Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశం తన 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని స్వదేశంలో, విదేశాల్లో ఎంతో కోలాహలంగా జెండా ఆవిష్కరణలతో, విందులు, పండుగలతో జరుపుకుంది. వాస్తవానికి ఈ 75ఏండ్ల కాలాన్ని సమీక్షించుకొని, భారతదేశ ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ముందుకు సాగాలని దిశానిర్దేశం చేసుకోవాల్సిన మంచి సందర్భం ఇది. గడచిన డెబ్భైఐదేండ్లలో భారతదేశం చాలా సాధించింది. కానీ సమానత్వం, మానవతా ధర్మం, స్వేచ్ఛ, అందరినీ కలుపుకొని పోయే విధానం, ఆర్థిక పునాదికి దిగువనున్న అనేక మందికి సమాన అవకాశాలను సృష్టించాలనే జాతీయోద్యమ సారాన్ని అందించడానికి ఇంకా చాలా కృషి చేయాల్సిన ఉంది.
ప్రధానమంత్రి ఎర్రకోట నుండి చేసిన తన ప్రసంగంలో, దృష్టి పెట్టాల్సిన అంశాలకు సంబంధించి ఐదు ప్రతిజ్ఞలను సూచించాడు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం, వలసీకరణ యొక్క ఆనవాళ్ళను, జాడలను, గుర్తులను పూర్తిగా తొలగించడం, మన మూలాలు, వారసత్వాలను గర్వంగా భావించడం, ఐక్యత, సమగ్రతలను సాధించడం, పౌరులలో కర్తవ్య భావనను కలిగించడం. ఈ ఐదు ప్రతిజ్ఞలపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. వాటిని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి, సంస్థాగతం చేసి అమలు చేయడానికి విశాలప్రాతిపదికన జాతీయంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది.
మొదటగా, ఏ రకమైన దేశంగా అభివృద్ధి చెందాలని మనం అనుకుంటున్నాం? కొన్ని పాశ్చాత్య దేశాలలో వలే కొద్దిమంది అత్యంత ధనికులు గల, హెచ్చైన అసమానతలు, వెలివేతలు, పేదరికం, ఆకలి, అన్యాయం, హింస, అశాంతితో కూడిన అధిక జీడీపీ గల దేశాన్ని కోరుకుందామా? లేదా అందరికీ సమానంగా సంపద పంపిణీ చేస్తూ, శాంతియుతమైన, అభివృద్ధి చెందుతున్న, అందరినీ కలుపుకొని పోయే విధానంతో, సంతోషంగా, అందరికీ సమానావకాశాలు కల్పించే అసమానతలు లేని దేశాన్ని కోరుకుందామా? ఎంపిక చేయబడిన కొందరి కోసమే అభివృద్ధి చెందే దేశాన్ని కోరుకుందామా? లేక అందరి కోసం అభివృద్ధి చెందే దేశాన్ని కోరుకుందామా? అందుకుగాను రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, భిన్నత్వం, స్వేచ్ఛ, సమానత్వం, మానవతా ధర్మం, న్యాయం లాంటి అంశాలపై సునిశితమైన దృష్టి ఉండాల్సిన అవసరం ఉంది. ముందుగా మనకు స్వచ్ఛమైన గాలి, తాగునీరు, తగినంత శక్తి కావాలి గదా? దీనికి స్వతంత్రమైన, స్వయంప్రతిపత్తి గల సంస్థలు, పౌర సమాజం, వికేంద్రీకృతమైన అభివృద్ధి, శాస్త్రీయ ఆలోచనా ధోరణికి సంబంధించిన చిక్కులు, వాటికి సంబంధించిన అవగాహన అవసరం.
రెండోది, మనం బలహీనులతో సరియైన రీతిలో ప్రవర్తిస్తూ, పాకీ పనిని, బాల కార్మిక వ్యవస్థను, కుల వ్యవస్థను, మన సమాజంలోని పురుషాధిక్యతను, కులాధిపత్యాన్ని రద్దు చేసినపుడు మాత్రమే వలసీకరణ యొక్క పూర్తి ఆనవాళ్ళను తొలగించడం సాధ్యమవుతుంది. మూడోది, మనం మన మూలాలు, వారసత్వాల గురించి గర్వించే క్రమంలో ప్రతీ ఒక్కరి భవిష్యత్తు అవకాశాల కోసం గతంలో మనం చూపిన దురభిమానాలను, ప్రాధాన్యత లను విడిచి పెట్టాలి. నాలుగోది శాంతి, ప్రగతి కోసం ఐక్యత, సమగ్రతల అవసరం ఉంటుంది. అయితే అవి మతం, జాతి, కులం, ఆచారం, భాష, సామాజిక హౌదా లాంటి అంశాలకు సంబంధించిన లోతైన అవగాహన, సహనాలను డిమాండ్ చేస్తాయి. చివరగా ఇతరులకు సేవ చేసి, సహాయపడడానికి, పౌరులలో కర్తవ్య భావనకు క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వం, విలువలు, నైతికత, నిస్వార్థ త్యాగం లాంటి అంశాల అవసరం ఉంటుంది.
దురదృష్టవశాత్తు ప్రస్తుత విషపూరితమైన, ఉద్రిక్త వాతావరణంలో విభజన రాజకీయాలు, పాలనా యంత్రాంగంలోని పెద్దల జోక్యం, ఆధిపత్యం చెలాయిస్తూ అదుపు చేస్తున్న సంస్థలు, నిజాయితీలేని చర్చలు, అదుపుచేయబడి లోబరచుకోబడిన మీడియా, ఉన్నత స్థానంలో హిందూత్వను నిలిపి, ముస్లింలు, మైనారిటీలు అట్టడుగుకు నెట్టబడుతున్న స్థితిలో, నగరాలకు నామకరణం చేయడం, చరిత్రను తిరగ రాయడం లాంటి చర్యలు చేపడుతున్న ఈ తరుణంలో ప్రధానమంత్రి ప్రతిజ్ఞలను అమలు చేయడం కష్టమైన పని. దానితో పాటుగా అధికారం, లాభాలకే విలువ ఇచ్చే ధోరణి ప్రస్తుత ప్రపంచంలోని నాయకుల్లో కనిపిస్తుంది కాబట్టి ప్రజలకు, గ్రహానికి సంబంధించిన సమస్యలపై నాయకుని దృష్టిని మళ్ళింపజేయడం కష్టమైన పని. నేడు గ్రహానికి, ప్రజలకు ఏది మంచి అనేది ప్రపంచ నాయకుల ఎజెండాలో ఉండదు. కాబట్టి ఇలాంటి వాతావరణంలో ప్రధానమంత్రి ఎజెండాలోని ప్రతిజ్ఞలను సాధించడానికి మనకు ఏ విధమైన ప్రతిజ్ఞలు అవసరం?
భావి భారతదేశాన్ని నిర్మించేందుకు ఉపయోగపడే ఈ ఐదు ప్రతిజ్ఞలను చర్చించాలని నేను సూచిస్తున్నాను. నేను ప్రతీ తోటి మనిషిని వారి మతం, జాతి, కులం, వర్ణం, ఆచారం, భాష, లింగ బేధాలతో నిమిత్తం లేకుండా గౌరవంగా, ప్రేమగా చూస్తాను. నేను ఐక్యరాజ్యసమితి మానవహక్కుల పత్రాన్ని అధ్యయనం చేసి అనుసరిస్తూ, నా తోటి మనుషుల జీవితాలు సురక్షితంగా, భద్రంగా, మెరుగ్గా ఉండేందుకు నా సహాయసహకారాలను అందజేస్తాను.
స్వతంత్ర, స్వయంప్రతిపత్తి గల సంస్థలు, చైతన్యవంతమైన పౌర సమాజం, హేతుబద్ధమైన ఆలోచనాధోరణి, అందుబాటులో ఉన్న న్యాయ వ్యవస్థ ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, భిన్నత్వం, అందరినీ కలుపుకొని పోయే విధానం, సమానత్వం, న్యాయాలను కాపాడడానికి భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు కష్టపడతాను.
అసత్యాలను కాక సత్యాన్ని, అపనమ్మకాన్ని కాక నమ్మకాన్ని, ద్వేషం భావాన్ని కాక ప్రేమను ఆచరించడం ద్వారా మంచి పౌరునిగా ఉంటాను. అవినీతికి పాల్పడకుండా, పన్నులను ఎగ్గొట్టకుండా, నేరాలు, హింస, డ్రగ్ మాఫియా, మోసాలు, అబద్ధాలు, అక్రమాలు, వ్యక్తిగత దాడులు, కక్షపూరిత చర్యలు, తప్పుడు సమాచారాలకు పాల్పడకుండా నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతాను. నేను కక్షపూరితమైన చర్యల్లో పాల్గొనకుండా, కోపాన్ని నిగ్రహించుకునే విధానాన్ని, ఎదుటివారిని క్షమించే గుణాన్ని, రాజీపడే తత్వాన్ని అలవర్చు కుంటాను. మహిళలను, ఆడపిల్లలను, యువతు లను గౌరవించి, వారి ప్రయోజనాలను కాపాడతాను.
ప్రజాసేవ
మా కమ్యూనిటీ ప్రాంతంలో పరిశుభ్రత కోసం, ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు, ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చేందుకు, పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవడానికి, వారికి ఆరోగ్య సేవలు అందించేందుకు, వారిలో నైపుణ్యాన్ని మెరుగు పరిచేందుకు, ఆడేందుకు, చెట్లు నాటేందుకు, న్యాయ సేవలు అందించేందుకు, నోటి పరిశుభ్రత, రవాణా, పరికరాలను సరిచేయడం, స్థానికంగా గ్రంథాలయాన్ని నడపడం, కథలు చదవడం లాంటి అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి నేను ప్రతి వారం ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా కొన్ని గంటల సమయాన్ని వెచ్చిస్తాను. బయటి వారి సహకారం లేకుండానే ఇతరులకు సహాయం చేయడానికి నా స్వంత మార్గాలను తెలుసుకుంటాను.
గాంధీజీ అహింసా మార్గాలను ఆచరించి, ఇంట్లో, కుటుంబాల్లో, పాఠశాలల్లో, వీధుల్లో, ఇరుగుపొరుగు ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో, గ్రామంలో, నగరంలో ప్రోత్సహిస్తాను. ఈ క్రమంలో తోటి మానవులను గాయపరిచే విధంగా పదజాలాన్ని ఉపయోగించి, ఆగ్రహాన్ని వ్యక్తం చేయను. కల్పనలు కాక వాస్తవాలు, పిడివాదం కాక ఆధారంతో కూడిన వివరాలకు విలువ ఇచ్చే హేతుబద్ధమైన, సహేతుకమైన, శాస్త్రీయ ఆలోచనలను నేను అభివద్ధి చేసుకుంటాను. వాదనలు, కోపతాపాలు, అవమానాలు, ద్వేషభావం లేకుండా ఇతరుల భిన్నాభిప్రాయాలను, అభిప్రాయాలను గౌరవిస్తూ అర్థవంతమైన చర్చలకు తావిచ్చే ఆలోచనా ధోరణిని కలిగి ఉంటాను. సమర్థవంతమైన సమాచారం, సహకారం, తోడ్పాటు ద్వారా తేడాలను గుర్తించే మనస్తత్వాన్ని కలిగి ఉంటాను.
ప్రజా ఉద్యమం అవసరం
ఈ ప్రతిజ్ఞలు చేయడం, వాటిని అనుసరించడం చాలా పెద్ద పని. దేశంలో వివిధ స్థాయిల్లో ప్రభుత్వంలో, వ్యాపారంలో, పౌర సమాజంలో, రక్షణ సేవా రంగంలో, న్యాయవ్యవస్థలో, మీడియాలో, శాస్త్రసాంకేతిక రంగంలో, విద్య, ఆరోగ్యం, కార్మిక రంగంలో, కళారంగంలో, ఈ ప్రతిజ్ఞలను విశ్వసించి, ఆచరించి, ప్రోత్సహిస్తున్న మైనారిటీలలో, యువకుల్లో, మహిళల్లో తగినంత మంది భాగస్వామ్యం లేకుండా మన వ్యవస్థాపక పితామహులు, స్వాతంత్య్ర సమర యోధులతో పాటు మనందరం గర్వపడే విధంగా అందరినీ కలుపుకొని పోయే దేశాన్ని నిర్మించడం సవాల్‌గా మారుతుంది. భారతదేశ ప్రజలందరి ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, అందరినీ కలుపుకొని పోయే విధానం, అభివృద్ధిని ప్రోత్సాహించే ధైర్యం, నిబద్ధత, దృఢవిశ్వాసంతో భిన్నమైన సమూహాలను తీసుకువచ్చేందుకు భారతదేశ చరిత్ర, వారసత్వం, నాగరికత, భారతదేశ ప్రజల విజ్ఞానంపై నాకు అపారమైన నమ్మకం ఉంది. నేను ఈ ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను. నాతో కలవడానికి మీకూ ఇష్టమేనా?
అనువాదం:బోడపట్ల రవీందర్,
- సామ్ పిట్రోడా
సెల్: 9848412451