Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతనొక నిత్య చైతన్య ఉద్యమ తరంగం. పేరు-దేవగుప్తపు పేరలింగం. రాజమండ్రిలో ఒక సాధారణ కార్మికుడు. ఎక్కువగా చదువుకోలేదు. కానీ, ఆయన కృషి గురించి తెలుసుకుంటే గొప్ప గొప్ప విద్యావేత్తలు సైతం సిగ్గుతో తలదించు కోవల్సిందే! ఇప్పుడు ఆయన వయస్సు ఎనభైసంవత్సరాలు. జీవిత కాలమంతా ఒంటరిగానే సైన్సు-హేతువాద ప్రచారంలో తలమునకలై గడిపారు. తన సైకిల్‌కు ''హేతువాద చైతన్యరథం'' అని బోర్డు తగిలించుకుని, వెనక సీటు మీద పుస్తకాల సంచి పెట్టుకుని, గోదావరిజిల్లాలలో ఊరూరూ తిరిగేవారు. గ్రామీణ ప్రజల్లో మూఢనమ్మకాలు తగ్గించడానికి జీవితాన్ని ధారపోశారు. నిక్కరు, ఆఫ్శర్టూ వేసుకుని, కాళ్ళకు స్లిప్పర్‌తో సైకిల్ మీద మారుమూల గ్రామాలన్నీ తిరగే పేరలింగాన్ని ఆ ప్రాంతంలో అందరూ గుర్తుపడతారు.
1942 సెప్టెంబర్ 6న దేవగుప్తపు పేరలింగం ఒక పేద వడ్రంగి కుటుంబంలో జన్మించారు. ఆ రోజుల్లో వారికి చదువుకునే అవకాశం లేదు. అయినా, అంతర్గతంగా అక్షరాల పట్ల పొంగుకొచ్చిన ప్రమాభిమానాల వల్ల తెలుగు అక్షరాలు నేర్చుకోగలిగారు. ఉన్నత విద్య సాధించలేకపోయినా, తన పరిమితమైన పరిజ్ఞానంతోనే ప్రశ్నించడం నేర్చుకున్నారు. ప్రశ్న - ఆయనలో శోధన శక్తిని తట్టిలేపింది. ఆ ప్రశ్నతో, ఆ శోధనతో - హేతువాదిగా మారారు.
1980లో రాజమండ్రి హేతువాదానికి మంచి కేంద్రంగా ఉండేది. రావిపూడి వెంకటాద్రి, పెన్మెత్స సుబ్బరాజు, కత్తి పద్మారావు మొదలైన వారంతా రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో సభలు నిర్వహించేవారు. వేల సంఖ్యలో జనం హాజరయ్యేవారు. ఆ వేల మందిలో ఈ డి. పేరలింగం ఒకరు. ఆ ఒక్కడు ఒక్కడిగా మిగిలిపోలేదు. ఒక్క దీపం వందల వేల దీపాలు వెలిగించినట్టు... ఆ ఒక్కడే, తను సముపార్జించిన హేతువాద పరిజ్ఞానం ఊరూరా తిరిగి ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆ రోజుల్లో గాలి శేషగిరిరావు అనే ప్రసిద్ధ ప్రవచనకారుడు ఉండేవారు. హేతువాదులంతా కలిసి, అదే సుబ్రహ్మణ్య మైదానంలో ఆ ప్రవచన కారుడి బండారం ప్రజల ముందు పెట్టారు. అది కళ్ళారా చూసిన పేరలింగం తన ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేసుకున్నారు. ఒకసారి అనారోగ్యంతో కదలకుండా ఇంటిపట్టున ఉండాల్సి వస్తే, ఆయన ఆ సమయాన్ని పుస్తక పఠానానికి, అధ్యయనానికి వినియోగించారు. సమయం వృధా చేయకుండా తన ధ్యేయానికి అనువుగా మలుచుకున్నారు.
వాస్తవం ఎప్పుడు వాస్తవమే. అది అబద్దాలకు లొంగకూడదు... అని నిర్ణయించుకుని, జనంలో తిరగడానికి, హేతువాద ప్రచారానికి ఉద్యమించారు. తనకు తెలిసిన, తను తెలుసుకున్న అంశాలు సరళమైన తెలుగులో రాయడానికి కూడా ప్రయత్నించారు. అలాకొన్ని చిన్న చిన్న పుస్తకాలు తయారయ్యాయి. అయితే అవి అచ్చేయడం ఎలాగో, అవి జనానికి అందించడం ఎలాగో ఆయనకు అప్పటికి తెలియదు. అందుకు కావల్సిన డబ్బు కూడా ఆయన దగ్గర లేదు. ఒకసారి రాజమండ్రి దగ్గరలో ఉన్న కడియం మండల కేంద్రంలో హేతువాదులు కలుస్తున్నారని పేరలింగానికి తెలిసింది. ఆయన హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. సైకిల్ మీద ఊరూరూ తిరిగి హేతువాదం ప్రచారం చేస్తున్న ఈ పెద్ద మనిషిని అక్కడ కొందరు గుర్తించారు. తను కొన్ని చిరుపొత్తాలు రాశానని అవి ఎలా ఎక్కడ అచ్చేయాలో తనకు తెలియదని ఆయన సభలో చెప్పారు. వెంటనే అక్కడున్న యువకులంతా స్పందించారు. ఉన్న ఫళంగా నలభైవేలు పోగుచేసి ఇచ్చారు. ప్రజాపత్రిక సంపాదకుడు సుదర్శన్, ఆయన శ్రీమతి దేవి ముందుకొచ్చారు. ప్రచురణ బాధ్యత తమ మీద వేసుకున్నారు. ఫ్రూఫ్‌లన్నీ స్వయంగా సుదర్శన్గారే చూశారు. ఆ రకంగా దేవగుప్తపు పేరలింగం అనే హేతువాద కార్యకర్త జనానికి రచయితగా పరిచయమయ్యారు. నలభై ఏండ్ల క్రితమే తెలుగునాట మనిషి కేంద్రంగా గొంతెత్తిన గళంగా, కలంగా ఆయన నిలబడిపోయారు. ఆరు ఏడేండ్ల కాలంలో పదికి పైగా పుస్తకాలు ప్రచురించారు.
ఆయన పుస్తకాల శీర్షికలు కొన్ని ఇలా ఉన్నాయి... 1. ప్రాచీన కుల సంస్కృతి-సామాజిక ప్రగతి 2. ఓ మహిళా నీకు మతమెందుకమ్మా? 3. సైన్సు ప్లస్ మూఢనమ్మకాలు 4. బైబిల్-శాస్త్రీయ విశ్లేషణ 5. ఆదిమానవుడు మొలకు ఆకులు కట్టుకున్నది సిగ్గువల్ల కాదు. 6. మతతత్వం స్త్రీ వ్యక్తిత్వం. 7. పట్టువదలని హేతువాద విక్రమార్కుడు పేరలింగం - స్వగతం (జీవిత చరిత్ర) 8. మంత్రాల్లో దాగి ఉన్న బూతుల మర్మం 9. వరూధిని వివాహం - హేతువాద సూక్తులు 10. శ్రీ వేంకటేశ్వర సుప్రభాత శృంగారం 11. పాకలపాటి వారి సంక్షిప్త చరిత్ర. ఈ పుస్తకాల శీర్షికలు చూస్తేనే ఆయన ఆలోచనా ధోరణి, వ్యక్త్తిత్వం కొంతలో కొంత అర్థమవుతుంది. ఆయనకు ఇప్పుడు ఎనభైఏండ్లు పూర్తయిన సందర్భంగా అభ్యుదయ ప్రజా సంఘాల ఐక్య సమాఖ్య - రాజమహేంద్రవరం (ఫోన్:9032094492 / 9502654774) వారు రాజమండ్రిలోని ప్రదీప్ కేర్ హాస్పిటల్లో 2022 సెప్టెంబర్ 4న అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జీవన సాఫల్య పురస్కారం అందిస్తున్నారు. ఇలాంటి నిస్వార్థ జీవుల్ని గుర్తించి గౌరవించు తరతకోవడం మన కర్తవ్యం. ఎటు నుండి ఏ ఆధారమూ లేని పేరలింగంగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వృద్ధాప్యపు పెన్షన్‌తో ప్రస్థుతం జీవనం సాగిస్తున్నారు. అలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉండికూడా నేటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు పెంచి పోషిస్తున్న మతో న్మాదాన్ని ఎదుర్కొని నిలబడటం మాటలు కాదుగదా?
ఎక్కువగా చదువు కోనందుకు, వడ్రంగి కార్మికుడిగా జీవనం సాగిస్తున్నందుకు, దయనీయమైన స్థితిలో ఉండి కూడా హేతువాదం మాట్లాడుతున్నందుకు భూస్వాములు, ధనవంతులు, అగ్రవర్ణాల వారి నుండి ఎన్నో అవమానాలు ఎదురయ్యేవి. ఓపికగా పేరలింగం అన్నింటినీ సహించారు. నిశ్శబ్దంగా తన పనిలో తాను నిమగమయ్యేవారు. తలవంచుకుని వెళ్ళిపోయేవారు. విద్యావంతులైన మూర్ఖుల్ని ఎదుర్కొని చలాకిగా తిప్పికొట్టగల సామర్థ్యం లేనందువల్ల... వక్తగా, రచయితగా గుర్తింపుపొందే అవకాశం లేక చాలా కాలం కార్యకర్తగానే జనంలో ఉండిపోయారు. అలా కూడా ఎన్నో దాడులకు, బెదిరింపులకు గురయ్యారు. అయినా గత మూడు దశాబ్దాలుగా ఆయన ఎన్నడూ అధైర్యపడలేదు. వెనకడుగు వేయలేదు. అమాయక గ్రామీణుల మెదళ్ళలో ప్రశ్నలు మొలిపిస్తూ సనాతన సంప్రదాయాల మోసాలు బట్టబయలు చేస్తూ, తన చైతన్య రథాన్ని ముందుకు దూకించేవారు. నిజానికి అది చాలా గొప్ప విషయం. ఇప్పటికీ మనం అనుసరించాల్సిన అంశం ఇదే. పేరలింగంగారి వలె గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు విస్తృతంగా తిరిగి, విద్యార్థుల్ని, అక్కడ పౌరుల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఉపన్యాస కార్యక్రమాలు, ఆన్లైన్ లెక్చర్లు ప్రధాన పత్రికల్లో వ్యాసాలు రాయడం వంటి పనులు చేస్తూనే మూఢనమ్మకాల నిర్మూలనకు పనికి వచ్చే అంశాల్ని జనానికి ప్రత్యక్షంగా ప్రదర్శించాల్సిందే! విడమరిచి చెప్పాల్సిందే!! అనాగరికుల్ని నాగరికులుగా మలచడం ఒక ఎత్తయితే, నాగరిక మూర్ఖుల్ని వివేకవంతుల్ని చేయడం మరొక ఎత్తు. అందరూ అన్ని పనులు ఒకే సామర్థ్యంతో చేయలేరు. అందుకే సైన్సు-హేతువాద ప్రచార రంగంలో పని చేయాలనుకునే వారు ఎవరికి వారు నిర్ణయించుకుని కర్తవ్యోన్ముఖులు కావాలి!
ఒక వైపు ఒక చక్కటి సైన్సు గ్రంథాలయం నెలకొల్పి, పది మందికి జ్ఞానం పంచుతూ, మరోవైపు దైవ మహిమలు చూపిన వారికి లక్ష రూపాయల బహుమతి ఇస్తానని ఛాలెంజ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా ఏమాత్రం నిలదొక్కుకోని జీవితంతో పోరాడుతూ, హేతువాద విషయం వచ్చేసరికి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఉండగలగడం ఆయన నిబద్ధతకు, నిజాయితీకి నిదర్శనం! పేరలింగం గారు తన ముగ్గురు కొడుకులకు హేతువాద పద్ధతిలో వివాహాలు జరిపించారు. ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా, వినికిడి శక్తి బాగా కోల్పోయినా, ఆయన తన ధ్యేయం నుండి తన దృష్టి మరల్చడం లేదు. ఒక ఆదర్శానికి కట్టుబడి జీవించడం మనం సమకాలీనంలో చాలా అరుదుగా చూస్తాం. అలాంటి అరుదైన వ్యక్తుల్లో చాలా అరుదైన వారు దేవగుప్తపు పేరలింగం. సామాన్యుల్లో అసామాన్యుడు.
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.