Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిల్కిస్ బానో. ఓ సాధారణ గుజరాత్ మహిళ. నేడు ఈ పేరు మానవీయ గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నది. ఈమెకు ఈ దేశంలో న్యాయం జరిగే అవకాశమే లేదా..? అనేది ఆ గుండెల స్పందన.
స్వతంత్ర భారదతావని 75ఏండ్ల చరిత్రలో గుజరాత్ నరమేధం-2002 మరువలేని ఓ భయంకర పీడకల. మనిషిలో ఇంత క్రౌర్యం, దుర్మార్గం, హింస దాగి ఉంటుందా అని సభ్యసమాజం ఉలిక్కిపడింది.
ఆ నరమేధంలో బానో ఓ సామూహిక పైశాచిక అత్యాచారానికి గురైంది. అప్పుడు ఆమె వయస్సు 21సంవత్సరాలు. ఐదునెలల గర్భవతి కూడా. అంతకుముందు ఆ నేరస్థులు ఓ పెద్ద బండరాయితో ఆమె మూడేండ్ల కూతురు చిన్నారి సలేహాను తలబద్దలు కొట్టి చంపారు. అలా తన కుటుంబంలోని 14మందిని ఆ దుర్మార్గులు హత్యచేయడాన్ని ఆమె కళ్ళారా చూసింది. నిస్సహాయ స్థితిలో పడిపోయిన తమ కుటుంబ మహిళలపై వారావిధంగా హత్యాచారం చేశారు. ఈ రాక్షస అకృత్యాన్ని చూపడానికి ఏ దృశ్య మాంద్యమూ సరిపోదేమో... విశదపరచడానికి అక్షరాలు కూడా లజ్జాఖిమానంతో ముడుచుకుపోతాయేమో....
అయితే ఈ భయంకర హత్యాకాండలో మిగిలిన ఏకైక మహిళ బానో కావడం గమనార్హం.
ఆ ఘటనలో బానో కొన ఊపిరితో స్పృహ తప్పి పడిపోయింది. శరీరంపై ఏ ఆశ్ఛాదన లేదు. సాటి మహిళ ఎవరో కప్పుకోడానికి ఓ వస్త్రాన్నిచ్చి, తాగడానికి కాసిన మంచినీళ్ళిచ్చింది. బానో తేరుకున్నది. అటుగా వెళుతున్న ఓ కానిస్టేబుల్ సహాయం తీసుకున్నది. పడుతూ లేస్తూ అలా వెళ్ళి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదైంది. ఇదీ న్యాయవ్యవస్థ మీద సహజంగా ఆమెకు ఏర్పడిన నమ్మకం. అక్కడ నుండి ఆమె ధైర్యంగా, ఒంటరిగా సుదీర్ఘ న్యాయపోరాటం చేసింది.
మాబ్ జస్టిస్ (మూక న్యాయం) పేరుతో మృగాల కంటే ఘోరంగా ప్రవర్తించిన ఆ నేరస్థులకు మరణశిక్ష పడలేదు సరికదా జీవిత ఖైదు శిక్షలతో సరిపెట్టవలసి వచ్చింది. ఈ శిక్షను బొంబాయి హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టు కూడా సమర్థించింది అప్పట్లో. సుప్రీం శిక్షను ఖరారు చేస్తూ బానోకు నష్టపరిహారంగా అప్పటి గుజరాత్ ప్రభుత్వాన్ని (మోడీ సీఎం) 50లక్షలు పరిహారం చెల్లించమని ఆదేశిం చింది. బానో దానిని తృణప్రాయంగా తిరస్కరించింది.
అయితే ఇప్పుడు తాజాగా గుజరాత్ ప్రభుత్వం బల్కిస్ బానో దురాగతం కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఆ పదకొండు మంది నేరస్థులకు క్షమాభిక్ష పెట్టింది. 'ఆజాదీ అమృతోత్సవ్ వేళ' పంద్రాగస్టున ప్రధాని నరేంద్రమోడీ నారీశక్తి గురించి ఘనంగా ప్రసంగించిన కొద్ది గంటల సమయానికే వారంతా గోద్రా సబ్ జైలు నుండి విడుదలయ్యారు.
వారేదో 'ఘన కార్యం' చేసిన వారైనట్టు వారికి పూలదండలు వేసి, హారతులిచ్చి, మిఠాయిలు తినిపించి స్వాగతం పలికారు. అరెస్టుకు ముందు వారంతా బీజేపీ కార్యకర్తలేనని మీడియా తెలిపింది.
ప్రధాని మోడీకి, అధికార బీజేపీ పార్టీకి మహిళా సాధికారతపై ఈ ఘటనతో ఏపాటి విలువ ఉన్నదో ఇట్టే అర్థమైపోయిందని విపక్షాలు మండిపడ్డాయి.
మహిళల విషయంలో బీజేపీ విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ తత్సంబంధిత సంస్థలన్నింటిదీ ఒకే తీరని, వారు చెప్పేదొకటి, చేసేదొకటి అని విమర్శించాయి. కథువా, ఉన్నావ్ కేసుల్లో రేపిస్టులకు (అత్యాచార నేరస్థులు) ఎలా మద్దతిచ్చారో, ఇప్పుడూ అలానే బానో విషయంలో కూడా రేపిస్టులకు మద్దతు ఇస్తున్నారని దుమ్మెత్తిపోసాయి.
ఈ విధంగా యధేచ్ఛగా రేపిస్టులకు ఎక్కడబడితే అక్కడ, ఎలా అయితే అలా బరితెగించి మద్దతిచ్చుకుంటూ పోతే మహిళలకు ఇక రక్షణెక్కడీ న్యాయమెక్కడీ అనే ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతున్నది.
తల్లులుపైన, పిల్లలపైన, గర్భిణీ స్త్రీలపైనా విచక్షణ మరచి మృగాలకంటే ఘోరంగా సామూహిక అత్యాచారాలు, హత్యలు చేసినవారిని కీర్తిస్తూ జైలునుండి విడుదలైనప్పుడు స్వాగత సత్కారాలు చేయడం ఏ విలువలకు ప్రస్థానమో ఎవరికీ అర్థంకాదు. పైగా బానోపై అత్యాచారం చేసిన దోషుల్లో కొందరు సంస్కారవంతులైన సత్ బ్రాహ్మణులు ఉన్నారని ఎమ్మెల్యే రౌల్జీ కొనియాడటం మరీ విడ్డూరం. బీజేపీ కోరుకుంటున్న సంస్కారం, సంస్కృతి ఇలానే ఉంటుందని చెప్పకనే చెప్పినట్లయింది.
ఆ దుర్మార్గం జరిగినప్పుడు కలిగిన బాధకంటే, ఇప్పుడు రేపుతున్న ఈ గాయం మరింతగా బాధపెడుతున్నది. వెగటు, ఏవగింపు, జుగుప్సా, ఛీదరింపు, బీభత్సం ఈ మాటలేవీ సరితూగేలా లేవు.
'మా జీవితాలను సర్వనాశనం చేసిన నరహంత కులను ఇప్పుడు మీరు విడుదల చేశారు. మరి భయంలేని నా మునుపటి ప్రశాంత జీవితాన్ని నాకు తిరిగి ఇవ్వగలరా..?' అన్న బానో ప్రశ్న నేడు మనుసున్న మనిషి ప్రతిగుండెలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. కలచివేస్తున్నది.
ద్వంద్వ ప్రమాణాలు అవలంబించే బదిరాంధ పాలకులకు మాత్రం ఇవి సహజంగానే వినిపించడం లేదు. అందుకే రోజా లగ్జంబర్గ్ చెప్పినట్టు 'ఏం జరుగుతున్నదో బిగ్గరగా చెప్పడమే ఎవరైనా ఎప్పుడైనా చేయగల అత్యంత విప్లవాత్మకమైన పని.'
- కె. శాంతారావు
సెల్: 9959745723