Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నడిబజారులో ''అన్నమో రామచంద్ర'' అంటూ కన్నీటి పర్యాంతరమయ్యాడు మనోజ్ అనే కానిస్టేబుల్. అదికూడ శ్రీరాముడు ఏలిన రాజ్యమని నమ్మే ఉత్తరప్రదేశ్‌లో! చలికాలంలో గోవులకు స్వెటర్లు కుట్టిస్తూ, కోతులను గుండెలకు హత్తుకుని ఆహరం అందించే ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్ ప్రభుత్వంలో!! పోలీసు ఉద్యోగాలు చేయాలంటే దేశంలో ఇలా ఆకలిని, ఆత్మగౌరవాన్ని చంపుకుంటేనే బతుకు ఉంటుందా!? ఇది కేవలం ఒక యూపీకి సంబంధించిన అంశమే కాదు, దేశంలో ప్రతీచోటా కింది ఉద్యోగస్తులైన పోలీసు కానిస్టేబుళ్లందరూ ఎదుర్కొంటున్న సమస్య.
గత ఐదు సంవత్సరాల కిందట, దేశంలో అత్యంత కీలమైన పారామిలటరీలో భాగమైన బియస్‌యఫ్ (బార్డర్ సెక్యూరిటి ఫోర్స్) ఇరవై తొమ్మిదవ బెటాలియన్‌కు చెందిన తేజ్ బహుదూర్ యాదవ్... ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అందులో తమకు పెడుతున్న నాసిరకపు ఆహారాన్ని తింటూ అతడు ఏడ్వడం చూసి దేశమంతా విస్తుపోయింది. ఈ దేశం కొరకు చలి, ఎండ, వానలను లెక్క చేయకుండా లోయల్లో, కొండల్లో, దేశ సరిహద్దుల్లో నూటనలభైకోట్లమంది కోసం నిత్యం పహరా కాసే జవాన్ల పరిస్థితి ఇలా ఉండటం ఏమిటనే ప్రశ్న తలెత్తింది. ఈ సంఘటన తర్వాత ఈ శాఖలో ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకున్నారో లేదో తెలియదుగానీ, అతడిని మాత్రం లైన్ ఆఫ్ కంట్రోల్ కింద ట్రాన్స్ ఫర్ చేశారు. ఆయన భార్య షర్మిళ దీనిపై ఢిల్లీ హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు చేయడం, ఆ తర్వాత తేజ్ బహుదూర్ యాదవ్‌ను ఏకంగా డిస్మిస్ చేశారు. పిదప ఆయన వారణాసి నుండి 2019 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్ పార్టీ నుండి బరిలో నిల బడ్డాడు. ఆ తరువాత అతను అనుమానస్పదంగా చనిపోయినట్లు వార్తలొచ్చాయి.!?
రెండేళ్ళ కిందట రాత్రి పదిన్నర సమయంలో ఓ గుజరాత్ మంత్రి కొడుకు, తన ఫ్రెండ్స్‌తో ట్రాఫిక్ రూల్స్‌కు వ్యతిరేకంగా బలాదూర్‌గా వెళ్తున్న సందర్భంలో, డ్యూటీలో ఉన్న లేడి కానిస్టేబుల్ ఆ మంత్రి కొడుకు కారును నిలిపివేసింది. దీని తర్వాత ఆమెను సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు వార్తలొచ్చాయి.
రెండు నెలల కిందట ఇదే ఉత్తరప్రదేశ్‌లో అశుతోష్ శుక్లా అనే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, 2017లో కేంద్రం తీసుకొచ్చిన చట్టానికి విరుద్దంగా ఎర్రబుగ్గపెట్టుకోని సైరన్ మోతలతో వెళ్తున్నపుడు, డ్యూటిలోవున్న సందీప్ పాండే అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫొటోతీశాడు. దీనికి ఆగ్రహించిన సదరు యంయల్ఏ, ఆయన అనుచరులు ఆ కానిస్టేబుల్‌పై వేలాదిమంది జనసమూహం మధ్యలో బూతులవర్షం కురిపిస్తుంటే, అవమానంతో ఆ కానిస్టేబుల్ ఎక్కెక్కి ఏడ్చిన ఘటన కూడ మనలను కదిలించింది. ఇకపోతే 2018 అక్టోబర్‌లో పోలీస్ వ్యవస్థలో శ్రమదోపిడీ అనే ఆర్టికల్ రాసినందుకు నవంబర్‌లో నన్ను మన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలపాటు సస్పెండ్ చేసింది.
''అన్నీటికి ముందు ఉంటవో ఓ..పోలీసన్నా - ఆకలితో చస్తావెందుంకో ఓ పోలీసన్న'' మనకు నాలుగు దశాబ్దాలుగా సుపరిచితమైన ఈ పాట నేటికీ తన ప్రాసంగికతను కోల్పోకపోవడం వైచిత్రి! భారత రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కలకు విరుద్దంగా ఉండే పోలీసు మ్యానివల్ విధానాన్ని ఆయా రాష్ట్రాలు తమ పోలీసు సిబ్బందిపై నేటికి రుద్దుతూనే ఉన్నాయి. డెబ్బైఐదేండ్ల స్వాంతంత్య్ర దేశంలో ఆకలవతున్నదనీ పోలీసులు అడుక్కోవాలా? దేశంలో ఇది ఒక మనోజ్ కుమార్ లేదా పైన చెప్పిన వారి ఆవేదన మాత్రమే కాదు, పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి వేదన. అందరూ తమ-తమ స్థాయిలో ఏదోరకమైన శారీరక-మానసిక ఒత్తిడికి గురవుతున్నవాళ్ళే... ఆకలినీ ఆత్మగౌరవాన్ని చంపుకుని తమ కుటుంబాలను వదిలి ఈ ప్రజల కోసం నిత్యం బాధలను అనుభవిస్తున్నవాళ్లే...
- వరకుమార్ గుండెపంగు