Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో రాజకీయం ఏడాదికో ఉప ఎన్నిక.. అందుకోసం ఆ ఏడాదంతా వ్యూహ, ప్రతి వ్యూహాలు అన్నట్టుగా ఉంది. హుజూర్నగర్ నుంచి మొదలు పెడితే మొన్నటి హుజూరాబాద్ వరకూ మధ్యలో దుబ్బాక, నాగార్జున సాగర్తో కలుపుకుని ఇప్పటికి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 'ఘనుడు' కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పుణ్యమాని మును'గోడు' ఉప ఎన్నిక హడావుడి షురూ అయింది. ఈ రకంగా చూస్తే ఇప్పుడు ఐదో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఆ సీటును దక్కించుకునేందుకు అధికారంలో ఉన్న గులాబీ పార్టీతోపాటు కాంగ్రెస్ గోడ దూకి కమల తీర్థం పుచ్చుకున్న రాజగోపాల్రెడ్డి, మరోవైపు సిట్టింగు స్థానాన్ని దక్కించుకోవటం ద్వారా పోయిన పరువును తిరిగి తెచ్చుకునేందుకు హస్తం పార్టీ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలోనే గులాబీ దళపతి శనివారం మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించారు. జనం తండోపతండాలుగా తరలొచ్చారు. అక్కడి బహిరంగ సభా వేదిక నుంచి ఆయన చెప్పిన ఒక మాటను మనం అండర్ లైన్ చేసుకోవాల్సిందే. బీజేపీని ఓడించేందుకు లౌకిక శక్తులన్నీ కలిసి పని చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమంటూ రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే క్రమంలో కారు సారు... సీపీఐ, సీపీఐ (ఎం) మాతోనే కలిసి పని చేస్తాయంటూ చెప్పటం కాలం తీసుకొచ్చిన మార్పని చెప్పక తప్పదు. ఇదే దళపతి ఒకనాడు నిండు శాసనసభలో కమ్యూనిస్టులనుద్దేశించి... 'కమ్యూనిస్టు పార్టీలు సూదులు, దబ్బణాల్లాంటివి, ఎప్పుడూ ప్రజా సమస్యలు, పోరాటాలు, ఉద్యమాలంటూ పొడుస్తూ ఉంటాయి...' అంటూ దెప్పిపొడిచారు. ఇప్పుడు అదే సారు... లౌకిక శక్తులు, కమ్యూనిస్టులంటూ భుజానికెత్తుకోవటంతో అబ్బ... 'ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి... మీరు ఎప్పుడూ ఇలాగే సెప్తరా...' అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
-బి.వి.యన్.పద్మరాజు