Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉన్నత విద్యలో 'పీహెచ్డీ కోర్స్' విశిష్ట ప్రాధాన్యత కలిగి ఉంది. చాలా మంది పీహెచ్డీ చేసి డాక్టరేట్ సాధించాలని కలలు కంటారు. కాని వారి కలలు విశ్వవిద్యాలయా లలో తిష్ట వేసిన అసమర్థ, అవినీతి ప్రొఫెసర్ల అంతులేని నిర్వాకాల వల్ల ఆదిలోనే పటాపంచలవుతున్నాయి. ఇలాంటి ప్రొఫెసర్ల వల్ల పీహెచ్డీ సాధించాలనే అభ్యర్థులకు మాత్రమే కాకుండా అంతిమంగా విద్యా వ్యవస్థకూ తీరని నష్టం వాటిల్లుతూనే ఉంటుంది. ఇటీవలి కాలంలో పీహెచ్డీ పరిశోధనా కోర్సులకు అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే ఇంటర్వ్యూల విధానం అనేక లోపాలతో కూడుకొని ఉండడాన్ని నిశితంగా పరిశీలిస్తే, ఉన్నత విద్య తిరోగమన దిశలో పయనిస్తుందనడానికి సంకేతంగా పేర్కొనవచ్చు.
ముఖ్యంగా 'పీహెచ్డీ ప్రవేశ ప్రకటన నాటికే లోలోపల అత్యధిక సీట్లు అక్రమంగా భర్తీ అవుతున్నాయి' అనేది జగమెరిగిన సత్యం. మిగిలిన కొన్ని సీట్లకు కూడా పర్యవేక్షకుల కూర్పుతో కూడిన పరిశోధక కమిటీ ఇంటర్వ్యూలను నామమాత్రంగా నిర్వహిస్తూ, పీహెచ్డీ ప్రవేశాల నియమ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ అక్రమంగా అనర్హ అభ్యర్థులకు సీట్లు కట్టబెట్టడం ఏమాత్రం సహేతుకం కాదు. ఒకవైపు సంబంధిత పర్యవేక్షకుల సూచనల మేరకు పరిశోధక కమిటీ ప్రయత్నపూర్వకంగా రాత పరీక్షలలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు తక్కువ మార్కులు వేస్తూ, మరోవైపు తమతో ముందే సీట్లు మాట్లాడుకున్న అభ్యర్థులకు ప్రయత్నపూర్వకంగా తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వేసి పీహెచ్డీ సీట్లను అప్పనంగా కట్టబెడుతూ విద్యా రంగంలో సరికొత్త దందాకు పాల్పడడం 'విద్యా వ్యవస్థకు తీరని కళంకం'గా ఉన్నది. ఈ రకంగా పీహెచ్డీ కోర్స్‌ని ఒక అంగడి సరుకుగా దిగజార్చడం ఏమాత్రం క్షమార్హం కాదు.
ప్రధానంగా పర్యవేక్షకులలో ఉండే 'పరివేశ ప్రభావం' కారణంగా, పరిశోధక కమిటీ ఆ విధంగా అన్యాయంగా వ్యవహరించడం వలన, పరిశోధనలో ఆసక్తిలేని వారు సైతం ఉడతాభక్తిగా అత్యధిక సంఖ్యలో సీట్లు పొందుతున్నారు. కానీ వారిలో అత్యధికులు వివిధ రకాల ఫెలోషిప్లను, నాన్-నెట్ ఫెలోషిప్లను పొందుతూ కూడా పరిశోధనలో ఏమాత్రం ప్రగతి చూపకపోవడం తద్వారా పీహెచ్డీ కోర్సులను కొనసాగించకపోవడంతో ఆ సీట్లు వృధా అవుతున్నాయి. వీరంతా తమ పరిశోధనని పూర్తి చేయకుండా, నిజంగా పరిశోధనా ఆసక్తి ఉన్న వారికి సీట్లు రాకుండా అడ్డుపడుతున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఫలితంగా డాక్టరేట్ చేయాలన్న ఎంతోమంది ఆశలు అడియాశలు అవుతున్నాయి. అందువలన పరిశోధక కమిటీ పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అన్యాయానికి తావు లేకుండా న్యాయబద్ధంగా వ్యవహరించాలి.
పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరగాలంటే మారుతున్న కాలానికి అనుగుణంగా పలు సంస్కరణలు తీసుకురావాలి. ఇటీవలి కాలంలో జరుగుతున్న కొన్ని పరీక్షలు ఏమాత్రం ప్రామాణికతని పాటించకపోవడం గమనార్హం. ప్రామాణికతలేని పరీక్షలు నిర్వహించడం వలన పెద్దగా ఒరిగేది ఏమి లేదు. ముఖ్యంగా పీహెచ్డీ ప్రవేశ పరీక్షలలో నెగటివ్ మార్కులు కూడా పొందుపరచాలి. ఈ నెగటివ్ మార్కుల విధానం వల్ల లాటరీవేసి సమాధానాలు గుర్తించే పద్ధతికి పూర్తిగా అడ్డుకట్ట వేయడమే కాకుండా అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ఎంతగానో దోహదపడుతుంది. నేడు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ఉన్నత స్థాయి ఉద్యోగాలకు సైతం గతంలో ఉన్న ఇంటర్వ్యూలను పూర్తిగా రద్దు చేసి రాత పరీక్షలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అందువలన 'కేవలం అర్హత పరీక్షగా నిర్వహించే పీహెచ్డీ ప్రవేశాలలో ఏరకంగా చూసిన ఇంటర్వ్యూ విధానం అనేది సరైనది కాదు.' పీహెచ్డీ ప్రవేశాలలో ఇంటర్వ్యూలను పూర్తిగా రద్దు చేసి కేవలం రాత పరీక్షల ద్వారా మాత్రమే సీట్లను కేటాయించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలి.
- జె.జె.సి.పి. బాబూరావు
సెల్: 9493319690