Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జిఐసి)లో ఉద్యోగస్తులకు భవిష్యత్తులో వారి పనిని బట్టి (ఉత్పాదకత ఆధారిత లేదా పెర్ఫార్మన్స్ బేస్డ్) జీతభత్యాలు ఉండబోతున్నాయని ఆగస్టు 24న అనేక వార్తాపత్రికల ద్వారా సమాచారం వెలువడింది. యాజమాన్యం తత్సంబంధిత వారి నుండి సలహాలను కూడా కోరుతున్నది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేయబడటంతో అనేకమంది ఉద్యోగుల్లో ఒక అభద్రతాభావంతో కూడిన చర్చలకు దారితీసింది. కొందరు దీనిని స్వాగతిస్తున్నట్లుగా, ''పని చేయని వారందరికి రోగం కుదురుతుంది'' అన్నట్లుగా అభిప్రాయాలు వాట్సాప్, ఫేసుబుక్ వంటి వేదికలపై వ్యక్తపరుస్తున్నారు. ఇక ప్రయివేటు సంస్థల్లో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారిని ఏద్దేవా చేయడం ''మంచి జరిగిందంటూ'' దెప్పిపొడవడం లాంటివి ఒకపక్క జరుగుతుంటే, ఒకే రంగంలో పనిచేస్తున్న వివిధ తరగతుల వారి మధ్య కూడా ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లోతుల్లోని వాస్తవాలను గ్రహించ కుండా ఇలా స్పందించడం పూర్తిగా అపరిపక్వపు అవగాహనే అవుతుంది.
ముందు అందరూ అర్థం చేసుకోవలసింది ఏమంటే... ఈ ప్రతిపాదన వ్యక్తులపై కాదు, కార్మిక వర్గంపై దాడి. వృత్తిని నిర్లక్ష్యం చేసే వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు, అలా చేయడం చాలా తప్పు. ఇది సాధారణంగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కనిపిస్తోంది. దీనికి సగం కారణం వ్యక్తుల నిర్లక్ష్యమైతే, మేనేజ్మెంట్ అసమర్థత మరో సగం. బాధ్యతలని విస్మరించే వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. కానీ ఈ ప్రతిపాదన వృత్తి నిర్వహణలో ఆలసత్వం వహిస్తున్న వారికి మాత్రమే ప్రమాదమని లేదా సరైన ఉత్పాదకత చూపని వారికే వర్తిస్తుందని అనుకుంటే పొరపాటు. ఉద్యోగుల మధ్య పోటీతత్వాన్ని పెంచి, ఒకరి పతనాన్ని మరొకరు కోరుకునేలా చేసి, అంతిమంగా స్థిరమైన ఉపాధి ఎవరికి లేకుండా, ప్రతి సందర్భంలోనూ కొత్త కొత్త వారిని నియమించుకుంటూ- తొలగించు కుంటూ పోయే ఒక ప్రమాదకరమైన గుత్తాధిపత్యాన్ని యాజమాన్యానికి అప్పజెప్పే లోపభూయిష్టమైన ఆలోచన ఇది. ఉద్యోగుల నైపుణ్యాన్ని పెంచి సంస్థ మరిన్ని లాభాలార్జించే కోణంలో కన్నా, వేతన జీవుల జేబులకు తక్కువ పంపడం ద్వారానే సంస్థ లాభాలను లెక్కించుకో జూసే కుతంత్రమిది. ఇది సంస్థల ఎదుగుదలకు ఏమాత్రం సరైనది కాదు. ఉద్యోగులను విభజించి పాలించడానికి, మహిళలను, అమాయకులను వేధించడానికి, న్యాయమైన ప్రశ్నలను సమాధి చేయడానికి, ఉద్యోగులు సంఘటితం కాకుండా చూడటానికి యాజమాన్యం చేతిలో ఇది ఆయుధమవుతుంది.
సంఘటిత రంగాల్లో ఉత్పాదకతను బట్టి కాకుండా బాధ్యతను బట్టి వేతనాలున్నాయి. అనగా తరగతుల వారిగా(క్యాడర్ బేస్డ్) స్కేళ్ళు ఉన్నవి, నైపుణ్యాన్ని బట్టి ప్రొమోషన్లూ ఉంటాయి. ఇది పనిని బట్టి ఇచ్చే ప్రతిఫలం లాంటిదే. అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ (పరిపాలన కార్యకలాపాలకు సంబంధిత)కు సంభంధించి నంత వరకు ఇలాంటి ఉత్పాదకత ఆధారిత చెల్లింపులు సత్ఫలితాలను ఇవ్వవు. ప్రోత్సాహకాలు ప్రధానమైనప్పుడు సంస్థ ప్రయోజనం కన్నా వ్యక్తిగత ప్రయోజనం, స్వలాభం కోసం వ్యక్తులు తప్పు చేసే అవకాశం ఉన్నది. అందుకే అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగులు ఎప్పుడూ తమకు చెల్లించబడుతున్న జీతాలను బట్టి తమ పనిలో ప్రతిస్పందన ఉండకూడదనే ఇలాంటి నెలవారి వేతనాల కాన్సెప్టు పుట్టింది. పర్మనెంట్ ఉద్యోగులు తాము పని చేస్తున్న సంస్థల్లో లాభనష్టాలకు సంబంధం లేకుండా చట్టాలకు లోబడి, ఇతరులెవరూ సదరు సంస్థను దోపిడీ (ఎక్సైట్) చేయకుండా కాపాడవలసిన బాధ్యత కలిగి ఉంటారు. ఈ బాధ్యతకు వెలకట్టడం అసాధ్యం. ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు సందర్భంగా, జీతభత్యాలకు సంబంధించి ఉటంకిస్తూ, ''ప్రభుత్వ రంగ సంస్థలు తమ కార్యకలాపాలను నడపడానికి పెర్మినెంట్ ఉద్యోగులను నియమించుకోవాలని, వారికి నిర్ణీత వ్యవధిని బట్టి జీతభత్యాల చెల్లింపు ఉండాలి తప్ప లాభనష్టాల్లో భాగం పంచే పద్ధతిలా ఉండకూడదని'' కూడా భారత పార్లమెంటు స్పష్టం చేసింది. పూర్తి కాలపు ఉద్యోగులెవరూ మరో వృత్తి చేపట్టరాదనే నిబంధన కుడా ఉన్నది. కనీసం పార్ట్ టైం వృత్తిని కూడా చేపట్టరాదు. ఎందుకంటే పర్మనెంట్ ఉద్యోగి మరొక సంస్థ తరపున పని చేస్తే పరస్పర ప్రయోజనాల సంక్లిష్టత ఏర్పడుతుంది. ఈ నియామకాలన్నీ కూడా ఒక సోపాన క్రమం (హైరార్కి)లో ఉండాలని, లాభనష్టాలతో సంబంధం గానీ, స్వలాభం కోసం వెంపర్లాట గానీ ఉండకూడదని కూడా స్పష్టం చేసింది. ఈ హైరార్కిలో ఉన్న తత్సంబంధిత తరగతి, లాభనష్టాలకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు బెరీజు వేస్తూ, ఇతర ఉద్యోగులను పురమాయిస్తోంది. అయితే ఎప్పటికప్పుడు విధులను పునర్నిర్వచిస్తూ అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగుల్లో ఆ రకమైన కార్యక్రమాల పర్యవేక్షణ ఎప్పుడైనా చేసుకునే వెసులుబాటు సదరు హైరార్కీకి సంక్రమించిన అధికారం. అట్టి అధికారాలతో సమిష్టి కృషితో సంస్థల పురోభివృద్ది జరగాలి గానీ వ్యక్తుల మధ్య పోటీ పెరిగి అది విచ్ఛిన్నానికి దారి తీయరాదు.
జీవిత బీమా రంగంలో ఓ నాలుగు దశాబ్దాల క్రితం చాలా మంది స్టాఫ్‌కి ఏజెన్సీలు ఉండేవి. నూతన పాలసీలు సేకరించి జీతంతో పాటు కమిషన్ కూడా పొందే వెసులుబాటు ఉండేది. కానీ ఆఫీసులో తమకు అధికారికంగా ఉన్న అప్రోచ్ వలన, అధికారాల వలన, వాటిని దుర్వినియోగం చేసి, కమిషన్ల కోసం సంస్థ ప్రయోజనాలను ఫణంగా పెట్టే ప్రమాదం ఉన్నదని స్టాఫ్ ఏజెన్సీని రద్దు చేశారు. సంస్థ పర్మినెంట్ ఉద్యోగులే అయినప్పటికీ డెవలప్మెంట్ ఆఫీసర్లకు పరిపాలన సంబంధిత కార్యక్రమాల్లో ఎలాంటి అవకాశం లేదు. చెల్లిస్తున్న వేతనాలకు సరిపడా ప్రీమియం సేకరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ, డెవలప్మెంట్ ఆఫీసర్లను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు చెల్లించకుంటే వారి మనుగడ దాదాపు అసాధ్యం. భీమా రంగంలో ఇన్సూరెన్స్ ఏజెంట్లు ''తమ వల్లే ప్రీమియం వసూలు అవుతుంది, తమదే నిజమైన పాత్ర'' అని భావిస్తారు. తాము నియమించకుంటే ఏజెంట్లకు జీవితం ఎక్కడిది... అని డెవలప్మెంట్ ఆఫీసర్లు అనుకుంటారు. తాము ఆఫీసును సరిగ్గా నిర్వహించకుంటే డెవలప్మెంట్ ఆఫీసర్లు ఏజెంట్లు మనగలిగేవారా అని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ప్రశ్నిస్తుంటారు. తమ ఆలోచనల వల్లే ఈ ప్రగతి అంతా... అంటూ పై అధికారులు వాపోతుంటారు. ఒకరి కంటే ఒకరు గొప్ప లేదా తక్కువ అన్నది కాదు, ఇదంతా ఒక గొలుసు కట్టు సంబంధంతో ఒకరి ద్వారా మరొకరు సంస్థకు ఉపయోగపడుతున్నట్లు. ఒక పాలసీ పూర్తి కావాలంటే అన్ని తరగతుల సహాయ సహకారాలూ అవసరమనేది సత్యం.
ప్రయివేటు రంగంలోనూ అన్ని ఉపాధుల్లో ఉత్పాదకత ఆధారిత వేతనాలు లేవు. కనీస వేతనాలు చెల్లిస్తూనే, ఇన్సెంటివ్ పద్ధతి అమలుపరుస్తుంటారు. అయితే ఉద్యోగులను తొలగించడానికి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ట్కు కూడా ఉత్పాదకతతో లింకు పెట్టి యాజమాన్యం సీనియర్ ఉద్యోగులను తొలగించి, అదే పనిలోకి తక్కువ వేతనానికి, కొత్త వ్యక్తులను నియమించుకుంటుంది. అందుకే ప్రయివేట్ సంస్థలలో పెరిగిన లాభాల నిష్పత్తికి సమానంగా వేతనాల వృద్ధి ఉండడం లేదు. నిర్ణీత వ్యవధిలో వేతన సవరణ జరగాలన్న కాన్సెప్టు ప్రయివేటు సంస్థల్లో లేదు. ఉద్యోగుల నియామకాలకు ఒక డిపార్ట్మెంట్ ఉంటే తొలగించడానికి కూడా మరో డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ. వివిధ పద్ధతుల ద్వారా సీనియర్ ఉద్యోగులను తొలగించేయడానికి సిద్ధమవుతుంటారు. అందులో బెల్ కరువు మెథడ్ అనేది ఒకటి. అందులో దాని ప్రకారం ప్రతి ఏటా ఒక సంస్థలో 20శాతం మంది ఉద్యోగులు రెడ్డెండెంట్ కొనసాగించడానికి అర్హత కోల్పోతారు. మరో 70శాతం మందిని కొంత తర్ఫీదుతో కొనసాగించవచ్చు. కేవలం 10శాతం మంది మాత్రమే కొనసాగించడానికి అర్హత కలిగి ఉంటారు. ఇలాంటి అనిశ్చితితో కూడిన ఉపాధులవల్లనే నేడు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్లు గయంలేని పక్షుల్లా నిరంతరం కొత్త ఉపాధి వెతుక్కోవడమే పనిగా ఉంటారు. ఇలాంటి చోట సంస్థపై ప్రేమాభిమానాలు పెరగవు. ఎంతసేపూ ''నాకేంటీ'' అనే ధోరణి కన్పిస్తుంటుంది. ఈ అనుభవాల దృష్ట్యా దీర్ఘకాలం పాటు స్థిరమైన ఉపాధి, క్రమం తప్పని వేతనాలూ కల్పిస్తే ఆ సంస్థ నాణ్యమైనదిగా నిలుస్తుంది. సంస్థలకు కాపాలదారుల్లా వ్యవహరించే పరిపాలనా సంబంధిత ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత వేతనాల కన్నా, సంస్థ సామర్థ్యాన్ని బట్టి చెల్లించే స్థిరమైన వేతనాలే సత్ఫలితాలనిస్తాయి.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016