Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఆర్టీసీలను నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రజా రవాణా సంస్థలను పొమ్మనలేక పొగ బెట్టే చందంగా అనేక అంశాలను కేంద్రం ముందుకు తెస్తున్నది. నిజానికి భారత రాజ్యాంగం ప్రకారం రవాణా అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం. కానీ రవాణాను తన పరిధిలోకి తీసుకొనే విధంగా విధానాలను రూపకల్పన చేసి అమలు చేస్తున్నది కేంద్రం. ఆ విధానాల ప్రభావాన్ని అర్థం చేసుకొని, వాటిని ప్రతిఘటించకుండా, వాటికి వ్యతిరేకంగా పోరాడకుండా ఆర్టీసీలను పరిరక్షించుకోవడం అసాధ్యమైన విషయం.
ఎం.వి.యాక్ట్ - 2019 : 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రోడ్ రవాణా రంగంపైన కన్నేసి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నం ప్రారంభించి, 'రోడ్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బిల్ - 2014'ను ముందుకు తెచ్చింది. దీనికి ప్రతిఘటన ఎదురవడంతో అనేక అంశాలలో సవరణలు చేస్తూ వచ్చింది. చివరకు ఆర్టీఎస్ బిల్లును 'ఎం.వి.యాక్ట్ సవరణ బిల్లు'గా పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 2019లో ఎన్నికలు జరిగి 16వ పార్లమెంటు రద్దవడంతో, 17వ పార్లమెంట్ ఏర్పడ్డ అనంతరం 2019 జులైలో పార్లమెంటులో తిరిగి ప్రవేశపెట్టారు. చట్ట సభలలో తనకు ఉన్న మెజార్టీతో ఎం.వి.యాక్ట్ 2019ని ఉభయసభల్లో ఆమోదించుకున్నారు. 2019 ఆగస్టు 9న రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం మొత్తం రవాణా రంగానికి, ప్రత్యేకించి రాష్ట్రాల రవాణా సంస్థల (ఆర్టీసీలు)కు మరణ శాసనం వంటిది. అయినా కేంద్రం తన దాడిని కొనసాగిస్తున్నది. చట్టంలోని ఒక్కో సెక్షన్‌కు రూల్స్ విడుదల చేస్తూ వస్తున్నది.
ఆర్టీసీ యాక్ట్ - 1950 ఏర్పడ్డ అనంతరం అనేక ఆర్‌టిసిలు ఉనికిలోకి వచ్చాయి. తమకున్న గుత్తాధిపత్యం దెబ్బతింటుందని భావించిన ప్రయివేటు ఆపరేటర్లు అనేక కోర్టు కేసులు వేసిన నేపథ్యంలో, 1976లో 40వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎం.వి.యాక్ట్ - 1988లోని చాప్టర్ 6కు రాజ్యాంగ రక్షణ కల్పించారు. ఎం.వి.యాక్ట్ - 2019లో ఈ చాప్టర్‌ను కనుమరుగు చేసి, రాజ్యాంగ సవరణకే అర్దం లేకుండా చేయడమే కాకుండా, ఆర్టీసీలను నిర్వీర్యం చేసేందుకు అవకాశం కల్పించారు.
ఎం.వి.యాక్ట్ - 2019కి ముందు భారత దేశంలో అగ్రిగేటర్స్ (యాప్ ఆధారిత సంస్థలు) వ్యవస్థకు అనుమతి లేదు. కొత్తగా తెచ్చిన చట్టంలో వీటికి అవకాశం కల్పించారు. వీటి ద్వారా ప్రజా రవాణాలోకి అనేక సంస్థలు వచ్చి టాక్సీ డ్రైవర్లను దోపిడీ చేయడం ఒక ఎత్తయితే, స్టేజి కారియర్స్‌గా నడిపి ఆర్టీసీ ఆదాయాలను కొల్లగొట్టేందుకు అవకాశం కల్పించింది. త్వరలోనే భారతదేశంలో యాప్ ఆధారిత బస్‌లను ప్రవేశపెడ్తామని 'ఊబర్' సంస్థ ప్రకటించింది. ఇదే దారిలో మరికొన్ని సంస్థలు ముందు కొస్తున్నాయి. ఇవన్నీ ఆర్టీసీల ఆదాయాన్ని కొల్లగొట్టేవే తప్ప మరొకటి కాదు.
అలాగే ఈ చట్టం రాకముందు స్కీంలు (రూట్ల గుర్తింపు) రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మాత్రమే ఉండేది. అంతఃరాష్ట్ర పర్మిట్లు, జాతీయ స్థాయి పర్మిట్స్ ఇచ్చే హక్కును రాష్ట్రాల నుండి లాగేసుకొని, కేంద్రం తనకు దఖలు పర్చుకొన్నది. ఆ రకంగా స్థానిక అవసరాల ఆధారంగా 'రూట్స్' కాకుండా, పెట్టుబడిదారుల లాభాల కోసం మాత్రమే రూట్ పర్మిట్స్ ఇస్తారు. ఈ రకంగా రాష్ట్రాల హక్కులను హరించి వేస్తారు.
టూరిస్టు పర్మిట్ వ్యవస్థ : ఇప్పటివరకు వేలాది ప్రయివేటు బస్‌లు పర్మిట్ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తూ ఆర్టీసీల ఆదాయాన్ని లూఠీ చేస్తున్నాయి. అటువంటి అక్రమ రవాణాను సక్రమ రవాణాగా చేసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 'నేషనల్ టూరిస్టు పర్మిట్' వ్యవస్థను ముందుకు తెచ్చింది. ఈ గైడ్‌లైన్స్ ప్రకారం నాలుగు చక్రాల బండి నుండి బస్‌ల వరకు, రూ.10,000 నుండి 3,00,000 వరకు చెల్లించి పర్మిట్ పొందితే, ఒక సంవత్సరం పాటు దేశంలోని ఎక్కడ నుండి ఎక్కడికైనా, ఏ సమయంలోనైనా, ఎన్నిసార్లయినా ప్రయాణీకు లను ఎక్కించుకొని వెళ్ళవచ్చు. ప్రయివేటు వ్యవస్థను ప్రోత్సహించి ఆర్టీసీల ఆదాయాలను కొల్లగొట్టి సర్వనాశనం చేయడానికే దీనిని ముందుకు తెచ్చారు.
డీజిల్ ధరల పెంపు - ఆర్టీసీలపై భారం : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయిల్ ధరల నియంత్రణ వ్యవస్థ లేకుండా చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీ సమీక్ష పేరుతో పెంచుతూ వచ్చింది. దీంతో ఆర్టీసీల ఆదాయ పరిస్థితి కుదుపులకు గురయింది. ఇది చాలదన్నట్లు, బల్క్ బయ్యర్స్‌కు ఇస్తున్న సబ్సిడీని తగ్గిస్తూ వచ్చి, చివరకు మార్కెట్ ధరలకే బల్క్ బయ్యర్స్ కూడా కొనే స్థితికి తీసుకొచ్చింది. దీని వలన ఆర్టీసీ ఆదాయం - ఖర్చులపై తీవ్ర ప్రభావం పడ్డది. 2019 నుండి 'డైనమిక్ ఫ్యూయల్ ప్రైసింగ్' పద్ధతిని తెచ్చింది. క్రమంగా కేంద్రం వసూలు చేస్తున్న పన్నులను పెంచుతూ వచ్చింది. ఫలితంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా, ప్రజా రవాణా సంస్థలు విపరీతమైన ధరలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలదన్నట్లు బల్క్ బయ్యర్ కొంటున్న డీజిల్ ధరలను విపరీతంగా పెంచింది. బంక్‌లలో రిటైల్‌గా కొంటే చెల్లించాల్సిన ధరకంటే సుమారు రూ.30 అదనంగా చెల్లించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. నిజానికి ఒక లీటర్ డీజిల్ ధరలో రూ.30 వరకు పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తున్నది. కనీసం ఆర్టీసీ లకైనా ఈ భారం లేకుండా చేయాల్సిన ప్రభుత్వం ధరలు పెంచి ఆర్టీసీలపై భారం మోపుతుండడం అన్యాయం.
విద్యుత్ బస్‌ల పేర ప్రయివేటుకు : ప్రత్యామ్నాయ ఇంధనం పేరుతో విద్యుత్ బస్‌లను / వాహనాలను ప్రవేశపెట్టే పథకాన్ని "Faster Adoption and Manufacturing of Electric & Hibrid Venicles - FAME I & II" పేర ముందుకు తెచ్చారు. ఈ స్కీం ద్వారా సమకూర్చే బస్‌లు కేవలం గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిపైనే తీసుకోవాలి. ఫేమ్ - 1 క్రింద ఒక్కో బస్‌కు 1 కోటి రూపాయలు కేంద్రం సబ్సిడీ ప్రయివేటు ఆపరేటర్‌కు ఇచ్చారు. ఫేమ్-2లో దానిని 50లక్షలకు తగ్గించారు. ఇలా ఇచ్చే సబ్సిడీలో ఒక్క రూపాయి కూడా ఆర్టీసీకి రాదు. ఆ రకంగా ప్రయివేటు కంపెనీల లాభా లను పెంచుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
ఇప్పుడు ఈ విద్యుత్ బస్‌లను పెంచాలని కేంద్రం ప్రయత్నిస్తున్నది. కేంద్రం విధించిన నిబంధనల ప్రకారం ఈ బస్‌ల నిర్వహణకు ఒక్క ఉద్యోగి కూడా ఆర్టీసీవారు ఉండరు. మొత్తం ప్రయివేటు కన్సార్టియం మాత్రమే చూసు కొంటుంది. దేశవ్యాప్తంగా మొదటి దఫా 5450 బస్‌ల కోసం జరిగిన టెండర్లలో టాటా సంస్థ 5300 బస్‌లు కి.మీ.కు 43.93పైసలుతో టెండర్ పొందింది. అనంతరం మరో టెండర్ వేయనున్నారు.
ఆర్టీసీలో విద్యుత్ బస్‌ల విస్తరణ కోసం 2022 మే 30న కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో జరిగిన చర్చల సారాంశాన్ని పరిశీలిస్తే, భారత్ స్టాండర్డ్, 2 మరియు 3 బస్‌లకు 10 సం|| దాటిన వాటి స్థానంలో విద్యుత్ బస్‌లకు వెళ్ళాలని నిర్ణయిం చారు. నిటి అయోగ్ ఇచ్చిన వివరాల ప్రకారం దేశంలోని ఆర్టీసీలలో 1,50,000 బస్‌లలో 50,000 బస్‌లు విద్యుత్ విభాగంలోకి మారాలని సూచించింది. అంటే ఆ మేరకు ఆర్టీసీ బస్‌లు, ఆర్టీసీ సిబ్బంది కుదించబడతారు. ఇవి అమలులోకి వస్తే ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే 40వేల మందికి పైగా సిబ్బంది మిగులు తేలి, వారి భవిష్యత్ అంధకారంగా మారుతుంది. దేశ వ్యాప్తంగా 7,50,000 కార్మికులలో 2,50,000 మంది ఇంటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. వీటిని ప్రతిఘటించకుండా ఆర్టీసీలు బతకడం అసాధ్యం. పై అంశాలను పరిశీలిస్తే ఈ రోజు ఆర్టీసీలు ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణం. ఆర్టీసీలను పరి రక్షించుకొనేందుకు ఆటంకంగా ఉన్న వాటికి వ్యతి తరతరేకంగా ఐక్యపోరాటాలలోకి ముందుకు రావాలి.
- పుష్పా శ్రీనివాస్