Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునుగోడు ఉప ఎన్నిక ఎందుకొచ్చినట్టు? అది అనివార్యమా?
బీజేపీ రోడ్ మ్యాప్‌లోనే కోమటిరెడ్డి బ్రదర్స్ పావులు కదుపుతున్నారా?
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసాడా?
వామపక్షాల మద్దతు టీఆర్ఎస్కు బ్లాంక్ చెక్ లాంటిదా?
బీజేపీ ప్రమాదం పెరుగుదలకు బాధ్యులెవరు?
ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న చర్చలే! స్పష్టత అవసరమైన ప్రశ్నలే! 2022కు ప్రాధాన్యత ఉన్నది. మోడీ మాటల ప్రకారం ఈపాటికి దేశంలో రైతులు ఆదాయం రెట్టింపు కావాలి. కానీ అదానీ ఆదాయం మూడింతలయ్యింది. అంబానీ ఆదాయం రెట్టింపయ్యింది. రైతుల పరిస్థితి మాత్రం మారలేదు. రైతు రైతుగా మనుగడ కోసమే ఏడాదిపాటు పోరాడవల్సి వచ్చింది. 700మందికి పైగా రైతులు బలికావాల్సి వచ్చింది. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల వేళ అవినీతి, బంధుప్రీతి, నారీశక్తి గురించి నీతులు చెప్పారు ప్రధాని. అవినీతిని చట్టబద్ధం చేసింది ఆయనే! ఆటగాడు కాకపోయినా క్రికెట్ సారధిగా వెలుగుతున్నది అమిత్‌షా కొడుకే! పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల ఊసెత్తనిది వీరే! పైగా వీరి గుజరాత్ ప్రభుత్వమే, ఏడుగురు కుటుంబ సభ్యులను కిరాతకంగా హత్యచేసి, మహిళను సామూహిక లైంగిక దాడిచేసిన దుర్మార్గుల ''సత్ప్రవర్తన''కు మెచ్చి జైలునుంచి విడుదల చేసింది. వరుసగా 16వ నెల కూడా ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో (జులైలో 13.9శాతం) ఉన్నది మోడీ పాలనలోనే! విద్యుత్తు సవరణ బిల్లు పేరుతో ప్రజల మీద భారాలు మోపి, ఆదానీని మేపాలని చూస్తున్నదీ బీజేపీ ప్రభుత్వమే. 'ఉచితాలు' రద్దుచేయాలన్న పేరుతో పేదల సబ్సిడీలు రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నదీ, సుప్రీంకోర్టులో కేసు వేసిందీ బీజేపీ నాయకులే! ఇలాంటి చరిత్ర మూటగట్టుకున్న బీజేపీ నేతలే తెలంగాణలో కూడా అధికారానికి వస్తామనీ, ఉద్ధరిస్తామనీ అంటున్నారు. ఇంతటి ప్రజా వ్యతిరేక విధానాల చరిత్ర ఉండి కూడా ఏధైర్యంతో అనగలుగుతున్నారు?
నిజానికి మునుగోడు ఉప ఎన్నికలు ప్రజలు కోరుకున్నవి కావు. బీజేపీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రుద్దుతున్న ఎన్నికలు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజీనామా చేసానంటున్న రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కోసం పోరాడిన దాఖలాలు లేవు. సొంత వ్యాపారాలే తప్ప నియోజకవర్గ ప్రజలను పట్టించుకున్నది లేదు. నియోజకవర్గం అభివృద్ధి నెపంతో 'స్వామికార్యం', 'స్వకార్యం' కోసం బీజేపీ చేతిలో పావుగా మారిన విషయం స్పష్టమే. ఇప్పుడు, ఆయన అన్నయ్య ఏ పార్టీకోసం పని చేస్తున్నారన్నది బేతాళుడి ప్రశ్నలాంటిది. ఆయన కాంగ్రెసు నాయకుడుగా చెలామణీ అవుతూనే బీజేపీకి ప్రాణంపోసే పనిలో ఉన్నారని బహిరంగ చర్చే నడుస్తున్నది. అన్నయ్య సమావేశాలకు హజరవుతున్న కార్యకర్తలే తమ్ముడి సమావేశాలకు కూడా హాజరవు తున్నారని జనవాక్యం. మరోవైపు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి దూకిన రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలను ఆకర్షించే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్‌రెడ్డి కూడా రేవంత్‌రెడ్డి మీద విమర్శల బాణం ఎక్కుపెట్టారు. కాంగ్రెస్‌లో ఇది మామూలేనని కొట్టిపారేయలేము. ఆయన బీజేపీలో చేరిన నేతలతో గొంతుకలిపారు. పైగా మర్రి శశిధర్‌రెడ్డి ''నిజాయితీ''కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు కితాబు ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ మాత్రం మునుగోడులో పోటీ టీఆర్ఎస్కూ కాంగ్రెస్‌కు మధ్యనే ఉంటుందని బింకం ప్రదర్శిస్తున్నది. బీజేపీ ఏ స్థాయిలో కెలుకుతున్నదో గమనించకుండా టీఆర్ఎస్ మీదనే దాడి ఎక్కుపెట్టింది. కరిగిపోతున్న కాంగ్రెస్ పునాదిని గుర్తించేస్థితిలో లేదు. సరైన రాజకీయ విధానంలేని కాంగ్రెస్, తన శ్రేణులను కాపాడుకోగల స్థితిలో కూడాలేదు. బీజేపీ ప్రమాదాన్ని గుర్తించకుండా టీఆర్ఎస్ మీదనే దాడి ఎక్కుపెట్టి, ఆచరణలో బీజేపీకే ఉపయోగపడుతున్నది. కాంగ్రెస్ అవకాశవాదం వల్లనే హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కరిగిపోయి, బీజేపీ గెలిపించిన విషయం మరువలేము. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా రాజకీయంగా గాడితప్పిన ఫలితంగానే కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ పంచనజేరిన విషయం తెల్సిందే. ఒక జాతీయ పార్టీగా, బీజేపీ ప్రమాదాన్ని గుర్తించటంలో కాంగ్రెస్ విఫలమైంది. రాష్ట్రంలో అవినీతిని ఎండగట్టే పేరుతో మోడీ గుప్పిట్లో ఉన్న సీబీఐ మీద విశ్వాసం ప్రదర్శించింది. అసోంకు చెందిన బీజేపీ నేత, ఉత్తరప్రదేశ్ సభలో, రాహుల్‌గాంధీ మీద నీతిబాహ్యమైన విమర్శలు చేస్తే, ఆయనను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేయించాలని ఆందోళన చేసింది. నోరుపారేసుకున్న బీజేపీ నేతను వదిలేసి, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద దాడిచేసింది. ఇలాంటి వైఖరి బీజేపీకే ఉపయోగమన్న విషయం కాంగ్రెస్‌కు అర్థంకాదని భావించాలా? రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలకు అధికారం కోసం ఆరాటం, పార్టీలో ఆధిపత్యం కోసం కుమ్ములాటలు తప్ప ప్రజల బాధలు, బీజేపీ ప్రమాదం పట్టవు. ఈ పరిస్థితులే కాంగ్రెస్ శ్రేణులు బయటకు తొంగి చూసేటట్టు చేస్తున్నాయి. విధానం సరిదిద్దుకోవాలన్న స్పృహలో కాంగ్రెస్ లేదు. అందుకే బీజేపీని ఓడించగల శక్తి తానేనన్న విశ్వాసం నియోజకవర్గం ప్రజలకే కాదు, సొంత పార్టీ శ్రేణులకే కల్పించలేకపోతున్నది. ఈ పరిస్థితుల్లోనే వామపక్షాలతో కలసి పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు నేతలు. అంటే తాము కాపాడుకోలేని తమ పార్టీని వామ పక్షాలు కాపాడాలని కోరుకుంటు న్నారన్న మాట! ఇక టీఆర్ఎస్ వైఖరి ఏమిటి? కేంద్రం మీద, బీజేపీ విధానాల మీద గట్టిగా పోరాడుతున్నారు. మంచిదే! ఆలస్యంగా నైనా సరైన దారిలోకి వచ్చారు. కానీ ఈ వైఖరి నిలకడగా ఉంటుందని రుజువు చేసుకోవాల్సింది వారే. అంతేకాదు, కేంద్రంలో మోడీ సర్కారుతో తమ లాలూచీ కుస్తీ వల్లనే ఇక్కడ బీజేపీకి కాళ్ళొచ్చిన విషయం కూడా గుర్తించాలి. ఇదొక భాగం. తమకు బీజేపీ ప్రమాదం విషయంలో జ్ఞానోదయం అయ్యింది కాబట్టి, ఇక వామపక్షాల మద్దతు తమకు బ్లాంక్ చెక్ లాంటిదని భావిస్తున్నారు. తమ అప్రజాస్వామిక ధోరణులే బీజేపీకి అవకాశాలిచ్చిన విషయం గుర్తించారా? దుబ్బాక, నాగార్జునసాగర్, జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అహంభావం ప్రదర్శించారు. పోడుభూముల కోసం పోరాడుతున్న గిరిజనుల మీద, ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్న పేదల మీద పోలీసులను ఉసిగొల్పారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారంలో మొండిగా వ్యవహరిం చారు. నిజానికి ఇవన్నీ తామిచ్చిన వాగ్దానాలే. పోరాడకుండానే పరిష్కరించాలి. పరిష్కరించకపోగా ప్రజల మీద నిర్బంధం ప్రయోగించారు. 73రంగాల కార్మికులలో ఐదు రంగాల కార్మికులకు మాత్రమే కనీస వేతనాలు ప్రకటించారు. యాజమాన్యాల వత్తిడితో వెనుకడుగు వేసారు. ప్రశ్నించే పత్రికలమీద కక్షసాధింపు చర్యలు చేపట్టారు. దళిత బంధుకు వామపక్షాల మద్దతు కోరారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే ఈ హంగామా చేసినట్టు అందరూ భావించవల్సి వచ్చింది. ఆ ఎన్నికల తర్వాత దళిత బంధు కదలలేదు. వామపక్షాలు ప్రజల కోసం పెట్టిన ప్రతిపాదనల వైపు కన్నెత్తి చూడలేదు. ఇవన్నీ ప్రజలెవరూ గమనించరని భావిస్తే పొరపాటు. ఇప్పటికైనా ఈ విషయాలను ఆలోచించాలి. సరిదిద్దుకోవాలి. అంతే తప్ప, తనకు ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలని కోరుకుంటే ఉపయోగం ఉండదు. ప్రజల పట్ల నిబద్ధత, చిత్తశుద్ధీ ప్రదర్శించాలి.
దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ బీజేపీ ప్రమాదాన్ని అందరికన్నా ముందుగా గుర్తించింది వామపక్షాలే. ప్రయివేటీకరణ విధానాలు, ధరల పెంపు వంటి ప్రజా వ్యతిరేక చర్యలు దుందుడుకుగా అమలు చేస్తున్నది మోడీ ప్రభుత్వం. రాష్ట్రాల హక్కులను హరిస్తున్నది. వనరులన్నీ గుప్పిట్లో పెట్టుకుని, నియంతృత్వ పోకడలు పోతున్నది. ప్రజాస్వామ్యం, లౌకికతత్వం వంటి రాజ్యాంగ విలువలను మంటగలుపుతున్నది. ప్రజలలో మతపరమైన విభజన సృష్టిస్తున్నది. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటున్నది. ఈ ప్రమాదం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే వామపక్షాలు బలపడటం కీలకం. ఆ దిశలోనే ఎర్రజెండా అడుగులుంటాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలవాలనీ, తద్వారా రాష్ట్రం మీద తమకు అనుకూల ప్రభావం పడాలనీ బీజేపీ ఎత్తుగడ. ఈ ఎత్తుగడ చిత్తుచేయాలన్న చిత్తశుద్ధి కమ్యూనిస్టులది. కమ్యూనిస్టులకు దమ్ముంటే పోటీ చేయాలని బండి సంజరు సవాలు విసిరారు. ఓట్లు చీల్చి లాభం పొందాలన్న దుగ్ధ. బీజేపీ ప్రమాదాన్ని ముందే గమనించిన శక్తి వామపక్షం. ప్రజలను, ప్రజాస్వామ్య వాదులను కూడగడుతున్న ఎర్రజెండా. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రెచ్చిపోతున్నారు. కమ్యూనిస్టుల నిబద్ధత పర్యవసానం ఇది. కాంగ్రెసైనా, టీఆర్ఎస్ అయినా గుర్తుపెట్టు కోవాల్సింది ఒక్కటే. బీజేపీని ఓడించే లక్ష్యంతోనే పనిచేయాలి.
- ఎస్. వీరయ్య