Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన కళ్ళ ముందే ఒక వికృతమైన నాటకం ప్రస్తుతం సాగుతోంది. వందల, వేల కోట్ల రూపాయల పన్ను రాయితీలను అప్పనంగా గుత్తాధిపతులకు సమర్పించుకుంటున్న మోడీ ప్రభుత్వం దేశంలో కొన్ని తరగతుల ప్రజానీకానికి అందుతున్న ''ఉచిత'' పథకాలు కూడదంటూ తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది. దానికి ముందు నరేంద్ర మోడీ దేశంలో యువత ఈ ఉచితాల ''సంస్కృతి''తో ప్రభావితం కావొద్దంటూ హెచ్చరించాడు. ఆ వెంటనే బీజేపీ కార్యకర్తగా ఉన్న ఒక న్యాయవాది ఈ ''ఉచితాలు'' కొనసాగించకుండా అడ్డుకోవాలంటూ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ వ్యవహారంలోకి సుప్రీం కోర్టును ఎందుకు లాగవలసి వచ్చిందన్నది ఒక అంతుపట్టని వ్యవహారంగా ఉంది. ఒకవేళ కొన్ని రాజకీయ పార్టీలు తాము అధికారంలో ఉన్నచోట్ల ''ఉచితాలను'' అమలు చేస్తూ అక్కడ జరగవలసిన ''అభివృద్ధి''ని జరగనివ్వకుండా ఉంటే అప్పుడు ఆ విషయంలో ఏం చేయాలనేది అక్కడి ఓటర్లకు విడిచిపెట్టెయ్యాలి. ఆ ఓటర్లు గనుక పట్టించుకోకపోతే అప్పుడు బీజేపీ దానిని ఎన్నికలలో ఒక చర్చనీయాంశంగా చేయాలి. ఈ మొత్తం వ్యవహారంలో సుప్రీం కోర్టు నిర్వహించవలసిన పాత్ర ఏమీ లేదు. సుప్రీం కోర్టు గనుక జోక్యం చేసుకుంటే అది చట్టసభల పరిధిలోకి వచ్చే విషయాలలో కోర్టులు అనవసరంగా జోక్యం కల్పించుకోవడమే అవుతుంది. ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ రాష్ట్రాలకు కల్పించిన అధికారాలను హరించడమే అవుతుంది. అంతే కాదు, ఓటర్లు నిర్ణయించుకోవాల్సిన అంశాలను వారికే విడిచిపెట్టెయ్యకుండా అనుచితంగా వారి హక్కులను కుదించినట్లే అవుతుంది. ఏ విధంగా చూసినా, ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం అనవసరమే గాక, మౌలికంగానే అప్రజాస్వామికం కూడా అవుతుంది.
నిజానికి ఇటువంటి విషయాలలో జోక్యం కల్పించుకోడానికి సుప్రీం కోర్టు ఆదినుంచీ వెనుకాడుతూనేవుంది. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రయివేటీకరించాలనే ప్రభుత్వ విధానం రాజ్యాంగపు ఆదేశ సూత్రాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. అయినప్పటికీ, సుప్రీం కోర్టు ఆ విషయంలో జోక్యం కల్పించుకోడానికి నిరాకరించింది. కోర్టు జోక్యం కల్పించుకోవడం అవసరం అని చేసిన వాదనలు ఎంత ఆమోదయోగ్యంగా ఉన్నా, ఆ విధంగా జోక్యం కల్పించుకోవడం అంటే అది చట్టసభల పరిధిలోకి చొరబడడమే అవుతుందన్న కారణంగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోడానికి నిరాకరించింది. బాల్కో ప్రయివేటీకరణపై దాఖలైన కేసు నాటినుండీ చాలా కాలంగా ఇదే వైఖరితో వ్యవహరిస్తోంది. అందుచేత ఇప్పుడు ఈ ''ఉచితాల''పై దాఖలైన కేసు విషయంలో సుప్రీం కోర్టు రంగంలోకి దిగడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. శ్రామిక ప్రజలకు ''ఉచితాల'' రూపంలో అందే రాయితీలను నిలుపు చేసిందనే విమర్శను ఎదుర్కోడానికి మోడీ ప్రభుత్వం సంసిద్ధంగా లేకపోవచ్చు. అందుకే, ఆ పని సుప్రీం కోర్టు ద్వారా జరిపించాలని భావిస్తున్నట్టు ఉంది. అయితే, ఈ కుట్రను అమలు చేయడానికి సుప్రీం కోర్టు ఎందుకు సిద్ధపడుతోందో అది మాత్రం వివరించనలవి కాకుండా ఉంది.
సంక్షేమానికై చేసే ఖర్చు
సంక్షేమానికై ప్రభుత్వాలు చేసే ఖర్చు, ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఇచ్చే రాయితీలు వేరే కోవలోకి వస్తాయని, పేదలకు అందించే ''ఉచితాలు'' మాత్రం వాటికంటే భిన్నమైనవని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే, ఈ ''ఉచితాల''కు, సంక్షేమానికి తేడా ఏమిటో ఆయన వివరించలేదు. మరో సందర్భంలో ఆయన ''హేతువిరుద్ధమైన ఉచితాలను'' రద్దు చేయాలని వ్యాఖ్యానించారు. కాని పేదలకు అందించే ''ఉచితాల''లో హేతుబద్ధమైనవిగా వేటిని పరిగణించాలో, వేటిని హేతు విరుద్ధమైనవిగా పరిగణించాలో, ఆ విధమైన తేడా చూపేందుకు కొలబద్ద ఏమిటో స్పష్టం చేయలేదు. చివరికి ''ఉచితాల'' విషయంలో ఏం చేయాలో సలహా ఇచ్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నట్టు ఆయన మాట్లాడారు.
ఒకవేళ అటువంటి కమిటీని దేనినైనా ఏర్పాటు చేస్తే గనుక, ఆ కమిటీ ఈ దేశంలో గుత్తాధిపతులకు అందిస్తున్న భారీ ''ఉచితాల'' విషయంలో ఏం చేయాలో ఆ విషయాన్ని ముందు పరిశీలించాలి. ఈ దేశంలో సంపద పన్ను లేదు. సంపన్నుల నుండి పన్ను రూపంలో ఆదాయం రాబట్టడానికి ఇప్పుడు అమలులో ఉన్నది ఒక్క కార్పొరేట్ పన్ను మాత్రమే. అందులోనూ భారీ రాయితీలు ఇవ్వడంలో ఔచిత్యం ఏమిటో ఏ కోశాన చూసినా అర్థం కాదు. (వ్యక్తిగత ఆదాయపు పన్నును ఈ కార్పొరేట్లు తేలికగా ఎగవేయవచ్చు. తమ స్వంతానికి వారు చేసే ఖర్చును, కంపెనీ ఖర్చులో కలిపి చూపిస్తారు. అంటే ఆ మేరకు వారి స్వంత ఆదాయాన్ని కూడా ఆ కంపెనీ ఖాతాలో చూపించినట్టే అవుతుంది. ఆ విధంగా వ్యక్తిగత ఆదాయ పన్ను నుండి వారు తప్పించుకుంటారు) కార్పొరేట్ పన్నులో రాయితీ ఇస్తే దాని వలన పెట్టుబడిదారులు పెట్టుబడులు మరింతగా పెట్టేందుకు ముందుకొస్తారన్న వాదన ప్రభుత్వం తన చర్యను సమర్ధించుకోడానికి చేసినట్టుగా ఉన్నదే తప్ప సిద్ధాంతపరంగా కాని, ఆచరణ పరంగా కాని ఆ వాదనకు ఏ విధమైన సమర్థనా లేదు. అందుచేత కార్పొరేట్లకు ఇస్తున్న పన్ను రాయితీల గురించి మాట్లాడకుండా, కేవలం ''ఉచితాల'' గురించి మాత్రమే మాట్లాడడం హేతు విరుద్ధం.
కాని, ఇప్పుడు సుప్రీం కోర్టు నియమించే కమిటీ పరిశీలించబోయే అంశాలలో పెట్టుబడిదారులకిచ్చే ఉచితాల ప్రసక్తి లేదు. ఇక ఆ కమిటీలో సభ్యులుగా వ్యవహరించడానికి రిటైరైన బ్యూరోక్రాట్లు, ఆర్థిక నిపుణులు కొందరు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఒక ''స్లాట్ మెషిన్'' మాదిరిగా వ్యవహరించడానికి వారెప్పుడు సుముఖంగానే ఉంటారు. (మనం స్లాట్ మెషిన్లో ఒక నాణెం దోపితే, మనకు కావలసిన వస్తువును ఆ మెషిన్ జారవిడుస్తుంది. అదే మాదిరిగా, ఈ నిపుణులు ప్రభుత్వం కోరిన విధంగా తమ నివేదికను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు) నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటం జరిగినప్పుడు ఇదేమాదిరిగా సుప్రీం కోర్టు ఒక కమిటీని నియమించింది కదా! మోడీ ప్రభుత్వం తీసుకున్న వైఖరిని సమర్థించేవారితోనే ఆ కమిటీ ఏర్పడింది. అయితే వచ్చిన చిక్కేమిటంటే, రైతులు మాత్రం ఇటువంటి వ్యవహారాన్ని సుతరామూ అంగీకరించలేదు.
ఇప్పుడు మళ్ళీ ఆ మాదిరిగానే డ్రామా నడుస్తోంది. ఇప్పుడు కూడా విద్య, వైద్యం విషయాల్లో ప్రజలకు ఇచ్చే సబ్సిడీలలో కోత పెట్టాలని చెప్పగలిగే బరితెగింపునకు మోడీ ప్రభుత్వం పూనుకోజాలదు. అందుచేత ''ఉచితాల'' విషయంలో మోడీ ప్రభుత్వం ప్రధానంగా వేటు వేయబూనుకునేది చిన్న ఉత్పత్తి దారులకు, అందునా, రైతాంగానికి ఇచ్చే ఉత్పత్తి సంబంధిత సబ్సిడీలపైనే. (ఎరువుల సబ్సిడీ, ఉచిత విద్యుత్ వగైరా) సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సూచించిన విధంగా సంక్షేమ పథకాలకి, తక్కిన ''ఉచితాలకి'' నడుమ ఒక వ్యత్యాసాన్ని చూపిస్తారు. రైతులకిచ్చే సబ్సిడీలను ఆ ''ఉచితాల'' కోవలోకి చేర్చుతారు. ఆ తర్వాత వాటికి కోత పెడతారు, లేదా రద్దు చేస్తారు.
అయితే, సంక్షేమ పథకాలకి, తక్కిన ఉచితాలకి నడుమ విభజనరేఖ గీయడం ఏమాత్రమూ సరైనది కాదు. రైతాంగ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సమగ్రమైన రీతిలోపరస్పర ఆధారితంగా ఉంటుంది. అందులో ఉత్పత్తికి అయే ఖర్చు, ఆ రైతు వినిమయం కోసం చేసే ఖర్చు పరస్పరం ఆధారపడివుంటాయి. ఉదాహరణకు, వ్యవసాయ విద్యుత్తు కోసం రైతు గనుక ఎక్కువ ఖర్చు చేయాల్సివస్తే దానిని తట్టుకోవడం కోసం ఆ రైతు తన పిల్లవాడిని చదువు మాన్పించవలసిన పరిస్థితి రావచ్చు. ఇప్పటికే రైతులకిచ్చే విద్యుత్తును ''ఉచితాల'' కోవలోకి చేర్చారు. ఇప్పుడు ఉచితాల రద్దు పేరుతో విద్యుత్ సబ్సిడీకి గనుక ఎగనామం పెడితే అప్పుడు వ్యవసాయం చేయడం రైతుకు మరింత భారం అవుతుంది. రైతుకు గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడితే అప్పుడు కార్పొరేట్లు వ్యవసాయంలోకి చొరబడడం తేలికవుతుంది. గతంలో నల్ల వ్యవసాయ చట్టాల ద్వారా ఏం సాధించాలని మోడీ ప్రభుత్వం భావించిందో, ఇప్పుడు ఈ ''ఉచితాల'' రద్దు ద్వారా అదే లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నిస్తోంది.
నయా ఉదారవాద ఎజండా
చిన్న స్థాయి ఉత్పత్తి రంగాన్ని, అందునా ముఖ్యంగా రైతాంగ వ్యవసాయాన్ని కార్పొరేట్లు చేజిక్కించు కోవాలన్నది మొదటినుంచీ నయా ఉదారవాద ఎజంగాగా ఉంది. ఆదిమ సంచయాన్ని (కొల్లగొట్టి పోగేసుకునే విధానాన్ని) ఒక విధానంగా అమలు చేయడం, ఆ క్రమంలో మన దేశ వ్యవసాయ రంగం పూర్తిగా సంపన్న పశ్చిమ దేశాల ప్రయోజనాలను నెరవేర్చడానికి అనుకూలంగా లొంగివుండేలా చేయడం ఆ ఎజండా సారాంశం. అది మన దేశ ఆహార స్వావలంబనను దెబ్బ తీస్తుంది. అటువంటి పరిస్థితిని మనం ఈ మధ్య ఆఫ్రికా ఖండంలోని దేశాలలో తలెత్తడం చూస్తాం.
నయా ఉదారవాదం యెడల తన భక్తి ప్రపత్తులను ప్రదర్శించుకోవడంలో ''ఉచితాల'' రద్దు అనేది మోడీ ప్రభుత్వపు తాజా దృష్టాంతం. బడా కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఇచ్చినందువలన ఆ మేరకు ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది. మరోవైపు బడ్జెట్లో ద్రవ్యలోటు పెరగకుండా పరిమితులకు లోబడివుండాలి. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులలో సామాన్య ప్రజలపై పరోక్ష పన్నులను గనుక మరింత పెంచితే అది ద్రవ్యోల్బణం మరింత పెరిగిపోడానికే దారితీస్తుంది. కాబట్టి ఆ విధంగా పరోక్ష పన్నులను పెంచడం సాధ్యం కాదు. అందుచేత ప్రభుత్వం తన ఖర్చును తగ్గించుకోవడం ఇంకో దారి లేదు. అందుకనే వ్యవసాయ సబ్సిడీలను తగ్గించడం మీద ప్రభుత్వం కన్ను పడింది. తద్వారా, ఒకవైపు ద్రవ్యలోటును అదుపులో ఉంచి ఐఎంఎఫ్‌ను సంతృప్తిపరచవచ్చు, ఇంకోపక్క చిన్న రైతు వ్యవసాయాన్ని దెబ్బతీసి బడా కార్పొరేట్ల చొరబాటుకు మరింత అవకాశం కల్పించవచ్చు. ఇదే మోడీ సర్కారు విధానం.
ఈ మొత్తం వ్యవహారం నయా ఉదారవాదపు రెండు ప్రధాన లక్షణాలను బైటపెడుతోంది. మొదటిది: దాని ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణి. ప్రజల సార్వభౌమాధికారం స్థానే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనాన్ని తెచ్చి రుద్దడం నయా ఉదారవాద విధానం. ప్రజానీకం వ్యతిరేకిస్తున్నా, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి కోరిన విధానాలనే ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఆ విధంగా చేయడానికి అన్ని అడ్డదారులనూ తొక్కుతుంది. ఇప్పుడు ''ఉచితాల'' రద్దు విషయంలో సుప్రీం కోర్టును రంగంలోకి దించడం అటువంటి డొంకతిరుగుడు దారే. సుప్రీం కోర్టు ఆదేశించిందన్న పేరుతో ప్రజామోదం పొందకుండానే ''ఉచితాలను'' రద్దు చేయవచ్చు. నేరుగా ప్రజల ఆమోదానికి పెడితే తిరస్కారానికే గురవవలసివస్తుందని ప్రభుత్వానికి తెలుసు.
ఇక రెండవది: నగంగా బైట పడ్డ ప్రభుత్వ వర్గ స్వభావం. నయా ఉదారవాదం ప్రజలకిచ్చే ''ఉచితాలకు'', మరోపక్క ''అభివృద్ధికి'' పోటీ పెట్టి చూపుతోంది. ఇక్కడ అభివృద్ధి అంటే బడా కార్పొరేట్లకు సమర్పించే ''ఉచితాలు'' మాత్రమే. అంటే శ్రామిక ప్రజానీకానికి రాయితీలు ఇవ్వాలా? లేక బడా కార్పొరేట్లకు ఇవ్వాలా? అన్నది అసలు ప్రశ్న అన్నమాట. ఇందులో నయాఉదారవాదం బడా కార్పొరేట్లవైపే మొగ్గు చూపుతుంది తప్ప ప్రజలవైపు ఎంతమాత్రమూ కాదు. అందుకోసం రాజ్యాంగ వ్యవస్థలోని ప్రతీ విభాగాన్నీ (న్యాయవ్యవస్థతో సహా) వాడుకుంటుంది.
మోడీ భక్తులంతా అతడు చాలా ధైర్యశాలి అని ప్రశంసిస్తూంటారు. కాని అతడు పైకి ప్రదర్శించే ధైర్యం వెనుక అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి అడుగులకు మడుగులొత్తే లొంగుబాటు దాగివుంది. అయితే, శ్రామిక ప్రజానీకానికి అందించే ''ఉచితాల'' రద్దు ఆ తరగతుల ప్రజలనుండి గట్టి ప్రతిఘటనను ఎదుర్కోక తప్పదు. రైతాంగ పోరాటమే దీనికి తిరుగులేని ఉదాహరణ.
(స్వేచ్ఛానువాదం)
- ప్రభాత్ పట్నాయక్