Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ప్రభుత్వం నేడు సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం అభినందనీయం. జానపద కళాకారులు, కవులు, రచయితలు, గౌడ కల్లుగీత తదితర సంఘాలు తమ శక్తిమేరకు పాపన్న చరిత్రను పదిలపర్చుకుంటూ నేటి తరానికి అందించాయి. నేడు ప్రభుత్వం కూడా గుర్తించి అధికారికంగా నిర్వహించడంతో పాపన్న చరిత్రకు పట్టాభిషేకం చేసినట ్లయింది. ఒక సామాన్య గౌడ కుటుంబంలో పుట్టి కల్లుగీత వృత్తి చేస్తూ జీవనం సాగించే వాడు గోల్కొండకోటను జయించి రాజ్యాన్ని పరిపాలించడం సామాన్య విషయం కాదు. స్థానిక దొరలు, భూస్వాములను, మొగల్ సామ్రాజ్య వాదులను ఎదురించడానికి స్వంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. యుద్ధవిద్యలో, ఎత్తుగడలు వేయడంలో ఆరితేరాడు. ఎన్నో ఒడుదొడుకు లను ఎదుర్కొన్నాడు. తన ఆశయం గొప్పదని తల్లి సర్వాయమ్మను ఒప్పించడానికి అనేక ప్రయత్నాలు చేసి చివరికి గొడవ పడ్డాడు. ''ఈ అణచివేత, దోపిడీ పోనాలీ, మన రాజ్యం రావాలి'' అని అమ్మకు నచ్చచెప్పాడు. అన్న మాట ప్రకారమే అమలు చేసి చూపాడు. మంచి పాలనాదక్షుడుగా ప్రజల మనస్సుల్లో నిలిచిపోయాడు. కృషి పట్టుదల ఉంటే సామాన్యుడు సహితం పరిపాలకుడు కావచ్చని 17వ శతాబ్దంలోనే అచరణలో చూపించాడు పాపన్న. కుల మతాల కతీంతంగా అందరిని చేరదీశాడు. మాదిగ, మాల, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, దూదేకుల, సాహెబ్, ముదిరాజ్, గొల్ల తదితర వృత్తి కులాల వారిని ప్రధాన బాధ్యతలలో ఉంచాడు. ధనికుల వద్ద ఉన్న భూములను, అక్రమ సంపదను దోచి పేదలకు పంచాడు. అగ్రకులాల వారు, ధనికులు, భూస్వాములకు మాత్రమే కాదు శ్రామికులకు కూడా పరిపాలించే సత్తా ఉందని నిరూపించాడు. ప్రజలందరితో సర్దార్ అనిపించుకున్నాడు. అలాంటి గొప్ప వీరుని చరిత్ర నేటి తరానికి స్ఫూర్తి కావాలి.
జానపదుల కథల్లో సర్వాయి పాపన్న చరిత్ర బహుళ ప్రచారంలో ఉన్నది. బుడిగజంగాలు, శారద కథల వాళ్ళు ఇతర జానపదులు పాపన్న చరిత్రను కథలు, పాటల రూపంలో వినిపిస్తున్నారు. వీరి నోళ్ళనుంచి వెలువడే కథల ఆధారంగానే పాపన్న చరిత్ర వెలుగులోకి వచ్చింది. కర్నాటక రాష్ట్రంలోని బళ్ళారి ప్రాంతంలో ఒక బోయవాడి పాట ఆధారంగా ప్రముఖ జానపద పరిశోధకుడు ఏజే బోయల్ ద్వారా పాపన్న చరిత్ర ప్రాచుర్యం పొందింది. అనేకమంది పరిశోధకులు మరింత లోతుగా అద్యయనం చేసి ఆధారాలను సేకరించారు. లండన్‌లోని విక్టోరియా - అల్బర్ట్ మ్యూజియంలో సర్వాయి పాపన్న ఒక చేతిలో రామచిలుక, మరో చేతిలో పొడువాటి బల్లెముతో సేదతీరుతున్న చిత్రం ఉన్నది. దీనిని ప్రముఖ జాపపద పరిశోధకుడు ఆచార్య బిరుదు రాజు రామరాజు సేకరించారు. లండన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు రిచార్డ్ యం.ఈటన్ రాసిన 'ఎ సోషల్ హిస్టరి ఆఫ్ ద దక్కన్ ఎయిట్ ఇండియన్ లీవ్స్' అనే పుస్తకం ప్రచురించి కవర్పేజిలో పాపన్న చిత్రాన్ని ప్రచురించారు. అనేక మంది రచయితలు పుస్తకాలు, వ్యాసాలు రాసారు. పాపన్న కట్టించిన, జయించిన కోటలు, పాలించిన ప్రాంతాలకు స్వయంగా వెళ్లి పరిశోధించి 2003లో ఆధారాలతో యుక్తంగా కొంపెల్లి వెంకట్ గౌడ్ దళిత బహుజన విప్లవవీరుడు సర్దార్ సర్యాయి పాపన్న అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఇది తెలంగాణ గ్రూప్ సిలబస్‌లో కూడా ఎంపిక అయ్యింది.
సర్వాయి పాపన్న నిర్మించుకున్న కోటలు సర్వాయిపేట, తాటికొండ, ఖిలాషాపురం, జయించిన కోటలు వరంగల్ కోట, భువనగిరి కోట లాంటివి నేటికీ సజీవ సాక్ష్యాలుగా మన కండ్ల ముందున్నాయి. కాకతీయుల పాలన అంతమైన 300ఏండ్ల తర్వాత క్రీ.శ. 1650 నుంచి 1709 వరకు పాపన్న ప్రస్థానం కొనసాగింది. పాపన్న క్రీ.శ 1650అగస్ట్ 18న జన్మించాడు. నాటి వరంగల్ నేటి జనగాం జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ మండలం తాటికొండ వాసి అతడు. బతుకుదెరువు కోసం పాపన్న పశువులను గాస్తూ తన తల్లి సర్యాయమ్మ కోరికమేరకు తన కులవృత్తి అయిన కల్లుగీత వృత్తిని చేపట్టాడు.
మొఘల్ చక్రవర్తుల పాలనలో రాజ్యాధికారం కోసం కుట్రలు, హత్యలు, అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్న తరుణంలో... గ్రామాధికారులుగా ఉన్న పౌజుదార్లు, అధికారులు ప్రజలను ఎన్నో విధాలుగా పీడించేవారు. ఫలితంగా అణగారిన వర్గాల జీవనం దుర్భరంగా మారింది. పన్నులు, వెట్టి విధానంతో శ్రమదోపిడీ నిరంతరం సాగుతూ వచ్చింది. ఈ పరిణామాలన్నీ పాపన్నపై ప్రభావం చూపాయి. తన కుటుంబ జీవన విధానం, ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు పాపన్నను రాజ్యకాంక్షవైపు నెట్టాయి. తన సవాసగాళ్ళు చాకలి సర్వన్న, మంగళి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్ళు, దూదేకుల పీరు, కోత్వాల్ మీరు సాహెబ్ వంటి ప్రధాన అనుచరులతో సమాలోచనలు చేశాడు. సమరానికి పూను కున్నాడు. తన తల్లి దాచిన సోమ్ముతో ఆయుధాలను సమకూర్చుకున్నాడు. తన సైన్యాన్ని పెంచు కోవడానికి ధనవంతుల దగ్గర ఉన్న ధనాన్ని కొల్లగొట్టారు. రాజ్యవిస్తరణ గావించారు. తాటికొండ నుంచి ప్రారంభమైన పాపన్న ప్రస్థానం ఆనాటి నల్గొండ పరగణా బోనగిరికోట, నేటి జనగాం జిల్లా ఖిలాషాపురం కోటలను కేంద్రంగా చేసుకుని తెలంగాణ అంతా విస్తరించింది. 30ఏండ్ల పాటు పాలన సాగించాడు. క్రీ.శ.1675 ప్రాంతంలో సర్వాయిపేట నుండి తన పాలన మొదలు పెట్టాడు. తన తల్లి పేరుతో ఆ గ్రామాన్ని నిర్మించాడు. రాజ్య విస్తరణ చేసుకుంటూ క్రీ.శ.1698 తాటికొండ ప్రాంతంలో నిర్మించిన కోట నుండి పాలన కొనసాగించాడు. క్రీ.శ.1700- 1705 ప్రాంతంలో ఖిలా షాపురంలో నిర్మించిన కోటను ప్రధాన కేంద్రంగా చేసుకొని రాజ్యాన్ని విస్తరింప చేశాడు. క్రమంగా తన సైన్యాన్ని మరింతగా పెంచుకుంటూ క్రీ.శ.1708లో వరంగల్, భువనగిరి కోటలను ఆక్రమించాడు. క్రీ.శ 1709 ఆరంభంలో గోల్కొండకోట పైకి దండెత్తి మొగల్ సైన్యంతో వీరోచితంగా పొరాడి తన వశం చేసుకున్నాడు. పాపన్న అనుకున్నట్లు తన లక్ష్యాన్ని సాధించాడు. పరిపాలన సాగించాడు. అపజయం పాలైన మొగలులు స్థానిక భూస్వాములు, దొరల అండతో తిరిగి వేలాది సైన్యంతో గోల్కొండకు వచ్చి యుద్ధం చేస్తున్న క్రమంలో, శత్రువుల చేతిలో చావడం ఇష్టంలేక తన చేతిలోని బళ్ళాన్ని పైకి విసిరి తన ఎదను చూపించాడు. బళ్ళెం గుండెలో గుచ్చుకొని ప్రాణాలు వదిలాడు. పాపన్న పాలించి నంత కాలం ప్రజలందరి కోసం పాటుపడ్డాడు. ఆ స్ఫూర్తితో నేడు అణగారిన వర్గాలు కుల మతాలకతీంతంగా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధాలను ఎండ గట్టాలి. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటిక రించడాన్ని అడ్డుకోవాలి. ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో సమానత్వంకై పోరాడాలి. అదే పాపన్నకు మనమిచ్చే నిజమైన నివాళి.
మరుగున పడిన పాపన్న చరిత్రను వెలికితీసి నేటి తరానికి అందించేందుకు ప్రభుత్వం పూను కోవాలి. పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై నెల కొల్పాలి. ఆయన నిర్మించిన కోటలు, ఆక్ర మించిన కోటలను పర్యాటక ప్రాంతాలుగా అబివృద్ధిపర్చాలి.
(నేడు సర్వాయి పాపన్న 372వ జయంతి సందర్భంగా)
- యం.వి.రమణ
సెల్:9490098485