Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ ఒక్క భాషనైనా ఇతర భాషలపై రుద్దితే, భారతదేశ ఐక్యతకే ముప్పు వాటిల్లుతుందని... భారతదేశంలో భాషా సమస్యపై చర్చిస్తున్న సందర్భంలో రాజ్యాంగ పరిషత్ గుర్తించింది. ఎనిమిదవ షెడ్యూల్ ఏర్పరచగానే, మొదటిగా అందులో 14 భాషలు చేర్చడం అంటేనే రాజ్యాంగ సభ, భారతదేశ సార్వభౌమత్వాన్ని, విభిన్న భాషల పరస్పర వైవిధ్యతను లోతుగా అర్థం చేసుకుందన్నమాట. ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చిన భాషలు క్రమంగా 22కి పెరిగాయి. కానీ భారతదేశ సమాఖ్య ఏ భావనతో అయితే ఏర్పడిందో, దానిని మార్చే ప్రయత్నాలు ఈ మధ్య కాలంలోనే జరగడం మొదలయింది.
ఇప్పుడున్న పాలనా వ్యవస్థ, తన హిందీ-హిందూ రాష్ట్ర సైద్ధాంతిక ఆలోచనలతో, భారతదేశంలోని ఇతర అన్ని భాషలపై హిందీని బలవంతంగా 'రుద్దబోతున్నాదేమో' అనే ఆందోళన కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్క హిందీని హిందీ మాట్లాడని వారిపై రుద్దడమే కాదు, తన జాతీయవాదానికి కీలకమైన సంస్కృతాన్ని కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని నేటి ప్రభుత్వం తన భాష, సాంస్కృతిక, విద్యా విధానాలతో రాజ్యాంగ నిర్మాణాన్నే ప్రశ్నార్ధకం చేస్తోంది.
హిందీ గురించిన తప్పుడు భావన
భారతదేశ భాషల పొందికలో హిందీని గురించిన తప్పుడు అవగాహన విస్తృతంగా వ్యాపించి ఉంది. ఇది కేవలం 22 భాషలలో ఒకటి మాత్రమే. చాలా రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో ఉన్న కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, పాండిచ్చేరిలలో... పశ్చిమాన గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లలో... ఉత్తరాన ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌లలో...ఈశాన్య భారతదేశంలోని సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, అస్సాంలలో హిందీ సహజమైన భాష కాదు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లలో హిందీ ఒక్కటే భాష. లేదా ప్రధానమైన భాష అనిపిస్తుంది. కానీ దగ్గరగా పరిశీలిస్తే, ఈ ప్రాంతాలలో కూడా వారి వారి ప్రాంతీయ భాషలున్నాయి. హిందీ కేవలం వేరొక రాష్ట్రం వారితో సంభాషించడానికి ఉపయోగపడుతుంది. ఆయా ప్రాంతాలలో పర్యటించినప్పుడు వారు హిందీ మాట్లాడడం వలన హిందీ అంతర్ రాష్ట్రీయ భాషగా ఉపయోగపడుతుంది. అందువలనే అది ఆ ప్రాంతాల ప్రాథమిక భాష అనే భావనకు బలం చేకూరుతుంది. కానీ ఈ భావన వాస్తవం కాదు.
హిందీ, సంస్కృతం
2011 జనాభా లెక్కల ప్రకారం (ఇప్పటికి ఇవే తాజా గణాంకాలు) దేశంలో మొత్తం 19,569 మాతృభాషలు ఉన్నట్టు వెల్లడయింది (ఇందులో కేవలం మాట్లాడేవి మాత్రమే చాలా ఉన్నాయి). ఇందులో నుండి అనేక కారణాలు చూపి 17,000 నిర్దాక్షిణ్యంగా తొలగించివేశారు. మరో 1474 భాషలకు అవసరమైనంత పండితుల ధృవీకరణలు లేకపోవడం వలన పక్కన పెట్టేసారు. కేవలం 1369, అంటే 7శాతం మాత్రమే-మాతృభాషలుగా-పరిగణనలోకి తీసుకున్నారు. వాటన్నిటిని 'భాషలు'గా గుర్తించే బదులు, 121 శీర్షికల కింద విభజించారు. ఈ 121 భారతీయ భాషలుగా గుర్తించారు. హిందీ మాట్లాడేవారి సంఖ్య పెంచేసి- 52 పైచిలుకుగా- చూపారు. అచ్చంగా హిందీ మాట్లాడేవారికి మరో 50 భాషలు మాట్లాడేవారిని చేర్చారు. ఇందులో భోజ్‌పురి ఉంది. భోజ్‌పురి మాట్లాడేవారు 5కోట్ల మంది ఉన్నారు. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్, హర్యానా, బీహార్లలో మరో ఆరు కోట్ల మంది వివిధ భాషలు మాట్లాడేవారిని కూడా హిందీ భాష మాట్లాడేవారిలో చేర్చారు. అదే సమయంలో 22 షెడ్యూల్డ్ భాషలకుగాను 17 భాషలు మాట్లాడేవారి సంఖ్యను ఇదివరకటి సంఖ్యతో పోల్చినప్పుడు తగ్గించి చూపారు. అంటే వారి సంఖ్య అంతకు ముందటి పదేండ్లకన్నా తగ్గిందన్నమాట. బీజేపీ నాయకులు మాట్లాడే తీరు, హిందీని ప్రోత్సహించే పద్ధతి- కేంద్ర, ప్రభుత్వ కార్యాలయాల పరిపాలనలో జొప్పించడం, రైళ్లలో, ప్రధాన రహదారులు, ప్రభుత్వ స్థలాలు వగైరాలలో హిందీలో రాయడం (హిందీ మాట్లాడేవారు లేని ప్రాంతాలలో కూడా), హిందీ భాష మాట్లాడే వారి సంఖ్యను పెంచడానికి, గణాంకాలను పెంచడానికి దోహదపడిందని అర్ధం అవుతున్నది.
ఇక సంస్కృతం విషయం వేరు. ఈ రోజు సంస్కృతం మాట్లాడేవారు ఎక్కువ మంది లేరు. అది హిందీకి మాతృభాష అయినందువలన, హిందువుల గ్రంథాలు అన్నీ సంస్కృతంలోనే ఉన్నందువలన, సంస్కృతం మాట్లాడేవారు ఎక్కువగా లేకపోయినా, హిందువులుగా భావిస్తున్న వారిలో సంస్కృతం 'పవిత్రమైన' భాషగా భావించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. 2021 జనగణనలు ప్రారంభించక ముందు, సామాజిక మాధ్యమాలలో, 'మీ భాషలో సంస్కృతానికి సంబంధించిన పదాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే సంస్కృతం మీ రెండో మాతృభాషగా జనగణన చేసేవారికి తెలియచేయండి' అని ప్రచారం మొదలవడం గమనించవచ్చు. దానికి భావోద్వేగాల, మతతత్వ విజ్ఞప్తి కూడా జోడించడం జరిగింది. హిందువులు అలా చేయకపోయినట్లయితే, 'విదేశీ భాషలు' మాట్లాడేవారు (పర్షియన్, ఉర్దూ అనే అర్థంతో పూర్తి తప్పుడు ప్రతిపాదనలు) మన సంస్కృత భాష మాట్లాడేవారి కన్నా ఎక్కువ నిధులు పొందుతారని ప్రచారం చేశారు. మన దేశంలోని దాదాపు అన్ని భాషలు, ద్రావిడ భాషలతో సహా ఎన్నో కొన్ని సంస్కృత పదాలను వాడుతుంటామన్నది ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. జనాభా లెక్కలు తీసేటప్పుడు, మాతృభాషతో పాటే మాట్లాడే రెండో భాష ఏదని అడగడం సర్వసాధారణం. ఆ రెండో భాష మాట్లాడేవారి గణాంకాలు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కిందటి జనాభా లెక్కలలో మొత్తం 121 కోట్ల జనాభాలో 24,000 మంది మాత్రమే సంస్కృతం తమ 'మాతృభాష'గా చెప్పుకున్నారు.
ఈ మధ్యకాలంలో హిందూ రాష్ట్రం కావాలనుకునేవారు సంస్కృతాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. ప్రపంచంలో ఉన్న మొత్తం జ్ఞానం అంతా సంస్కృతంలో ఉందని వాదిస్తుంటారు కొందరు. ఒక ఆలోచనాపరునిగా, అంతా కాకపోయినా... కొంత ప్రాపంచిక ఆలోచనల చరిత్ర గురించి తెలిసి, జ్ఞానం ఎక్కడ నుండి ఉద్భవించినా గౌరవించడం తెలిసిన నాకు... ఈ వాదన చేయడం చూస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ భాషనైనా బలవంతంగా ప్రజలపై రుద్దలేం. ప్రజలు ఏ భాషనైనా వాడొచ్చు. వాడకపోవచ్చు. అది వారికి సంబంధించిన అంశం. ప్రజలు తాము పని చేసేటప్పుడు, వ్యాపారాలు చేసేటప్పుడు, తమ ఆలోచనలను పంచుకునేటప్పుడు, సమాజంలో ఒకరితో ఒకరు సంభాషించుకునేటప్పుడు, భాషను వాడతారు. ప్రజలకు జ్ఞానాన్ని సంపాదించి పెట్టే భాష అభివృద్ధి చెందుతుంది. వారికి సంబంధించినదిగా ఉంటుంది. పైగా ప్రస్తుతం మన దేశ జనాభాలో ఎంతమంది పూర్తిగా సంస్కృతాన్ని వాడతారో తెలుసుకోవడానికి జనగణనలు అవసరం లేదు. వారి సంఖ్య అతి స్వల్పమని తేటతెల్లం అవుతూనే ఉంది.
అధిక సంఖ్యాక జాతీయవాదం
హిందూ రాష్ట్రం నిర్మించాలనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు ఆలోచనలకు బహు భాషా నిలయమైన ఈ దేశంలో స్థానం లేనేలేదు. జాతీయవాదం అంటే, వారి ఉద్దేశంలో దేశంలో అత్యధిక భాగంగా ఉండే ఒకే ఒక సమూహం ప్రధానమైనది. మిగిలిన అందరు-ఇతర భాషలు మాట్లాడేవారు, సంస్కృతులు కలవారు, ప్రాంతాలవారు, మైనారిటీ మతస్తులు, దేశస్థులు కారు. లేదా దేశ ద్రోహులు. వారంతా మెజారిటీ సమూహాలను కూడగట్టేందుకు సులువైన లక్ష్యాలు. 'పవిత్రమైన' లావాదేవీలన్ని సంస్కృతంలోనూ, రోజువారీ లావాదేవీలన్ని హిందీలోనూ జరుపుకునే హిందువులది మాత్రమే భారతదేశం అంటే, దేశంలోని ఇతర భాషలనన్నిటిని తుడిచిపెట్టడమే అవుతుంది. గతంలో ఆంగ్ల మాధ్యమాన్ని, తద్వారా అనేక రూపాలలో వచ్చిపడ్డ జ్ఞానాన్ని, ఆంగ్లేయుల వలన భారత దేశానికి చారిత్రికంగా ఏర్పడ్డ ఒక ఉపద్రవంగా జాతీయవాదులు భావించేవారు. ఆంగ్ల విద్య తమ గొప్ప సాంప్రదాయ సంస్కృత జ్ఞానాన్ని కలుషితం చేస్తున్నదని అనుకునేవారు. భారత రాజ్యాంగం వివేకవంతమైన ఆలోచనలకు ప్రతిరూపంగా, లోతైన అవగాహనతో రూపొందించబడిన తరువాత ఈ భావనలు తొలగిపోయాయి. ఈనాటి ప్రభుత్వ, రాజ్యాంగ సంస్థల పట్ల తన అసౌకర్యాన్ని యథేచ్ఛగా వ్యక్తపరచడానికీ, భారతదేశ భాషా సంస్కృతి పట్ల వారి పరిమితమైన అవగాహనకూ ప్రత్యక్ష సంబంధం ఉంది. ఒక మరుగుజ్జు సిద్ధాంతం మెరుగైన వాస్తవాలకు సంబంధించిన విధానాలకు రూపకల్పన చేస్తే సంస్కృతికి, సమాజానికి అంతులేని నష్టం కలుగుతుంది. దేశం ముందుకుపోయే బదులుగా వెనక్కు అడుగులు వేస్తుంది.
- జి.ఎన్. డేవీ
హిందూ సౌజన్యంతో
వ్యాసకర్త: 'పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్
ఇండియా' చైర్పర్సన్