Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్త్రీ సంక్షేమం గురించి మాట్లాడుతూ... ''భారత స్త్రీలకు సమానత్వం అనే ఆలోచన లేకపోతే, సమానత్వం గురించి ఆలోచించగల అవకాశాన్ని వాళ్లకు కల్పించాలి'' అంటారు అమర్త్యసేన్. సాధారణంగా మహిళల గురించి చర్చించేటప్పుడు సంపన్న, కులీన వర్గాల మహిళలను పక్కన పెట్టేయవచ్చు. వారికి సమస్యలు లేవని కాదు గానీ, ఏటికి ఎదురీదుతూ, మునకలు వేస్తూ కొట్టుకుపోతున్న వారు మధ్యతరగతి, పేద వర్గాల స్త్రీలు మాత్రమే. అందుకని వారి గురించిన ఆలోచన మాత్రమే ఇక్కడ చేద్దాం. పాత రాతియుగంలో మహిళలు గుంపునకు ముందుండి పోరాడేవారట. తరాలు మారే కొద్ది స్త్రీల తలరాత మారింది. విద్యకు దూరమయ్యారు. ఎలాంటి ఆస్తి హక్కు లేదు. పరదా పద్ధతి, బాల్య వివాహాలు, వితంతు వ్యవస్థ, పుట్టిన ఆడపిల్లల్ని పురిటిలోనే గొంతు నొక్కటం, సతీసహగమనం... ఒకటి కాదు రెండు కాదు స్త్రీల పరిస్థితి దారుణంగా మారింది. బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో కొన్ని చట్టాలు రూపొందించబడ్డాయి. కులాంతర వివాహ చట్టం, వితంతు పునర్వివాహం, విడాకులు వంటి అంశాలపై చట్టాలు వచ్చాయి. స్త్రీ విద్య ప్రోత్సహింపబడింది. స్త్రీ విద్య స్త్రీలను కేవలం ఒక భార్యగా, తల్లిగా మాత్రమే కాక సాంఘిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధిలో భాగంగా చూడగలిగేలా చేసింది. స్వాతంత్రానంతరం, భారత రాజ్యాంగం స్త్రీల కోసం కొన్ని ప్రత్యేక చట్టాలను చేసింది. అన్నింటా సమాన హక్కులు కల్పించింది. 14ఏండ్ల వరకు బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను నిర్దేశించింది. అయితే పితృస్వామిక వ్యవస్థ స్త్రీ విద్యను అణగద్రొక్కుతూనే ఉంది. అసంఖ్యాకులైన స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రమూ శూన్యం. అయితే పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో పురుషాధిక్యత అంతగా కనపడదు. స్త్రీలు ఏదో ఒక ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనడం వలన కుటుంబ పరంగా నిర్ణయాలు తీసుకునేప్పుడు వారి అభిప్రాయాలకు అవకాశం ఉంది. కానీ ఈ వర్గం స్త్రీలకు విద్య లేదు. అయితే పొలం పనుల్లో, పశుపోషణలో వీరి పాత్ర శక్తివంతమైనది కాబట్టి వారి మాట కొంత చెల్లుబడింది.
మధ్యతరగతి స్త్రీలను గురించి చర్చించేటప్పుడు వారిని గృహిణులుగా, ఉద్యోగులుగా, విద్యార్థులుగా వర్గీకరించి చూడటం సబబు. అయితే వీరందరిపైనా ప్రపంచీకరణ ప్రభావం అత్యధికం. కుంకుడుకాయ రసం, కొబ్బరినీళ్లు, పాలు, మంచినీళ్లు డబ్బాల్లో ( ప్యాకెట్స్, సాచెట్స్) పోసి అమ్ముతారని మనం ఊహించి కూడా ఉండం. ఇప్పుడా వినిమయ సంస్కృతికి లోబడి పోయాం. షాంపూ సాచెట్స్ మన నిత్యవసరాల్లో ఒకటి. అయితే నిత్యావసరం, లగ్జరీ పదాలకు విస్తృతార్థం ఏర్పడింది. ఒకప్పుడు ఫ్రిజ్ లగ్జరీ వస్తువు. ఇప్పుడు అత్యవసరం. అలాగే సోఫాలు కుర్చీలు, పరుపులు వంటివి కూడా నిత్యావసరాలయ్యాయి. సుఖంగా బతకడం తప్పు కాకపోవచ్చు. కానీ అవి లేకపోతే గడవని పరిస్థితి ఏర్పడి అవి సమకూర్చుకోవడానికి మధ్యతరగతి మహిళలు నానా అగచాట్లు పడుతున్నారు. ఒకప్పుడు ఆదాయంలో మదుపు చేసిన తర్వాతే ఖర్చు పెట్టే వాళ్ళు. ఇప్పుడు వస్తువులను ఇన్స్టాల్మెంట్ రూపంలో కొని తమ రేపటి ఆదాయం పైన కూడా అప్పులు చేస్తున్నారు. ఈ వర్గం స్త్రీలకి తమ పిల్లల చదువు తలకు మించిన భారం అవుతోంది. అనుకోని ఖర్చు వస్తే ఆ కుటుంబం తలక్రిందులు అవుతున్నది.
నేషనల్ ఇన్కమ్ స్టాటిస్టిక్స్‌లో మహిళలు 26శాతం, పురుషులు 52శాతం పని చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆర్థికంగా, సామాజికంగా 'పని' నిర్వచనం వేరుగా ఉంది. మహిళలు చేసే చాలా పనులు ఆర్థిక పరంగా గణనలో లేకపోవడం విషాదం. ఉద్యోగినుల పరిస్థితి చర్చించేటప్పుడు సంఘటిత రంగంలో పనిచేసే స్త్రీలు, అసంఘటిత రంగంలో పనిచేసే స్త్రీలు అని విభజింపవచ్చు. ఏదైనా సంస్థలో ఉద్యోగ నియామకానికి కొన్ని రూల్స్, కచ్చితమైన వేతన పద్ధతి, సెలవులు ఉన్నప్పుడు అది సంఘటిత రంగం అని చెప్పొచ్చు. ఇందులోనూ ప్రభుత్వ, ప్రయివేటు రంగాలుగా మరొక విభజన చేయొచ్చు. ఇక్కడ ఉద్యోగ భద్రత ఉంటుంది. సాధారణంగా దిగువ ఎగువ మధ్య తరగతి మహిళలు ఈ వర్గంలోకి వస్తారు. ఈ 75 సంవత్సరాల్లో మహిళలు ఉన్నత చదువులు చదవగలిగి ఎన్నో రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ రాణిస్తున్నారు. అయితే ఎంత చదువుకున్నా, ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నా సంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు కూడా సమస్యలు తప్పడం లేదు. పితృస్వామ్యం అంత తేలిగ్గా మన సమాజాన్ని వదలడం లేదు. అధిక శాతం ఇలాంటి కుటుంబాల్లో నిర్ణయాధికారం మగవారికే ఉంటుంది. తమ ఏటీఎం కార్డుని గృహిణి అయిన తన భార్య చేతిలో పెట్టే పురుషులు కూడా లేకపోలేదు. గానీ, సాధారణంగా మనం ఏదైనా సమస్య చర్చించేటప్పుడు అధికశాతం ఎలా ఉందో అదే మాట్లాడుకుంటాం. ఈ మధ్య తరగతి ఉద్యోగినులలో పురుషాధిక్యత ఒక సమస్య అయితే, పనిచేసే చోట లైంగిక వేధింపులు మరొక సమస్య. వేధింపబడ్డ మహిళలు, తమపై వారికి గానీ, ప్రభుత్వం ఏర్పరచిన కమిటీలకు గానీ కంప్లైంట్ ఇవ్వరు. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. కంప్లైంట్ ఇచ్చినప్పుడు నలుగురు తమని గమనిస్తారనో, 'నీ ప్రవర్తనలో ఏ లోపం లేకపోతే అతడు నీతో అలా ఎందుకు ప్రవర్తిస్తాడు' అని తిరిగి తమనే ప్రశ్నిస్తారనో, ట్రాన్స్పర్ చేస్తారనో, నలుగురి నోట్లో నానడం ఎందుకనో బాధితులు మౌనం వహిస్తారు. ఇంకొన్నిసార్లు కంప్లైంట్ చేసిన మహిళలే పనిష్మెంట్కు గురవుతుండటం కూడా చూస్తూనే ఉన్నాం. ఉద్యోగినుల మరొక సమస్య చాలాచోట్ల స్త్రీలకు ప్రత్యేకమైన రెస్ట్ రూమ్స్ ఉండటం లేదు. చైల్డ్ కేర్ సెంటర్స్ లేవు. ఉద్యోగినులకు చిన్నపిల్లల సంరక్షణ చాలా పెద్ద సమస్య. ఇంటిదగ్గర ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే సరే, లేదా పిల్లల సంరక్షణ తలకు మించిన భారం అవుతున్నది.
ఇక అసంఘటితరంగాలలో పనిచేసే మహిళల సమస్యలు మరింత క్లిష్టతరంగా ఉన్నాయి. వ్యవసాయం తదితర సంబంధిత పనులు, మైనింగ్ కన్స్ట్రక్షన్ పనులు, హౌటల్లు, మాల్స్, బట్టల దుకాణాలు, ఇంటి పనిలో సహాయం చేసే స్త్రీలు, కూరలు, పండ్లు వంటివి అమ్మే వారు... ఈ విధంగా అసంఘటిత రంగంలో పనిచేసే మహిళల శాతం ఎక్కువే. వీరిలో చాలా ఇండ్లల్లో మగవారి సంపాదన ఇంటికి చేరదు. తాగుడు వ్యసనం ఆ కుటుంబాల్ని పట్టి పీడిస్తుంది. మగవారి సంపాదన ఇంటికి ఉపయోగపడక పోగా, ఆడవారి సంపాదనను కూడా బలవంతంగా లాక్కోవడం, ఇవ్వకపోతే కొట్టడం నిత్యకృత్యం. మద్యం ఆ కుటుంబాల్ని ఎంతగా నాశనం చేస్తోందో అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వాలు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయానికి ఒక వ్యసనంలా అలవాటుపడిపోయాయి. ఒకే పని చేసే స్త్రీ, పురుషులకి సమాన వేతనం ఉండటం లేదు. గనులు వంటి ప్రమాదకరమైన చోట పని చేసే వారికోసం, యాజమాన్యాలు ఆరోగ్య, భద్రతాపరమైన కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఉదాహరణకి సున్నపు బట్టీల్లో పనిచేసే వారికి కనీసం చేతికి తొడుగులు కూడా లేకపోవడం. అభ్రకం గనుల్లో పనిచేసే వారికి శ్వాస సంబంధిత వ్యాధులు నుండి రక్షణ ఏర్పాట్లు లేకపోవడం. పైగా ఉద్యోగ భద్రత ఏమాత్రం ఉండదు. వీటన్నిటికీ తోడు లైంగిక వేదింపులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు షరా మామూలే.
'నాగరికుడు' అని తనను తాను మనిషి ఎంతగా అభివర్ణించుకుంటున్నా, స్త్రీల పై జరుగుతున్న అత్యాచారాలను గమనిస్తే, మనం ఇంకా అటవీక రాజ్యంలోనే ఉన్నామని పిస్తుంది. అధికారిక గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతిగంటకు ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురి అవుతున్నారు. ప్రతి 26నిమిషాలకు ఒక మహిళ వేధింపులకు గురౌతోంది. ఏటా మహిళలపై ఈ నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఉద్యోగంలో ఎక్కువ శాతం విధులకు వెళ్లి వచ్చేప్పుడు తమకు రక్షణ లేదని మహిళలు వెల్లడించారని అసోచామ్ సర్వే చెప్తోంది. బీపీఓ, ఐటి అనుబంధ రంగాలు, హాస్పిటాలిటీ, పౌర విమానయానం, నర్సింగ్ హౌమ్స్ లో పనిచేస్తున్న మహిళలు తమకు రక్షణ లేదని చెబుతున్నారు.
వీటన్నిటి దాటుకుని పోయేందుకు మహిళ ఇంకా పోరాడవలసే ఉన్నది. అధిక శాతం స్త్రీలలో సహనం ఎంతగా ఉంటుందో, పోరాడే గుణం కూడా అంతగానే ఉంటుంది. కానీ మహిళల్లో ఆ చైతన్యం అనేది విషయాలపట్ల అవగాహన, పరిజ్ఞానం ఉన్నప్పుడే వస్తుంది. అప్పుడే మహిళకు నిజమైన స్వాతంత్య్రం సిద్ధిస్తుంది.
- వి. నాగగాయిత్రి,
సెల్: 9440465797