Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశం సమాఖ్య రాజ్యంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. కానీ కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అసలు దేశంలో సమాఖ్య ప్రభుత్వం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రాలకూ కొన్ని అధికారాలు ఉన్నాయనే సంగతి మర్చిపోయి కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. జీఎస్టీ దగ్గర్నుంచి విద్యుత్ వరకు ఏ చట్టం తీసుకున్నా కేంద్రం పెత్తనమే సాగుతోంది. చివరకు బియ్యం కొనుగోళ్ల విషయంలోనూ రాష్ట్రాల మాట చెల్లుబాటు కాకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో సమాఖ్య వాదం మాటలకే పరిమితమవుతోంది. కేంద్రంపైకి సమాఖ్య స్ఫూర్తి అంటున్నా ఆచరణలో మాత్రం విరుద్ధంగా వ్యవహరి స్తోంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సమన్వయం లేకుండా పోయిందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్రాల సమిష్టి కృషి వల్లే దేశం కరోనా మహమ్మారి నుంచి బయటపడిందని ప్రధాని నరేంద్ర మోడీ అంటుంటారు. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొన్నాయనే విషయం మరచిపోరాదు. భారతదేశం ఒక సమాఖ్య దేశం. ఇందులో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధిలో సహకరించుకోవాలి. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబద్ధమైన బాధ్యత. ఈ స్ఫూర్తితోనే మన రాజ్యాంగ నిర్మాతలు మన దేశ సమాఖ్య స్వరూపాన్ని తీర్చిదిద్దారు. కానీ గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ ధోరణి భిన్నంగా ఉంది. కేంద్రప్రభుత్వ విధాన నిర్ణయాలు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నప్పుడు, అది దేశాభివృద్ధినే గాక, సమాఖ్య స్ఫూర్తినీ ప్రమాదంలో పడేస్తుంది.
రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే భారత్ ఒక దేశంగా అభివృద్ధి చెందుతుంది. సమాఖ్య విధానంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలనేవి అతి ప్రధానమైనవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దృఢమైన, స్నేహపూర్వక సంబంధాలు ప్రజాస్వామ్యాన్నీ బలోపేతం చేస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమతుల్యత ఏర్పర్చే క్రమంలోనే హక్కులు, బాధ్యతలను రాజ్యాంగం వర్గీకరించింది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాగా స్పష్టంగా పేర్కొంది. కానీ, ఈ ఉమ్మడి జాబితా ఆసరాతో కేంద్రం రాష్ట్రాల హక్కుల్లోకి చొరబడుతోంది. ఈ మధ్యకాలంలో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సంస్కరణ బిల్లుల వంటి చట్టాలు రాష్ట్రాలకు ముఖ్యంగా రాజకీయంగా ప్రబల శక్తిగా లేని రాష్ట్రాలకు శరాఘాతాలుగా మారు తున్నాయి. దీనివల్లే చాలా సందర్భాల్లో రాష్ట్రాల హక్కులకు భంగం కలిగినప్పుడల్లా ఫెడరల్ నినాదం ముందుకొస్తోంది. భారతదేశ అస్తిత్వం దానికదిగా ప్రత్యేకమైనది కాదు. ఇది రాష్ట్రాలతో కూడినదే కాకుండా రాష్ట్రాల నుంచి వచ్చే పన్నులపై ఆధారపడినది. ఇదంతా రాజ్యాంగ బద్ధంగా నిర్వచించుకున్నది. అంతేతప్ప రాష్ట్రాలు కేంద్రానికి ఇస్తున్న పన్నుల నిధులను కేవలం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు వెచ్చించటం కాకూడదు. రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్న పన్నుల్లో ఆ రాష్ట్రాలకు వాటాగా దక్కాల్సిన నిధులను ఇవ్వకుండా కొన్ని రాష్ట్రాలకే వెచ్చిస్తున్న పరిస్థితి ఎంత మాత్రమూ ఆమోదయోగ్యమైనది కాదు.
దీంతో కొన్ని రాష్ట్రాల్లో నిధుల కొరతతో అభివృద్ధి కుంటుపడటమే కాదు, ఆ రాష్ట్రాలు వెనకబడిపోయే ప్రమాదం ఉన్నది. పెరుగు, పనీర్, తేనె వంటి వాటి పైనా జీఎస్టీ విధించటాన్ని ఆర్థిక మంత్రి సమర్థించుకుంటూ రాష్ట్రాలు కూడా భాగస్వాములుగా ఉండే జీఎస్టీ మండలి ఈ నిర్ణయం తీసుకున్నదని అన్నారు. జీఎస్టీ మండలి నిర్ణయాలన్నీ కేంద్రం, బీజేపీ రాష్ట్రాలు కూడబలుక్కొని ఏకపక్షంగా తీసుకుంటున్నాయని, తమ అభిప్రాయానికి ప్రాధాన్యతే ఉండటం లేదని పలు విపక్ష పాలిత రాష్ట్రాలు వాపోతున్నాయి. పెరిగిన ధరలు సామాన్యులను ఎంతలా బాధపెడుతున్నాయో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరేండ్ల బాలిక ప్రధాని మోడీకి రాసిన లేఖ వెల్లడిస్తోంది. దేశంలో కోట్లాది మంది నిరుపేద కూలీలకు అంతో ఇంతో ఆసరా కల్పిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి కేటాయింపు లను 25శాతం తగ్గించటమే ఇందుకు నిదర్శనం.
ఉపాధి హామీ కింద ఇవ్వాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయటం లేదని, రాష్ట్రాలను సమన్వయం చేసుకొని వెళ్లటం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవలే తీవ్రంగా ఆక్షేపించింది. ఈ పరిస్థితి చూస్తుంటే మొత్తం పథకానికే ఎసరు పెట్టే ఆలోచనలో సర్కార్ ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని చేయాల్సిన చట్టాలను కూడా ఏకపక్షంగా తెస్తుండటంతో సమస్య ముదురుతోంది. రాష్ట్రాలకు నేరుగా సంబంధం ఉన్న రంగాల్లో అయినా ఆయా ప్రభుత్వాల సూచనలు తీసుకోవాలి. కానీ అది కూడ జరగకపోవడం తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. అందుకే దేశం సమాఖ్య స్ఫూర్తితోనే నడుస్తుందా? అన్న ప్రశ్న ఇటీవలి కాలంలో తరచుగా తెరపైకి వస్తోంది. విపక్ష పాలిత రాష్ట్రాలపై అప్రకటిత వివక్ష చూపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ గెలవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత సమాఖ్య విధానానికి ముప్పు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాన విధానాలను, ముఖ్య చట్టాలను వాటిని అమలుపర్చవలసిన రాష్ట్రాలను సంప్రదించ కుండా రూపొందిస్తున్నారు. కేంద్రం ఇటీవల ఉపసంహరించుకున్న మూడు సాగుచట్టాల ఇందుకొక ఉదాహరణ. అలాగే విద్య, సహకార సంఘాలు, బ్యాంకింగ్ మొదలైన వాటికి సంబంధించిన నిర్ణయాలను కూడా కేంద్రమే తీసుకుని వాటిని రాష్ట్రాలపై రుద్దుతోంది. శాంతిభద్రతలు రాష్ట్రాలకు సంబంధించిన అంశం. అయినప్పటికీ కేంద్రం ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాల స్వతంత్ర ప్రతిపత్తిని బలహీనపరిచింది. రాజకీయ అసమ్మతిని అణచివేసేందుకు ఊపాను విచక్షణారహితంగా ప్రయోగిస్తోంది. జాతీయ దర్యాప్తు సంస్థలకు విస్తత అధికారాలు కల్పించింది. తమను వ్యతిరేకిస్తున్న రాజకీయ పక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపరి చేందుకు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొదలైన దర్యాప్తు సంస్థలను ఉపయోగించు కుంటున్నది. తమను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపై ఒక పద్ధతి ప్రకారం దాడి చేయడానికే ఆలిండియా సివిల్ సర్వీస్ రూల్స్ సవరణకు పూనుకున్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తూ సమాఖ్య రాజ్యం అన్న భావనను బలహీన పరుస్తోంది. రాష్ట్రాలు మేల్కొనకపోతే ఇది చాలా ప్రమాదకరం.
-జటావత్ హనుము,
సెల్: 8519836308