Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆగస్టు 15న మనం జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నపుడు, 75ఏండ్ల క్రితం ఆనాటి రాజ్యాంగ నిర్ణయాక అసెంబ్లీ అర్థరాత్రి జరిపిన చారిత్రక సమావేశాన్ని, ఆనాడు పార్లమెంట్‌పై మొదటిసారిగా జాతీయ పతాకాన్ని ఎగురవేయడాన్ని మనం గుర్తు చేసుకుంటాం. ఆ జాతీయ పతాకాన్ని స్వాతంత్య్ర సమరయోధురాలు, రాజ్యాంగ నిర్ణయాక అసెంబ్లీలోని 15మంది మహిళా సభ్యుల్లో ఒకరైన హంసా మెహతా రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌కు అందచేస్తూ... ''ఈ అత్యున్నత భవనంపైన ఎగిరే ఈ మొదటి పతాకం భారత మహిళల నుండి వచ్చిన బహుమతి... స్వాతంత్య్రం కోసం మన దేశం పోరాటం జరిపే కాలంలో మనం పోరాడాం, ఇబ్బందులు పడ్డాం, త్యాగాలు చేశాం. ఈనాడు మనం లక్ష్యాన్ని సాధించాం... మహత్తరమైన భారతదేశం కోసం పని చేయాలని మనకు మనం ప్రతిన బూనుదాం... మరింత మహోన్నతమైన ప్రయోజనాల కోసం మనం సాధించిన స్వేచ్ఛాను కొనసాగిద్దాం...'' అన్నారు. స్వతంత్ర భారతదేశంలో సమాన పౌరులుగా సమానత్వ హక్కులను అనుభవిస్తామనే మహిళల ఆశలు, వారు కన్న కలలు ఆ మాటల్లో ప్రతిబింబించాయి. ఈనాడు భారత మహిళలు ఆనాడు ఆమె పేర్కొన్న ''మనం సాధించిన స్వేచ్ఛను కొనసాగిం చేందుకు'' అన్న సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, స్వాతంత్య్రద్యోమం నాటి విలువలు, ఈ 75ఏండ్లలో మహిళలు ముందడుగు వేయడానికి దోహద పడిన రాజ్యాంగ విలువల గురించి ఒకసారి అవలోకిద్దాం. ఇంకా ఛేదించాల్సిన అడ్డంకులను కూడా పరిశీలిద్దాం.
మహిళలను తీవ్రంగా
ప్రభావితం చేస్తున్న లౌకిక విలువలపై దాడి
భారతదేశంలోని మహిళలకు ఆనాటి స్వాతంత్య్ర పోరాటం నుండి వారసత్వంగా సంక్రమించిన మహత్తరమైన, అమోఘమైన బలం ఏమిటంటే మత గ్రంథాల ద్వారా మహిళల జీవితాలు నిర్ణయించబడకపోవడం, రెండవ పౌరురాలి హోదా నిర్ణయించబడకపోవడం. లింగం, మతం, మరే ఇతర కారణాలతో సంబంధం లేకుండా పౌరులందరూ సమానులే అని గుర్తించే రాజ్యాంగం ద్వారా మాత్రమే వారి హోదా నిర్ణయించబడింది. పలు రంగాల్లో అడ్డంకులను అధిగమించి మహిళలు అనేక విజయాలను సాధించడంలో రాజ్యాంగంలో అంతర్లీనంగా ఉండే లౌకిక చట్రపరిధి చాలా కీలకం. ఇస్లామ్‌ను తమ మతంగా పేర్కొంటూ మతపరమైన దేశంగా పాకిస్థాన్‌ను ప్రకటించినట్లుగా భారత్ కూడా అదే తీరున ముందుకు సాగినట్లైతే ఇన్ని మహిళా అనుకూల చట్టాలు ఆమోదించడం సాధ్యమయ్యేది కాదు. భారతదేశం లౌకిక చట్రపరిధిని ఆమోదించడం వల్లనే ఈ మహిళా చట్టాలకు మార్గం సుగమం అయింది. భారత్‌లో కూడా పాకిస్థాన్‌లా హిందూ రాష్ట్రంగా భారత్‌ను ప్రకటించి ముందుకు సాగాలని అనుకుంటే మహిళల జీవితాలను పాలించేది మనుస్మృతి అయివుండేది కానీ రాజ్యాంగమై ఉండేది కాదు.
ఆ సమయంలో, రాజ్యాంగం బదులుగా మనుస్మృతి కావాలని కోరే శక్తుల్లో ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ వంటివి ఉన్నాయి. ఈనాడు వారే భారతదేశాన్ని పాలిస్తున్నారు. అయితే, లౌకికవాదం, సమాన పౌరసత్వం అన్న సూత్రాల ఆధారంగా మన చట్టాలు ఉన్న కారణంగానే భారత్‌లో ఈనాడు మహిళలు చాలా సాధించారన్న వాస్తవాన్ని మనం పునరుద్ఘాటించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, ఇందులో లొసుగులు, లోపాలు కూడా చాలా వున్నాయని అంగీకరించినప్పటికీ, మహిళల హక్కులను ముందుకు తీసుకెళ్ళడానికి అవి ఒక భూమికను అందించాయి.
మహిళా స్వతంత్ర సంస్థ,
ప్రతిపత్తికి విఘాతం
స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో, మహిళల సామాజిక, రాజకీయ కార్యాచరణకు, అలాగే వారి స్వతంత్ర సంస్థలకు వివిధ రాజకీయ పక్షాల జాతీయోద్యమ నేతలు ప్రోత్సాహమరదించారు. గాంధీజీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టుల నేతృత్వంలోని ఉద్యమం, అంబేద్కర్ నేతృత్వంలోని సామాజిక న్యాయ ఉద్యమం నేతలు వారికి సహాయ సహకారాలు అందించారు. ఫ్యూడల్ చట్రపరిధిని ఛేదించుకుని లక్షలాదిమంది మహిళలు పోరాట కార్యకర్తలుగా లాఠీలు ధరించి స్వాతంత్య్ర ఉద్యమంలోకి దూకారు. జైళ్ళకెళ్ళారు, అక్కడే మరణించారు. కానీ స్వాతంత్య్రం తర్వాత ఏం జరిగింది? ఈనాడు భారతదేశంలో, ఈ విలువలను మరింత ముందుకు తీసుకెళుతూ, మహిళలు సమిష్టి, వ్యక్తిగత కృషితో తమకు అసాధ్యం అనుకున్న రంగాల్లోకి, క్షేత్రాల్లోకి వెళుతున్నారనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. తమ ప్రగతిశీల పోరాటాల ద్వారా న్యాయం కోసం పోరాడే మహిళా ఉద్యమాలు, స్త్రీలకు లబ్ది చేకూర్చేందుకు తీసుకువచ్చిన చట్టపరమైన, విధానపరమైన మార్పుల వెనక చోదక శక్తిగా ఉన్నాయి.
కానీ ప్రభుత్వాల పాత్ర మాత్రం అరకొరగా, బలహీనంగా ఉంటోంది. కొడుకుకే ప్రాధాన్యతనివ్వాలనే సంస్కృతులు ఇంకా కొన్ని కుటుంబాల్లో కొనసాగడంతో బాలురు, బాలికల మధ్య నిష్పత్తి బాగా తగ్గిపోతుండడం మనం చూడవచ్చు. 1994లో ఆడ శిశు భ్రూణ హత్యలను చట్టవిరుద్ధం చేసినప్పటికీ, 2020లో ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, 2011-2016 మధ్య కాలంలో భారత్‌లో దాదాపు 4లక్షల మంది ఆడపిల్లలు పుట్టకుండానే 'పోయారు' అని అంచనా వేయబడింది. ఆడపిల్లా లేక మగపిల్లాడా అని తెలుసుకుని ఆడపిల్ల అయితే గర్భస్రావం చేయించుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. ఒకపక్క సామాజిక, కుటుంబ జీవితంలో సమాన స్థాయి, హోదా కావాలని మహిళలు కోరుతుంటే, అందుకు వ్యతిరేకంగా లైంగిక దాడులు, బాలలపై అత్యాచారాలు, వరకట్న హత్యలు, యాసిడ్ దాడులు వంటివి అనేక విష రూపాల్లో మహిళలపై ఎదురుదాడి చేస్తున్నాయి.
2019లో నేరాల సంఖ్య 4.12లక్షలుగా నమోదైనట్లు జాతీయ నేరాల బ్యూరో గణాంకాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత వచ్చిన 2020 నివేదిక చూసినట్లైతే, నేరాల సంఖ్య తగ్గింది కానీ దీనికి ప్రధాన కారణం లాక్‌డౌన్‌గా ఉంది. అంతకంటే అధ్వాన్నమైన అంశమేమంటే, మహిళలపై జరిగిన నేరాల్లో నేర నిరూపణ జరిగిన రేటు చాలా తక్కువగా అంటే 23.7శాతంగా ఉంది. ముఖ్యంగా దళితులు, ఆదివాసీ మహిళలు కులతత్వ నేరాలకు ప్రధాన లక్ష్యాలుగా మారుతున్నారు. గ్రామీణ సంపన్న వర్గాలు పాల్పడే వర్గనేరాలు కూడా పెరుగుతున్నాయి.
పార్లమెంట్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం, స్వాతంత్య్రోద్యమ విలువలకు తిలోదకాలిస్తున్న మరో అంశమని చెప్పుకోవచ్చు. భారతదేశ మొదటి పార్లమెంట్లో కేవలం ఐదుశాతం మందే మహిళలు ఉండడం సిగ్గుచేటు కాగా, 75ఏండ్ల తర్వాత కూడా, మహిళలు కేవలం 14శాతంగానే ఉండటం గమనార్హం! ప్రపంచ సగటు 24.6శాతమే తక్కువనుకుంటే దాని కన్నా ఇది ఇంకా తక్కువ. ఇక రాష్ట్రాల చట్టసభల రికార్డు అయితే మరింత అధ్వాన్నంగా ఉంది. సగటు కేవలం 8.8శాతంగా ఉంది. ఎన్నికల్లో ఎన్ని హామీలిచ్చినప్పటికీ, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా కోల్డ్ స్టోరేజ్‌లోనే మగ్గుతోంది. ఈ బిల్లును ఆమోదించడానికి సరిపడా మెజారిటీ వున్నా ప్రస్తుత ప్రభుత్వానికి సంకల్పం కొరవడింది. ఇక చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్ ప్రారంభమై యూపీఏ హయాంలో 50శాతానికి పెరిగింది. కేవలం సంఖ్యాపరంగా పంచాయతీలు, స్థానిక సంస్థల్లో మహిళలు అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పడమే కాదు, తమ కఠోర శ్రమ, కృషి, పట్టుదలతో అనేకానేక విజయ గాథలు రచిస్తున్నారు. మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ మొదటగా అమలు చేసింది వామపక్షాల పాలనలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రమే అన్నది ఇక్కడ గుర్తించాల్సిన అంశం కాగా, మహిళల నేతృత్వంలోని స్థానిక సంస్థలు అవి చేసిన కృషికి గానూ అనేక అవార్డులు అందుకున్నది కేరళలో అన్నది విస్మరించలేని వాస్తవాలు.
విలువలు వర్సెస్ పెట్టుబడిదారీవాదం,
నయా ఉదారవాద చట్రపరిధి
ఎంతగానో పోరాడి, కష్టపడి సాధించుకున్న హక్కులకు ఈనాడు అతిపెద్ద సవాళ్ళు ఎదురవుతున్నా యనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో కన్నా ఈ పరిస్థితి ఇప్పుడు మరీ ఎక్కువగా ఉంది. బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ విధానాలు, వారి మనువాదీ సిద్ధాంతాల దాడి ఇందుకు కారణాలుగా ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం రూపొందించిన కార్పొరేట్ అనుకూల, నయా ఉదారవాద విధానాలను మరింత దూకుడుగా అమలు చేస్తోంది. సామాజిక, వర్గ అసమానతలనేవి దోపిడీకి గురయ్యే వర్గాల్లో స్త్రీ, పురుషులను ఇరువురినీ ప్రభావితం చేస్తున్నప్పటికీ అందులో మహిళలు మరింత బాగా ప్రభావితమవుతున్నారు.
నయా ఉదారవాద విధానాల కింద, భారత్‌లో మహిళల ఆర్థిక స్థితిగతులు అంతకంతకూ క్షీణిస్తున్నాయి. సామాజిక వివక్షతకు వారు మరింత ఎక్కువగా గురవుతున్నారు. ప్రపంచంలో మహిళల విషయంలో అత్యధికంగా నిరుద్యోగం రేటు ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. అతి తక్కువ మహిళా కార్మిక ప్రాతినిధ్యం రేటు (ఎఫ్ఎల్పిఆర్) ఉన్న దేశాల్లో కూడా భారత్ ఒకటిగా ఉంది. 2019లో ఒఇసిడి సర్వే ప్రకారం భారత్‌లో స్త్రీ, పురుషుల మధ్య నిరుద్యోగపు రేట్లలో 52 పర్సంటేజ్ పాయింట్లు తేడా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. పైగా, పని కోసం ప్రయత్నించి విఫలమవడం వల్ల అయిన ఖర్చులు, వాటి పర్యవసానంగా ఎదురయ్యే నిరాశ, నిస్పృహలు వీటిన్నంటి కారణంగా పెద్ద సంఖ్యలో మహిళలు కార్మిక వర్గానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మహిళల వేతనాలు ఇప్పటికీ సగటున పురుషుల వేతనాల్లో మూడో వంతుగా ఉన్నాయి. మహిళల పని కుటుంబ ఆదాయానికి అనుబంధంగానే పరిగణించడం ఇందుకు కారణంగా ఉంది. అంగన్వాడీలు, ఆరోగ్య సర్వీసుల్లో ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకంలోని కార్మికులు, వంటవారు, సర్వర్లు ఇలా వివిధ ప్రభుత్వ పథకాల్లో కీలకమైన సేవలను అందించే దాదాపు కోటి మంది ఉద్యోగుల్లో ప్రధానంగా మహిళలే ఉన్నారు. వీరి శ్రమను అత్యంత సిగ్గుచేటైన రీతిలో దోచుకోవడమే ఇందుకు స్పష్టమైన ఉదాహరణగా పేర్కొనవచ్చు. వీరికి కనీస వేతనాలు ఇవ్వడానికి, సర్వీసులను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం తిరస్కరిస్తోంది.
పెట్టుబడిదారీవాదం, కులం, పితృస్వామ్య భావజాల ఆధారిత వ్యవస్థలు ఈ మూడింటితో కూడిన విషపూరితమైన కలయిక, అణచివేతలు ఇవన్నీ కూడా చవకగా మహిళా శ్రామిక శక్తిని దోచుకోవడం ద్వారా మిగులు విలువను వెలికి తీయడాన్ని ముమ్మరం చేయడానికి అనుమతిస్తున్నాయి. తద్వారా కార్పొరేట్ సంస్థలు గరిష్ట స్థాయిలో లాభాలు ఆర్జించడానికి దోహదపడుతున్నాయి. భారతదేశంలో మహిళలు ఎలాంటి వేతనాలు, రాయితీలు లేకుండా చేసే పనుల భారం అపారంగా ఉందని 2019లో అధికార సంస్థలు నిర్వహించిన సర్వే పేర్కొంది. ఇంట్లో పనులు, పిల్లలను పెంచడంలో, వృద్ధుల ఆలనా పాలనా చూసుకోవడంలో ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి తోడ్పాటు లేకపోవడం, పైగా నీరు, ఇంధనం వంటి నిత్యావసరాలు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించింది. ఇళ్ళల్లో మహిళలు సగటున ఐదుగంటలు పని చేస్తుంటే, పురుషులు కేవలం గంటన్నర మాత్రమే పని చేస్తున్నారు. పురుషులతో పోలిస్తే ఆడవారి సంరక్షణా సేవలు రెండింతలుగా ఉన్నాయి. అభివృద్ధి జరగడం, సాంకేతికత పెరగడం వల్ల మహిళలకు, ఎలాంటి వేతనాలు చెల్లించని ఈ భారం తక్కువవడానికి బదులుగా మరింత ఎక్కువవుతోంది. దేశంలో అసమానంగా ఉన్న సామాజిక సంబంధాలే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
ఉత్పాదకతతో కూడిన పనుల్లోనూ మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వకుండా, పిల్లలు, కుటుంబ సంరక్షణలో ప్రభుత్వం నుండి ఎలాంటి సౌకర్యాలు లేకుండా, అసమాన మైన, లింగ ఆధారిత పని విభజన అనేది మహిళలు ముందుకెళ్లడానికి పెద్ద అడ్డంకిగా ఉండగలదు. సోషలిస్టు దేశాల్లో, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడాన్ని మౌలిక, సమాన హక్కుగా మార్చడం వల్ల మహిళల స్థితి గతుల్లో సమూలమైన మార్పులు రావడానికి దారి తీసింది.
భారతదేశంలో, ప్రస్తుత ప్రభుత్వం దూకుడుగా అనుసరించే విధానాలు ఒకవైపు కార్పొరేట్లకు మాత్రమే సాయపడుతుండగా, మరోవైపు తమ తిరోగమన మనువాదీ సామాజిక ఎజెండాను ముందుకు తోస్తున్నాయి. ఈ రెండూ కలిసి స్వాతంత్య్ర పోరాట విలువలనే కాదు, దాని ద్వారా వచ్చిన స్వేచ్ఛను కూడా దారుణంగా దెబ్బ తీస్తున్నాయి. సమానత్వం, న్యాయం సాధించేందుకు, ప్రస్తుత వ్యవస్థలోని రుగ్మతల నుండి విముక్తి కల్పించేందుకు మరిన్ని పోరాటాల దిశగా స్త్రీ, పురుషులను సమైక్యంగా సమీకరించాలని ఇది పిలుపిస్తోంది.
- బృందాకరత్