Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాదులో మతఉద్రిక్తతలు పునరావృత మవడం రాజకీయ నాయకులనే గాక సామాన్య ప్రజానీకాన్ని కూడా ఆందోళనపరిచింది. బీజేపీ మతతత్వ రాజకీయాల ముప్పును గురించి ఎంత చెబుతున్నా అలసత్వం చూపిన వారంతా ఉలిక్కిపడాల్సి వచ్చింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక వైపు నుంచి పాదయాత్ర పేరిట బెదిరింపులు, మతతత్వ హెచ్చరికలు చేస్తుంటే, మరోవైపు ఎంఎల్ఎ రాజాసింగ్ హద్దూ అదుపులేని విద్వేష వ్యాఖ్యలతో వాతావరణం కలుషితం చేశారు. పాతబస్తీలోనూ ఇతర చోట్ల కూడా పోలీసుల మొహరింపు అనేక చోట్ల ఆంక్షలు అనివార్యమైనాయి. గత ఎనిమిదేండ్లుగా కొంత ప్రశాంతంగా ఉన్న నగరం ఉలిక్కిపడింది.
దీనికన్నా ముందే బండి సంజరు తన పాదయాత్రలో భగవద్గీత వివాదం రగిలించారు. అంతిమయాత్రలలో భగవద్గీత రికార్డు వేయడం వల్ల అది చావుగీత అయిపోతోందని కోపగించారు. ఇకపైన అలా చేస్తే వైకుంఠ రథం అనే శవశకటం టైర్లు కోసేస్తామని ''ఘనమైన'' కార్యక్రమం ప్రకటించారు. ఘంటసాల పాడిన గీత రికార్డులు వేయడం అందరూ చేస్తుంటారు. అర్థశత్దాంపైగా ఈ పని చేస్తున్నా అదేమీ మృత్యుగీత కాలేదు. పైగా అంతిమ యాత్ర వంటి విషాద సమయంలో ఎవరు ఏమి చేయాలనేది మరణించిన వారికీ, వారి కుటుంబ సభ్యులకూ మాత్రమే సంబంధించిన విషయం. భగవద్గీతపై అనేక అభిప్రాయాలూ అంచనాలూ ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా టైర్లు కోయడం లాంటి పనులు రాజకీయ పార్టీ ప్రకటించడమేంటి? ఇతర మతస్తులతో పాటు హిందూమతస్తులపై కూడా హిందూత్వ ఎలా దాడిచేస్తుందనడానికి ఇదో ఉదాహరణ. సహజంగానే దీనిపై విమర్శలు వచ్చాక కొంత తగ్గారు. మౌలికంగా అదే వాదనతో ఉండి అవకాశం దొరికినప్పుడల్లా వినిపిస్తున్నారు. ఇటీవలనే వారి జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి మరుగుపడిన వివాదాన్ని మళ్లీ రగిలించే ప్రయత్నం చేశారు.
మునావర్ షో పేరిట విషప్రచారం
ఈ మధ్యలోనే మునావర్ ఫరూఖ్ అనే రాజకీయ విదూషకుడు (స్టాండింగ్ కమెడియన్) హైదరాబాదులో ఏర్పాటు చేసుకున్న షోను అడ్డుకోవాలంటూ రాజాసింగ్ ప్రకటనలు చేశాడు. ప్రాణాలు పోయినా అడ్డుకుంటానని రెచ్చ గొట్టాడు. ఈ ఫరూక్ ఎక్కడో రాముడిని అవమానించాడనేది ఆయన ఆరోపణ. అయితే సహజం గానే ఈ వాదనను ప్రభుత్వం పోలీసులు తోసి పుచ్చారు. ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయబోననే హామీతో అతనికి అనుమతి నిచ్చారు. అదేదో దేశ ద్రోహమైనట్టు సంఫ్‌ుపరివార్ శక్తులు రభస ప్రారంభించాయి. ఈ కారణంగా మంత్రి కేటీఆర్ కూడా రంగంలోకి దిగి ఈ షోను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విద్వేష రాజకీయాలను ఖండించారు. పోలీసులు కూడా భారీ భద్రత కల్పించి షో పూర్తిచేశారు. వచ్చిన ప్రేక్షకుల కన్నా వారి సంఖ్యఎక్కువగా ఉందని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేశారు గాని సామాన్య ప్రజలేమీ పట్టించుకోలేదు. మీడియా చర్చలలోనూ మతతత్వ వాదనలను గట్టిగా తిప్పికొట్టడం, పాతబస్తీలో పోలీసుల కట్టుదిట్టం కారణంగా అల్లర్లు నివారించబడ్డాయి. సరిగ్గా అది సహించలేకనే రాజాసింగ్ రంగంలోకి దిగారు. ఫరూక్ షో సందర్బంలోనే ఆయన తమ పార్టీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్శర్మలాగా చేయాల్సి వస్తుందని బెదిరించారు. ప్రవక్తపై దారుణ వ్యాఖ్యలు చేసిన నూపుర్‌ను బీజేపీ అధిష్టానం బహిష్కరించాల్సి రావడం తెలిసిన విషయమే. అంతటితో ఆగని రాజాసింగ్ నిజంగానే ప్రవక్తను అవమానించే విడియో విడుదల చేశాడట. పోలీసుల జోక్యంతో తర్వాత దాన్ని తొలగించారు గనక ఇప్పుడు ఎవరికీ కనిపించదు. ఆ పైన శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తున్నందున రాజాసింగ్‌ను అరెస్టుచేశారు. బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. అయినా నిరసన పేరుతో బీజేపీవారు పెద్ద దుమారం లేపారు. తర్వాత సింగ్‌ను హైకోర్టు విడుదల చేసింది. ఏమంటే ఆయనను అరెస్టు చేసే సమయంలో సిఆర్పి41 కింద నోటీసు ఇవ్వలేదనే సాంకేతిక కారణం చూపారు. ఇదేదో పెద్ద విజయమైనట్టు వారు హడావుడి చేస్తుంటే, మరోవైపున నిరసన అంటూ మజ్లిస్ నేతలు కూడా ప్రదర్శనలు జరిపారు. దీంతో పాతబస్తీ భగ్గుమన్నది.
పాదయాత్ర ప్రహసనం
ఇంకోవైపున బండి సంజరు పాదయాత్రలలోనూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నందున ఆయన పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ వరంగల్ పోలీసు కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. వీటిని కూడా సాంకేతిక కారణాలతో కోర్టు పక్కన పెట్టింది. ఆయన విద్వేష ప్రసంగాల విడియో సమర్పించినా దానివెంట వివరాలతో అఫిడవిట్ లేదని కారణం చూపింది. ఈ సమయంలో మీడియా కూడా గ్రీన్ సిగల్ వచ్చినట్టు ఊదరగొట్టింది. వ్యూహాత్మకంగా ఆలోచించిన పోలీసులు రాజాసింగ్‌ను నోటీసు ఇచ్చి అరెస్టు చేసి ఆపైన పీడీచట్టం కింద నిర్బంధించారు. ఈ లోగా ఆయన మరో విడియో విడుదల చేశారు. విచిత్రమేమంటే ఈ మొత్తం పరిణామాలలో బీజేపీ రాష్ట్ర నాయకులెవరూ సింగ్ మాటలు తప్పని చెప్పలేదు. జాతీయ నాయకత్వం చూసుకుంటుందని అన్ని కోణాలూ చూడాలని సన్నాయి నొక్కులు నొక్కారు. కోర్టు మాత్రం ఆయనను జైలుకు పంపింది. పోలీసులు, ప్రభుత్వం అనుమతిస్తే తప్ప ఏడాది వరకూ ఆయన బయిటకు వచ్చే అవకాశముండదు. గతంలోనూ గోరక్షణ పేరిట సింగ్ తీవ్ర విద్వేష వ్యాఖ్యలు చేసి సస్పెండయ్యారు. అప్పుడూ ఇప్పుడూ కూడా బీజేపీ నాయకత్వ చర్య వ్యూహాత్మకమే తప్ప చిత్తశుద్ది లేదనడానికి తదుపరి సంఘటనలే సాక్ష్యమిస్తాయి.
వీర్రాజు వినాయక వివాదం
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నుంచి ఎంపి జీవీఎల్ నరసింహరావు వరకూ వినాయక పందిళ్లకు ప్రభుత్వం ఆటంకం కలిగిస్తున్నదనే పల్లవి ఎత్తుకున్నారు. గత నిబంధనలే కొనసాగించడం తప్ప తామేవీ అదనంగా విధించలేదని ఏపీ అధికారులు చెబుతున్నారు. అయినా సరే హిందూమతానికి రక్షణ లేకుండాపోయిందని బీజేపీ నేతల గగ్గోలు ప్రారంభించారు. బహుశా తెలంగాణ కన్నా వెనకబడకూడదనే వ్యూహం కావచ్చు. గతంలోనూ అంతర్వేదిలో రథం దగ్గం నుంచి రామతీర్థం కపిలతీర్థం అంటూ రకరకాలుగా మతోద్రిక్తతలు పెంచేందుకు బీజేపీ విఫలయత్నం చేసింది. ఆయా సండర్బాలలో టీడీపీ, జనసేన కూడా ఇందుకు గొంతు కలిపాయి. మరోవైపున వైసీపీ తామే అసలైన మత రక్షకులమని నిరూపించుకునేందుకు తంటాలు పడింది. గుంటూరు జిన్నా టవర్‌పై రభస అందరికీ కళ్లు తెరిపించింది. చార్మినార్ జిన్నాటవర్ వివాదాలు బీజేపీ నిజస్వరూపం తెలిసేట్టు చేశాయి. కానీ టీడీపీ మాత్రం బీజేపీతో పొత్తుకు తహతహ లాడుతుండటం, వైసీపీ లోపాయి కారిగా అంటకాగడం పరిస్థితిని సంక్లిష్టం చేసింది. వినాయక వివాదంపై అశోక్ గజపతి రాజు వంటివారు బీజేపీ పాట పాడటం, వారి అనూకూల మీడియాలో అదే పనిగా చర్చ పెట్ట డం ప్రజలను గందరగోళ పర్చే ప్రయత్నమే.
తారలతో రాజకీయం
తెలుగుదేశం జనసేన ల వైఖరి ఆసరా చేసుకుని బీజేపీ కేంద్ర నాయకత్వమే కొత్త ఎత్తుగడలు మొదలె ట్టింది. మునుగోడు ఉపఎన్నిక పేరిట హైదరాబాద్ వచ్చిన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్‌ను కలుసుకోవడం ద్వారా రాజకీయ సంకేతాలిచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రభావం ఏపీపైనా పడుతుందని ఎత్తు వేశారు. తర్వాత జెపి నడ్డా కూడా నితిన్‌ను కలుసుకున్నారు. రామోజీరావుతోనూ భేటీ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి మాత్రం రాజకీయాల్లోకి రాననీ, కాబట్టి బీజేపీతో వెళ్లేది లేదని వారికి తేల్చి చెప్పారు. దాంతో చిన్నా చితక నటీనటులను, క్రీడాకారులను ఆకర్షించేందుకు తంటాలు పడుతూ రెండు రాష్ట్రాలలో ఏదో జరగబోతున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. స్వభావ సిద్ధమైన తమ మతరాజకీయాలను తీవ్రంచేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు గతానుభవాలు, భవిష్యత్ ముప్పులు పట్టించుకోకుండా బీజేపీతోనే వెళ్లాలని టీడీపీపై ఒత్తిడి చేస్తున్నాయి. కేసీఆర్ వ్యతిరేకతను తప్పు పడుతున్నాయి. కుంబకోణాలలో ఇరికిస్తారని బెదిరి స్తున్నాయి. అమిత్ షా నేరుగా రామోజీని కలిసి మాట్లాడటమే ఇందుకు నిదర్శనర. అయితే టీడీపీ మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా అమిత్ షాను కలిశారని కట్టుకథలు వదలి చర్చలు పెడుతున్నారు. మాటిమాటికి ఏవరో ఒకరిపై ఐటి, ఇడి, సిబిఐ దాడులు చేయిస్తున్నారు. కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతనే సంఫ్‌ుపరివార్ భావజాలంతో తెలుగులో కార్తికేయ 2 నిర్మించి రికార్డు వసూళ్లు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాలపై మోడీ ప్రభుత్వం సాగిస్తున్న సామదాన భేద దండోపాయాలకు ఇవన్నీ ఉదాహరణలు. వీటన్నిటిలో మరీ అనర్థదాయకమైంది మత విద్వేషాలు రగిలించే విభజన రాజకీయాలు. వాటిని విస్మరించి బీజేపీ దృతరాష్ట్ర కౌగిలికోసం అర్రులు చాబేవారు దానికి పెద్ద మూల్యమే చెల్లించక తప్పదు. ఈ లోగా ప్రజల సమైక్యతను, మతసామరస్యాన్ని కాపాడు కోవడం పట్ల మరింత అప్రమత్తత వహించాల్సి ఉంటుంది.
- తెలకపల్లి రవి