Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సల్మాన్ రష్దీ గొప్ప పేరున్న రచయిత. ఇటీవల న్యూయార్క్‌లో ఓ దుండగుడి చేతిలో ఆయన కత్తిపోటుకు గురై ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఆయన ఎవరు? ఎందుకు ఆయనపై కత్తి దాడి జరిగిందనే విషయాలు ప్రస్తుతం అందరి మదిని తొలుస్తున్నాయి.
భారత్‌కు స్వాతంత్య్రం రాకకు రెండు నెలల ముందు, అంటే 1947 జూన్ 19న సల్మాన్ రష్దీ ముంబైలో జన్మించారు. ఆయన గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఆయన స్వాతంత్రం వచ్చిన అర్థరాత్రి జన్మించిన పిల్లలపై 'మిడ్ నైట్ చిల్డ్రన్స్' అనే పుస్తకం రచించారు. ఈ నవల ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ పుస్తకం 1981లో బుకర్ అవార్డును గెలుచుకుంది.
రష్దీపై ఇప్పుడు తీవ్రమైన కత్తిదాడి జరిగింది. కానీ చాలా కాలంగా ఆయనపై ఇలాంటి దాడులు సాగుతూనే ఉన్నాయి. ఆయన చాలా ఏండ్ల నుంచి భయాందోళనల మధ్యే జీవనం గడుపుతున్నారు. ఆయనపై ఇప్పటి వరకు 15సార్లు కత్తులతో దాడి జరిగింది. దీనికి ఆయన రచించిన ఓ పుస్తకమే కారణం. 1988లో సల్మాన్ రష్దీ 'ది సాటానిక్ వెర్సెస్' అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం తీవ్ర వివాదాలకు దారి తీసింది. ఈ పుస్తకం ఇస్లామిక్ వ్యతిరేక, దైవ దూషణగా పరిగణలోకి వచ్చింది. దీంతో అతడికి ఇరాన్ నుంచి హత్యా బెదిరింపులు వచ్చాయి. ఆ పుస్తకాన్ని 1988 సంవత్సరంలో ఇరాన్ నిషేధించింది. అప్పటి నుంచి రష్దీ తీవ్రవాదులకు టార్గెట్‌గా ఉన్నారు.
ఇరాన్ నుంచి సల్మాన్ రష్దీకి వచ్చిన బెదిరింపు చిన్నదేమీ కాదు. అప్పటి (33ఏండ్ల కిందట) ఇరాన్ సుప్రీం చీఫ్ అయతుల్లా రుహౌల్లా ఖొమేనీ అతడిని చంపాలని ఫత్వా జారీ చేశారు. అతడిని చంపిన వ్యక్తికి మూడు మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తానని ప్రకటించారు. అయితే తరువాత ఇరాన్ ప్రభుత్వం అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటూ దానిని కొట్టిపారేసింది. అయితే 2012లో సల్మాన్ రష్దీకి ఇర్ నుంచి హత్యా బెదిరింపులు వచ్చాయి. ఇరాన్‌కు చెందిన ఈ మత సంస్థ ఆ రివార్డ్ మొత్తాన్ని 3.3 మిలియన్ డాలర్లకు పెంచింది.
సల్మాన్ రష్దీ రచించిన ''ది సాటానిక్ వెర్సెస్'' పుస్తకం ఇండియాలో కూడా నిషేధంలో ఉంది. ఈ పుస్తకానికి వ్యతిరేకంగా ఇంగ్లాండ్ వీధుల్లో రష్దీ బొమ్మలు దహనం చేశారు. అలాగే ఆ పుస్తకానికి సంబంధించిన కాపీలను కూడా దహనం చేశారు. ఒక నెల తర్వాత ఇస్లామాబాద్‌లోని యూఎస్ సమాచార కేంద్రంపై 1000 మంది పాకిస్థానీయులు దాడి చేశారు. ఐరోపాలో కూడా నిరసనలు జరిగాయి. లండన్ టెహ్రాన్ దాదాపు రెండు సంవత్సరాల పాటు దౌత్య సంబంధాలను తెంచుకున్నాయి.
యునైటెడ్ స్టేట్స్లో, సుసాన్ సోంటాగ్, టామ్ వోల్ఫ్ వంటి రచయితలు రష్దీకి సహాయం చేయడానికి బహిరంగ ఉపన్యాసాలు నిర్వహించారు. రష్దీ 1990లో ''ఇన్ గుడ్ ఫెయిత్'' అనే వ్యాసంలో తనను తాను విశదీకరించుకోవడానికి ప్రయత్నించారు. కానీ చాలా మంది ముస్లింలు శాంతించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అతడు ఒక దశాబ్దానికి పైగా 'సేఫ్ హౌస్'లో గడిపారు. దాదాపు 13 సంవత్సరాల పాటు ఆయన జోసెఫ్ అంటోన్ అనే మారు పేరుతో గడిపాడు. మొదటి ఆరు నెలల్లోనే 56 ప్రదేశాలు మార్చారు. అతడి భాగస్వామి, అమెరికన్ నవలా రచయిత్రి అయిన మరియాన్ విగ్గిన్స్తో కూడా కలిసి ఉండలేకపోయారు. సుదీర్ఘకాలం ఆయన ఒంటరితనం అనుభవించారు.
కొంత కాలం తరువాత ఆయన తిరిగి సాధారణ జీవితాన్ని గడపడం ప్రారంభించాడు. పార్టీలు, ఫంక్షన్లలో కనిపించారు. తన ఇంటిపేరు కూడా మార్చుకున్నారు. కాగా.. గతంలో ఇరాన్ జారీ చేసిన ఫత్వాను అమలుచేయబోమని 1998లో ఇరాన్ సంస్కరణవాద అధ్యక్షుడు మొహమ్మద్ ఖతామీ ఫెడరల్ ప్రభుత్వం బ్రిటన్‌కు హామీ ఇచ్చింది. కానీ ఖొమేనీ వారసుడు అయతోల్లా అలీ ఖమేనీ మాత్రం 2005లో రష్దీ మతభ్రష్టుడని తాము నమ్ముతున్నామని పేర్కొన్నాడు.
సాహిత్యాన్ని అందించినందుకు క్వీన్ ఎలిజబెత్-2 రష్దీకి 2007లో నైట్ బిరుదును అందించారు. దీంతో చాలా మంది ముస్లింలు ఉలిక్కిపడ్డారు. దీంతో ఇరాన్ బ్రిటన్ను ఇస్లామోఫోబియా అంటూ ఆరోపించింది. అప్పటి నుంచి ఫత్వా అలాగే కొనసాగింది. అయితే రష్దీ 1990 చివరి నుంచి న్యూయార్క్‌లో జీవిస్తున్నారు. అజ్ఞాతం నుంచి బయటకు వచ్చిన తరువాత ఆయన ఒక సామాజిక వ్యక్తిగా ఎదిగారు. పాశ్చాత్య దేశాలలో చాలా మంది ఆయనను స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రం ఉన్న హీరోగా చూశారు. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనపై కత్తి దాడి జరిగింది. కాలానుగుణంగా ప్రతి మతంలో మార్పులు వస్తున్నాయి. మతం, దైవం అనేవి వ్యక్తిగత నమ్మకాలు. ఇవి వ్యక్తిగత జీవన విధానాలుగా ఉన్నంత వరకు పర్వాలేదు. రాజకీయ నినాదంగా మారితేనే మనిషి మనుగడకు ఇబ్బంది.
- యం. రాం ప్రదీప్
సెల్:9492712836