Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈరోజు దేశంలో రాజకీయ పార్టీలుగానీ, ప్రభుత్వాలుగానీ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాల మీద ఉచితాల పేరిట పెద్ద చర్చ జరుగుతోంది. ప్రధాని మోడీ స్వయంగా ఈ ఉచితాలు పంచిపెట్టే సంస్కృతి సమాజానికి చేటు చేస్తుందని, దీని ఫలితంగా ఎయిర్ పోర్టులు, హైవేలు, ఇన్ఫ్రాÛస్ట్రక్చర్ నిర్మాణం కష్టతరం అవుతుందని, సంక్షేమ పథకాల వల్ల దేశానికి నష్టం జరిగిపోతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో బీజేపీ నాయకుడు ఈ ఉచితాలు (సంక్షేమ పథకాలు) ఎత్తివేయాలంటూ ఏకంగా కేసు సుప్రీం కోర్టులో వేసాడు. సుప్రీం కోర్టు ఉచితాలు, సంక్షేమ పథకాల మధ్య తేడాను నిర్థిష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల బకాయిలు రద్దు చేస్తూ, వాటికి ప్రోత్సాహకాలు అని అందమైన పేరు పెడుతూ, పేదలకిచ్చే సంక్షేమ పథకాలను మాత్రం ఉచితాలు అంటున్నది. ప్రభుత్వాలు బాధ్యతగా ప్రజలకు అందించాల్సిన కనీస అవసరాలను ఉచితాలని హేళన చేస్తూ సంక్షేమ పథకాల రద్దుకు కుట్ర పన్నుతున్నది. దేశానికి వెన్నుముక అయిన రైతుల రుణమాఫీకి చేతులు రాని మోడీ ప్రభుత్వం, కార్పొరేట్ శక్తులకు మాత్రం రైటాఫ్ పేరిట లక్షల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేస్తుంది. రైటాఫ్ వల్ల, కార్పొరేట్లకు తగ్గించిన టాక్సులవల్ల కలిగే నష్టాలను పూరించడానికి సెస్సులను పెంచుతూ సామాన్యుడి జేబులకు చిల్లులు పెడుతున్నది.
డా. బి.ఆర్. అంబేద్కర్ అభిప్రాయం ప్రకారం... ఆర్థిక, సామాజిక, విద్యా, వైజ్ఞానిక రంగాలలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడం భారత ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా కలిగి ఉంది. అన్ని వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన విధి. భారత రాజ్యాంగం తనకుతాను సంక్షేమ రాజ్యంగా ప్రకటించుకుంది. రాజ్యాంగంలోని 39వ అధికరణ (సి) ప్రకారం దేశ సంపద కొందరి దగ్గరే కేంద్రీకరింపబడకుండా చూడాలి. 46వ అధికరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ఆర్థిక ప్రయోజనాల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలి. ఆర్టికల్ 47 ప్రకారం దేశ ప్రజలందరికీ పౌష్టికాహారాన్ని అందించడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం, జీవన పురోగతిని పెంపొం దించడం ప్రభుత్వాల బాధ్యత. భారత రాజ్యాంగ పీఠిక, ఆదేశిక సూత్రాలలో సంక్షేమ రాజ్యం యొక్క లక్ష్యాన్ని స్పష్టంగా పొందుపరచడం జరిగింది.
ఫాసిస్ట్ నేత ముస్సోలినీ ''రాజ్యం - కార్పొరేట్ కంపెనీల కలయికే కార్పొరేట్ స్వామ్యం'' అని పేర్కొన్నారు. అతని వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఇక్కడి పాలకులు అందుకు తగ్గట్టుగానే అడ్డూ అదుపూ లేకుండా బడా కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా పాలన సాగిస్తున్నారు. ఉచితాలపై మద్యతరగతిలో వ్యతిరేకత రెచ్చగొట్టి వారి దృష్టిని కార్పొరేట్ ఉద్దీపనల నుండి మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రపంచంలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టని దేశం లేదు. సంక్షేమం ఆధునిక ప్రభుత్వాల ప్రాథమిక లక్షణం. అభివృద్ధి ఆధారిత అసమానత లను రూపుమాపడానికి ప్రభుత్వాలు ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది. సంక్షేమ పథకాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకత్వం రేపు సంక్షేమ పథకాలు ప్రకటించకుండా ఎన్నికలలో పోటీ చేస్తుందా? అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ యోజన, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, జన్ ధన్ యోజన, బేటీ బచావో - బేటీ పఢావో, స్టాండప్ ఇండియా, ప్రధాన మంత్రి ఉజ్వల, ప్రధాన మంత్రి కిసాన్ పెన్షన్ యోజన వంటి పథకాల మాటేమిటి? కేవలం రహదారులు, విమానాశ్రయాలు అభివృద్ధి అయినంత మాత్రాన్నే దేశం అభివృద్ధి అయినట్లు కాదు. ప్రజలందరికీ విద్య, వైద్యం, ఉపాధి దొరికినప్పుడే నిజమైన అభివృద్ధి అన్న కనీస సోయి ఈ బీజేపీ పాలకులకు లేకపోయింది.
సంక్షేమ పథకాలు, నగదు బదిలీ వలన ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి, తద్వారా ఉత్పాదకత పెరిగి వారు సంపద సృష్టికి కారణం అవుతారు. ప్రజలకు సంక్షేమ పథకాలు వద్దనడం సమాజ అభివృద్ధికి గొడ్డలి పెట్టు, రాజ్యాంగ విరుద్ధం. సంక్షేమం భిక్ష కాదు, ప్రజల హక్కు. సంక్షేమం-అభివృద్ధి జోడెడ్ల బండిలా ముందుకు సాగినప్పుడే దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది.
- కాసు మాధవి
సెల్: 9492585106