Authorization
Tue April 08, 2025 03:36:09 pm
బైరాన్‌పల్లి బలిదానానికి నేటికి 74ఏండ్లు. ఒకప్పుడు వరంగల్జిల్లాలో, ఇప్పుడు సిద్దిపేటజిల్లాలో ఉన్న ఈ ఊరిలో... భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో జలియన్‌వాలాబాగ్‌ను పోలిన నరమేధం జరిగింది. రజాకార్ల సైన్యాధిపతి, మానవ మృగం ఖాసీం రజ్వి ఆకృత్యాలకు, ఆగడా లకు, అన్యాయాలను ఎదురోడ్డి నిలిచిన పోరాటాల పురిటిగడ్డ వీరబైరాన్‌పల్లి. నిజాం నిరంకుశ నరహంతక పరిపాలనకు వ్యతిరేకంగా రక్తతర్పణ చేసిన కర్మభూమి బైరాన్‌పల్లి. తెలంగాణలో భూమికోసం... భుక్తికోసం... విముక్తికోసం... సాగిన మహౌన్నత సాయుధ తెలంగాణ పోరాటంలో మరువలేని నెత్తుటి సంతకం బైరాన్‌పల్లి.
1948 మే నెలలో 60మంది రజాకార్లు బైరాన్పల్లిపై దాడికి యత్నించి విఫలమయ్యారు. రెండవసారి 150మంది రజాకార్లు దాడికి పాల్పడి ఓటమిపాలయ్యారు. ఈ దాడిలో 20మంది రజాకార్లు చనిపోయారు. దీంతో అప్పటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ 'హాసీం' బైరాన్‌పల్లి గ్రామాన్ని తిరుగుబాటు గ్రామంగా ప్రకటించాడు. బైరాన్‌పల్లిని ఏరోజైనా నేలకూలుస్తానని ప్రతిన బూనాడు. ఇలా కక్షపెంచుకున్న రజాకార్లు ఏదో ఒకరోజున పెద్దఎత్తున దాడి చేసే అవకాశముందని, గ్రామంలో ఎవరూ ఉండవద్దని అప్రమత్తం చేస్తూ గ్రామ రక్షకదళానికి గెరిల్లాదళం పంపిన వర్తమానం అందలేదు. ప్రజలంతా వారి రోజువారి పనులలో నిమగ మయ్యారు.
ఖాశీంరజ్వీ పర్యవేక్షణలో బైరాన్పల్లిపై మూడవసారి దాడికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీంతో ఆగస్టు 26 రాత్రి నిజాం సైనికులు, రజాకార్లు అంతాగలిసి 500మంది జనగామలో బసచేసి 1948 ఆగస్టు 27 తెల్లవారుజామున ఒంటిగంటకు పది బస్సుల్లో జనగామ-సిద్దిపేట దారిగుండా బైరాన్‌పల్లి గ్రామానికి బయలుదేరారు. గ్రామం చుట్టూ డేరాలు వేశారు. తెల్లవారుజామున దొంగదాడికి సిద్ధంగా ఉన్నారు. రైతులు లేగలను, దూడలను ఆవుల వద్దకు పాలకు వదులుతున్న వేళ అది... తెల్లవారుజామున 4గంటల సమయం... అప్పుడే బహిర్భూమికి వెళ్లిన ఉల్లెంగల నరసయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను వెంటబెట్టుకొని గ్రామంలోకి వస్తుండగా వారిని వదిలించుకొని నరసయ్య గ్రామంలోకి పరిగెత్తాడు. రజాకార్లు గ్రామంలోకి చొరబడ్డారంటూ ప్రజలను అప్రమత్తం చేశాడు. బురుజుపైన ఉన్న కమాండర్ రాజిరెడ్డి ప్రజలంతా రక్షణలోకి వెళ్లేందుకు నగారా మోగించాడు. బురుజుపై కాపలాగా ఉన్న మోటం రామయ్య, మోటం పోచయ్య, బలిజ భూమయ్య నిద్ర మత్తు వదిలించుకునే లోపే రజాకార్ల తుపాకీ గుండ్లకు బలయ్యారు. ఫిరంగుల నుంచి వచ్చిపడ్డ నిప్పురవ్వలతో బురుజుపై నిల్వచేసిన మందుగుండు సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. దీంతో గ్రామంలోకి ప్రవేశించిన రజాకార్లు దొరికినోళ్లను దొరికినట్టే మట్టుబెట్టారు. అంతటితో ఆగకుండా ఇల్లిల్లూ తిరిగి 96మందిని పట్టుకొని, పెడరెక్కలు విరిచి, జోడుగా లెంకలుగట్టి, వరుసగా నిలబెట్టి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. వారి రక్తదాహాన్ని తీర్చుకున్నారు.
శవాలు గుట్టలుగావేసి, వాటి చుట్టూ వందమంది మహిళలను చెరబట్టి వివస్త్రలుగాచేసి బతుకమ్మలాడించారు. కొందరు మహిళలు ఇదంతా భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. అదేరోజు తెల్లవారేసరికి కూటికల్ గ్రామం చేరు కున్నారు. ఊరు కరణందొర నర్సింగరావు సహాయంతో బురుజుపైన ఉన్న గ్రామరక్షక దళసభ్యులు 25మంది యువకులను ప్రాణహాని తలపెట్టమని నమ్మించి కిందికి దించారు. జోడు లెంకలుగట్టి ఊరు పొలిమేరలో ఉన్న మర్రిచెట్టువద్దకు తీసుకెళ్లారు. వరుసగా నిలబెట్టి ఒకే తూటాతో 22 మందిని కాల్చిచంపారు. అలా రికార్డుల ప్రకారం రెండు గ్రామాలలో 118 మందిని హింసించి కాల్చిచంపారు. కానీ ఈసంఖ్య అంతకంటే ఎక్కువే ఉంటుం దని స్థానికులు చెబుతున్నారు. బైరాన్‌పల్లి కూటిగల్ వీరుల చరిత్ర అజరామరం...
నేడు బైరాన్‌పల్లి వీరుల సంస్కరణ దినం
- మన్నె చంద్రయ్య
సెల్: 9441681685