Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకవైపు కనీవినిఎరుగని ఎండలు, మరోవైపు భరించలేని ధరలు బ్రిటిష్ ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. బ్రిటన్ చరిత్రలోనే ఎన్నడూ ఎరుగనంత అత్యధిక స్థాయిలో 40.3 డిగ్రీల సెలిషియస్ ఉష్టోగ్రత ఈ ఏడాది జులై 19న లింకన్షైర్ నగరంలో నమోదైంది. గత మూడు నెలల కాలంలో బ్రిటన్ను మూడు హీట్‌వేవ్‌లు తాకాయి. ప్రజలు ఇండ్లలోనుండి బయటకు రావడానికే భయపడిపోయారు. సాయంకాలం అయితే చాలు ఎక్కడ నీరు కనిపిస్తే అక్కడ మునిగి సేద దీరడానికి ప్రయత్నించారు.
ద్రవ్యోల్బణం 10శాతం దాటిపోవడంతో అధిక ధరల మంటనూ తట్టుకోలేక బ్రిటిష్ కార్మికవర్గం గత 40ఏండ్లలో మొదటి సారి అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున సమ్మె బాట పట్టింది. పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ బ్రిటన్ రేల్వే, పోస్టల్, పోర్ట్, బస్ సర్వీసు కార్మిలు, ఎయిర్‌లైన్స్ సిబ్బంది, నర్సులు, టీచర్లు... ఒకరేమిటి అన్ని రంగాల కార్మికలు సమ్మెలోకి దిగుతున్నారు. చివిరికి లాయర్లు కూడా ప్రజలు తమకు ఇచ్చే ఫీజులు చాలటం లేదు కనుక ప్రభుత్వం కొంత గ్రాంటుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. దీన్ని పరిశీలకులు ''కార్మిక నిరసనల వేసవి'' (సమ్మర్ ఆఫ్ లేబర్ డిస్కంటెంట్) అంటున్నారు. 1970వ దశకంలో చూసినట్లే కార్మికవర్గ పోరాటాల వెల్లువను ఆ దేశం నేడు చూస్తున్నది.
బ్రిటిన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్నీ, పాలక వర్గం తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్నీ ఎదుర్కొంటున్న సమయంలో పాలకులు తమపైకి నెట్టేస్తున్న సంక్షోభ భారాల నుండి తప్పుకోడానికి కార్మికవర్గం సమ్మె పోరాటాల్లోకి అనివార్యంగా రావాల్సి వచ్చింది. పాలక కన్సర్వేటివ్ పార్టీ వరుస కుంభకోణాల్లో కూరుకుపోయి ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సి వచింది. తదుపరి ప్రధానమంత్రి పదవికి కన్సర్వేటివ్ పార్టీ నాయకులు రిషి సునాక్ (ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు), లిజ్ ట్రస్ మధ్య పోటీ ఉత్కంఠభరితంగా సాగుతోంది.
అసలే ఆర్థిక మాంద్యం దానికి తోడు అమెరికాతో కలిసి బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాలు కోరి తెచ్చుకున్న ఉక్రెయిన్ యుద్ధం... వీటితో దేశంలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం రెండంకెల సంఖ్యను దాటిపోయి 12.5శాతానికి చేరుకుంది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశానికి అంటుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం విధించిన అధిక పన్నులు, రుణభారం... వీటన్నిటినీ తట్టుకోడానికి తమ వేతనాలు పెంచాలని కార్మికులు కోరుతున్నారు. ద్రవ్యోల్బణం నేపథ్యంలో కార్మికుల నిజవేతనాలు దారుణంగా పడిపో తున్నాయి. కొన్ని రంగాల్లో కార్మికుల వేతనాలు పెంచడానికి యాజమాన్యాలు ముందుకొస్తున్న ప్పటికీ ద్రవ్యోల్బణం నుండి రక్షణ కల్పించే స్థాయిలో లేకపోవడంతో వారు చర్చలనుండి బయటకు వచ్చి సమ్మెల్లో పాల్గొంటున్నారు.
దాంతో ఈ వేసవి కాలంలో బ్రిటన్ 1970వ దశకంలో మాదిరిగా కార్మికవర్గ అశాంతిని చూస్తున్నదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆనాడు కార్మి సమ్మెతో దేశ ఆర్థిక వ్యవస్త స్తంభించిపోయింది. పారిశుధ్య కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో వీధులన్నీ చెత్తతో నిండిపోయాయి. చివరికి చనిపోయిన వారి శవాలు కూడా పూడ్చకుండా వదిలివేయబడ్డాయి.
బ్రిటన్ రైల్వే కార్మిలు ఆగస్టు 18, 19 తేదీల్లో రెండు రోజులపాటు గత ముప్పయ్యేండ్లలో చూడని అతి పెద్ద సమ్మె చేశారు. సమ్మెలో వేలాది మంది కార్మికులు పాల్గనడంతో రెండు రోజుల పాటు లండన్ నగరంలోని అండర్ గ్రౌండ్ రైళ్ల (ట్యూబ్ రైలు)తో సహా దేశంలోని రైలు రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. తూర్పు ఇంగ్లండ్‌లోని అతి పెద్ద పోర్టు అయిన ఫెలిక్స్స్టోవెలో డాక్ కార్మికులు ఎనిమిది రోజుల పాటు పని నిలిపేసి రికార్డు సృష్టించారు. శుక్రవారం నుండి ట్రిటన్లోని 1,70,000 మంది టెలికమ్, పోస్టల్ కార్మిలు ఆరు రోజుల పాటు సమ్మె చేస్తున్నారు. ఇందులో రాయల్ మెయిల్‌కు చెందిన 1,15,000 మంది ఉన్నారు. 2013లో రాయల్ మెయిల్‌ను ప్రయివేటీకరించిన తరువాత పోస్టల్ కార్మికులు చేస్తున్న తొలి జాతీయ సమ్మె ఇది. ప్రపంచ వ్యాపితంగా 180 దేశాల్లో టెలికమ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుజాతి టెలికమ్ కంపెనీ బిటి గ్రూపులోని 40,000 మంది కార్మికులు కూడా సమ్మెకు దిగారు. ఆగస్టు 30, 31 రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మెలో లండన్ నగరంలోని బిటి గ్రూపు కార్యాలయ సిబ్బందే కాకుడా ఇంజినీర్లు ఇతర పైస్థాయి సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. ఆగస్టు 26, 27, 30 తేదీల్లో మూడు రోజుల పాటు క్రౌన్ ఆఫీసులోని 3,500 మంది పోస్టాఫీస్ కార్మికులు, సప్లయి చైన్, అడ్మిన్ కార్మికులు కూడా సమ్మె చేస్తున్నారు. బ్రిటిష్ కమ్యూనికేషన్స్ వర్కర్స్ యూనియన్ (సిడబ్ల్యుయు) సమ్మె బాలెట్లో 90 మంది కార్మికులు సమ్మెకు సై అన్నారని యూనియన్ ప్రధాన కార్యదర్శి డేవ్ వార్డ్ చెప్పారు. పోస్టాఫీసు కార్మికులు మే 3 నుండి సమ్మెకు దిగడం ఇది నాల్గవ సారి. ద్రవ్యోల్బణం 12 వరకు పెరిగిపోతే యాజమాన్యాలు కేవలం 5శాతం వేతనం పెంచుతామనీ, 500 పౌండ్ల బోనస్ ఇస్తామని ప్రకటించడం కార్మికలను సంతృప్తి పరచలేదు.
'ఈ జీవన వ్యయ సంక్షోభంలో మేము మా ఉద్యోగాలు, వేతనాలు, జీవన పరిస్థితులను రక్షించు కోడానికి ఎంతవరకైనా పోరాడతాం' అని బ్రిటిష్ ప్రధాన కార్మిక సంఘం 'యునైట్' అధ్యక్షురాలు షారొన్ గ్రహమ్ చెప్పారు. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం గత 40ఏండ్లలో ఎన్నడూ చూడనంత అధిక స్థాయికి చేరుకుంది. ఈ వేసవిలో అది 13 శాతానికి తాకవచ్చునని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తెలిపింది. దాంతో బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ సుదీర్ఘ కాల మాంద్యంలోకి అడుగుపెట్టింది. ''నిజవేతనాలు రికార్డు స్థాయిలో పడిపోతున్న ఈ తరుణంలో కార్మికుల వేతన విలువను కాపాడుకోడానికి గతంలో ఎన్నటికన్నా కార్మికవర్గం ఐక్యంగా పోరాడాలి'' అని గ్రహమ్ చెప్పారు.
ఇంతటి మాంద్యం, ద్రవ్యోల్బణంలోనూ (మాంద్యోల్బణ ంాస్టాగ్ఫ్లేషన్) కార్మికుల వేతనాలు తగ్గిపోతున్నాయే గాని పెట్టుబడిదారుల లాభాలు మాత్రం తగ్గడంలో లేదు. వాళ్లు వేలాది కోట్ల పౌండ్ల సంపద ఈ ఆపద్కాలంలో కూడా పోగుచేసుకుంటున్నారు. మరోవైపు కార్మికులకు వేతనాలు పెంచడం వల్లే ద్రవ్యోల్బణం పెరుగుతున్నదని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌తో సహా పెట్టుబడిదారీ బాజాలన్నీ ప్రచారం చేస్తున్నాయి. కానీ ''వేతనాల వల్ల ద్రవ్యోల్బణం పెరగడం లేదు, ఆహారం ధరలు విపరీతంగా పెరడం వల్లనే ద్రవ్యోల్బణం పెరుగుతోందని జులై నెల ద్రవ్యోల్బణం రికార్డు తెలియజేస్తోందని గ్రహమ్ స్పష్టం చేశారు. బ్రిటన్ పెట్టుబడిదారుల లాబీ గ్రూపు 'సిబిఐ' కూడా కార్మిక సమ్మెలకు వ్యతిరేకంగా ప్రచారం అందుకుంది. 'ఇంధన ధరలతోపాటు అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్న తరుణంలో కార్మికుల సమ్మెను అర్థం చేసుకోగలం' అని చెబుతూనే, అయితే అత్యధిక కంపెనీలు 'ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచగలిగే సామర్ధ్యం గలిగి లేవు' అని పేర్కొన్నది. మొత్తం మీద కంపెనీలది లాభాల సమస్యయితే కార్మికులు జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు.
సమ్మెలను అడ్డుకోడానికి బ్రిటిష్ కన్సర్వేటివ్ ప్రభుత్వం రెండు విధాలుగా కుట్రలు చేస్తోంది. ఒకవైపు అది సమ్మెలు భగం చేయడం కోసం సమ్మెచేసే కార్మికుల స్థానంలో ఏజెన్సీ స్టాఫ్ నియమించుకోడానికి అనుమతిస్తూ ఇటీవల చట్టం చేసింది. మరోవైపు ప్రతిపక్ష లేబర్‌పార్టీ కార్మికులను సమ్మెలకు పురిగొల్పుతున్నదని ప్రచారం చేస్తున్నది. బ్రిటిష్ కార్మికులకు ప్రతిపక్ష లేబర్ నాయకులు మద్దతిస్తున్నారని బోరిస్ జాన్సన్ ఒకవైపు లేబర్పార్టీపై నిందలు వేస్తుంటే మరోవైపు సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావ ప్రదర్శనల్లో లేబర్ ప్రజా ప్రతినిధులు పాల్గొనరాదని ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్టార్మెర్ హెచ్చరిక చేశాడు. అయినా చాలా మంది ఈ హెచ్చరికలను లెక్క చేయకుండా సభల్లో, ర్యాలీల్లో పాల్గొన్నారు.
లండన్ లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్ 'హార్రొడ్స్' యాజమాన్యం తమ కార్మికులు సమ్మె చేస్తే ఏజెన్సీ స్టాఫ్‌ను ఉపయోగించుకుంటామని ప్రకటించింది. ప్రభుత్వ, కంపెనీల ఈ చర్యలపట్ల కార్మికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని రంగాల కార్మికులు సమ్మె పోరాటాలకు సిద్ధమవుతున్నారు. తమకు సరిపడ్డా వేతనాలు పెంచకపోతే సమ్మెలోకి దిగుతున్నట్లు అనేక రంగాల సిబ్డంది హెచ్చరికలు జరీచేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుట పడే పరిస్థితి లేదు కనుక ఈ వేసవి కాలంలోనే కాదు ఆ తరువాత కూడా సమ్మెల వెల్లువ కొనసాగుతుందని పరిశీలకులు చెబుతున్నారు.
- ఎస్. వెంకట్రావు