Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతడి సాహిత్యం సమాజానికి అద్దం... అతడి జీవితం చీకటిపై యుద్ధం...
''హయత్ లేకే చలో ఖాయనాత్ లేకే చలో
చలేతో సారే జమానేకో సాత్ లేకే చలో'' అంటూ నడుస్తూ నడిపించిన కమ్యూనిస్టు కీర్తి అతడు...
''మరఫిరంగి నోటినుండి మరణగీతి మోగుతోంది
బతుకు పూల తోటలోన ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లి'' అని కలమెత్తిన కవితాస్ఫూర్తి అతడు...
అబూ సయీద్ మహ్మద్ మఖ్ధూమ్ మొహియొద్దీన్ ఖాద్రీ... మగ్ధూమ్ మొహియుద్దీన్‌గా ఈ ప్రపంచానికి సుప్రసిద్ధుడు. మగ్ధూమ్గా ఈ నేలకు చిరస్మరణీయుడు.
అతడు కవిగా ఎంత ప్రసిద్ధుడో కమ్యూనిస్టుగానూ అంతే ప్రసిద్ధుడు. గాయకుడు, నటుడు, నాటక రచయిత, దర్శకుడు కూడా! కానీ కొందరు మగ్ధూమ్ను కవిగా మాత్రమే గుర్తిస్తారు. అలా గుర్తించేవారంతా ఆయన కమ్యూనిస్టు రాజకీయాల్లో లేకుంటే మరింత కవిత్వం రాసేవాడని భావిస్తారు. మరి కొందరు ఆయనను కమ్యూనిస్టుగానే గుర్తిస్తారు. వారిలో కూడా మగ్ధూమ్ కవిత్వాన్ని వదిలేస్తే ఆయన రాజకీయ కృషి మరింత విస్తృతంగా ఉండేదని అనుకునేవారు లేకపోలేదు. అయితే... ఆయన కవిగాకుండా అంత గొప్ప కమ్యూనిస్టు అయ్యుండేవాడు కాదన్నది ఎంత నిజమో, కమ్యూనిస్టు గాకుండా అంతటి మహాకవీ అయ్యుండేవాడు కాదన్నది అంతే నిజం. ఎందుకంటే అయనలోని కవి, కమ్యూనిస్టు ఇద్దరూ ఒక్కరే..! ఆ ఇద్దరూ ప్రజాపక్షం వహించేవారే..! కాబట్టే ఆయన తన కవిత్వంలో ఆకలీ అవమానాలు, దోపిడీ పీడనలు లేని సామ్యవాద సమాజాన్ని స్వప్నించాడు, ఆ స్వప్న సాకారానికి కమ్యూనిస్టు కర్తవ్యాన్ని నిర్వహించాడు.
మెదక్ జిల్లా ఆందోల్‌లో 1908 ఫిబ్రవరి 4న మగ్ధూమ్ జన్మించాడు. ఆయన పూర్వీకులు ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్, షాజహానాబాద్ ప్రాంతాల నుండి దక్కన్ పీఠభూమికి తరలివచ్చి స్థిరపడ్డారు. తండ్రి గౌస్ మొహియుద్దీన్ నిజాం ప్రభుత్వంలో సూపరిండెంటు. మగ్ధూమ్కు నాలుగేండ్ల వయసప్పుడే చనిపోయాడు. తల్లి ఉమ్జాబేగం మరో పెండ్లి చేసుకోవడంతో బాబాయి బషీరుద్దీన్ వద్ద పెరిగాడు. ప్రాథమిక విద్య హైదరాబాద్ ధర్మవంత హైస్కూల్లో, మెట్రిక్యులేషన్ సంగారెడ్డిలో పూర్తి చేసుకుని 1929లో ఉన్నత చదువులకోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చేరుకున్నాడు. బతకాడానికి ట్యూషన్లు చెప్పుకుంటూ, పెయింటింగ్స్ వేసుకుంటూ, సినిమా తారల బొమ్మలు అమ్ముకుంటూ నానాకష్టాలు పడ్దాడు. ప్రతి ఉదయం ఒక పైసా ఖర్చుచేసి ఒక్క తందూరి రొట్టె తిని రోజంతా గడిపాడు. బహుశా ఆ ఆకలే ఆయనకు ఆశయ పథాన్ని నిర్దేశించి ఉంటుంది! ఆ కన్నీళ్లే ఆయనలో కవితావేశాన్ని నింపి ఉంటాయి! పుట్టెడు కష్టాల్లోనూ ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూనే గడిపేయడం తన జీవనశైలిగా మార్చుకున్నాడు. అందుకేనేమో... నిరాశా నిస్పృహలనేవి జీవిత కాలంలో ఆయన దరిదాపులను కూడా చేరలేకపోయాయి! జీవితాన్ని ఓ సవాల్‌గా తీసుకున్నాడు. అసలు నిరాశ చెందడానికి కూడా తీరికలేని జీవితాన్ని నిర్మించుకున్నాడు.
మగ్ధూమ్ మంచి హస్యప్రియుడు. గొప్ప ఉపన్యాసకుడు. చదువులోనూ ప్రతిభావంతుడు. ఒకవైపు బతుకు పోరాటం చేస్తూనే మరోవైపు చదువునూ, కవిత్వాన్నీ, నాటకాలను కొనసాగించిన మగ్ధూమ్.. 'స్టూడెంట్స్ యూనియన్' ఏర్పాటు చేసి విద్యార్థి ఉద్యమాలకూ నాయకత్వం వహించాడు. 1937లో తన 29వ యేట ఎంఏ పట్టా తీసుకున్నాడు. ఆ పైన హైదరాబాద్ సిటీ కాలేజ్‌లో ఫ్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరాడు. కానీ తన లక్ష్యం అదికాదనిపించింది ఆయనకు. జీవితంతోపాటే సమాజాన్నీ చదివిన మగ్ధూమ్ ఉద్యోగంతో సంతృప్తి చెందలేకపోయాడు. తాను విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే ఆయన కమ్యూనిస్టు పత్రికలు, సాహిత్యాన్ని రహస్యంగానైనా క్రమం తప్పక అధ్యయనం చేసాడు. ఉద్యోగంలో చేరాక ఆ అధ్యయనాన్ని మరింత విస్తృతంగా కొనసాగించాడు. ఆ అవగాహన నుండి, లోతైన పరిశీలన నుండి... మార్క్సిజమే ఈ సమాజ పురోగమనానికి మార్గమని నిర్ధారించుకున్నాక... 1940లో తన సహచరులతో కలిసి కమ్యూనిస్టుపార్టీలో చేరాడు.
ఆ కమ్యూనిజం వెలుగులోనే.. కవిత్వం, కార్మికవర్గ దృక్పథాల మేళవింపుగా తన జీవితాన్ని ఆవిష్కరించాడు. మానవత్వమై పరిమళించాడు. మనషుల్ని ప్రేమించేవాళ్లు కమ్యూనిస్టులు కాకుండా ఎలా ఉంటారు! కమ్యూనిజాన్ని ప్రేమించేవారు కవిత్వాన్ని ప్రేమించకుండా ఎలా ఉంటారు!! అందుకే..
''సారా సంసార్ హమారా హై
పూరబ్, పశ్చిమ్, ఉత్తర్, దక్కన్
సారా సంసార్ హమారా హై..
హం అమేరీకి, హం ఆఫ్రంగి
హం చీనీ జాం బజానే వతన్'' తూరుపు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రపంచ మంతా మాదే.. ప్రపంచమంతా మేమే.. మేం అమెరికన్లం, మేం ఆఫ్రికన్‌లం, మేం చైనీయులం... ప్రపంచమంతా మేమే ఈ ప్రపంచమంతా మాదేనంటూ కవి త్వం ద్వారా తన కార్మికవర్గ అంతర్జాతీయతను సగర్వంగా ప్రకటించాడు. ఉద్యోగం వదిలి ఉద్యమాలకు శ్రీకారం చుట్టాడు. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, బటన్ ఫ్యాక్టరీ, బట్టల మిల్లు మొదలు ఎలక్ట్రిసిటీ, సిడబ్ల్యూడి, మున్సిపాలిటీ, రైల్వేలాంటి డిపార్ట్మెంట్లలో వందల కార్మికసంఘాలను నిర్మించాడు. కార్మికోద్యమ నేతగా, అనేక కార్మికసంఘాలకు అధ్యక్షుడిగా వారి హక్కులకోసం అహౌరాత్రులు శ్రమించాడు. కానీ అలా ఉద్యమిస్తే రాజ్యం ఊరుకుంటుందా..? కక్షగట్టి కారాగారాలకు తరలిస్తుంది. అలా 1943లో మొదటిసారిగా జైలుజీవితం అనుభవంలో కొచ్చిందాయనకు. అయితే మాత్రం..? అక్షరాన్నీ, శబ్ధాన్ని ఎవరు బంధించగలరు? పోరాటమే జీవితమైన వాడికి ఎక్కడైతే ఏం..! అక్కడా కమ్యూనిజాన్ని కవిత్వీకరించడమే కాదు, ఖైదీల హక్కులనూ నినదించాడు మగ్ధూం. ఇలా హక్కుల పోరాటంలో జైలు, బైలు ఆయన జీవితంలో సర్వసాధా రణంగా మారిపోయినా అతనెప్పుడూ నీరుకారిపోలేదు. ''అక్షరాల అగ్గిపూలు కాల్చేయుట ఎవరితరం.. అరుణారుణ ఆశయాల ప్రభాతాలే నిరంతరం'' అని నిరూపించాడు. రెట్టించిన సంకల్పంతో కవిత్వానికీ, కార్మికోద్యమాలకూ కమ్యూనిస్టు చైతన్యమిచ్చి హైదరాబాద్ వీధుల్లో అరుణపతాకమై రెపరెప లాడాడు. అలా రెపరెపలాడుతూనే ఆ తరువాత కమ్యూనిస్టుపార్టీ హైదరాబాద్ కమటీకి తొలి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.
పట్టణాల్లో కంపెనీ కార్మికుల కన్నీళ్లనే కాదు... పల్లెసీమల్లో రైతుకూలీల దుఃఖాన్ని కూడా భరించలేకపోయాడు. ''రైతుకు రొట్టెనివ్వని పొలమెందుకు.. కాల్చేయండి కంకులన్నిటిని'' అన్న ఇక్బాల్ కవిత్వమై నినదించాడు. నిర్బంధ లెవీ వసూళ్లు, వెట్టిచాకిరీ, భూస్వాముల దురాగతాలకు తోడు, కనీస మానవహక్కులకు నోచని తెలంగాణ గ్రామీణ జీవితాన్నీ సహించలేకపోయాడు. అందుకే కమ్యూనిస్టు కృషి పల్లెలకు విస్తరించాలన్న పార్టీ పిలుపును అందిపుచ్చుకున్నాడు...
''రా... ఈ శిథిలాలపై స్వాతంత్య్ర పతాకమెత్తు
రా... ఈ శిథిలాలపై రక్త పతాకమెత్తు..'' అని గర్జించాడు. అటు బ్రిటిషు రాజ్యాన్నీ ఇటు నిజాం రాచరికాన్నీ సవాలు చేసే విముక్తి గీతమై మారుమోగాడు...
''జంగ్ హై జంగే ఆజాదీ
ఆజాదీ కె పర్చమ్ కె తలే
హం హింద్ కె రహ్నే వాలోంకి
మెహకూమోంకి మజ్దూరోంకి
దహెఖానోంకి మజ్దూరోంకి
ఆజాది కే మత్వాలోంకి
ఏ జంగ్ హై జంగే ఆజాదీ'' అంటూ ప్రజల స్వాతంత్య్ర కాంక్షను అక్షరీకరించడమే కాదు, లక్షలాది మందిని ఆచరణకు కదిలించాడు. ఆంధ్రమహాసభ మితవాదుల ప్రాబల్యం నుండి బయటపడి కమ్యూనిస్టుల నేతృత్వంలోకొచ్చాక... సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన ముగ్గురు కమ్యూనిస్టు అగ్రజుల్లో మగ్ధూమ్ ఒకడు కావడం గమనార్హం. దాదాపు సాయుధ పోరాటకాలమంతా మగ్ధూమ్ది అజ్ఞాత జీవితమే. పోరాట విరమణానంతరం అజ్ఞాతం వీడిన మగ్ధూం... ఆ తరువాత 1952లో కమ్యూనిస్టుపార్టీ అభ్యర్ధిగా హూజూర్‌నగర్ నుండి హైదరాబాద్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957లో మెదక్ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా, అంతకుముందే 56లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై సభలో ప్రతిపక్షనేతగా 1969వరకూ కొనసాగాడు.
మగ్ధూమ్ జీవించిన కాలం చిన్నదే అయినా ఆయన జీవితం చాలా విస్తృతమైనది. ఆయన కృషి తెలంగాణకు మాత్రమే పరిమితమైనది కాదు. ఢిల్లీ కేంద్రంగా ఏఐటీయూసీ అఖిలభారత స్థాయి బాధ్యతల్లో, వియన్నా కేంద్రంగా ప్రపంచ ట్రేడ్ యూనియన్ సమాఖ్య ప్రధాన కార్యాలయంలోనూ పనిచేసాడు. సోవియట్ యూనియన్, చైనా, తూరుపు యూరపు దేశాలన్నిటితోపాటు ఆఫ్రికన్ దేశాలు కూడా తిరిగి వచ్చాడు. ఇంతటి విస్తృతమైన రాజకీయ కృషిలో తలమున కలవుతూ కూడా ఆయన తన సాహిత్య, సాంస్కృతిక కృషిని మరువలేదు. 'అభ్యుదయ రచయితల సంఘం' ఏర్పాటులో ''ప్రజానాట్యమండలి'' ఏర్పాటులో ఆయన చొరవ మరవలేనిది. విద్యార్థిగానే విఖ్యాత నాటకకర్త బెర్నార్డ్ షా నాటకాలను ఉర్దూలోకి అనువదించి, ప్రదర్శించి విశ్వకవి రవీంద్రుని ప్రశంసలనందుకున్నాడు. శాంతి నికేతన్‌లో విద్యాభ్యాసానికి గురు దేవుల ఆహ్వానమందుకున్నాడు. 1943లో బొంబాయిలో ఏర్పడిన అఖిల భారత ప్రజా నాట్యమండలి (ఇప్టా) ఆవిర్భావసభకు ఆయన తెలంగాణ ప్రతినిధి. ఆ సందర్భంగా ఏర్పడిన తొలి ఆఖిలభారత కమిటీకి ఆంధ్ర నుండి డాక్టర్ గరికపాటి రాజారావు ఎన్నికైతే తెలంగాణ నుంచి ఎన్నికైన మొట్టమొదటి నేత మగ్ధూం. అందుచేత ఆయన తెలుగునాట ప్రజా కళారంగానికీ ఆద్యుడూ ఆరాధ్యుడు. ఆయన సినిమాల కోసం పాటలు రాయకపొయినా సినిమా రంగమే ఆయన పాటలను వెండితెరపై ఆవిష్కరించడం విశేషం.
ఇలాంటి విశేషాలూ విశిష్టతలెన్నున్నా... నిరాడంబర శైలి, నిబద్ధతతో కూడిన జీవితాచరణలే ఆయన సహజాభరణాలు. అతడు ఎంత సాహసో అంత సరదా మనిషి. గొప్ప హాస్యప్రియుడు. ఆయన రోజువారీ సంభాషణల్లోనే కాదు, చట్టసభల ప్రసంగాల్లోనూ, వాదనల్లోను చక్కటి 'హ్యూమర్'' వ్యక్తం కావడం ఆయన మరో సహజ లక్షణం. విషయం ఎంత సూటిగా, స్పష్టంగా, ధృడంగా ఉంటుందో అంత చమత్కారమూ ఉంటుంది. రాజకీయ ఖైదీగా జైలులో ఖైదీలకు నాసిరకం ఆహారమివ్వడాన్ని నిరసిస్తూ... వారిచ్చిన ఆకులులేని కాడలతో తాడు పేని జైలరుకు బహుకరించినా, ప్రతిపక్ష నేతగా శాసనసభలో నాటి ఆరోగ్యశాఖ మంత్రి ''పూల్‌చంద్ గాంధీ'' పనితీరును విమర్శిస్తూ.. 'పూల్ చన్ద్.. కాంటే బహుత్'' (పువ్వులు కొంచెం.. ముండ్లు చాలా) అంటూ ఛలోక్తి విసిరినా అవి నవ్విస్తూనే చురకలంటించేవి. ఎంతటి గాఢమైన విషయాన్నైనా సున్నితమైన హస్యాన్ని జోడించి చెప్పటం ఆయన ప్రత్యేకత. బాల్యమంతా మసీద్‌లోనే ఆశ్రయం పొందిన మగ్ధూమ్ ఏనాడూ మతాన్ని అనుసరించలేదు, దూషించలేదు. అయితే మతదురహంకారాన్ని మాత్రం ఎప్పుడూ సహించలేదు. బతికినంతకాలం పీడితుల పక్షాన నిలిచి... నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్ని అంకితం చేసి... 1969 ఆగస్టు 25న మరణాన్ని జయించిన మగ్ధూమ్ అమరత్వం ఓ జీవనది...
మగ్ధూమ్ ఓ విలువల సంద్రం... విప్లవ శిఖరం...
మగ్ధూమ్ ఓ కన్నీటి అల... ఎర్రని కల...
మగ్ధూమ్ ఓ కవితా ప్రవాహమ్... కమ్యూనిస్టు పరిమళం...
(నేడు మగ్ధూమ్ వర్థంతి)
- రాంపల్లి రమేష్