Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మమ్మల్ని వెళ్లనివ్వండిరా బాబూ'' అని తాలిబాన్లను వేడుకొని ఆఫ్ఘనిస్తాన్ నుంచి అవమానకరంగా వెనుదిరిగిన అమెరికా కొద్ది నెలలు గడవకుండానే ఉక్రెయిన్ సంక్షోభానికి తెరదీసింది. అది ఎప్పుడు పరిష్కారం అవుతుందో అంతుబట్టని స్థితిలో ఇప్పుడు తైవాన్ పేరుతో చైనాను రెచ్చగొడుతోంది. ఏదో ఒక సాకుతో యుద్ధాలు, మిలిటరీ జోక్యాలు చేసుకోవటం సులభం కానీ వాటి నుంచి బయటపడటం అంత తేలిక కాదని గతంలో వియత్నాంపై ఫ్రాన్సు, అమెరికా జరిపిన యుద్ధాలు, ఇరాక్‌లో, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా మిత్రపక్షాల మిలిటరీ జోక్యం, దాడులు స్పష్టం చేశాయి. ప్రకృతిలో రాబందులు పశువుల, మనుషుల మృతకళేబరాల కోసం నిరంతరం చూస్తుంటాయి, అవే వాటి ఆహారం. అమెరికా మిలిటరీ కార్పొరేట్ రాబందులు మాత్రం నిరంతరం యుద్ధాల కోసం చూస్తుంటాయి. అవసరమైతే తమ సైనికులను కొందరిని బలిపెట్టైనా సరే లాభాలను పిండుకోవటమే దాని పని.
తైవాన్ జలసంధిలో తిరుగుతున్న అమెరికా మిలిటరీ నౌకలు ఆయుధాలు, వాటి ప్రయోగ వ్యవస్థలను కట్టివేసుకొని ఏమీ తెలియనట్లు సంచరిస్తున్నాయని, ఇది రెచ్చగొట్టుడుకే తప్ప మరొకటి కాదని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. తైవాన్ విలీన ప్రక్రియను అడ్డుకొనే క్రమంలో ఒకవేళ యుద్ధమే గనుక వస్తే... జలసంధిలో ప్రవేశించే అమెరికా మిలిటరీ నౌకలు చైనా సరిహద్దులకు చాలా దగ్గరగా ఉంటాయని, భూమి మీద నుంచి చైనా సంధించే క్షిపణులను అవి తట్టుకొని నిలవలేవని, అందువలన తైవాన్ జలసంధిలో సంచారానికి అర్ధం లేదని చైనా నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అమెరికా పంపిన నౌకలు దాని వద్ద ఉన్న పాత తరానికి చెందినవని, చైనా వద్ద అంతకంటే మెరుగైనవి ఉన్నందున వాటితో తైవాన్ వేర్పాటు వాదులను సంతుష్టీకరించటం, తన మిత్ర దేశాలకు భరోసాను ప్రదర్శించటం తప్ప చైనాను భయపెట్టలేరని పశ్చిమ దేశాల విశ్లేషకులు పేర్కొన్నారు. అంతే కాదు చైనాలో తైవాన్ విలీనం తమకు అంగీకారం కాదని ప్రపంచానికి చెప్పటం కూడా దీని వెనుక ఉందని అంటున్నారు.
చైనా చుట్టూ వివిధ దేశాలలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటికి ధీటుగా చైనా కూడా తన బలాన్ని పెంచుకుంటున్నది. అమెరికా, దాని మిత్రదేశాల మిలిటరీని తట్టుకోగలిగేట్లు క్షిపణులను రూపొందిం చింది. ఉపగ్రహాల సంకేతాలు, మార్గదర్శనం లో ఒకే సారి ఒకే వ్యవస్థ నుంచి పలు దిక్కులకు క్షిపణులను ప్రయోగించగల ఎంఎల్ఆర్ఎస్ వ్యవస్థలను కూడా రూపొందించింది. అవి ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్నవాటి కంటే ఎక్కువ రాకెట్లను పంపగలిగినవి. బిజినెస్ ఇన్సైడర్ అనే పత్రిక రాసిన విశ్లేషణ ప్రకారం ఒకేసారి ఎనిమిది 370 ఎంఎ రాకెట్లను 350 కిలోమీటర్ల దూరం, రెండు 750 ఎంఎం రాకెట్లను 500కిలోమీటర్ల దూరం వరకు వదలవచ్చు. చైనా-తైవాన్ మధ్య దూరం 150 కిలోమీటర్లే గనుక ఆ ప్రాంతంపై ఎక్కడికైనా క్షిపణులను చైనా వదలగలదు. సముద్ర జలాల్లో ప్రవేశించిన మరో దేశ మిలిటరీని కూడా ఎదుర్కొనే సత్తాను కలిగి ఉంది.
ఆసియాలో చిచ్చు పెట్టేందుకు పూనుకున్న అమెరికా తీరుతెన్నులు చైనా - రష్యా మిలిటరీల సహకారాన్ని మరింతగా పెంపొందించే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. 1995లో చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికన్లు తైవాన్ అధ్యక్షుడు లీ టెంగ్ హుకు వీసా ఇచ్చారు. దానికి నిరసనగా చైనా అనేక క్షిపణి పరీక్షలు జరిపింది, దాంతో చైనాను బెదిరించేందుకు అమెరికా 1996లో రెండు విమాన వాహకయుద్ధ నౌకలను తైవాన్ జలసంధికి పంపింది. దాని కొనసాగింపుగా 1997లో నాటి స్పీకర్ న్యూటన్ గింగ్‌రిచ్‌ను తైవాన్ పర్యటనకు పంపింది. ఇటీవలి నాన్సీ పెలోసీ మాదిరి అనుమతి లేకుండా గింగ్రిచ్ రాలేదు. చైనాతో ముందుగా సంప్రదించిన తరువాతే జరిగింది. తైవాన్ గురించి తమ నేత ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయరని అమెరికా చెప్పిన మాటలు నమ్మింది చైనా. ఆ మేరకు అధికారికంగానే అనుమతించింది తప్ప తైవాన్ మీద ఎలాంటి రాజీ వైఖరిని అనుసరించలేదు. రెండున్నర దశాబ్దాల నాడు రష్యా నుంచి ఆయుధాలను కొనుక్కోవాల్సిన స్థితిలో ఉన్న చైనా నేడు కొన్నింటిని అమ్మే దశకు ఎదిగింది. ఆధునిక అస్త్రాలను రూపొందిస్తున్నది. నాన్సీ పెలోసీ రాక తరువాత తన సత్తా ఏమిటో చూపుతున్నది. తాను స్వంతగా రూపొందించుకున్న రెండు విమానవాహక యుద్ధ నౌకలు అనేక ఇతర నౌకలు, విమానాలతో డ్రిల్స్ నిర్వహించింది. తమకు అడ్డు వచ్చే వారిని క్షణాల్లో ఎదిరించే సత్తా ఉందని ప్రపంచానికి వెల్లడించింది. ఇప్పటికే ఉక్రెయిన్‌లో రష్యా మీద పరోక్ష దాడులు జరుపుతున్న అమెరికా ఒకేసారి చైనా మీదకు దిగే అవకాశం అంత సత్తా లేదన్నది నిపుణుల విశ్లేషణ. ఆయుధాల అంశంలో రష్యాతో కొన్ని చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ అమెరికాను ఎదిరించేందుకు వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టటానికి ఆ రెండు దేశాలూ సిద్దపడతాయి. పరిమితులు లేని భాగస్వాములుగా ఉన్నట్లు రెండు దేశాలూ ప్రకటించిన సంగతి తెలిసిందే. తైవాన్ అంశం మీద అమెరికా ఇలా ఇంకా రెచ్చగొట్టుడు కొనసాగిస్తే మిలిటరీ సహకారం కూడా రెండు దేశాల మధ్య మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగనుందనే సంకేతాలు, అమెరికాలో మాంద్య ప్రమాదం, పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగలనుందనే విశ్లేషణల నేపథ్యంలో తాజా పరిణామాలు జరుగుతున్నాయి. బైడెన్ క్రమంగా తైవాన్ అంశం మీద ఒకే చైనా అన్న అంగీకృత విధానానికి తిలోదకాలిచ్చే దిశగా పావులు కదుపుతున్నాడు. చైనాకు వ్యతిరేకంగా ఆసియా నాటో కూటమి ఏర్పాటుకు పథకం వేశారు.
ఇటీవలి అమెరికా బుద్దిపూర్వక చర్యలు, రష్యా వ్యతిరేక వైఖరి ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నది. దీన్నుంచి కూడా లబ్ది పొందేందుకు అమెరికా చూస్తున్నది. మొదటి ప్రపంచ యుద్ధంలో వచ్చిన లాభాలతో అమెరికాలో 22వేల మంది మిలియనీర్లను సృష్టించింది, 28.6బిలియన్ డాలర్లు లాభాలు వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో లాభాలు రెట్టింపు వచ్చాయి. రక్తంతో తడిచిన లాభాలు మరిగిన అమెరికన్ కార్పొరేట్లు అప్పటి నుంచి జనాలకు కావాల్సిన వస్తువుల కంటే ప్రాణాలు తీసే ఆయుధాల తయారీకే ప్రాధాన్యత ఇచ్చారు. చైనాలో చౌకగా దొరికే శ్రమతో తక్కువ ధరలకు వినిమయ వస్తువుల తయారీకి పెట్టుబడులు పెట్టటం, పరిశ్రమలను తరలించటం కూడా కార్పొరేట్ల లాభాల వేటలో భాగమే. నాలుగేండ్ల రెండవ ప్రపంచ యుద్ధం అమెరికాలో బిలియనీర్లను 32 నుంచి 44వేలకూ వారి ఆస్తులు 103బి.డాలర్లకూ పెంచింది. ప్రపంచానికి ఆ యుద్ధ ఖర్చు మూడులక్షల కోట్ల డాలర్లని అంచనా కాగా అమెరికా వాటా కేవలం 336 బి.డాలర్లు మాత్రమే. ఆ యుద్ధంలో సర్వనాశనమైన ఐరోపా పునరుద్ధరణ పేరుతో అమెరికా ముందుకు రావటానికి దానికి వచ్చిన లాభాలే పెట్టుబడి. ఆ పథకంలో కూడా అమెరికా లబ్దిపొందింది. ఐరోపాకు సోవియట్ నుంచి ముప్పు ఉందనే బూచిని చూపి నాటో కూటమి ఏర్పాటు చేసి దానికి ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్న సంగతి జగమెరిగినదే. ఇప్పుడు ఉక్రెయిన్ నాశనానికి దానికి ఆయుధాలమ్మి సొమ్ము చేసుకోవటంతో పాటు దాని పునరుద్దరణ పేరుతో తన కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు పావులు కదుపుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా చేసింది అదే. తన కంపెనీలకే కాంట్రాక్టులు అప్పగించింది. అనేక యుద్ధాల అనుభవం చూసిన తరువాత తన పౌరుల ప్రాణాలను ఫణంగా పెట్టకుండా ఇతరులను బలితీసుకుంటూ ఆయుధాలమ్మి సొమ్ము చేసుకుంటోంది. అది పెట్టే తంపులన్నీ తనకు సుదూరంగా ఉన్న దేశాల్లోనే. అమెరికాకు ఇరుగు పొరుగుదేశాలతో పేచీ లేదు కనుక వాటి నుంచి ముప్పులేదు.
రెండవ ప్రపంచ యుద్ధం నాటి నుంచి 2001వరకు ప్రపంచంలోని 153 ప్రాంతాల్లో అమెరికా పెట్టిన చిచ్చు, చేసిన యుద్ధాలు 258గా లెక్కవేశారు. వీటన్నింటిలో అమెరికన్ కార్పొరేట్లకు లాభాలే వచ్చాయి. అందువల్లనే ప్రపంచంలో ఎక్కడైనా శాంతి ఉందంటే అమెరికాకు నిదరపట్టదు. వియత్నాంపై దాడిలో పెద్ద సంఖ్యలో అమెరికన్లు మరణించటంతో దానికి వ్యతిరేకంగా జనంలో తీవ్ర అసమ్మతి చెలరేగింది. దాంతో అప్పటి నుంచి తన చేతికి మట్టి అంటకుండా, తన పౌరులు మరణించకుండా మిత్రపక్షాల పేరుతో ఇతర దేశాలను దించుతోంది. కావాల్సిన పెట్టుబడులు పెడుతోంది, ఆయుధాలు అమ్ముకుంటోంది. ఇరాక్‌పై దాడిచేసి అక్కడి చమురు సంపదలపై పట్టు సంపాదించిన సంగతి తెలిసిందే. అదే ఎత్తుగడను ఇరాన్ మీద కూడా అమలు చేసేందుకు పూనుకొని ఎదురు దెబ్బలు తిన్నది. దాన్ని ఎలాగైనా తన దారికి తెచ్చుకొనేందుకు ఆంక్షల పేరుతో పరోక్ష దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తైవాన్ మీద చైనాను రెచ్చగొట్టటం వెనుక అనేక అంశాలున్నాయి. చైనా ఆయుధాల సత్తాను తెలుసుకోవటం, ఉక్రెయిన్ వివాదంలో రష్యాకు మద్దతు మానుకోవాలని బ్లాక్మెయిల్ చేయడం, తైవాన్ జలసంధిలో విన్యాసాలు ఖర్చుతో కూడుకున్నవి గనుక ఆర్ధికంగా నష్టపెట్టటం, మిలిటరీ ఖర్చు పెరిగేట్లు చూడటం వంటి అనేక కోణాలున్నాయి. వీటన్నింటినీ మదింపు వేసుకొనే తైవాన్ అంశంలో రాజీలేదని చైనా ముందుకు పోతోంది.
- ఎం.కోటేశ్వరరావు
సెల్:8331013288