోవడం ఎంతమాత్రం కాదు. ఆ జండా రెపరెపల వెనుక దాగున్న లక్షలాది గుండెల తపనను, వేలాది జీవితాల త్యాగాలను గుర్తుచేసుకోవడం. మన స్వాతంత్రం ఎంతవిలువైనదో, రక్తతర్పణలు చేసిన నాటి త్యాగధనుల దేశభక్తి ఎంతగొప్పదో స్మరించడం, ఆలోచించడం, వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం. ఇదే త్రివర్ణపతాకానికి మనమిచ్చే నిజమైన గౌరవం.
మనం గొప్పగా చెప్పుకుంటున్న ఈ కాలంలో కూడా ఒంటరిగా పోలీసుస్టేషన్‌కు వెళ్ళడానికి జంకుతున్నాం, వ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తడానికి భయపడుతున్నాం, సామాజిక మాధ్యమంలో కూడా స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేసే సాహసం చేయలేకపోతున్నాం. అటువంటిది వందల సంవత్సరాల బానిసపాలనలో, దేశం బ్రిటిష్ కబందహస్తాలలో విలవిలలాడుతున్న కాలంలో దేశ స్వాతంత్రం కోసం ఎలుగెత్తడమే కాదు, తమ ధన మాన ప్రాణాలను తృణప్రాయంగా భారతమాత పాదాలముందు నిండు భక్తితో సమర్పించిన నాటి స్వాతంత్ర యోధుల ఘనతను, వారి నిష్కళంక దేశభక్తిని అందిపుచ్చుకోవడమే నేడు మనముందున్న కర్తవ్యం.
ప్రపంచ చరిత్రలో అత్యంత పాశవిక ఘటనగా నిలిచిపోయిన 'జలియన్ వాలాబాగ్' సంఘటన ప్రపంచానికి తెలియడానికి నెలరోజులకుపైగా పట్టిందంటే నాటి నిర్బంధాన్ని ఏమని వర్ణించాలి! నేడు సువిశాల భారతదేశం మన కండ్లముందు సుస్పష్టంగా కనిపిస్తున్నది. కానీ, నాడు 500 సంస్థానాల రూపంలో చిన్నాభిన్నంగా ఉన్న ప్రాంతాన్ని ఒక దేశంగా ఉహించుకుని, మాతృదేశ విముక్తికోసం ఎలుగెత్తిన నాటి తరాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సింది పోయి మనలో కొందరు వారి చిత్తశుద్దిని ప్రశ్నించడం, వికృత ఉద్దేశాలను నాటి మహనీయులకు ఆపాదించడం విడ్డూరం, దురదృష్టకరం. సర్వసత్తాక ఘనతంత్ర దేశంలో జీవిస్తూ కూడా విదేశీ పెట్టుబడులకు, సామ్రాజ్యవాదులకు దాసోహమంటున్న కొందరు నేటితరం సూడో దేశభక్తులనేమనాలి? నిర్భంధంలో కూడా రాజీపడకుండా గుండె ధైర్యాన్ని ప్రదర్శించిన, జీవితాలను తృణప్రాయంగా త్యాగంచేసిన నాటి స్వాతంత్ర యోధుల నిజాయితీని, నిష్కళంక దేశభక్తిని, ఔన్నత్యాన్ని దురుద్దేశంతో తూలనాడటం ఆకాశం మీద ఉమ్మేయడమే.
మువ్వన్నెల జండావెనుక దాగున్న మన పూర్వుల ఉద్దేశాలను, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, కులమతాలకతీతమైన శాంతి, సహనం, సామరస్యాల ఔన్నత్యాన్ని నిలబెట్టడం, కొనసాగించడంలోనే మన దేశభక్తి దాగున్నదనేది అక్షరసత్యం. ఏడున్నర దశాబ్దాల కిందట ఆ స్ఫూర్తిదాతలు మనకందించిన ఆ జయకేతాన్ని నిజంగా ఎగురేయాల్సింది మనింటి గోడలమీదనో, సందుచివర జండాగద్దెలమీదనో కాదు, మన గుండెల మీద.
- చందుపట్ల రమణకుమార్ రెడ్డి,
సెల్:9440449392