Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుజరాత్ ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని అడ్డుపెట్టుకొని, పదకొండు మంది మానవ మృగాలను విడుదల చేయటం విచక్షణ లేని నిర్ణయం. 75ఏండ్ల స్వాతంత్య్ర వజ్రోత్సవాలనాడే ఈ బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వం ఈ దిగ్భ్రాంతి కరమైన నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం! ఢిల్లీ పెద్దలకు తెలియకుండా ఇంతటి తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకోలేరన్నది జగమెరిగిన సత్యం. పైగా తగుదునమ్మా అంటూ విడుదలైన వారిని స్వాగత, సన్మానాలతో సత్కరించి మరీ సమాజంలోనికి పంపారు. ఎర్రకోటపై జాతీయ జెండానెగరేస్తూ దేశ ప్రధాని ''మహిళల్ని తక్కువ చేసి, బాధించే మన ప్రవర్తనను, సంస్కృతిని, రోజువారి జీవన విధానాన్ని మార్చుకోలేమా..?!'' అని జాతిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఆ మాటలు మన స్మృతిపథం నుంచి చెరగకముందే తన సొంత రాష్ట్రంలో అంతటి కిరాతకానికి పాల్పడిన రక్కసి మూకకు, తిరిగి స్వేచ్ఛనిచ్చి విడుదల చేయటం సిగ్గుచేటు. తీవ్రమైన సామూహిక అత్యాచారం, 14 హత్యల్లో దోషులైన వారిని విడుదల చేయటం కేవలం బాధితులరాలికే కాదు, దేశ భవిష్యత్తుకు, మహిళల మనుగడకు, చట్టాల ఉనికికి సంబంధించిన సమస్య. నిందితులు సవర్ణ కులానికి చెందిన వారు కాబట్టి ఇలాంటి నేరం చేసి ఉండరని చెప్పటం నిజంగా కుల దురహంకారమే. ఇలాంటి సంఘటనల పట్ల ఉదాసీనత వల్ల, న్యాయస్థానాలు కూడా ప్రజల విశ్వాసం కోల్పోతే సమాజం మహా ప్రమాదంలోకి నెట్టి వేయబడుతుంది.
''హర్ ఘర్ తిరంగా'' అంటూ మోడీ ప్రభుత్వం అట్టాహాసంగా ప్రకటించిన ఈ వజ్రోత్సవాలను ఈ ఉదంతం ఘోరంగా వెక్కిరిస్తున్నది. నిజానికి ఈ వజ్రోత్సవాలు చేసుకునేంత ఘనమైన అభివృద్దేమీ దేశంలో కనిపించడం లేదు. రాజస్థాన్లోని 9ఏండ్ల దళిత విద్యార్థిని సవర్ణుల కుండలోని నీళ్లు తాగాడని ఓ స్కూల్ టీచర్ కొట్టి చంపిన సంఘటన దేశమంతటా సంచలనాన్ని సృష్టించింది. మరి ఈ స్వాతంత్రోత్సవ సంబురాలు ఎవరికోసం..?! ఎప్పుడో వందేండ్ల కిందట స్వాతంత్య్రానికి పూర్వం బడిలో సవర్ణుల నీళ్ల కుండలు ముట్టినందుకు దళితుల పిల్లలు అవమానాలను, దాడులను ఎదుర్కొన్న ఘటనలు విన్నాం. అంబేద్కర్ వంటి మహనీయులకూ అవి తప్పలేదు. కానీ స్వాతంత్య్రం వచ్చి వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్భంలో కూడా ఇలాంటి సంఘటనలు చూస్తూ ఈ కులహత్యలనూ, కుల దురహంకారాలనూ స్వాతంత్య్రం అని స్వాగతించ గలమా...?! సంబురాలు చేసుకోగలమా...?!
ఐక్యరాజ్యసమితి తాజా మానవ హక్కుల మండలి నివేదిక ప్రకారం... భారతదేశంలో మహిళలు, దళితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాలకార్మిక వ్యవస్థ, కుల వివక్ష, పేదరికం, మత వివక్ష పరస్పరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనీ, మహిళలకూ బహుజనులకూ, వ్యవస్థీకృత అధికారం అందటం లేదనీ, మహిళా సాధికారత మసకబారుతున్నదనీ ఈ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దేశంలో వివక్ష అనేది తన తీరు మార్చుకుందేగాని, దాని ఉనికి మాత్రం అలానే ఉంది. చూస్తుంటే... దళితులు, మైనారిటీలు, బలహీన వర్గాలు ఈ దేశంలో భాగం కాదా? అన్న సందేహం కలగక తప్పని పరిస్థితి. ఈ దుర్మార్గాలను ఎండగట్టి ఉద్యమించకపోతే మరో వందేండ్లు వెనక్కి పోతుంది ఈ దేశం. మరో సామాజిక స్వాతంత్య్రం పోరాటానికి మనమందరం సన్నద్ధులం కావాల్సిందే...
- డి. స్వరూప
సెల్: 9912965549