Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తరాల అంతరాలు మారుతున్నాయి. కంప్యూటర్ యుగం దాటి డిజిటల్ యుగానికి వాయువేగంగా అడుగిడటం జరిగి పోయింది. స్మార్ట్‌ఫోన్ శరీరంలో శాశ్విత అంగమైంది. అంతర్జాలం దూరాలను చెరిపేసింది. ఆన్లైన్ పోకడలు ఆకాశమే హద్దుగా పయనిస్తున్నాయి. సైబర్ యుగం ఎత్తుపల్లాలు చవిచూస్తున్నది. సైబర్ టెక్నాలజీ వరమో, శాపమో అర్థం కావడం లేదు. ఇంటర్నెట్ వలలో నేటి యువత ఊయలలూగుతోంది. అదే సమయంలో సైబర్ నేరాల విషవలయంలో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సైబర్ మోసాలు సర్వసాధారణం అయి పోయాయి. మన అమాయకత్వమే పెట్టుబడిగా అతిసునాయాసంగా మన ఖాతాలోంచి డబ్బుల్ని కాజేస్తున్న కేటుగాళ్ల సంఖ్య నానాటికీ పెరుగు తోంది. భారతదేశంలో 2018లో 2.08 లక్షలు, 2019లో 3.94 లక్షలు, 2020లో 11.58 లక్షలు, 2021లో 14.03 లక్షలు, 2022లో ఇప్పటి వరకు 6.74లక్షల సైబర్ నేరాలు నమోదు కావడం నేటి సైబర్ నేరప్రవృత్తికి అద్దం పడుతున్నది. 2018 నుంచి 2021 వరకు సైబర్ నేరాలు ఏడురెట్లు పెరగడం ప్రమాద తీవ్రతను వ్యక్తం చేస్తున్నది.
ప్రభుత్వ సర్వర్ నుంచి దాదాపు 20,000 మంది వ్యక్తిగత వివరాలు బయట పడ్డాయని రుజువైంది. 2018లో భారత్‌కు చెందిన 17,560 వెబ్సైట్లు హాక్ కాగా, 2019లో 24,768, 2020లో 26,121 వెబ్సైట్లు హాక్ కావడం గమనించారు. 2020లో 4,047 బ్యాంక్ ఆన్లైన్ మోసాలు, 2,160 ఏటియం మోసాలు, 1,093 ఓటిపి మోసాలు, 972 మంది మహిళలు, పిల్లల సైబర్ బుల్లీయింగ్ మోసాలు, 578 నకిలీ సోషల్ మీడియా కేసులు నమోదు అయ్యాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వివరాలు తెలుపుతున్నాయి. సైబర్ నేరాల్లో అత్యధికంగా కర్నాటక (16.2 శాతం), తెలంగాణ (13.4శాతం), అస్సాం (10.1 శాతం) రాష్టాల్లో నమోదు కావడం గమనిస్తున్నాం.
విద్యావంతులు కూడా ప్రలోభాలకు ఆశపడి సైబర్ నేరగాళ్ళు విసిరే గాలాలకు చిక్కి మోసపోతుండటం చూస్తున్నాం. డిజిటల్ లావాదేవీలు పెరగడంతో బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఫిషింగ్, ర్యాన్సమ్, మెయిల్ స్పామ్వేర్, రకరకాల మాల్వేర్ దాడులు సర్వసాధారణం అయ్యాయి. పని భారం అధికంగా ఉందన్న పోలీసుల వాదన సైబర్ నేరగాళ్ళకు వరంగా మారుతున్నది. సైబర్ నేరాలను రిజిస్టర్ చేసుకోవడానికి కూడా పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. సైబర్ నేరాలపై నిఘా కరువైంది. సైబర్ నేరగాళ్ల వలయాన్ని ఛేదించడం పోలీసులకు కష్టం అవుతున్నది. సైబర్ నేరాల పట్ల పోలీసులకు ప్రత్యేక శిక్షణలు ఇవ్వడం కనీస అవసరంగా ప్రభుత్వం భావించాలి. ఒక్క తెలంగాణ వాసులు మాత్రమే 2021 నుంచి రూ.216 కోట్లు సైబర్ నేరగాళ్ళకు సమర్పించుకున్నారంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
సెల్‌ఫోన్ సిమ్ కార్డులు తేలికగా లభించడం కూడా నేరగాళ్ళు రెచ్చి పోవడానికి అవకాశమి స్తోంది. సైబర్ నేరాలతో దేశద్రోహులు, ఉగ్ర వాదులు, సంఘ విద్రోహశక్తులు బలపడు తున్నట్లు చరిత్ర వివరిస్తున్నది. కాబట్టి సైబర్ నేరాలను అదుపు చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడంతో పాటు, పౌరులకు అవగాహన కల్పించడం, సైబర్ భద్రతా వ్యవస్థలను తీసుకురావడం, ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణలు ఇవ్వడం, ప్రజా సమాచార భద్రత గూర్చి సామాన్యులకు అవగాహన కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అంతర్జాల వినియోగ పరిమితులను తెలుసుకోవడం, ఆర్థిక సమాచారాల్లో గోప్యత ప్రదర్శించడం, వ్యక్తిగత పాస్‌వర్డులను రహస్యంగా ఉంచుకోవడం, అనుమానిత కాల్స్‌ను తిరస్కరిం చడం, తద్వారా సైబర్ నేరగాళ్ళు విసిరే విషవలలో పడకుండా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండటం పౌరుల విధి. సైబర్ నేరాలను అదుపు చేయడానికి ఆర్బిఐ, ఐబీ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, ఈడీ, పోలీస్ విభాగాలు సమన్వయం తో పనిచేయాలి.
- డా||బి.ఎం.రెడ్డి
సెల్: 9949700037