Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తైవాన్ విలీనం అంశం మీద అమెరికా మరింతగా చైనాను రెచ్చగొట్టేందుకే పూనుకుంది. అమెరికన్ పార్లమెంటు దిగువసభ స్పీకర్ నాన్సీ పెలోసీని పర్యటనకు పంపి చైనా అడ్డుకుంటే రచ్చ చేయాలని చూసింది. సంయమనం పాటించిన చైనా ఆగస్టు నాలుగవ తేదీ నుంచి తైవాన్ జలసంధిలో మిలిటరీ డ్రిల్సు నిర్వహిస్తున్నది. అవి జరుగుతుండగానే ఏం చేస్తారో చూస్తాం అన్నట్లుగా కొంత మంది ఎంపీలను తైవాన్ పంపిన అమెరికా తమ నౌకా దళాన్ని చైనా దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి పంపనున్నట్లు ప్రకటించింది. తన సత్తా ఏమిటో చూపేందుకే చైనా డ్రిల్సు నిర్వహిస్తున్నది. వాటిలో భాగంగా సముద్రంలో నాటిన మందుపాతరలను తొలగించే విన్యాసాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నది. గత నాలుగు నెలలుగా వీటిని నిర్వహిస్తున్నారు. ఇటీవలే చైనా మిలిటరీలో ప్రవేశపెట్టిన హెజియన్, చిషుయి అనే నౌకలు వీటిలో పాల్గొన్నాయి. ఇవి నీటి మీద తేలుతున్న మందు పాతరలను తొలగించటంలో విజయ వంతమైనట్లు వార్తలు. తాజా విన్యాసాలు జరుగుతుండగా సమీపానికి వచ్చిన గుర్తు తెలియని ఒక విదేశీ నౌకను హెచ్చరించి పంపినట్లు చెబుతుండగా అది అనుమతి లేకుండా చేపలు పట్టేందుకు వచ్చినది కావచ్చని వార్తలు. కొన్ని దేశాలు చేపలు పట్టే నౌకల పేరుతో నిఘా బృందాలను పంపటం తెలిసిందే.
మందుపాతరలను తొలగించే డ్రిల్సు నిర్వహించాల్సిన అవసరం చైనాకు ఎందుకు వచ్చిందన్నది ప్రశ్న. గత ఏడు దశాబ్దాలుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ను సైనికంగా పటిష్టపరుస్తున్నాయి. విలీనానికి ససేమిరా అంటున్న అక్కడి ప్రభుత్వం ప్రతిఘటనకు దిగవచ్చని, దానికి మద్దతుగా అమెరికా, జపాన్, మరికొన్ని దేశాలు రావచ్చని చైనా భావిస్తున్నది. బలవంతంగా విలీనానికి పూనుకుంటే తాము మిలిటరీని పంపుతామని జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తైవాన్ విలీనానికి తప్పనిసరైతే బలప్రయోగానికి పూను కుంటామని తాజాగా ఒక శ్వేత పత్రంలో ప్రకటించిన చైనాకు మందుపాతరలను కనుగొనటం, తైవాన్ను ఏ విధంగా చుట్టుముట్టాలనే ఎత్తుగడలు అవసరం కావచ్చని, ఆ కసరత్తులో భాగంగానే విన్యాసాలని భావిస్తున్నారు. చైనాను అడ్డుకొనేందుకు చుట్టూ మందుపాతరలను అమర్చేందుకు తైవాన్‌కు అమెరికా సాయం చేస్తున్నది. ఈ ఏడాది జనవరిలో మందుపాతరలను అమర్చే నౌకను తైవాన్ మిలిటరీకి అందించారు, మరో మూడింటిని సిద్దం చేస్తున్నారు. చైనా మీద వత్తిడి తెచ్చేందుకు పచ్చ సముద్రం తదితర ప్రాంతాల్లో మందు పాతరలను అమర్చాలని అమెరికా నిపుణులు సలహా ఇచ్చారు. రానున్న వారాల్లో తైవాన్ జలసంధికి తమ యుద్ధ నౌకలను పంపనున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇది చైనాను మరింతగా రెచ్చగొట్టేందుకు, తైవాన్‌కు భరోసా ఇచ్చేందుకు అన్నది స్పష్టం.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తిష్టవేసిన రోనాల్డ్ రీగన్ అనే విమానవాహక యుద్ద నౌక పరిస్థితులను గమనిస్తుండగా, ఈ నెల తొమ్మిదిన చైనాకు సమీపంలోని జపాన్ ఒకినావా దీవుల్లో అమెరికా-జపాన్ వైమానిక దళ డ్రిల్లు నిర్వహించారు. సాంకేతికంగా తైవాన్ను ఒక దేశంగా అమెరికా గుర్తించనప్పటికీ అనధికారికంగా సంబంధాలను కొనసాగిస్తున్నది. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన ఒక బిల్లులో తైవాన్ను నాటో ఏతర ప్రధాన భాగస్వామిగా పేర్కొన్నది. తైవాన్ విధాన చట్టం 2022 ప్రకారం తైవాన్‌కు 450 కోట్ల డాలర్లు భద్రతాపరమైన సాయం అందించాలని నిర్ణయించింది.
రపైకి ఏమి చెప్పినప్పటికీ చైనా మిలిటరీ సత్తా ప్రపంచ స్థాయికి ఎదిగిందని పశ్చిమ దేశాల మిలిటరీ నిపుణులు, విశ్లేషకులు అంగీకరిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం, ఆయుధ కార్పొరేట్ సంస్థల నిధులతో నడిచే సిఎస్ఐఎస్ అనే సంస్థ చైనా పవర్ ప్రాజెక్టు పేరుతో ఒక పత్రాన్ని రూపొందించింది. దానిలో చైనా వద్ద ఉన్న పలు రకాల క్షిపణులను ఉటంకిస్తూ పేర్కొన్న అంశాల సారాంశం ఇలా ఉంది. ''మిలిటరీ శక్తికి సాంప్రదాయ క్షిపణుల అవసరం పెరుగుతున్నది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్ఏ) వందలు, వేల కిలోమీటర్ల దూరంలో వాటిని మోహరిస్తున్నారు. ప్రపంచంలోనే భూమి మీద నుంచి ప్రయోగించే అత్యంత శక్తివంతమైన క్షిపణులను అభివృద్ధి చేసిన దేశంగా చైనా ఉంది. అమెరికా రక్షణ శాఖ సమాచారం ప్రకారం 2000 సంవత్సరంలో చైనా క్షిపణి శక్తిని చూస్తే సాధారణ నిర్దుష్టతతో కూడిన స్వల్పశ్రేణి క్షిపణులు ఉన్నాయి. తరువాత సంవత్సరాలలో దీర్ఘశ్రేణి, భిన్నమైన ఖండాంతర, క్రూయిజ్ క్షిపణులను రూపొందించింది. అవి సాంప్రదాయ, అణ్వాయుధాలను మోసుకుపోగల సత్తా కలిగినవి. తైవాన్‌తో సహా భూ లక్ష్యాలను దెబ్బతీయగలిగినవి. అమెరికా క్షిపణులను మోసుకుపోగల వాటిని కూడా నాశనం చేయగలినవి. అత్యాధునిక పశ్చిమ దేశాల క్షిపణి వ్యవస్థలలోకి కూడా దూసుకుపోగల హైపర్సోనిక్ క్షిపణులను చైనా కలిగి ఉంది. ఒక వేళ పశ్చిమ దేశాల క్షిపణులను దెబ్బతీయలేకున్నా వాటిని పనికి రాకుండా చేయగలవ''ని ఆ పత్రంలో పేర్కొన్నారు.
చైనా చుట్టూ వివిధ దేశాలలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. తమ దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేందుకు పూనుకున్న అమెరికా, దాని మిత్రదేశాల మిలిటరీని తట్టుకోగలిగేట్లు చైనా తన క్షిపణులను రూపొందించింది. ఉపగ్రహాల సంకేతాలు, మార్గదర్శనంలో ఒకే సారి ఒకే వ్యవస్థ నుంచి పలు దిక్కులకు క్షిపణులను ప్రయోగించగల ఎంఎల్ఆర్ఎస్ వ్యవస్థలను కూడా రూపొందించింది. అవి ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్నవాటి కంటే ఎక్కువ రాకెట్లను పంపగలిగినవి. బిజినెస్ ఇన్సైడర్ అనే పత్రిక రాసిన విశ్లేషణ ప్రకారం ఒకేసారి ఎనిమిది 370 ఎంఎ రాకెట్లను 350 కిలోమీటర్ల దూరం, రెండు 750 ఎంఎం రాకెట్లను 500 కిలోమీటర్ల దూరం వరకు వదలవచ్చు. చైనా-తైవాన్ మధ్య దూరం 150 కిలోమీటర్లే గనుక ఆ ప్రాంతంపై ఎక్కడికైనా క్షిపణులను చైనా వదలగలదు. ప్రస్తుతం ఆమెరికా ఆంక్షలను ధిక్కరించి రష్యా వద్ద ఉన్న ఎస్-400 రక్షణ వ్యవస్థలను మన దేశం, టర్కీ కొనుగోలు చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటితోనే రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ముందుకు పోతున్నది. 2018-20 మధ్య రెండు ఎన్-400 వ్యవస్థలను చైనా కొనుగోలు చేసింది. అంతే కాదు రష్యా ఎస్-300 వ్యవస్థ ప్రాతిపదికన చైనా స్వంతంగా రూపొందించేందుకు పూనుకుంది. వాటిలో అమెరికా వద్ద ఉన్న పేట్రియాటిక్ వ్యవస్థలలో ఉన్న వాటిని కూడా చేర్చేందుకు పని చేస్తున్నది. ఇవి ఎలా పని చేసేదీ ఇంతవరకు పరీక్షలు జరపలేదు.
చైనా జరిపిన మిలటరీ డ్రిల్స్‌ను తొలుత ఒక అల్లరిగా వర్ణించిన అమెరికా ఇప్పుడు బలవంతంగా విలీనం చేసుకొనేందుకు ఇదంతా కావాలనే చేస్తున్నదంటూ లోకం ముందు గుండెలు బాదుకుంటూ చైనాను దోషిగా చూపేందుకు పూనుకుంది. మెల్లమెల్లగా తైవాన్ ఆక్రమణకు పూనుకుంటోందని ఆరోపిస్తోంది. తైవాన్ను దిగ్బంధనం గావిస్తే దాని రేవులు ప్రభావితమై ఆర్ధికంగా చైనా నష్టపోతుందని కొందరు హెచ్చరికలతో కూడిన బెదిరింపులకు పూనుకున్నారు. చైనా ఆ మంచి చెడ్డలను ఆలోచించలేనంత అమాయకంగా లేదు. ఆ పరిస్థితి తలెత్తితే అది చైనాతో పాటు ఐరోపా, అమెరికా అనేక దేశాలకూ నష్టదాయకమే.
చైనా వద్ద ఉన్న మిలిటరీతో పోలిస్తే తైవాన్ వద్ద ఉన్న ఆయుధాలు చాలా తక్కువ. 2019 వివరాల ప్రకారం చైనా మిలటరీ ప్రపంచంలోనే అతి పెద్దది. చైనా వద్ద అణ్వాయుధాలు ఎన్ని ఉన్నదీ తెలియదు. అమెరికా అంచనా ప్రకారం 200 కాగా, స్టాక్‌హౌం సంస్థ 350 అని, 2030 నాటికి 1000కి చేరవచ్చని చెప్పింది. గత వేసవిలో చైనా జరిపిన కొన్ని పరీక్షలను బట్టి అవి హైపర్సోనిక్ క్షిపణి పరీక్షలని పశ్చిమ దేశాల అనుమానం. ఇంతటి సైనిక శక్తి ఉన్నా తైవాన్ను బలవంతంగా విలీనం చేసుకొనేందుకు చైనా ఇంతవరకు పూనుకోలేదు. అలాంటి పరిస్థితే వస్తే అటూ ఇటూ నష్టపోయేది తన జనమే కనుక ఎంతో సంయమనంతో ఉంది. అమెరికాకు అలాంటి జవాబు దారీతనం లేదు. తన పంతం నెగ్గించుకొనేందుకు ఎందరినైనా బలి పెట్టేందుకు పూనుకుంటుంది. చైనా సోషలిస్టు దేశం కనుక ఆచితూచి ముందుకు పోతున్నది.
- ఎం.కోటేశ్వరరావు
8331013288