Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోదాడ ప్రాంతంలో మునగాల పరగణాకు ప్రత్యేక చారిత్రక నేపధ్యం ఉంది. మునగాల పరగణా ప్రజా ఉద్యమాలకు పుట్టినిల్లు. నాడు మునగాల పరగణా జమీందారీ వ్యతిరేక పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తదనంతరం జరిగిన ప్రజా ఉద్యమాలలో అనేక మంది వీరుల ప్రాణ త్యాగాలతో పునీతమైనది ఈ ప్రాంతం. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ మునగాల పరగణాలోని నడిగూడెం మండలం, రామాపురం గ్రామంలో 15.7.1950న జన్మించారు కామ్రేడ్ కుక్కడపు ప్రసాద్. ఆయన విప్లవ సాంప్రదాయాలు కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి కుక్కడపు రంగయ్య నాడు జరిగిన మునగాల జమీందారీ వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ పేదలకు అండగా నిలిచిన ధీశాలి. అలాంటి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న కుక్కడపు ప్రసాద్ కోదాడ ప్రాంతంలో మార్క్సిస్టు పార్టీ ఉద్యమ నిర్మాణానికి పునాదులు వేశారు. 1976లో కోదాడలో కాకతీయ ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించి పట్టణంలోనే స్థిరపడ్డారు.
ఆయన ఇల్లే ఉద్యమ కేంద్రంగా నాయకులకు, కార్యకర్తలకు ఆశ్రయం కల్పించింది. లావు బాలగంగాధర్ రావు, నండూరి ప్రసాదరావు, మోటూరి ఉదయం, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, మేదరమట్ల సీతారామయ్య, అరిబండి లక్ష్మినారాయణ, మల్లు స్వరాజ్యం, ఉప్పల కాంతారెడ్డి లాంటి అనేక మంది పోరాట యోధులు ప్రసాద్ ఇంటి నుండే ఉద్యమ కార్యాచరణను రూపొందించు కునేవారు. వారి స్ఫూర్తితో ప్రసాద్ అనేక గ్రామాల్లో ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగించారు. కాపుగల్లు, గొండ్రియాల, అమీనాబాద్, ద్వారకుంట ఫ్యూడల్ సాంప్రదాయం కలిగిన గ్రామాలు. ఈ గ్రామాల్లో భూస్వాముల ప్రభావం ఎక్కువ. ఈ గ్రామాల్లో పాలేర్ల పోరాటం, కూలీ రేట్ల ఉద్యమం, భూ పోరాటాలు అనేకం నిర్వహించి, అట్టి గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) గెలుపు కోసం పట్టువీడని విక్రమార్కుడిలా ప్రసాద్ తన కార్యాచరణ కొనసాగించారు. కోదాడ పట్టణంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు, మహిళా సంఘాలను స్థాపించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద గ్రామ పంచాయతీగా పేరు పొందిన కోదాడ గ్రామ పంచాయతీలో సీపీఐ(ఎం) వార్డు మెంబర్గా ప్రాతినిధ్యం వహిస్తూ, మార్క్సిస్టు పార్టీ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందారు. ప్రసాద్ జీవితం అనేక ప్రజా ఉద్యమాలకు ఆలవాలం. కార్మిక రంగంలో విశేషమైన కృషి సాగించారు. పట్టణంలో టైలరింగ్ వర్కర్స్ యూనియన్, ఆల్షా గుమస్తాల సంఘం, సామీల్ వర్కర్స్ యూనియన్, జి.పి వర్కర్స్ యూనియన్, రాతెండి ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్, హమాలీ కార్మిక సంఘాలను స్థాపించి వారి హక్కుల కోసం నిరంతరం పోరాడారు. 1996లో ఉమ్మడి నల్లగొండజిల్లా మార్క్సిస్టు పార్టీ ఉద్యమం విచ్ఛిన్నానికి గురైనప్పుడు, విచ్ఛిన్నాన్ని ఎదురించి పార్టీ శాఖలను నిలబెట్టారు. కోదాడ ప్రాంతంలో 30గ్రామాల్లో కూలీరేట్ల ఉద్యమం నడిపి, కోదాడ పట్టణంలో 5వేల మంది వ్యవసాయ కూలీ మహిళలతో పెద్ద ప్రదర్శన నిర్వహించారు. అలా పార్టీ విచ్ఛిన్నకులను ఎదురించి పార్టీని కాపాడడంలో వ్యవసాయ కూలీ పోరాటాన్ని ఆయుధంగా మలుచుకున్న గొప్ప కార్యోన్ముఖుడు కామ్రేడ్ కుక్కడపు ప్రసాద్. విద్యార్థి ఉద్యమంలో మార్క్సిస్టు భావాలకు ఆకర్షితుడై పార్టీలో నాయకుడిగా ఎదిగాడు. మొదట డివైఎఫ్ఐ డివిజన్ అధ్యక్షునిగా, కార్యదర్శిగా, ఆ తరువాత సిఐటియు డివిజన్ అధ్యక్షునిగా, పార్టీ డివిజన్ కార్యదర్శిగా, పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేస్తూ కోదాడ నియోజక వర్గంలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించాడు. మునగాల, నడిగూడెం మండలాల్లో పార్టీ కార్యకర్తలపైన నిర్భందం, దాడులు, హత్యలు కొనసాగుతున్న కాలంలో కార్యకర్తలను కాపాడు కోవడంలో, నిర్భందాన్ని ఎదురించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు.
కోదాడకు వచ్చిన రాష్ట్ర, జిల్లా నాయకులకు ప్రసాద్ ఇల్లే ఆశ్రయం. ఆయన సతీమణి నళిని విద్యావంతురాలు. ఆయన విప్లవ కార్యాచరణకు చేదోడు వాదోడుగా ఉండేది. ఆమె మహిళా సంఘం డివిజన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రసాద్ కుటుంబం గత మూడు తరాలుగా విప్లవ సాంప్రదాయాలను కొనసాగిస్తున్నది. కోదాడ పట్టణంలో కె.ఆర్.ఆర్ కళాశాల ఒక ఉద్యమ కేంద్రం. మార్క్సిస్టు భావాలు వ్యాపిస్తున్న కాలంలో ఎస్ఎఫ్ఐ ఉద్యమాన్ని కొందరు ఆరాచక, అసాంఘిక శక్తులు అణచివేసేందుకు ప్రయత్నిస్తే... కార్యకర్తల వెన్నంటి ఉండి విద్యార్థి ఉద్యమాన్ని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన వ్యక్తి కామ్రేడ్ ప్రసాద్. ఇండ్ల స్థలాలులేక రోడ్ల వెంట నివాసం ఉంటున్న పేదలందరినీ ఐక్యంచేసి, పోరాడి, పట్టణంలోని తమ్మరబండపాలెంలో అనేక మంది పేదలకు ఇండ్ల స్థలాలు సాధించి, ఆ కాలనీకి సుందరయ్య కాలనీగా నామకరణం చేసిన నాయకుడు కుక్కడపు ప్రసాద్. పట్టణంతో పాటు అనేక గ్రామాల్లో భూపోరాటాలు నిర్వ హించి నిర్భందాలను, కేసులను ఎదుర్కొన్నారు.
కోదాడ ప్రాంతంలో జరిగిన ప్రతీ ప్రజాఉద్యమంలో తనపై అనేక కేసులు మోపబడ్డాయి. రాజకీయ ఐక్యకార్యాచరణలో భాగంగా సీపీఐ(ఎం) విధానాన్ని, విశిష్టతను, పార్టీ గొప్పతనాన్ని, నిర్భయంగా పార్టీ వైఖరిని విశదీకరించేవారు. పట్టణంలో మధ్యనిషేధ ఉద్యమం, కులవివక్ష వ్యతిరేక పోరాటం, సహపంక్తి భోజనాలు, అక్షరాస్యత ఉద్యమం ఇలా అనేక సామాజిక ఉద్యమాల్లో సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్న క్రమంలో ఆయన వందల కేసులు ఎదుర్కొన్నారు. రెండు పర్యాయాలు జైలు జీవితాన్ని గడిపారు. ఉద్యమమే ఊపిరిగా విప్లవోద్యమంలో తనదైన పాత్ర పోషించారు.
ధనిక కుటుంబంలో జన్మించినా విప్లవ భావాలతో పెనవేసుకున్న జీవితం ఆయనది. కుల కట్టుబాట్లను పక్కకు నెట్టి, కార్మిక వర్గ లక్షణాలను అలవర్చుకొని, కమ్యూనిస్టు విలువలను కాపాడుతూ, నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన తుదిశ్వాస వరకూ పరితపించిన ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ కుక్కడపు ప్రసాద్. ఆయన మరణించి రెండు సంవత్సరాలు.. ఈ సందర్భంగా ఆగస్టు 23న కొదాడలో జరిగిన ఆయన ద్వితీయ వర్థంతి సభ... ఆయన స్మృతులతో పాటు, తన పోరాట స్ఫూర్తినీ అందించింది. భవిష్యత్తు పట్ల గొప్ప విశ్వాసాన్ని అందించింది. జోహార్ కామ్రేడ్ ప్రసాద్...
- ములకలపల్లి రాములు
సెల్: 9490098338